తెలుగుకు పూర్వ వైభవం కోసమే ‘పాఠశాల’
– డాక్టర్ ఎన్.ఈశ్వర్ రెడ్డి
కడప కల్చరల్:
తెలుగుభాషకు పూర్వ వైభవం కల్పించేందుకు ప్రత్యేకించి ‘తెలుగు పాఠశాల’ కార్యక్రమాల ద్వారా తన వంతుగా ప్రయత్నిస్తున్నామని సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం బాధ్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఆదివారం బ్రౌన్ గ్రంథాలయంలో బాలల కోసం నిర్వహిస్తున్న తెలుగు పాఠశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. నానాటికి తెలుగుభాష, సంస్కృతి తీసికట్టు అవుతున్న విధం తెలుగు వారందరినీ బాధిస్తోందని, తెలుగుభాషాభిమానిగా బ్రౌన్ గ్రంథాలయ బాధ్యునిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీనికి చిన్నారుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. భాషాభిమానుల సహకారం ఉంటే దీన్ని మరింత శోభతో ముందుకు తీసుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు నీలవేణి పురాణాలు, ఇతిహాసాల నుంచి నీతి కథలను సోదాహరణంగా చిన్నారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపాలకృష్ణశాస్త్రి, డాక్టర్ శివారెడ్డి, బ్రౌన్ గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.