‘‘మీరు సిపి బ్రౌన్ ఫొటో సంపా యించాలి. మన దేశంలో ఇప్పటి వరకూ ఎక్కడా దొరకలేదు. ఫొటో సంపాయిస్తే మీకు ఒక లక్ష రూపా యలు కానుకగా ఇస్తా.’’ 1965లో ఇంగ్లాండుకు ప్రయాణమవుతున్న డాక్టర్ పసుమర్తి సత్యనారాయణ మూర్తితో ‘భారతి’ మాసపత్రిక సంపాదకులు శివలెంక శంభుప్రసాద్ అన్న మాటలు ఇవి. శంభు ప్రసాద్ ఐదుగురి సంతానంలో మూడవ సంతానంగా అమ్మాయి పుట్టింది.
ఆమె కాశీనాథుని నాగేశ్వరరావు మరణించిన రోజున (1938లో) జన్మించింది. తాతగారి గుర్తుగా ఆ అమ్మాయికి నాగేశ్వరమ్మ అని నామ కరణం చేశారు. ఈమె భర్తే డా‘‘ శ్యామ్ పసుమర్తిగా పిలువ బడిన డా‘‘ పి.ఎస్.ఎన్. మూర్తి. డాక్టర్ మూర్తి వృద్ధాప్య కార ణాలతో తలెత్తిన స్వల్ప అనారోగ్య కారణంగా 88 ఏళ్ళ వయస్సులో హైదరాబాదులో ఏప్రిల్ 9న మరణించారు.
మూర్తి ఛలోక్తులతో గలగలా నవ్వే నిత్య ఉత్సాహి,మంచి చదువరి. అలవోకగా రాయగల ఆంగ్ల రచయిత! ‘అన్ టచ్‌బుల్ నిర్భయాస్ ఆఫ్ ఇండియా అండ్ వన్ బిలియన్ రైజింగ్’ అనే సెమీ–ఫిక్షనల్ ఆంగ్ల నవల ఈయనదే. ఉత్తరాంధ్రలోని యలమంచిలి గ్రామంలో స్వాతంత్య్ర యోధుల కుటుంబంలో 1934లో జన్మించిన ఈ మెడికల్ డాక్టర్ చేసిన ఈ రచనలో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పాటు టాయిలెట్లు శుభ్రం చేసే ఓ యువతి కథా ఉంది.
పి.ఎస్.ఎన్. మూర్తి పేరు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది. వైద్యశాస్త్రానికి సంబంధించిన ఉన్నత చదువు ఎఫ్.ఆర్.సి.ఎస్. కోసం ఎడిన్‌బరో వెళ్ళిన మూర్తి... సి.పి. బ్రౌన్ అంతిమదశలో లండన్‌లో గడిపిన జీవి తంపై విలువైన పరిశోధన చేశారు. 1965లో బ్రౌన్ ఫొటో అన్వేషణలో తెలిసిన వివరాలను 2019లో వెలువరించిన ‘సి.పి. బ్రౌన్స్ లైఫ్ ఇన్ లండన్ ఆఫ్టర్ హి లెఫ్ట్ ఇండియా’ అనే పుస్తకంలో నిక్షిప్తం చేశారు. 1934లో విశాఖ పట్టణంలో మూర్తి జన్మించారు. శంభు ప్రసాద్ కుమార్తెతో వివాహం అయిన పిమ్మట లండన్ వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత తండ్రి మరణం కారణంగా యలమంచిలి వచ్చేశారు.
బ్రౌన్ ఫొటోపై అన్వేషణలో భాగంగా గూటాల కృష్ణ మూర్తిని కలిసిన తర్వాత... మొదట జనన, మరణ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి బ్రౌన్ జనన, మరణ తేదీల రికార్డుల ఎంట్రీలను జిరాక్స్ తీయించారు. ఆ వివరాలతో ‘లండన్ టైమ్స్’ దినపత్రిక కార్యాలయానికి వెళ్ళి, బ్రౌన్ గురించి వివరాలు చెప్పి సాయం చెయ్యమని అడిగారు. వారు ఫొటో లేని ‘శ్రద్ధాంజలి’ విశేషాల జిరాక్సు ఇచ్చారు. వారి సలహాపైనే నేషనల్ పోర్‌ట్రెయిట్ గ్యాలరీ, బ్రిటిష్ మ్యూజియం,
ఇండియా ఆఫీసు లైబ్రరీలను గాలించారు. అక్కడా ఫొటో లభించలేదు. ప్రొఫెసర్‌గా బ్రౌన్ చివరిదశలో లండన్ యూని వర్సిటీలో పనిచేశారు కనుక యూనివర్సిటీ ఆర్కైవ్స్ వెళ్ళారు. లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ ఉద్యోగానికి బ్రౌన్ అప్లికేషన్ కారణంగా అక్కడ చాలా చర్చ జరిగింది.
అప్పట్లో ఐ.సి.ఎస్. అధికారులకు భారతీయ భాషలైన సంస్కృతం, హిందీ, గుజరాతీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడంలో శిక్షణ ఇవ్వడానికి తెల్లదొరలు పాఠాలు చెప్పేవారు. సి.పి. బ్రౌన్ అర్హుడే అయినా విద్యార్థులు లేని కారణంగా ఉద్యోగం ఎందుకు ఇవ్వాలని చర్చ జరిగింది. చివరికి బ్రౌన్ నియామకం జరిగింది. బ్రౌన్ తరువాత ఈ ఉద్యోగానికి ఇద్దరు ఇంగ్లీషు వారు పోటీపడినా తెలుగు బిడ్డ పి.వి. కుమార స్వామి రాజాకు లభించింది. ఇలాంటి వివరాలు చాలా లభించినా బ్రౌన్ ఫొటో దొరకలేదు.
లండన్‌లోని కిల్డేర్ గార్డెన్స్‌లో బ్రౌన్ నివాసమున్న ఇంటి ఫొటోలు కూడా లభించాయి. ఇంటి దగ్గరున్న çశ్మశానాలలో బ్రౌన్ వివరాలు లభించలేదు. చివరికి ప్రముఖులకు అంత్యక్రియలు జరిపే ‘కెన్సాల్ గ్రీన్ సిమెట్రీ’లో అన్వేషిస్తే ఆయన సమాధి కనబడింది. గడ్డీ గాదంతో నిండిపోయిన ఆ సమాధిని ఇటీవల కాలంలో చూసిన తొలి ఏకైక వ్యక్తి డా‘‘ మూర్తి. తొలిసారి సమాధి 1984 డిసెంబర్ 12 చూసినప్పుడు డాక్టర్ గూటాల కృష్ణమూర్తి కూడా మూర్తితో ఉన్నారు. గ్రేవ్ డిగ్గర్‌కి కొంత పైకమిచ్చి ఆ సమాధి చుట్టూ శుభ్రం చేయించారు మూర్తి. అయితే బ్రౌన్ ఫొటో ఇంతవరకు లభించలేదు. ఇప్పుడు చలామణీలో ఉన్నది ఊహాజనిత పెయింటింగ్ మాత్రమే.
1999లో ‘ఇదే సి.పి. బ్రౌన్ ఫొటో’ అని ఓ వార్త సంచలనంగా వచ్చింది కానీ... తర్వాత అది ఆధారరహిత మని తేలింది. అలాగే తామే మొదట సి.పి. బ్రౌన్ సమాధి కనుగొన్నట్లు కొందరు చేసిన ప్రకటన 2009లో తెలుగు దినపత్రికల్లో హడావిడి చేసింది. నిజానికి, ఆ ఘనత దక్కా ల్సింది మూర్తికి. అయితే బ్రౌన్ ఫొటో లభించలేదనే అసంతృప్తి ఆయనకు ఉండేది. సంచలనాల కారణంగా అప్పుడు... మళ్ళీ మూర్తి మరణం కారణంగా ఇప్పుడు సి.పి. బ్రౌన్ గురించి మాట్లాడుకుంటున్నాం.
డా‘‘ నాగసూరి వేణుగోపాల్
వ్యాసకర్త పాపులర్ సైన్సు రచయిత
99407 32392
Comments
Please login to add a commentAdd a comment