ఆధునిక భారతదేశంలో పాశ్చాత్య వైద్య శాస్త్రపు పట్టా పొంది, ప్రాక్టీస్ చేసి, విజయం సాధించిన తొలి భారతీయ మహిళ కాదంబినీ బోస్ గంగూలీ. వీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో మాట్లాడిన తొలి మహిళ కూడా! అమెరికన్ చరిత్రకారుడు డేవిడ్ కోఫ్ ప్రకారం... కాదంబినీ గంగూలీ చాలా ఆధునికంగా ఆలోచించిన, తొలి తరం బ్రహ్మ సమాజపు భారతీయ మహిళ.
భారతదేశానికి సంబంధించి మహిళల తొలి సంస్థ ‘భాగల్పూర్ మహిళా సమితి’ని ప్రారంభించినవారిలో ఒకరైన బ్రజా కిషోర్ బసుకు కాదంబిని 1861 జూలై 18న జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో కాదంబిని ఢాకాలోని బ్రహ్మో ఈడెన్ ఫిమేల్ స్కూల్, అటు తర్వాత కలకత్తాలోని హిందూ మహిళా విద్యాలయలో చదువుకున్నారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో 1879లో విద్యార్థినులకు ప్రవేశం కల్పించగా, మరుసటి సంవత్సరం కలకత్తా విశ్వవిద్యాలయంలో మహిళా విద్యార్థులకు డిగ్రీ చదువుకు అవకాశం లభించింది. అలా భారతదేశంలో పట్టభద్రులైన తొలి ఇద్దరు మహిళల్లో ఒకరు కాదంబినీ గంగూలీ కాగా, మరొకరు చంద్రముఖీ బసు.
డిగ్రీ చదువు పూర్తి అయ్యాక 1883 జూన్ నెలలో ద్వారకానాథ్ గంగూలీతో కాదంబిని వివాహమైంది. ద్వారకానాథ్ మనదేశంలో మహిళల కోసం తొలి పత్రిక ‘అబలా బంధోబ్’ను నిర్వహించిన అభ్యుదయవాది. బహుభార్యాత్వానికి, అంధ విశ్వాసాలకు, పరదా పద్ధతికి, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ద్వారకానాథ్ గంగూలీ తొలి భార్యను కోల్పోయిన తర్వాత, కాదంబినిని వివాహమాడారు. వారిద్దరి మధ్య 20 ఏళ్ల వయసు తేడా ఉంది. ద్వారకానాథ్ పోరాడిన తర్వాత కానీ కాదంబినికి కలకత్తా మెడికల్ కళాశాలలో ప్రవేశం లభించలేదు.
దాంతో కాదంబినీ గంగూలీ భారతీయ విశ్వ విద్యాలయపు వైద్యవిద్యలో ప్రవేశించిన తొలి మహిళ అయ్యారు. విద్యాలయాల్లో మహిళల ప్రవేశం గురించి చాలామంది వ్యతిరేకిస్తూ కూడా పోరాడారు. అలాంటి వారిలో ఆ విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్ ఆర్‌సీ చంద్ర కూడా ఉన్నారు. కనుకనే కాదంబినీ గంగూలిని ప్రాక్టికల్ ఎగ్జామ్‌లో ఫెయిల్ చేయగా బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ పట్టా లభించలేదు. వివక్ష ఆ స్థాయిలో ఉండేది. నెలకు 20 రూపాయల చొప్పున ఉపకార వేతనం కాదంబినీ గంగూలికి జారీ చేసి, 1883 నుంచి ఒకేసారి పెద్ద మొత్తం ఇచ్చారు.
దాంతో భర్త ప్రోత్సాహంతో 1892లో ఇంగ్లాండ్ వెళ్లి ఎడిన్‌బరో నుంచి ఎల్‌ఆర్‌సీ (లైసెన్షియేట్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్), గ్లాస్కో నుంచి ఎల్‌ఆర్‌సీ ఎస్ (లైసెన్షియేట్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్), ఇంకా డబ్లిన్ నుంచి జీఎఫ్‌పీఎస్ పట్టాలు పొందారు. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత కలకత్తాలోని లేడీ డఫ్రిన్ హాస్పిటల్‌లో నెలకు 300 రూపాయల జీతంతో ప్రసూతి శాస్త్రం, గైనకాలజీ విభాగాలలో సేవలందించారు.
డాక్టర్ వృత్తిలో బిజీగా ఉన్నా పిల్లలను శ్రద్ధగా పెంచారు. ఆమె కుమార్తె జ్యోతిర్మయి స్వాతంత్య్ర సమరయోధురాలు కాగా, కుమారుడు ప్రభాత్ చంద్ర జర్నలిస్టుగా తండ్రి నడిపిన ‘అబలా బంధోబ్’ పత్రికలో గొప్పగా రాణించారు. ఆమె సవతి కూతురు మనవడే ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే!
ఆగ్నేయాసియాలోనే యూరోపియన్ వైద్యశాస్త్రాన్ని అభ్యసించి, పట్టా పొంది, ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ కాదంబినీ గంగూలీ. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాదంబిని మహిళల హక్కులకు సంబంధించి విశేషంగా పోరాడారు కనుకనే ఆనాటి సమాజం నుంచి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ‘బంగభాషి’ అనే పత్రిక ‘కులట’ అంటూ ఆమెను పరోక్షంగా విమర్శించే దాకా వెళ్ళింది. అయితే భర్త ద్వారకానాథ్ పోరాడి ఆ పత్రికా సంపాదకుడు మహేష్ పాల్‌ను కోర్టుకీడ్చి ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించేలా విజయం సాధించారు.
అరవై రెండేళ్ల వయసులో 1923 అక్టోబర్ 3వ తేదీన కన్నుమూసిన కాదంబినీ గంగూలీ నేటికీ భారతీయ మహిళా లోకానికే కాదు, అందరికీ ప్రాతఃస్మరణీయులు. కనుకనే ఇటీవల అంటే 2020లో ‘స్టార్ జల్సా’లో వచ్చిన ‘ప్రోతోమా కాదంబిని’ అనే బెంగాలీ టెలివిజన్ సీరియల్; జీ బంగ్లాలో ‘కాదంబిని’ అనే బెంగాలీ సిరీస్ చాలా ప్రజాదరణ పొందాయి.
డా‘‘ నాగసూరి వేణుగోపాల్
వ్యాసకర్త ఆకాశవాణి విశ్రాంత అధికారి
9440732392
సమాజానికి ఎదురీదిన తొలి వైద్యురాలు
Published Sun, Jun 16 2024 12:28 AM | Last Updated on Sun, Jun 16 2024 12:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment