Nagasuri venugopal
-
సమాజానికి ఎదురీదిన తొలి వైద్యురాలు
ఆధునిక భారతదేశంలో పాశ్చాత్య వైద్య శాస్త్రపు పట్టా పొంది, ప్రాక్టీస్ చేసి, విజయం సాధించిన తొలి భారతీయ మహిళ కాదంబినీ బోస్ గంగూలీ. వీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో మాట్లాడిన తొలి మహిళ కూడా! అమెరికన్ చరిత్రకారుడు డేవిడ్ కోఫ్ ప్రకారం... కాదంబినీ గంగూలీ చాలా ఆధునికంగా ఆలోచించిన, తొలి తరం బ్రహ్మ సమాజపు భారతీయ మహిళ. భారతదేశానికి సంబంధించి మహిళల తొలి సంస్థ ‘భాగల్పూర్ మహిళా సమితి’ని ప్రారంభించినవారిలో ఒకరైన బ్రజా కిషోర్ బసుకు కాదంబిని 1861 జూలై 18న జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో కాదంబిని ఢాకాలోని బ్రహ్మో ఈడెన్ ఫిమేల్ స్కూల్, అటు తర్వాత కలకత్తాలోని హిందూ మహిళా విద్యాలయలో చదువుకున్నారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో 1879లో విద్యార్థినులకు ప్రవేశం కల్పించగా, మరుసటి సంవత్సరం కలకత్తా విశ్వవిద్యాలయంలో మహిళా విద్యార్థులకు డిగ్రీ చదువుకు అవకాశం లభించింది. అలా భారతదేశంలో పట్టభద్రులైన తొలి ఇద్దరు మహిళల్లో ఒకరు కాదంబినీ గంగూలీ కాగా, మరొకరు చంద్రముఖీ బసు. డిగ్రీ చదువు పూర్తి అయ్యాక 1883 జూన్ నెలలో ద్వారకానాథ్ గంగూలీతో కాదంబిని వివాహమైంది. ద్వారకానాథ్ మనదేశంలో మహిళల కోసం తొలి పత్రిక ‘అబలా బంధోబ్’ను నిర్వహించిన అభ్యుదయవాది. బహుభార్యాత్వానికి, అంధ విశ్వాసాలకు, పరదా పద్ధతికి, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ద్వారకానాథ్ గంగూలీ తొలి భార్యను కోల్పోయిన తర్వాత, కాదంబినిని వివాహమాడారు. వారిద్దరి మధ్య 20 ఏళ్ల వయసు తేడా ఉంది. ద్వారకానాథ్ పోరాడిన తర్వాత కానీ కాదంబినికి కలకత్తా మెడికల్ కళాశాలలో ప్రవేశం లభించలేదు. దాంతో కాదంబినీ గంగూలీ భారతీయ విశ్వ విద్యాలయపు వైద్యవిద్యలో ప్రవేశించిన తొలి మహిళ అయ్యారు. విద్యాలయాల్లో మహిళల ప్రవేశం గురించి చాలామంది వ్యతిరేకిస్తూ కూడా పోరాడారు. అలాంటి వారిలో ఆ విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్ ఆర్సీ చంద్ర కూడా ఉన్నారు. కనుకనే కాదంబినీ గంగూలిని ప్రాక్టికల్ ఎగ్జామ్‌లో ఫెయిల్ చేయగా బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ పట్టా లభించలేదు. వివక్ష ఆ స్థాయిలో ఉండేది. నెలకు 20 రూపాయల చొప్పున ఉపకార వేతనం కాదంబినీ గంగూలికి జారీ చేసి, 1883 నుంచి ఒకేసారి పెద్ద మొత్తం ఇచ్చారు. దాంతో భర్త ప్రోత్సాహంతో 1892లో ఇంగ్లాండ్ వెళ్లి ఎడిన్‌బరో నుంచి ఎల్‌ఆర్‌సీ (లైసెన్షియేట్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్), గ్లాస్కో నుంచి ఎల్‌ఆర్‌సీ ఎస్ (లైసెన్షియేట్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్), ఇంకా డబ్లిన్ నుంచి జీఎఫ్పీఎస్ పట్టాలు పొందారు. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత కలకత్తాలోని లేడీ డఫ్రిన్ హాస్పిటల్లో నెలకు 300 రూపాయల జీతంతో ప్రసూతి శాస్త్రం, గైనకాలజీ విభాగాలలో సేవలందించారు.డాక్టర్ వృత్తిలో బిజీగా ఉన్నా పిల్లలను శ్రద్ధగా పెంచారు. ఆమె కుమార్తె జ్యోతిర్మయి స్వాతంత్య్ర సమరయోధురాలు కాగా, కుమారుడు ప్రభాత్ చంద్ర జర్నలిస్టుగా తండ్రి నడిపిన ‘అబలా బంధోబ్’ పత్రికలో గొప్పగా రాణించారు. ఆమె సవతి కూతురు మనవడే ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే! ఆగ్నేయాసియాలోనే యూరోపియన్ వైద్యశాస్త్రాన్ని అభ్యసించి, పట్టా పొంది, ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ కాదంబినీ గంగూలీ. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాదంబిని మహిళల హక్కులకు సంబంధించి విశేషంగా పోరాడారు కనుకనే ఆనాటి సమాజం నుంచి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ‘బంగభాషి’ అనే పత్రిక ‘కులట’ అంటూ ఆమెను పరోక్షంగా విమర్శించే దాకా వెళ్ళింది. అయితే భర్త ద్వారకానాథ్ పోరాడి ఆ పత్రికా సంపాదకుడు మహేష్ పాల్‌ను కోర్టుకీడ్చి ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించేలా విజయం సాధించారు. అరవై రెండేళ్ల వయసులో 1923 అక్టోబర్ 3వ తేదీన కన్నుమూసిన కాదంబినీ గంగూలీ నేటికీ భారతీయ మహిళా లోకానికే కాదు, అందరికీ ప్రాతఃస్మరణీయులు. కనుకనే ఇటీవల అంటే 2020లో ‘స్టార్ జల్సా’లో వచ్చిన ‘ప్రోతోమా కాదంబిని’ అనే బెంగాలీ టెలివిజన్ సీరియల్; జీ బంగ్లాలో ‘కాదంబిని’ అనే బెంగాలీ సిరీస్ చాలా ప్రజాదరణ పొందాయి.డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి విశ్రాంత అధికారి 9440732392 -
హరిజనాభ్యుదయానికి నిరాహార దీక్ష
ఇక్కడ కనబడే ఫోటో గమనించారా? ఆంధ్ర రాష్ట్రం సాధించడానికి మొదలు పెట్టిన దీక్ష ముందు రోజు అంటే 1952 అక్టోబరు 18న మదరాసులో తీసిన ఫోటో ఇది! కుర్చీలో కూర్చున్న ఆ వ్యక్తి 52 ఏళ్ళ పొట్టి శ్రీరాములు. ఈ ఫొటో దాదాపు మనందరికీ పరిచయం కానిదే! ఇదే విధంగా ఆ మహానుభావుడి గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయనిపిస్తుంది. ఉత్తర భారత దేశంలో హిందూ–ముస్లిం మతపరమైన విభేదాలే అతి పెద్ద సమస్య అని ఆ తరం మహానాయకులంతా భావించారు. అయితే దక్షిణ భారతదేశంలో అంటరానితనంతో దాపురించిన అట్టడుగు వర్గాల అధ్వాన్న స్థితి చాలా పెద్ద అవరోధమనీ, ఆ సమస్య గురించి ఆలోచించాలనీ నాలుగుసార్లు నిరాహారదీక్షలు చేసినవారు అమరజీవి పొట్టి శ్రీరాములు! బ్రిటిష్ పాలనలో 1946 మార్చి 7వ తేదీన పది రోజులపాటు నెల్లూరు మూలాపేట వేణు గోపాల స్వామి గుడిలో నిరాహారదీక్ష చేసి హరిజన ప్రవే శాన్ని సాధించారు. అటు సింహాచలం నుంచి ఇటు తిరు మల దాకా తెలుగు ప్రాంతాలలోనే కాక; మదరాసు ప్రెసి డెన్సీలోని తమిళ, కన్నడ ప్రాంతపు దేవాలయాలన్నింటిలోనూ హరిజనులకు ప్రవేశం కల్గించే బిల్లును ఆమో దింపచేయడానికి అదే 1946 నవంబర్ 25 నుంచి 19 రోజులపాటు నిరాహారదీక్ష చేసి విజయం సాధించారు. నిజానికి 1944 అక్టోబరు 2 గాంధీజీ 75వ జన్మ దినోత్సవ సందర్భంగా అస్పృశ్యతకు వ్యతిరేకంగా కావ లిలో వివిధ కార్యక్రమాలు ప్రారంభించారు. దానికి ముందు శ్రీరాములు సబర్మతీ ఆశ్రమంలో మూడు సంవత్స రాలుండి నూరుపాళ్ళు గాంధేయవాదిగా మారారు. మేన మామ, తన భార్య సీతమ్మ తండ్రి అయిన గునుపాటి నర్సయ్య తీవ్ర అనారోగ్యానికి లోను కావడంతో, 1937 నుంచి నెల్లూరు జిల్లాతోపాటు ఇతర తెలుగు ప్రాంతాలు పొట్టి శ్రీరాములుకు కార్యక్షేత్రాల య్యాయి. హరిజనులకు దేవా లయ ప్రవేశంతో అన్ని సమ స్యలు తీరవని ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధం. జైళ్ళ సంస్కరణలు, వివాహ సంప్ర దాయాలలో మార్పులు వంటి వాటికి సంబంధించి కృషి చేస్తూ వచ్చారు. తన స్ఫూర్తిదాత గాంధీజీ మరణించడంతో కలత చెందిన శ్రీరాములు, ఆయన స్మృతి కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదనలను ఉమ్మడి మదరాసు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దానితో ఏడు న్నర దశాబ్దాల క్రితం అంటే 1948 సెప్టెంబర్ 10న మద రాసులో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట శ్రీరాములు నిరాహారదీక్ష ప్రారంభించారు. మన సమాజానికి చాలా కీలకమైన తేదీగా సెప్టెంబర్ 10ని గుర్తు పెట్టుకోవాలి. స్వాతంత్య్రం సంపాదించుకున్న భారతదేశంలో పొట్టి శ్రీరాములు చేసిన తొలి దీక్ష కూడా ఇది. హరిజనుల అభ్యున్నతి కోసం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మొదలైన ఈ దీక్ష ఫలితంగా న్యూసెన్స్ యాక్ట్ కింద మదరాసులోనే శ్రీరాములు నెలరోజుల శిక్ష మీద జైలు పాలయ్యారు. జైల్లో కూడా అలాగే దీక్ష కొనసాగించారు. జైలులో రక్తాన్ని కక్కుకునే పరిస్థితి కూడా దాపురించింది. అలాంటి స్థితిలో విడుదలైతే మరల దీక్షకు పూనుకోకుండా తనను వికలాంగుణ్ణి చేయాలని ప్రభుత్వం యత్ని స్తున్నట్టు పొట్టి శ్రీరాములు (1948 సెప్టెంబర్ 29 ఆయనే రాసిన ఉత్తరంలో) భావించారు. దాంతో ఆయన అర్ధంతరంగా దీక్షను ఆపివేసినపుడు జైలు నుంచి విడుదల చేశారు. తన లక్ష్య సాధన కోసం దీక్షా రంగస్థలాన్ని వార్ధా ఆశ్రమానికి మార్పు చేసి, 1949 జనవరి 12 నుంచి మళ్ళీ ప్రారంభించారు. ఈ నాలుగో సత్యాగ్రహ దీక్ష 28 రోజుల పాటు చేసి ఉమ్మడి మద రాసు ప్రభుత్వంతో ప్రతి నెల 30వ తేదీ (ఫిబ్రవరి నెల అయితే 28 లేదా 29) ‘హరిజన సేవా దినోత్సవం’గా జరిపేలా చట్టం చేయించి, అట్టడుగు వర్గాల అభ్యున్నతిని వాంఛించారు. ఆ చట్టమయితే వచ్చింది కానీ ఫలితం మాత్రం హుళక్కి! డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్: 94407 32392 -
బ్రౌన్ అన్వేషణలో మరువరాని డాక్టర్
‘‘మీరు సిపి బ్రౌన్ ఫొటో సంపా యించాలి. మన దేశంలో ఇప్పటి వరకూ ఎక్కడా దొరకలేదు. ఫొటో సంపాయిస్తే మీకు ఒక లక్ష రూపా యలు కానుకగా ఇస్తా.’’ 1965లో ఇంగ్లాండుకు ప్రయాణమవుతున్న డాక్టర్ పసుమర్తి సత్యనారాయణ మూర్తితో ‘భారతి’ మాసపత్రిక సంపాదకులు శివలెంక శంభుప్రసాద్ అన్న మాటలు ఇవి. శంభు ప్రసాద్ ఐదుగురి సంతానంలో మూడవ సంతానంగా అమ్మాయి పుట్టింది. ఆమె కాశీనాథుని నాగేశ్వరరావు మరణించిన రోజున (1938లో) జన్మించింది. తాతగారి గుర్తుగా ఆ అమ్మాయికి నాగేశ్వరమ్మ అని నామ కరణం చేశారు. ఈమె భర్తే డా‘‘ శ్యామ్ పసుమర్తిగా పిలువ బడిన డా‘‘ పి.ఎస్.ఎన్. మూర్తి. డాక్టర్ మూర్తి వృద్ధాప్య కార ణాలతో తలెత్తిన స్వల్ప అనారోగ్య కారణంగా 88 ఏళ్ళ వయస్సులో హైదరాబాదులో ఏప్రిల్ 9న మరణించారు. మూర్తి ఛలోక్తులతో గలగలా నవ్వే నిత్య ఉత్సాహి,మంచి చదువరి. అలవోకగా రాయగల ఆంగ్ల రచయిత! ‘అన్ టచ్బుల్ నిర్భయాస్ ఆఫ్ ఇండియా అండ్ వన్ బిలియన్ రైజింగ్’ అనే సెమీ–ఫిక్షనల్ ఆంగ్ల నవల ఈయనదే. ఉత్తరాంధ్రలోని యలమంచిలి గ్రామంలో స్వాతంత్య్ర యోధుల కుటుంబంలో 1934లో జన్మించిన ఈ మెడికల్ డాక్టర్ చేసిన ఈ రచనలో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పాటు టాయిలెట్లు శుభ్రం చేసే ఓ యువతి కథా ఉంది. పి.ఎస్.ఎన్. మూర్తి పేరు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది. వైద్యశాస్త్రానికి సంబంధించిన ఉన్నత చదువు ఎఫ్.ఆర్.సి.ఎస్. కోసం ఎడిన్‌బరో వెళ్ళిన మూర్తి... సి.పి. బ్రౌన్ అంతిమదశలో లండన్‌లో గడిపిన జీవి తంపై విలువైన పరిశోధన చేశారు. 1965లో బ్రౌన్ ఫొటో అన్వేషణలో తెలిసిన వివరాలను 2019లో వెలువరించిన ‘సి.పి. బ్రౌన్స్ లైఫ్ ఇన్ లండన్ ఆఫ్టర్ హి లెఫ్ట్ ఇండియా’ అనే పుస్తకంలో నిక్షిప్తం చేశారు. 1934లో విశాఖ పట్టణంలో మూర్తి జన్మించారు. శంభు ప్రసాద్ కుమార్తెతో వివాహం అయిన పిమ్మట లండన్ వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత తండ్రి మరణం కారణంగా యలమంచిలి వచ్చేశారు. బ్రౌన్ ఫొటోపై అన్వేషణలో భాగంగా గూటాల కృష్ణ మూర్తిని కలిసిన తర్వాత... మొదట జనన, మరణ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి బ్రౌన్ జనన, మరణ తేదీల రికార్డుల ఎంట్రీలను జిరాక్స్ తీయించారు. ఆ వివరాలతో ‘లండన్ టైమ్స్’ దినపత్రిక కార్యాలయానికి వెళ్ళి, బ్రౌన్ గురించి వివరాలు చెప్పి సాయం చెయ్యమని అడిగారు. వారు ఫొటో లేని ‘శ్రద్ధాంజలి’ విశేషాల జిరాక్సు ఇచ్చారు. వారి సలహాపైనే నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీ, బ్రిటిష్ మ్యూజియం, ఇండియా ఆఫీసు లైబ్రరీలను గాలించారు. అక్కడా ఫొటో లభించలేదు. ప్రొఫెసర్‌గా బ్రౌన్ చివరిదశలో లండన్ యూని వర్సిటీలో పనిచేశారు కనుక యూనివర్సిటీ ఆర్కైవ్స్ వెళ్ళారు. లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ ఉద్యోగానికి బ్రౌన్ అప్లికేషన్ కారణంగా అక్కడ చాలా చర్చ జరిగింది. అప్పట్లో ఐ.సి.ఎస్. అధికారులకు భారతీయ భాషలైన సంస్కృతం, హిందీ, గుజరాతీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడంలో శిక్షణ ఇవ్వడానికి తెల్లదొరలు పాఠాలు చెప్పేవారు. సి.పి. బ్రౌన్ అర్హుడే అయినా విద్యార్థులు లేని కారణంగా ఉద్యోగం ఎందుకు ఇవ్వాలని చర్చ జరిగింది. చివరికి బ్రౌన్ నియామకం జరిగింది. బ్రౌన్ తరువాత ఈ ఉద్యోగానికి ఇద్దరు ఇంగ్లీషు వారు పోటీపడినా తెలుగు బిడ్డ పి.వి. కుమార స్వామి రాజాకు లభించింది. ఇలాంటి వివరాలు చాలా లభించినా బ్రౌన్ ఫొటో దొరకలేదు. లండన్‌లోని కిల్డేర్ గార్డెన్స్‌లో బ్రౌన్ నివాసమున్న ఇంటి ఫొటోలు కూడా లభించాయి. ఇంటి దగ్గరున్న çశ్మశానాలలో బ్రౌన్ వివరాలు లభించలేదు. చివరికి ప్రముఖులకు అంత్యక్రియలు జరిపే ‘కెన్సాల్ గ్రీన్ సిమెట్రీ’లో అన్వేషిస్తే ఆయన సమాధి కనబడింది. గడ్డీ గాదంతో నిండిపోయిన ఆ సమాధిని ఇటీవల కాలంలో చూసిన తొలి ఏకైక వ్యక్తి డా‘‘ మూర్తి. తొలిసారి సమాధి 1984 డిసెంబర్ 12 చూసినప్పుడు డాక్టర్ గూటాల కృష్ణమూర్తి కూడా మూర్తితో ఉన్నారు. గ్రేవ్ డిగ్గర్కి కొంత పైకమిచ్చి ఆ సమాధి చుట్టూ శుభ్రం చేయించారు మూర్తి. అయితే బ్రౌన్ ఫొటో ఇంతవరకు లభించలేదు. ఇప్పుడు చలామణీలో ఉన్నది ఊహాజనిత పెయింటింగ్ మాత్రమే. 1999లో ‘ఇదే సి.పి. బ్రౌన్ ఫొటో’ అని ఓ వార్త సంచలనంగా వచ్చింది కానీ... తర్వాత అది ఆధారరహిత మని తేలింది. అలాగే తామే మొదట సి.పి. బ్రౌన్ సమాధి కనుగొన్నట్లు కొందరు చేసిన ప్రకటన 2009లో తెలుగు దినపత్రికల్లో హడావిడి చేసింది. నిజానికి, ఆ ఘనత దక్కా ల్సింది మూర్తికి. అయితే బ్రౌన్ ఫొటో లభించలేదనే అసంతృప్తి ఆయనకు ఉండేది. సంచలనాల కారణంగా అప్పుడు... మళ్ళీ మూర్తి మరణం కారణంగా ఇప్పుడు సి.పి. బ్రౌన్ గురించి మాట్లాడుకుంటున్నాం. డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త పాపులర్ సైన్సు రచయిత 99407 32392 -
అమరజీవి త్యాగాన్ని గుర్తుచేస్తూ... సాయి చంద్ పాదయాత్ర
ప్రముఖ సినీనటుడు సాయి చంద్ ‘మా భూమి’ (1980) చిత్రంతో పరిచయమై, పేరు తెచ్చుకుని ఇటీవల కాలంలో శేఖర్ కమ్ముల ‘ఫిదా’ (2017) చిత్రంలో తెలంగాణ మాండలికంలో తండ్రి పాత్రను గొప్పగా రక్తి కట్టించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకుని 69 ఏళ్లు నిండి 70వ సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా... డిసెంబర్ 15న మదరాసు నుంచి సుమారు మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే పడమటి పల్లె గ్రామానికి కాలినడకన ఒంటరిగా బయల్దేరారు. సోమవారానికి ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకుంది. 7వ రోజైన బుధవారానికి కావలికి సమీపంలో కొనసాగింది. పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంటరిగా దీక్ష ప్రారంభించినట్లుగానే సాయిచంద్ తన అనుచరుడు భీమినేని రాయుడుతో తన నడకను మద్రాసు తెలుగు మిత్రుల వీడ్కోలుతో ప్రారంభించారు. మద్రాసు, మైలాపూరులోని స్పీకర్ బులుసు సాంబమూర్తి ఇంటి ఆవరణలో పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు నిరాహారదీక్ష చేసి భారత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడానికి శ్రీకారం చుట్టారు. పొట్టి శ్రీరాములు స్మారక స్థలి నుంచి బయలు దేరిన సాయిచంద్ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో, సింగ రాయకొండకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పడమటి పల్లెకు నడుస్తూ ఉన్నారు. 1956లో జూన్ 25న సంస్కర్త, పోరాటశీలి త్రిపురనేని రామస్వామి చౌదరి మనవడిగా; ప్రఖ్యాత రచయిత, మేధావి త్రిపురనేని గోపీచంద్ కుమారుడిగా సాయిచంద్ జన్మించారు. తొలిదశ నుంచీ అభ్యుదయ భావాలు పుష్కలంగా ఉన్న సాయిచంద్ బాల్యం విజయవాడలో గోరాగారి నాస్తిక కేంద్రంలో సాగింది. రచయిత, గాయకుడు కూడా అయినటువంటి సాయిచంద్ ప్రస్తుత సమాజానికి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చెయ్యాలని ఈ నడక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 1876లో ధాత కరువు వచ్చి తిండీ, నీళ్ళు లేక ప్రజలు, పశువులు అలమటించాల్సి వచ్చింది. అప్పట్లో కనిగిరి తాలూకాలోని పడమటి పల్లె అనే కుగ్రామం నుంచి బతుకు తెరువు కోసం పొట్టి శ్రీరాములు కుటుంబం తమిళ సీమకు తరలి వెళ్లింది. మదరాసు నగరం జార్జి టౌన్‌లోని అన్నా పిళ్ళై వీధిలో 163వ నంబరు గల గృహంలో 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు. శ్రీరాములుకు 12 ఏళ్ళు రాకుండానే తండ్రి గురవయ్య గతించారు. ప్రాథమిక విద్య మద్రాసులోనే జరిగింది. తర్వాత బొంబాయిలోని విక్టో రియా జూబిలీ టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకున్నారు. 1920 ప్రాంతంలో శానిటరీ ఇంజనీరింగ్ చదువు కార ణంగా రైల్వే శానిటరీ ఇంజనీరుగా బొంబాయిలో ఉద్యోగం లభించింది. ఆ సమయంలో తల్లి, భార్య, ఒక కుమారుడు చాలా తక్కువ వ్యవధిలో కనుమరుగవడం గొప్ప విషాదం. పదేళ్ళ తరువాత గాంధీజీ ప్రభావానికి లోనైన తర్వాత 1930 ఏప్రిల్‌లో ముఖాముఖి కలిశారు. గాంధీజీ అనుమతి పొంది, ఉద్యోగానికి అదే నెలలో రాజీనామా చేసి సబర్మతీ ఆశ్రమం బయలుదేరారు. ఇదీ స్థూలంగా పొట్టి శ్రీరాములు జీవిత నేపథ్యం. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరికతో తొలి సమావేశం బాపట్లలో 1913లో జరిగింది. ఆ తరువాత నాలుగు దశాబ్దాలకు పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు ఎందుకు బలిపెట్టవలసి వచ్చిందో చరిత్రలోకి వెళ్లి చూడాలి. తెలుగు వారి ప్రత్యేక రాష్ట్రం కోసం ఎస్కే ధార్ కమీషన్ (1948), జేవీపీ కమిటీ (1949), మరో మూడు కమిటీలు రిపోర్టులిచ్చాయి. అయితే సి. రాజగోపాలా చారి, జవహర్లాల్ నెహ్రూ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి వంటివారి సొంత ఆలోచనల కారణంగా చాలా పరిణామాలు సంభవించాయి. గాంధీజీకి వియ్యంకుడై 1952 జనవరి 26 దాకా అధికారం చలాయించిన, సొంత భాష ప్రయోజనాల కోసం తపించిన తమిళుడైన సి. రాజగోపాలాచారి తెలుగు వారికి పెద్ద రాష్ట్రం ఏర్పడటాన్ని వ్యతిరేకించారంటారు. బెంగాల్ వంటి ప్రాంతాల్లో మాదిరిగా కమ్యూనిస్టు పార్టీ తెలుగు ప్రాంతంలో స్థిరపడి తనకి ఇబ్బంది కలిగించకూడదని నెహ్రూ భావనలు, నీలం సంజీవ రెడ్డి స్థానిక రాజకీయ ప్రయోజనాలు వెరసి రాష్ట్ర అవతరణను అడ్డుకున్నాయి. వీటన్నిటినీ గమనించిన పొట్టి శ్రీరాములు చలించి తన వంతుగా నిరాహారదీక్షకు దిగారు. దీక్ష ప్రారంభించిన తర్వాత కూడా అదేమీ పెద్ద ప్రభావం చూపబోదని పలు నివేదికలు మదరాసు నుంచి ఢిల్లీ వెళ్ళాయి. అయితే పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ అయిన తర్వాతనే తెలుగువారి మనోభీష్టం బయటి ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఆ కారణంగానే 1956లో తెలుగు, తమిళం, కన్నడం మలయాళం భాషలవారికి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇంతటి ఘనమైన త్యాగ చరిత్రను, పొట్టి శ్రీరాములు వంటి సాధారణవ్యక్తి నిరుపమాన త్యాగాన్ని తెలుగు వారికి గుర్తు చెయ్యాలని 66 ఏళ్ళ అవివాహితుడైన సాయి చంద్ తన కాలినడకతో తెలియచెప్పాలని ప్రయత్నిస్తున్నారు! (క్లిక్ చేయండి: కొత్త సంవత్సరం బాగుంటుందా?) - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి -
పారిశ్రామిక విప్లవానికి పునాది
నిజానికి శాస్త్రవేత్త అంటే న్యూటన్ మాత్రమే అనేంత ప్రచారం ఉంది! చెట్టు మీద నుంచి ఆపిల్ పడటం అనే కథకుండే ఆకర్షణ కారణంగా న్యూటన్‌కు అంత గ్లామర్ నడుస్తోంది. కేంబ్రిడ్జిలో జరిగిందని చెప్పే ఈ వృత్తాంతం గురించి న్యూటన్ మహాశయుడు ఎక్కడా పేర్కొనక పోవడం గమనార్హం. అయితే ఆయన కేంబ్రిడ్జిలో చదువుతున్నప్పుడే జోహన్నెస్ కెప్లర్ వివరించిన సూర్యుడు, భూమి గమనాల గురించి లోతయిన విషయాలు అవగతం చేసుకున్నారు. అంటే గురుత్వాకర్షణ భావనను పూర్తిగా పట్టుకున్నది కేంబ్రిడ్జిలోనే. కనుక ఈ ‘ఊహాత్మక యాపిల్’ వ్యవహారం దీనితో ముడిపడిందేమో! 1642 క్రిస్మస్ రోజున అర్ధరాత్రి తర్వాత ఐజాక్ న్యూటన్ ఇంగ్లాండులో జన్మించారు. అదే సంవత్సరంలో నెలల క్రితమే ప్రాయోగిక విజ్ఞానానికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్త గెలీ లియో గెలీలి చనిపోవడం ఒక చారిత్రక విశేషం. గెలీలియో, న్యూటన్ కృషి అవిభాజ్యమైనదిగా పరిగణించారు అల్బర్ట్ ఐన్‌స్టీన్. ఎవరు ఎలా పరిగణించినా తను మాత్రం విజ్ఞాన సముద్రం చెంత ఇసుకలో బుల్లిగవ్వలు, ముచ్చటైన శంఖాలు ఏరుకొనే పిల్లవాడినని న్యూటన్ మరో సందర్భంలో చెప్పడం గమనించాలి. గెలీలియో వంటి వారు ప్రతిపాదించిన భావనలను ఎంతో ప్రతిభావంతంగా ‘మెకా నిక్స్’ అనే ఫిజిక్స్ చట్రంలో తన సూత్రీకరణతో అమర్చిన సూక్ష్మమేధావి, ఆలోచనాశీలి న్యూటన్. కాంతి, ఉష్ణం, దృశా శాస్త్రం, కలనగణితం, గురుత్వాకర్షణ సిద్ధాంతం ఇలా విస్తృత మైన కృషి చేసినవారు న్యూటన్. బాలుడిగా చాలా పరికరాలతో ఆడుకుంటూ, కొత్తవి తయారు చేస్తూ ఉండేవాడు. చదువులో పెద్దగా ప్రతిభా వంతుడిగా చిన్నతనంలో కనిపించకపోయినా తర్వాత దశలో ఆశ్చర్యకరంగా ఎదిగి 26 సంవత్సరాలకే గణితశాస్త్ర ఆచార్యు డయ్యాడు. ధనాగారం అధిపతిగా సేవలందించి, శాస్త్ర పరి జ్ఞానంతో దొంగలను పట్టారు. 1703లో రాయల్ సంస్థకు అధ్యక్షుడుగా ఎన్నికయి, చివరివరకు ఆ పదవిలో కొన సాగారు. 1668లో మెర్కర్ రాసిన సంగతులన్నీ తను అంతకు ముందే కనుగొన్నట్టు న్యూటన్‌కు అనిపించింది. గ్రంథకర్త అయిన తన పేరు లేకుండా తన గణితశాస్త్ర పరిశీలనలను రాసి లండన్, యూరప్ ప్రముఖులకు పంపారు. వారి ఆమోదం పొందాక ఆ పరిశీలనలు పుస్తకంగా వెలువడి, మంచి పేరు తెచ్చాయి. కటకాల గురించి ఆయన చేసిన పరిశోధనలు కళ్ళ జోళ్ళు, దూరదర్శినులు మెరుగు కావడానికి తోడ్పడ్డాయి. రాయల్ సొసైటీలో చేరిన తర్వాత మరో శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ బెడద ఎక్కువయ్యింది. అతని నోరు మూయిం చడానికి 1686 ఏప్రిల్ 28న ప్రఖ్యాతమైన పుస్తకం ‘ప్రిన్సిపియా మేథమెటికా’ వెలువడింది. తన కాంతి కణ సిద్ధాంతాన్ని విభేదించి హెగెన్స్ ‘తరంగ సిద్ధాంతం’ వచ్చినా అది ప్రాచుర్యంలోకి రాలేదు. 1727 మార్చి 20న కనుమూసిన న్యూటన్ కృషి కారణంగానే ఓడల ప్రయాణం, వంతెనల నిర్మాణం సులువు కావడమే కాదు; పారిశ్రామిక విప్లవానికి తెరలేచింది. న్యూటన్ వల్లనే వంద సంవత్సరాల లోపు జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం ఆవిష్కరించగలిగారు! - డా. నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
మహిళా మార్గానికి మణిదీపం
ప్రయోజనకరంగా ఆలోచిం చడమే కాదు; పనికొచ్చే రీతిలో కలాన్ని లేఖలు, వ్యాసాలు, పాటలు, పద్యా లుగా ఝళిపించడమే కాదు; పని చేయడం, చేయించడం ఆమె బలం! ఆడవారు చెప్పులు తొడుక్కుని వీధిలోకి వస్తేనే, విడ్డూరంగా కనిపించే రోజుల్లో స్త్రీహితైషిణీ మండలి, యువతీ విద్యాలయం, హనుమంతరాయ బాల విద్యావిహార్ వంటి సంస్థలు స్థాపించి, నిర్వహించిన కార్యశీలి. గాంధీజీ సూచనతో జీవితాంతం ఖద్దరు కట్టడమే కాదు; స్నేహితురాండ్రతో కలసి స్వరాజ్యలక్ష్మి వ్రతం, రాట్నలక్ష్మీ పూజలు చేసి స్వదేశీ దీక్షా సూత్రాల్ని ముంజేతి కంకణాలుగా ధరింప చేసిన మహిళాసేనాని కనుపర్తి వరలక్ష్మమ్మ. 1896 అక్టోబరు 6న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. భారత స్వాతంత్య్ర అవతరణోత్సవ సందర్భంగా మద్రాసు ఆకాశవాణిలో 1947 ఆగస్టు 16న విశ్వనాథ, కృష్ణశాస్త్రి, జాషువాతో కలిసి కవిత్వం పఠించిన ఏకైక మహిళ; 1968 మే 31న హైదరాబా దులో జరిగిన అఖిల భారత తెలుగు రచయితల మహాసభల్లో వానమామలై వరదాచారి, కాళోజీ నారా యణరావు, మునిమాణిక్యం నరసింహారావుతో పాటు సత్కారానికి అందుకున్న ఏకైక కవయిత్రి. కనుపర్తి వరలక్ష్మమ్మ అనగానే గుర్తుకు వచ్చే రచన ‘శారదా లేఖలు’. సివిల్ సర్వీసెస్‌తో సహా చాలా పోటీ పరీక్షలకు పాఠ్యాంశంగా నేటికీ చదువు తున్న ఈ ‘లేఖలు’ సుమారు నాలుగు దశాబ్దాల వ్యవధిలో 80 ఉత్తరాల రూపంలో రాసిన సాహిత్యం. 1922లో ‘ఆంధ్రపత్రిక’లో ‘మా చెట్టు నీడ ముచ్చట్లు’ పేరుతో తొలుత రాసిన వరలక్ష్మమ్మ, 1928 నుంచి ‘గృహలక్ష్మి’ మాసపత్రికలో చాలాకాలం కొనసాగిం చారు. కల్పలత అనే స్నేహితురాలికి రాసిన ఉత్తరాలుగా ఇవి కనబడ తాయి. స్త్రీల విషయాలు, ఆరోగ్యపు సంగతులు, రాజకీయాలు, స్వాతంత్య్ర పోరాటం, మూఢ నమ్మకాలు, శారదా చట్టం, వర కట్నం, ధరలు పెరగడం, నగలు, నాటకాలు, పర్యటనలు, నాయ కులను స్మరించుకోవడం వంటివే కాదు; ‘గృహలక్ష్మి’, ‘సమదర్శిని’ పత్రికల్లో స్త్రీల గురించి వెలువడిన వ్యాసాలలోని అపసవ్య ధోరణుల గురించి విమర్శలు కూడా ఈ లేఖల్లో కనబడతాయి. గాంధీ దండకం మాత్రమే కాదు, ఓటు వేయమని రచనలతో స్త్రీలను ప్రబోధించిన వర లక్ష్మమ్మ బ్రాహ్మణ శబ్దానికెంత గౌర వముందో, శూద్ర శబ్దానికీ అంతే గౌరవముందన్న ధీశాలి, సమవాది. 1896–1978 మధ్యకాలంలో జీవించిన వర లక్ష్మమ్మ బడికి వెళ్ళి పెద్దగా చదువుకోలేదు. కానీ కొటి కలపూడి సీతమ్మ ప్రసంగం విని చదువుకోవాలని ఆసక్తి పెంచుకున్నారు. ఇంటిలో తండ్రి, సోదరుల ప్రోత్సాహంతో గ్రంథపఠనం, మరోవైపు చోరగుడి సీతమ్మ తోడ్పాడుతో సంఘసేవ ప్రారంభించారు. 1909లో పెళ్లి జరిగి, అదే ఊరిలో అత్తవారింటికి వెళ్ళి నప్పుడు వాళ్ల అన్న ‘శబ్దార్థ చంద్రిక’ నిఘంటు వును బహూకరించడం విశేషం. ఆరోగ్యశాఖలో హెల్త్ ఇన్ స్పెక్టరైన భర్త హనుమంతరావు వెంట మదనపల్లె, బెజవాడ వంటి పట్టణాలు తిరు గుతూ మహిళా చైతన్యానికి కృషి చేశారు. విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్త్రధారణ, రాట్నం, ఖద్దరు వంటి విషయాల గురించి స్ఫూర్తి కరంగా రాశారు. ఫలితంగా, ఎంతోమంది స్త్రీలు సత్యా గ్రహం చేశారు; కల్లు అంగళ్ళ ముందు పికెటింగు చేశారు. ఒకరిద్దరు స్త్రీలు శారద లేఖలు చదివి, సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళి, అక్కడే పురుడు పోసు కున్నారు కూడా. స్త్రీ చైతన్యం, సంఘ సేవ, సాహితీ సృజన, దేశభక్తి, ఆత్మగౌరవం కలబో సిన కార్యశీలి కనుపర్తి వరలక్ష్మమ్మ 1978 ఆగస్టు 13న కన్నుమూశారు. 125వ జయంతి వత్సరం ముగు స్తున్న వేళ ఆ మహోజ్వల మహిళాదీపాన్ని మననం చేసు కోవాల్సి ఉంది. (నేడు కనుపర్తి వరలక్ష్మమ్మ 125వ జయంతి) డా. నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్ : 94407 32392 -
పర్యావరణ ఉద్యమాలకు ప్రాతఃస్మరణీయుడు
1981లో నైరోబీ నగ రంలో ప్రపంచ శక్తి సదస్సు జరుగుతోంది. పైజామా– కుర్తా వేసుకొన్న వ్యక్తి కట్టెల మోపు భుజాన వేసు కుని సమావేశ మందిరం లోకి ప్రవేశించడం ఎంద రినో ఆకర్షించింది. అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న వారిని పేదరికం, వెనుకబాటుతనం ఎలా దెబ్బ తీస్తున్నాయో పాశ్చాత్య దేశాల ప్రతినిధులకు చెప్పాలని సుందర్‌లాల్ బహుగుణ ప్రయత్నం! మే 21న రిషీకేశ్‌లోని ఎయిమ్స్‌లో కనుమూసిన సుందర్‌లాల్ బహుగుణ చరిత్ర విలువైంది. 1927 జనవరి 9న టెహ్రీ (ఇప్పుడు ఉత్తరా ఖండ్ రాష్ట్ర జిల్లా) ప్రాంతం మరోడ గ్రామంలో బహుగుణ జన్మించారు. వారి పూర్వీకులు బెంగాలీ బందోపాధ్యాయ తెగవారు. పొట్టకోసం ఉత్తర ప్రదేశ్ ప్రాంతానికి (గఢ్వాల్) వచ్చినపుడు, తమ ఆయుర్వేద పరిజ్ఞానంతో రాజుగారి అనారోగ్యాన్ని నయం చేశారట. రాజు సంతోషపడి ‘బహుగుణ’ ప్రాంతాన్ని వారికి దానంగా ఇచ్చారు. క్రమంగా ఇంటిపేరు మారిపోయేంతగా అక్కడ కలసి పోయారు. చెట్లు, ఆకులు, మూలికల విలువ తెలి సిన కుటుంబం నుంచి వచ్చినవాడు సుందర్‌లాల్. లాభం కోసం అడవులను నరికిన చరిత్ర టెహ్రీ సంస్థానాధీశులది. 1930ల్లో ఇలాంటి ఘటనల్లో 17మంది చంపబడ్డారు, 80 మంది జైలు పాల య్యారు. ఈ నేపథ్యంలో 13 ఏళ్ల వయసునుంచే సుందర్‌లాల్ రాజకీయపరంగా చురుకుగా ఉన్నారు. గాంధీజీ శిష్యుడు శ్రీదేవ్ సుమన్ ఇతనికి మార్గదర్శి. స్వాతంత్య్రోద్యమం, సర్వోదయో ద్యమం మాత్రమే కాక మీరాబెన్ పర్యావరణ కార్యక్రమాలు సుందర్‌లాల్‌కు స్ఫూర్తి. భార్య విమలాబెన్.. సరళాబెన్ శిష్యురాలు. మీరాబెన్, సరళాబెన్ ఇద్దరూ గాంధీ స్ఫూర్తితో మనదేశం వచ్చి ఉద్యమంలో పాల్గొన్న మహిళా మణులు. పర్యావ రణ విషయమే కాదు, దళితులు ముఖ్యంగా దళిత స్త్రీలకోసం పోరాడి 1950 దశకంలో బుదకేదార్ దేవాలయంలో తొలిసారి హరిజన ప్రవేశం సాధిం చిన ఘనత సుందర్లాల్ది. పర్వత ప్రాంతాల మద్యపాన సమస్య గురించి, మూఢనమ్మకాల నిర్మూలన గురించి కూడా పని చేశారు. స్త్రీలోకం సాయంతో విజయాలు సాధించ వచ్చునని భావించడమే కాదు... ఫలితాలు సాధిం చిన సమన్వయవాది సుందర్‌లాల్. 1974 మార్చి 26న అనుకోకుండా గౌరదేవి తీసుకున్న నిర్ణయం ప్రపంచానికి దారి చూపింది. అలకానంద నది పైభాగాన ఉన్న 2,500 చెట్లను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసింది. ఆ చెట్లు కొట్టుకోవడానికి కాంట్రాక్టర్లు రైని గ్రామానికి వచ్చారు. దీనిని గౌర దేవి చూసి, మిగతా గ్రామస్థులకు చెప్పింది. అలా ముగ్గురు మహిళలు–గౌరదేవి, సుదేశదేవి, బిచ్ని దేవి ఒక రాత్రంతా చెట్లను కౌగలించు(చిప్కో)కొని రక్షించడంతో మిగతావారు మరుసటి రోజు నుంచి చెట్లను కావులించుకోవడం ప్రారంభించారు. అలా మొదలైంది చిప్కో ఉద్యమం. విమలాబెన్ భర్తకు చెప్పి, ఈ ఉద్యమంలోకి ప్రవేశించింది. అలా సుందర్‌లాల్ ఈ చిప్కో ఉద్యమం కొనసాగడానికి, ఇతర ప్రాంతాలకు వ్యాపించడానికి దోహద పడ్డారు. పాదయాత్రతో యువకులను, మహిళ లను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ఎమర్జెన్సీ రావడంతో చిప్కో ఉద్యమం కూడా మందగించింది. అయితే 1978లో పోలీసులు చిప్కో ఉద్యమంలో పాల్గొన్న మహిళలపై చేసిన దురాగతాలు మళ్ళీ వార్తల్లోకెక్కాయి. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హెచ్.ఎన్. బహుగుణ దీనిపై కమిటీ వేశారు. ఈ సందర్భంలో 4,800 కిలోమీటర్ల పాదయాత్రను సుందర్‌లాల్ చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిశారు. ఒక 15 ఏళ్లు చెట్లు కొట్టకుండా నిషేధం విధించేలా చేశారు. ప్రపంచ స్థాయి చిప్కో ఉద్యమంగా జర్మనీ, అమెరికా, ఇంగ్లాండు, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాలకు స్ఫూర్తిగా మారింది. రిచర్డ్ సెయింట్ బెర్బ్ బేకర్ రాసిన విషయాలు 108 దేశాలకు వెళ్ళాయని అంచనా. చిప్కో ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తంగా అధ్యయన అంశంగా మారింది. సుగతా కుమారి, బాబా ఆమ్టే, మేధా పాట్కర్ వంటి ఎంతోమందికి చిప్కో ఉద్యమం స్ఫూర్తి. టెహ్రీ డ్యామ్ నిర్మాణ విషయంలో కూడా సుందర్‌లాల్ బహుగుణ చేసిన పోరాటం పెద్దదే! 1978లో స్వాతంత్య్ర సమరయోధులు వి.డి. సక్లాని నాయకత్వాన మొదలైన ఈ ఉద్యమం 1989లో వారు అనారోగ్యం పాలు కావడంతో బహుగుణ నాయకత్వం అందుకున్నారు. ఈ సందర్భంగా 74 రోజులపాటు నిరాహారదీక్ష చేశారు. పండు వయసులో కనుమూసిన సుందర్‌లాల్ బహుగుణ నిత్యపోరాటయోధుడు. కశ్మీరు నుంచి కోహిమా పాదయాత్ర చేసినపుడు దాదాపు 30 కిలోల బరువు మోసుకుని తిరగడం వారి శారీరక ఆరోగ్యాన్ని చెబుతుంది. ఏ ప్రాంతపు అడవులు, నదులు, పర్వతాలు ఆ ప్రాంతం వారివే. వాటిని మనం నాశనం కాకుండా చూసుకుంటే మన సంక్షే మాన్ని అవి చూసుకుంటాయి. అందుకే ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ (నాశనం కాని జీవావ రణ వ్యవస్థల సముదాయమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ) అని పదేపదే చెప్పేవారు. మరి మనకు వినేస్థాయి వివేకం ఉందా! వ్యాసకర్త : డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్ : 94407 32392 -
అసామాన్య పోరాటం దండి సత్యాగ్రహం
సామాన్యులను విశేషంగా ప్రభావితం చేసే ఉప్పు కోసం సామాన్యులందరినీ కలుస్తూ దానికి నడకను సాధనంగా చేసుకున్న మహాఉద్యమ పథికుడు మహాత్మాగాంధీ. 1930 ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల ముప్పై నిమిషాలకు 61 ఏళ్ల వృద్ధ నేత గాంధీ తన సహచరులతో కలిసి నాటి బ్రిటిష్ చట్టాన్ని ధిక్కరిస్తూ, గుజరాత్ తీరంలోని దండి వద్ద చేసిన ఉప్పు తయారీ బ్రిటిష్ పాలకులను వణికించింది. ఈ ఉద్యమమే తర్వాత భారత స్వాతంత్య్రానికి నాంది పలికింది. అటు జాతీయ నాయకులు, ఇటు బ్రిటిష్ పాలకులు పరాచికాలు ఆడినప్పటికీ ఈ రెండు వర్గాల అంచనాలను వమ్ము చేస్తూ దండి సత్యాగ్రహం ఘన విజయం సాధించడమే కాకుండా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమందికి ప్రేరణ ఇచ్చింది. అది 1930 ఏప్రిల్ 6. ఉదయం 6 గంటల 30 నిమిషాలు. 61 సంవత్సరాల వృద్ధుడు తన సహచరులతో వచ్చి ఉప్పును తయారు చేశారు. ఆ నాయకుడు గాంధీజీ. అలా ఉప్పు సత్యాగ్రహానికి రంగస్థలం అయిన ప్రాంతం గుజరాత్ తీరంలోని దండి. వందేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటన అప్పటి బ్రిటీషు పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఉద్య మంతోనే భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. వ్యూహంలో చాతుర్యం: గాంధీజీ వేషభాషలు చాలా మామూలుగా కనబడతాయి. ఇంగ్లండు చదువు గానీ, దక్షిణాఫ్రికా అనుభవం గానీ ఆయనకు ఉన్నట్టు మాటలు, దుస్తుల ద్వారా అంచనా వేయలేం. ఈ దండి సత్యాగ్రహం భావనలో రెండు అంశాలు మనం గమనించవచ్చు. ఒకటి ఉప్పు, రెండవది నడక. గాలి, నీరు తర్వాత ముఖ్యమైనది ఉప్పు అని గాంధీజీ దండి సత్యాగ్రహం గురించి వివరిస్తూ పేర్కొన్నారు. అప్పటి బ్రిటీష్ వారు భారతీయుల నుంచి వసూలు చేసే పన్నుల్లో ఉప్పు పన్ను 8.2 శాతం ఆక్రమించేది. నిజానికి సుదీర్ఘమైన సముద్రతీరంగల ఈ దేశంలో ఉప్పు వద్దన్నా లభిస్తుంది. మనకు సూర్యరశ్మి కూడా కొరత కాదు. అయితే బ్రిటీష్ వాళ్ళు తమకనుకూలంగా ఉప్పు తయారీని నిషేధిస్తూ చట్టాలు చేశారు. ఈ ఉప్పు పన్ను ధనికుల కన్నా పేదవారినే ఎక్కువ బాధించేది. దేశంలోని పేదలను కదిలించే ఉప్పును గాంధీ తన ఉద్యమానికి ఒక ప్రతీకగా స్వీకరించడం అమోఘమైన పాచిక. గాంధీ చంపారన్ ఉద్యమ సమయంలో ఏనుగునెక్కి కూడా ప్రయాణం చేశారు. దండి సత్యాగ్రహానికి బండ్లు, కార్లు కాకుండా కేవలం నడిచే కార్యక్రమంగా ఆయన మలిచాడు. సబర్మతీ ఆశ్రమానికి దగ్గరలో వుండే ఏదో ఒక తీర ప్రాంతాన్ని కాకుండా 200 మైళ్ళ దూరంలో వుండే నౌసరి (దండికి అప్పటి పేరు) ని ఎంచుకోవడం కూడా గాంధీ ప్రతిభావంతమైన ప్రణాళిక. 1930 మార్చి 12వ తేదీన 78 మంది అనుచరులతో 24 రోజుల పాటు నడుస్తూ మధ్యమధ్యన ప్రతి రోజూ ఒక ఊరిలో ఆగుతూ సాగడం అప్పటికి చాలా కొత్త వింతగా కనబడింది. మిగతా జాతీయ నాయకులు ఇదేమి వ్యూహమని పరాచికాలు ఆడగా బ్రిటీష్ పాలకులు 6 పదులు దాటిన ముదుసలి ఏమి నడుస్తాడులే అని తమలో తాము నవ్వుకున్నారు. ఈ రెండు వర్గాల అంచనాలను వమ్ము చేస్తూ దండి సత్యాగ్రహం విజయవంతం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమందికి ప్రేరణ ఇచ్చింది. యువకులకు పెద్ద పీట: గాంధీతోపాటు 200 మైళ్ళు నడచిన 78 మంది వివరాలు పరిశీలిస్తే అందులో 40–50 ఏళ్ల వయసున్నవాళ్ళు 6గురు మాత్రమే వుండగా... 60 దాటినవాడు ఒక్క గాంధీజీయే. ఈ బృందంలో ఎక్కువమంది 20–25 మధ్య వయసున్న యువకులే కావడం విశేషం. చాలా జాగ్రత్తగా గాంధీజీ ఈ 78 మందిని ఎంపిక చేసుకున్నారు. వీరిలో ఒకే ఒక తెలుగు వ్యక్తి 25 సంవత్సరాల ఎర్నేని సుబ్రహ్మణ్యం. వీరే తరువాతి దశలో పొట్టి శ్రీరాములుకు మిత్రుడిగా, గురువుగా కొనసాగారు. భారత స్వాతంత్య్రోద్యమంలో క్రియాశీలక సంఘటనలు సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనం వంటివి ఉవ్వెత్తున మొదలైనా చౌరీచౌరాలో జరిగిన అల్లర్ల కారణంగా గాంధీ తన వ్యూహాన్ని మార్చేశారు. తరువాత మనకు కనబడే ప్రధాన సంఘటన దండి సత్యాగ్రహమే. సంఘటనలకు స్పందనగా ఎలా వ్యక్తులు తమను తాము మలచుకోవాలో సత్యాగ్రహ శిక్షణ కూడా ఏర్పాటు చేశారు. అటువంటి వినూత్న శిక్షణకు రాజమండ్రి దగ్గర వున్న సత్యాగ్రహ ఆశ్రమం కేంద్రం కావడం తెలుగువారందరికీ గర్వకారణం. దండి సత్యాగ్రహం ప్రభావం: 1930 ఏప్రిల్ 6న గాంధీ తన సహచరులతో కలసి ఉప్పును తయారు చేసి, బ్రిటీష్ శాసనాన్ని ఉల్లంఘించారు. అలా గాంధీ తయారు చేసిన ఉప్పు గడ్డను తరువాత వేలం వేయడం ఒక చారిత్రక విశేషం. గాంధీజీ ఉప్పు తయారు చేసిన సమయంలో తెలుగింటి కోడలైన సరోజినీ నాయుడు చట్టాన్ని గాంధీ అతిక్రమించారని బిగ్గరగా ప్రకటించడం ఇంకో విశేషం. కమలాదేవి ఛటోపాధ్యాయ స్వాతంత్య్రం ఉప్పును కొంటారా అని బొంబాయిలో మెజిస్ట్రేట్‌ను అడగడం మరో ఆశ్చర్యకరమైన అంశం. ఈ రీతిలో దేశవ్యాప్తంగా ఉప్పు స్వాతంత్య్ర ఉద్యమానికి నిప్పు రవ్వగా పనిచేసింది. 1930 ఫిబ్రవరి 27న యంగ్ ఇండియా పత్రికలో నేను అరెస్టయితే అనే శీర్షికతో గాంధీ ఒక సంపాదకీయాన్ని రాస్తూ ఉప్పు పన్ను దుష్ప్రభావాన్ని వివరించాడు. మార్చి రెండవ తేదీ గాంధీజీ వైస్రాయ్ కి సుదీర్ఘమైన ఉత్తరం రాసి ఈ పన్ను ద్వారా పేదలను ఏ స్థాయిలో పీడిస్తున్నారో తెలియజేసారు. ఒక వేళ మీరు సానుకూలంగా స్పందించక పోతే 11వ రోజున సబర్మతీ ఆశ్రమం నుంచి బయలుదేరి ఉప్పు పన్ను చట్టాన్ని అతిక్రమిస్తానని హెచ్చరించారు. ఏప్రిల్ 6వ తేదీన చూసీచూడనట్టున్న బ్రిటీష్ ప్రభుత్వం అప్రమత్తమై మే 5వ తేదీన గాంధీజీని అరెస్టు చేసింది. ప్రపంచ వ్యాప్త స్ఫూర్తి : శాంతియుతంగా నిరసన తెలిపే విధానం (సత్యాగ్రహం) ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. గాంధీ దండి సత్యాగ్రహం నడకను చిత్రిం చిన దృశ్యాలు యూరప్‌ను, అమెరికాను విపరీతంగా ఆకర్షించాయి. న్యూయార్క్ టైమ్స్ ప్రతి రోజూ వార్తలు ప్రచురించటమే కాకుండా ఏప్రిల్ 6, 7 తేదీల్లో తొలి పేజీ కథనాలను ప్రచురించింది. 1930 సంవత్సరం మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా గాంధీజీని టైం మ్యాగజైన్ ఎంపిక చేయడం విశేషం. ఉప్పు పన్నుకు సంబంధించిన సామాజిక ఆర్థికపరమైన పార్శా్వలను వివరించే రీతిలో రామమనోహర్ లోహియా ఉద్యమం జరిగిన మూడేళ్ళలో పీహెచ్.డి పట్టాను గడిం చడం ఇంకో విశేషం. దండి ఉద్యమం జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో నల్లజాతి వారికి వెలుగు చుక్కానిగా మారింది. ఆ ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. తొలుత తాను గాంధీజీని సీరియస్‌గా పట్టించుకోలేదని అయితే ఉప్పు సత్యాగ్రహం, ఆయన నిరాహార దీక్షలు, సత్యాగ్రహ భావన ఆకర్షించాయని తరువాత గాంధీ సిద్ధాంతాలను లోతుగా అన్వేషించడం మొదలైందని, చివరకు గాంధీపట్ల ఆయన ఉద్యమంపట్ల ఆరాధనగా మారిందని అదే తన ఉద్యమాన్ని నడిపించిందని మార్టిన్ విశ్లేషించారు. దండి సత్యాగ్రహానికి 75 ఏళ్ళ పండుగ : 1980లో దండియాత్ర స్వర్ణోత్సవం, 2005లో 75 ఏళ్ళ పండుగ జరి గాయి. ఈ రెండు సందర్భాలలో భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్ళలను విడుదల చేసింది. మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ 2005లో చేసిన రిఎనాక్టిమెంట్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా వార్తలకెక్కింది. 9 దేశాల నుంచి 900 మందితో ప్రారంభమైన తుషార్ గాంధీ బృందం అప్పటి దండి సత్యాగ్రహం దారిలోనే కదిలితే రోజు రోజుకూ కొత్తవారు వచ్చి చేరడంతో ఆ సంఖ్య కొన్ని వేలుగా పెరిగింది. దీనిని న్యాయం, స్వాతంత్య్రం కోసం చేసిన అంతర్జాతీయ నడక అని నామకరణం చేశారు. సబర్మతీ ఆశ్రమం నుంచి దండి దాకా సాగే ఈ దారిని ఇపుడు దండి దారి (దండి పాత్) అని నామకరణం చేశారు. 2019 జనవరి 30వ తేదీన దండిలో నేషనల్ సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్ మ్యూజియంను భారత ప్రభుత్వం ప్రారంభించింది.సామాన్యులను విశేషంగా ప్రభావితం చేసే విషయం కోసం సామాన్యులందరినీ కలుస్తూ దానికి నడకను సాధనంగా చేసుకున్న మహాఉద్యమ పథికుడు మహాత్మాగాంధీ. ఇప్పటికీ ఈ విశేషాలు తలుచుకుంటే, తవ్వి పోసుకుంటే ఆశ్చర్యకరం... స్ఫూర్తిదాయకం! వ్యాసకర్త:డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్ : 94407 32392 -
గోవా పోరాటంలో భాగమైన రహస్య రేడియో
విమానానికి రేడియో ట్రాన్స్ మీటర్ బిగించారు. ఇంకో లౌడ్ స్పీకర్ అమర్చారు. ఆ ప్రసార బృందం పూలు చల్లుతూ 450 సంవత్సరాల చరిత్రలో అపు రూపమైన వార్తను ప్రకటిస్తూ రెండు గంటలపాటు ఆకాశ యానం చేశారు! ఆశ్చర్యమని పించే ఈ సంఘటన 1961 డిసెంబర్ 19న స్వేచ్ఛ సిద్ధించిన గోవాలో జరిగింది. అది గోవా స్వాతంత్య్రం కోసం మొదలైన ‘ద వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్. కొత్త ప్రపంచం–కొత్త రేడియో అనే ఇతివృత్తంతో ప్రపంచ వ్యాప్తంగా రేడియో దినోత్సవం జరుపుకుంటున్న వేళ మనం మరచిపోయిన రేడియో చరిత్రను కొత్తగా తెలుసుకుందాం. 1955 నవంబర్ 25న మొదలైన ఈ రేడియో స్టేషన్ గోవాకు స్వాతంత్య్రం లభించిన రోజు విజయోత్సవంలో పాల్గొని తన ప్రసారాలు ఆపివేసి చరిత్రలో విలక్షణ పుటగా మారిపోయింది. 1510లో గోవా పోర్చుగీసు స్థావరంగా మారింది. పాండిచ్చేరి ఫ్రెంచి వారి చేతిలోకి పోయినట్టు గోవా, డయ్యు, డమన్ పోర్చుగీసు చేతిలో ఉండిపోయాయి. 1932లో గోవా గవర్నర్‌గా యాంటోనియో డి ఒలివీరా సలాజార్ వచ్చిన తర్వాత ఆంక్షలు పెరగడం, ప్రజల హక్కులు హరించడం మొదలైంది. 1940వ దశకం నుంచి స్వాతంత్య్ర పోరాటం గురించి ఆలోచనలు మొదలయ్యాయి. 1954లో దాద్రా నగర్ హవేలీ విముక్తి పొందడం కొత్త ఆశలకు ద్వారాలు తెరిచింది. 1955లో భారత ప్రభుత్వం ‘ఎకనమిక్ బ్లాకేడ్’ ప్రకటించడంతో గోవా బంగాళదుంపలు (నెద ర్లాండ్స్), వైన్ (పోర్చుగీసు), కూరలు, బియ్యం (పాకి స్తాన్), టీ (శ్రీలంక), సిమెంట్ (జపాన్), ఉక్కు (బెల్జియం) ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 1961లో చేపలు పట్టే భారతీయుల పడవలపై గోవా కాల్పులకు దిగడంతో పరిస్థితి మరింత దిగజారింది. 1955 నవంబర్ 25న ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ గోవా సరిహద్దు రాష్ట్ర ప్రాంతం అంబోలి అడవుల నుంచి మొదలైంది. భారత స్వాతంత్య్ర స్ఫూర్తితో వామన్ సర్దేశాయి, లిబియా లోబో కలిసి పోర్చుగీసు, కొంకణి భాషల కార్యక్రమాలతో దీన్ని ప్రారంభిం చారు. రేడియో స్టేషన్ ట్రాన్స్‌మీటర్‌ను ఒక ట్రక్కుకు బిగించి, దట్టమైన అడవుల నుంచి ప్రసారాలు చేసే వారు. గోవా అధికారికంగా చేసే ప్రాపగాండాను వమ్ము చేస్తూ నడిచిన ఈ సీక్రెట్ రేడియో ప్రసారాలకు భారతదేశం నుంచి, ఇతర దేశాల నుంచి మద్దతు లభించేది. ఈ విషయంలో గోవా ఒంటరి కాదనే భావం కల్గించి, ధైర్యం నూరిపోయడానికి వార్తల పరి ధిని పెంచారు. ఇండియా భూభాగం నుంచి ప్రసారం అయ్యేది కనుక భారతీయ నాయకుల ప్రసంగాలు కూడా ప్రసారం చేశారు. 1956 జూలై 15న వినోబా భావే తన రేడియో ప్రసంగంలో శాంతియుతంగా గోవాను వదిలి వెళ్ళిపొమ్మని పోర్చుగీసు వారిని కోరారు. భారత్ పార్లమెంటులో, ఇతర దేశాలలో ఈ విషయంపై జరిగే చర్చల సారాంశాలను కూడా శ్రోత లకు ఎప్పటికప్పుడు అందించేవారు. 1961 డిసెం బర్లో ‘ఆపరేషన్ విజయ్’ మొదలయ్యాక వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ బృందం అడవుల నుంచి బెల్గాం ప్రాంతా నికి వచ్చింది. ఆ సమయం నుంచి ప్రతి గంటకూ ప్రసారాలు చేశారు. గోవా ఆర్మీనుద్దేశించి భారత రక్షణ మంత్రి వి.కె.కృష్ణ మీనన్ 1961 డిసెంబర్ 15న ఈ సీక్రెట్ రేడియోలో ప్రసంగిస్తూ చర్చలకు ఆహ్వానిం చారు. భారత సైన్యం లోపలికే రాకుండా గోవా ఆర్మీ డిసెంబర్ 17న బ్రిడ్జిని కూల్చివేసింది. సుమారు 36 గంటల పాటు వాయు, సముద్ర, భూతలాలపై భీకర పోరాటం నడిచింది. డిసెంబర్ 19న గోవా ప్రాంతం భారత భూభాగంలో కలిసిపోయింది. 1955 నుంచి 1961 దాకా వామన్ సర్దేశాయి, లిబియా లోబో అడవుల్లో పడిన ఇబ్బందులు ఏమిటో మనకు తెలియదు. కానీ ఈ కాలంలోనే వారిరువురూ భార్యాభర్తలుగా మారిపోయారు. రేడియో చరిత్రలో ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ ఒక స్ఫూర్తి పుంజం. డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్ : 94407 32392 (నేడు ప్రపంచ రేడియో దినోత్సవం) -
గుండెలో విజ్ఞానం–మనసులో సాహిత్యం
‘‘సాహిత్యమునకు, శాస్త్రమునకు గల అగాథాఖాతమును పూడ్వవలెను. సాహిత్య, శాస్త్రములను ద్వీపములకు వారధి కట్టవలెను. కవులకు, శాస్త్ర విధులకు మధ్యగల నిరవగాహన భిత్తిని పడగొట్టవలెను..’’ అని సర్దేశాయి తిరుమలరావు తన అమూల్య గ్రంథం ‘సాహిత్య తత్వము–శివభారతదర్శనము’లో ఢంకా భజాయించి చెబుతారు. 1928 నవంబర్ 28న కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా జోరాపురంలో జన్మించిన సర్దేశాయి తిరుమలరావు అనంతపురంలో బి.ఎస్సి. చదివి తెలుగు మీద అభిమానంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఏ (ఆనర్సు) చేయాలని–రెండో ఏడు ప్రవేశం కోరారు. అది సాధ్యపడలేదు, దాంతో రాజస్తాన్‌లోని పిలానీలో బిట్స్–పిలాని ద్వారా ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివారు. 1954లో అనంతపురంలోని ఆయిల్ టెక్నలాజికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్లో రీసెర్చి కెమిస్టుగా చేరి 1989లో ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. తిరుమల రావు వల్ల ఒకవైపు తెలుగు సాహిత్యం, మరోవైపు ఆయిల్ టెక్నాలజి గణనీయంగా లాభపడ్డాయి. సైన్సూ, సాహిత్యమే జీవితపు తోడుగా సాగిన ఆజన్మ బ్రహ్మచారి ఆయన. సంగీతం వినడం హాబీ. సరస చమత్కారం అలవాటు. లౌక్యం, మొహమాటం ఎరుగని జీవనతత్వం. 1994 మే 10న కనుమూసే దాకా అనంతపురం కమలానగర్లో చిన్న పెంకుటింటిలో అన్నతో కలసి ఉండేవారు. అన్నగారూ బ్రహ్మచారే! ఇంటినిండా పుస్తకాలు మాత్రమే! ఎలాంటి ఫర్నిచర్, టెలిఫోన్ లేకుండా నేల మీదనే అధ్యయనం సాగేది. ఆ ఇంటికి ఎవరు వెళ్ళినా నేల మీదనే, చాపమీదనే కూర్చోవాలి. నూనెగింజలు విరివిగా రాయలసీమ ప్రాంతంలో పండుతుండటంతో 1949లో తైల సాంకేతిక పరిశోధనా సంస్థ దేశంలోనే తొలిసారి అనంతపురంలో ఏర్పడింది. ఆ సంస్థ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి సర్దేశాయి తిరుమలరావు. పూర్వీకులు మరాఠీవారు. ఆయనకు మాతృభాష కన్నడం. తెలుగు, ఇంగ్లి్లష్, కన్నడం, సంస్కృతం బాగా వచ్చు. అటు ఆయిల్ టెక్నాలజీలో సుమారు 500 పరిశోధనా పత్రాలు వెలువరించడమే కాక ‘కన్యాశుల్కము–నాటక కళ’, ‘శివభారతదర్శనము–సాహిత్య తత్వము’ వంటి అత్యంత విలువైన గ్రంథాలు సృజియించారు. బియ్యపు పొట్టు, కొబ్బరి, పట్టుపురుగు గుడ్డు, వాడిన కాఫీ పొడి, పత్తి విత్తనాలు, ఆముదాలు, వేరుశనగ గింజలు, పొగాకు విత్తనాలు, వేపగింజలు, మిరపగింజలు, సీతాఫలం గింజలు, అరటి తొక్క, టమోటా విత్తనాలు, దవనం, మరువం, పుదీనా, నువ్వులు, కుసుమలు – ఇలా స్థానికంగా విరివిగా లభించే వాటిపై పరిశోధనలు చేసి, చేయించి పేటెంట్లు పొంది దేశానికి విదేశీ మారకం సాధించారు. ఆంధ్రపత్రిక, భారతి, ది హిందూ, బ్లిట్జ్, ఇలస్ట్రేటెడ్ వీక్లీ, సైన్స్ టు డే వంటి పత్రికలలో ఆయన వర్తమాన విషయాలు–గతుకుల రోడ్లు, అణుశక్తి, బిచ్చగాళ్ళు, అంతర్జాతీయ రాజకీయాలు, సాహిత్య విషయాలు, మేధో వివాదాలు – ఇలా ఎన్నో ఉత్తరాలలో చర్చించేవారు. ‘దేవాలయంపై బూతు బొమ్మలాంటివాడు గిరీశం’ అని తిరుమలరావు వ్యాఖ్యానించారు. 1952 సమయంలో తిరుమలరావు పిలానిలో చదువుకుంటుండగా ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహారదీక్షకు దిగిన పొట్టి శ్రీరాములును ఆ పనికి తగడని కొందరు విమర్శించేవారు. గాంధీ నిరాహారదీక్షకు సరిపోయినపుడు పొట్టి శ్రీరాములు ఎందుకు సరిపోడంటూ విద్యార్థిగా ‘హిందూస్తాన్ టైమ్స్’ పత్రికకు ఉత్తరం రాశారు తిరుమలరావు. గాంధీజీ నాలుగో కుమారుడు హిందూస్తాన్ టైమ్స్ పత్రిక ఎడిటర్‌గా ఆ ఉత్తరం ప్రచురించడం విశేషం. మతానికి మంగళం పాడిన పిదపనే సైన్స్ మొదలవుతుందని నమ్మినవాడు సర్దేశాయి తిరుమలరావు. ‘‘బ్రహ్మసూత్రాలను చెప్పిన బాదరాయణునే కాదు అతని శిష్యులను కూడా దేవుళ్ళుగా పూజిస్తారు. కానీ బాదరాయణునితో సాటి అయిన కణాదుని గురించి చాలామందికి తెలియదు. న్యూటన్ రూథర్ ఫర్డ్ పరిశోధనలు వచ్చేదాకా కణాదుని భావనలు చెల్లుబడి అయ్యాయి’’ అనేవారు తిరుమలరావు. (నేడు సర్దేశాయి తిరుమలరావు జయంతి) వ్యాసకర్త: డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, సైన్స్ రచయిత, వర్తమాన అంశాల వ్యాఖ్యాత మొబైల్ : 94407 32392 -
తుంపరలు చెబుతున్న కరోనా కహానీ
యువర్ అటెన్షన్ ప్లీజ్ ‘మీ స్నేహితులకు, బంధువులకు కానుకలు పంపించాలనుకుంటున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి.. మా సంస్థ నుంచి ఒక వ్యక్తి, చక్కని ప్యాకింగ్‌తో, చిరునవ్వు ఉన్న ముఖంతో వారి ఇంటికి వెళ్లి తలుపు కొట్టి, వారి చేతిలో మీ కానుకను ఉంచుతారు. ఆ కానుక అందుకున్నప్పటి వారి సంతోషాన్ని మేము ఫొటో రూపంలో మీకు పంపిస్తాము కూడా!’ ఈ తరహా ప్రకటనలు ఇదివరకు విదేశాలలో ఉండేవి. వస్తు వినిమయం పెరిగిన తరువాత ఇలాంటి ప్రకటనలు అన్నిచోట్ల చూస్తూనే ఉన్నాం. మరి కరోనా వైరస్‌కు కూడా ఇలాంటి ఒక ఆకర్షణీయమైన ‘ప్యాకేజీ’ ఉందండోయ్! అవే... తుంపరలు. నవ్వకండి మరీ! ఆ తుంపరల కహానీ ఏమిటో, కాస్త శాస్త్రీయంగా తెలుసుకుందామా? నాన్జింగ్ నార్మల్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్లు గ్జియావోజియాంగ్సీ, యుగువో లీ లీ లియు 2009 డిసెంబర్లో జరిపిన పరిశోధన ఫలితాల వ్యాసం ప్రకారం.. మనం 1 నుంచి 100 వరకు అంకెలు లెక్క పెట్టినప్పుడు సుమారుగా 108 తుంపరలు తయారౌతాయి. 20 సార్లు దగ్గినప్పుడు సుమారుగా అదే సంఖ్యలో తుంపరలు బయటకు వస్తాయి. ఇందులో 10 సెంటీమీటర్ల దూరంలో 57.4%, 20 సెంటీమీటర్ల దూరంలో 27.4%, 30 సెంటీమీటర్ల దూరంలో 90% తుంపరలు ఉన్నాయి. ఇక దగ్గినప్పుడైతే 90 శాతం తుంపరలు 30 సెంటీమీటర్ల దూరం వరకూ పడ్డాయట. ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని ఇచ్చినప్పుడు, పరిశీలిస్తే.. మాట్లాడినప్పుడు 100 కన్నా ఎక్కువ, దగ్గినపుడు 800 కన్నా ఎక్కువ తుంపరలు పడ్డాయి. మాస్కు ధరించి మాట్లాడితే, 18.7 మిల్లీగ్రాముల నీరు చేరుకుంది. ప్లాస్టిక్ బ్యాగు, టిష్యూ పేపర్ వాడితే 79.4 మిల్లీగ్రాముల నీరు పేరుకుంది. సర్జికల్ మాస్క్ వేసుకున్నప్పుడు 20 సార్లు దగ్గితే ఆ మాస్క్ మీద 22.9 మిల్లీ గ్రాముల నీరు చేరుకుంది.ప్లాస్టిక్ బ్యాగ్ టిష్యూ పేపర్ వాడినపుడు 85 మిల్లీగ్రాములు పేరుకుపోయింది. సార్స్ వ్యాధి వచ్చినప్పుడు, 2007లో టోక్యో యూనివర్సిటీ, నేషనల్ తైవాన్ యూనివర్సిటీ, తైపీ, తైవాన్ చైనాలో తుంపరల పరిమాణం గురించి కూడా పరిశోధనలు చేశారు. దీని ప్రకారంగా మాట్లాడినప్పుడు తుంపరల సైజు 0.58–5.42 మైక్రో మీటర్లు. దగ్గినప్పుడు తుంపరల సైజు 0.62– 15.9 మైక్రోమీటర్లు. పి 100 ఫిల్టర్ మాస్క్ వాడడం వల్ల తుంపరల శాతం బాగా తగ్గింది.వివిధ వయసులలో, ఆడ, మగ వలంటీర్ల యావరేజ్ తుంపరల సంఖ్య, పరిమాణం చూస్తే వయో, లింగ భేదాల వలన పెద్దగా మార్పు కనబడలేదు. గాలిలో తుంపరల రూపంలో వ్యాప్తి చెందే అంటు వ్యాధులు చాలానే ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి మంప్స్, ఫ్లూ, ఎంటెరో వైరస్ వాంతులు, విరోచనాలు కలుగచేసేవి. క్షయ వ్యాధి, సార్స్, మెర్స్, కరోనా మొదలైనవి. పెద్ద సైజు తుంపరలు వ్యాధి ఉన్న మనిషికి దగ్గరలోనే ఆగిపోతాయి. కానీ చిన్న సైజు ఉన్న తుంపరలు అయితే ఇంకాస్త ఎక్కువ సేపు ఎక్కువ దూరంలో గాలిలో ప్రయాణిస్తాయి. వ్యాధి కలుగచేసే సూక్ష్మజీవి వైరస్ ఐనా బ్యాక్టీరియా అయినా, ఆ మనిషిలో జబ్బునైనా కలుగచేయవచ్చు లేదా, మనిషిని కెరియర్ (వాహకం)గా తయారు చేయవచ్చు. అంటే అతనిలో వ్యాధి లేదు, బయటకు అతడు రోగి కాదు. ఐనా తనలో సూక్ష్మజీవి ఉంది, కనుక అతడు ఎందరికో దీనిని సంక్రమింప చేయవచ్చు. గాలిలో ఉన్న ఈ తుంపరలు ముక్కు ద్వారా ఊపిరి తీసుకున్నప్పుడు, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి దగ్గు కలుగుతుంది. అందుకే దూరంగా ఉండాలి. ఆ తుంపరలను మింగినపుడు, అవి మన జీర్ణాశయంలోనికి వెళ్తాయి. జీర్ణాశయం నుంచి మలద్వారం ద్వారా బయటికి కూడా వస్తాయి. అందుకే పదేపదే చేతులు శుభ్రంగా కడుక్కోమని చెప్పడం. పై పరిశోధనలు చెప్పే సత్యాలు.. 1. తుమ్ము, దగ్గు, మాట్లాడే సమయంలో తుంపరలు వస్తాయి. 2. తుంపరలు సైజు, సంఖ్య ఆహార పదార్థాలు నోటిలో ఉన్నపుడు పెరుగుతాయి. 3. రోగి కాని వారు, వాహకంగా వ్యాధిని వ్యాపించే అవకాశం ఉంది. 4. వైద్య ఆరోగ్య రంగంలో పనిచేసే వారు మాస్క్ వాడాలి. 5. మాస్క్ ఉన్నపుడు సైగలు చేయడం మంచిది. మాట్లాడుతూ ఉంటే తుంపరల సంఖ్య పెరుగుతుంది. 6. చేతులు మోచేతుల దాకా 2 నిమిషాల చొప్పున రోజూ కనీసం 5 సార్లు సబ్బుతో కడుక్కోవాలి. 7. గట్టిగా మాట్లాడకండి. 8. నోటిలో ఆహారం ఉండగా మాట్లాడరాదు. విస్తృతంగా వచ్చే జబ్బును మహమ్మారి లేక ప్రపంచ వ్యాప్త వ్యాధి అంటారు. ఆ వ్యాధి ఉధృతంగా ఉన్నపుడు మనిషి తలవంచక తప్పదు. నాగసూరి వేణుగోపాల్ : 919440 732392 కాళ్ళకూరి శైలజ : 98854 01882 -
క్విట్ ఇండియాకు ఊపిరులూదిన రేడియో
బ్రిటిష్ వారితో గానీ, వారి ప్రభుత్వంతో గానీ ఎటువంటి వ్యవహారం పెట్టుకోవద్దు. వారికి మీరిచ్చే ధనంగానీ, లేదా మీకు వారిచ్చే ధనంగానీ మన సోదర భారతీయుల రక్తంతో తడిసింది. ప్రతి ఇంటి మీదా, కిటికీ మీద మువ్వన్నెల జెండా ఎగురవేయండి. కోర్టులకెళ్ళడం పాపంగా పరిగణించాలి. విదేశీ వస్తువులు కొనవద్దు. ప్రభుత్వ బ్యాంకుల నుండి మీ ధనం తీసేయండి. న్యాయం లేని ప్రభుత్వానికి సేవలందించే అధికారులను బాయ్‌కాట్ చెయ్యండి. రైతు పండించే ధాన్యం మొదలైనవి అతని దగ్గరే ఉండనివ్వండి. ఇలాంటి పది విధులను ప్రతి భారతీయుడు తప్పకుండా నిర్వహించాలని 1942 అక్టోబరు 29వ తేదీన రహస్య ఆకాశవాణి కాంగ్రెస్ రేడియో హిందూస్తానీలో ఉద్బోధించింది. అవి క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. అంతేకాదు, అవి రెండో ప్రపంచ యుద్ధం రోజులు కూడా. బ్రిటిష్ ప్రభుత్వం నడిపే ఆల్ ఇండియా రేడియో స్టేషన్లు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, లక్నో, మద్రాసు, తిరుచ్చురాపల్లిలు మాత్రమే ఉన్నాయి. ఇవేకాక తిరువాంకూరు, మైసూరు, హైదరాబాదు, ఔరంగాబాదు సంస్థానాలు నడిపే రేడియో కేంద్రాలున్నాయి. అయితే ఇవేవీ ప్రజల స్పందననుగానీ, స్వాతంత్య్ర ఉద్యమం వార్తలు కానీ ఇవ్వడం లేదు. వార్తాపత్రికలు సెన్సార్ కాకుండా అచ్చు కావడంలేదు. దాంతో భాగ్యనగర్ రేడియో వంటి రహస్య రేడియో కేంద్రాలు కీలకపాత్ర పోషించాయి. 1942 ఆగస్టు 27 నుంచి నవంబరు 12 వరకు 78 రోజులపాటు రామమనోహర్ లోహియా పర్యవేక్షణలో కాంగ్రెస్ రేడియో గొప్పగా సాగింది. మనదేశంలో 1927 జూలై 23న వ్యవస్థీకృతమైన రేడియో ప్రసారాలు మొదలయ్యాయనే కారణంతో ఆరోజును భారత ప్రసార దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా విలువైన ప్రసారాలు చేసి గొప్ప చరిత్ర సృష్టించిన ఈ ఆజాద్ రేడియో గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వం కన్నుగప్పడానికి కొన్నిరోజులకొకసారి ప్రసార ఫ్రీక్వెన్సీతోపాటు ట్రాన్స్‌మీటర్ స్థానం ఆరేడుచోట్లకు మార్చారు. విఠల్దాస్ కాకర్, ఉషా మెహతా, విఠల్దాస్ జవేరి, నానక్ మెత్వానివంటి మెరికల్లాంటి నలుగురు యువతీయువకులతో ఈ ప్రసారాలలో తోడ్పడ్డారు. ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫైల్స్ ఆధారంగా ఈ కాంగ్రెస్ రేడియో లేదా ఆజాద్ రేడియో గురించి మరిన్ని విషయాలు ఇటీవలే బయల్పడ్డాయి. రోజుకు ఒకసారి ఇంగ్లిష్‌లో, మరోసారి హిందూస్తానీలో అంటే రెండుసార్లు, ప్రతిసారి సుమారు అరగంటపాటు ప్రసారాలు చేసిన ఈ రేడియో ఎటువంటి విషయాలు ఇచ్చిందనే అంశంపై అధ్యయనం ప్రారంభించినపుడు ఈ వ్యాసం మొదట్లో పేర్కొన్న విషయాలు తారసపడ్డాయి. ఈ సమాచారంతో 2018లో ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డూరింగ్ క్విట్ఇండియా మూమెంట్’ అనే పుస్తకం వెలువడింది. ఈ 78 రోజుల ప్రసారాలు హిందూస్తాన్ హమారా అనే పాటతో మొదలై వందేమాతరం పాటతో ముగిసేవి. వార్తలు, వార్తా సమీక్షలు, గాంధీ, వల్లభ్‌భాయ్ పటేల్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నాయకుల ప్రసంగాలు, భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం ప్రత్యేకత, డూ అండ్ డై కార్యాచరణ వెనుక ఉండే తాత్విక నేపథ్యం, వర్తమాన విషయాలపై ప్రశ్నోత్తరాలు– ఇలా చాలా ప్రయోజనకరంగా ఆ రేడియో కార్యక్రమాలు ఉండేవి. భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం చాలా ప్రత్యేకమైందని 1942 అక్టోబరు 21న చేసిన ప్రసారంలో కనబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా గత 200 ఏళ్లలో జరిగిన విప్లవాలలో పోల్చి ఒక భారత్‌లోనే పేదలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నట్లు విశదం చేశారు. రష్యన్ విప్లవంలో కేవలం ఒక శాతం జనాభా పాల్గొనగా, ఫ్రెంచి విప్లవంలో సైతం కొందరే పాలుపంచుకున్నారు. వీరందరూ ధనికులే కానీ పేదలు కాదు. సాంప్రదాయకంగా విప్లవాల పంథాలో పోకుండా, ఆయుధాలు లేని పేదవారు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఒక ప్రత్యేకత. భారత్‌లో అనాదిగా ఉండే శాంతి భావన, నిరాయుధీకరణ, గాంధీ అహింసా ప్రబోధం కలగలిసి భారత స్వాతంత్య్రోద్యమాన్ని ప్రపంచంలోనే సరికొత్తగా రూపొందించాయి. ఇటువంటి కారణాలతో భారత స్వాతంత్య్రోద్యమం విశేషమైంది, విలక్షణమైంది. జాతికవసరమైన ఎన్నో ప్రబోధాలు రామ్మనోహర్ లోహియా సారథ్యంలో ఆనాటి ఆజాద్ రేడియో దేశానికందించింది. ఈ రేడియో సాగింది 78 రోజు లైనా ప్రసారం చేసిన సమాచారం, మార్గదర్శకత్వం మాత్రం విలువైనవి. డా.నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త వర్తమానాంశాల పరిశోధకులు, పత్రికా రచయిత, మొబైల్ : 94407 32392 -
చెన్నపట్నం తొలి తెలుగు ‘వాణి’
మద్రాసు ఆకాశవాణి తెలుగువారి తొలినాటి రేడియో ప్రసారాలను వెలువరించిన కేంద్రం. తెలుగునాట సరళమైన వార్తా భాష స్థిరపడటానికి మద్రాసు ఆకాశవాణి కేంద్రం చేసిన కృషి ఎనలేనిది. ‘‘నేనిప్పుడు చెన్నపట్టణం నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడి నుంచి వినుచున్నరో నేను చెప్పజాలను. కానీ అనేక స్థలములయందు వినుచున్నారని తలచుచున్నాను’’ అంటూ 1938 జూన్ 16 వ తేదీ రాత్రి 8 గంటల 15 నిమిషాలకు కుర్మా వెంకటరెడ్డి ‘భారతదేశం - రేడియో’ అనే అం శంపై ప్రసంగించారు. అది మద్రాసు రేడియో కేంద్రం మొదలైన రోజు. అవి అక్కడి నుంచి వినిపించిన తొలి తెలుగు పలుకులు. వెంకటరెడ్డి 1937 ఏప్రిల్ 1 నుంచి జూలై 14 దాకా నాటి మద్రాసు రాష్ట్ర ప్రధానిగా అంటే ముఖ్యమంత్రిగా పని చేసినవారు. త్యాగరాజుల వారి తెలుగు కృతిని వెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై నాదస్వరంపై వాయిస్తుండగా ఈ కేంద్రం ప్రసారాలను ప్రారంభించింది. పిమ్మట అప్పటి ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలచారి ఆంగ్లంలో ప్రా రంభోపన్యాసం చేశారు. అప్పటికి ఆకాశవాణి అనే మాటను అధికారికంగా వాడ లేదు, రేడియోకు పర్యాయపదంగా వాడారు. రాజాజీ తన ఉపన్యాసంలో ‘హిందూస్తాన్ ఆకాశవాణి’ అని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రసార వాహికగా మద్రాసు రేడియో పుట్టుకతోనే తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. అయితే తెలుగువాడైన సి.వి. కృష్ణస్వామిసెట్టి ప్రారంభించిన మద్రాసు ప్రెసిడెన్సీ క్లబ్ 1924 జూలై 31 నుంచి కొంత కాలం ప్రసారాలను నిర్వహించింది. అది మూతపడ్డాక 1930లో మద్రాసు నగరపాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించింది. కానీ అవీ ఎంతో కాలం సాగలేదు. ఇంతలో 1933లో హైదరాబాదు చిరాగ్ ఆలీ సందులో మహబూబ్ ఆలీ అనే తపాలా శాఖ ఉద్యోగి 200 వాట్ల శక్తి గల రేడియో కేంద్రం ప్రారంభించారు. 1935 నుంచి నిజాం నిర్వహణలోకి పోయిన ఆ కేంద్రం కార్యక్రమాలు ఉర్దూలో ఉండేవి. ఆ కేంద్రమే 1939 జూలై నుంచి దక్కన్ రేడియోగా మారింది. కనుక 1938 జూన్ 16వ తేదీని తెలుగు ఆకాశవాణి జన్మదినంగా పరిగణించాల్సి ఉంటుంది. మద్రాసు కేంద్రం నుంచి తెలుగు ప్రసారాలే ఎక్కువగా ఉండేవని చరిత్ర చెబుతోంది. తొలి రోజులనాటి ఆ ప్రసారాలను గురించి ఆచంట జానకిరామ్ ఆత్మకథ ‘సాగుతున్నయాత్ర’లో కళాత్మకంగా, సవివ రంగా వర్ణించారు. ఆచంట జానకిరామ్, అయ్యగారి వీరభద్రరావు, సూరినారాయణమూర్తి మద్రాసు ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలకు చాలా దోహదం చేశారు. ఈ ముగ్గురిని ‘మూర్తి త్రయం’గా పేర్కొనేవారు. ఈ ముగ్గురు పాల్గొన్న ‘అనార్కలి’ తొలి తెలుగు రేడియో నాటకం. అది 1938 జూన్ 24న లైవ్‌గా మద్రాసు కేంద్రం ద్వారా ప్రసారమైందని డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ అంటారు. అనార్కలి పాత్రను భానుమతి చేశారు. నాటక రచయిత ‘వైతాళికులు’ ముద్దుకృష్ణ. చారిత్రక విషయాల పరిశోధక రచయిత, నాటి ‘భారతి’ పత్రిక ఉపసంపాదకుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ చేసిన‘మయ నాగరికత’ అనే ప్రసంగం రేడియో తెలుగు ఎలా ఉండాలో విశదం చేసింది. ‘‘ఈ యుగం ఎంత చిత్రమైనదో? ఇదంతా పరిశోధన యుగం. వైజ్ఞానిక యుగం. ప్రతి విషయంలోనూ పరిశోధనే! నిప్పు, నీరు, గాలి, ధూళి ఇం తెందుకు...’’ అనే వాక్యాలను పరిశీలిస్తే రేడియో వచన ధర్మాలు సులువుగా బోధపడతాయి. జానకిరామ్ ‘ఇతర గ్రహాలలో మానవులున్నారా?’ అనే అంశంపై జడ్జిగా, చీఫ్ జస్టిస్‌గా పేరుపొందిన సర్ వేపా రామేశముతో ప్రసంగం చే యించారు. కోలవెన్ను రామకోటేశ్వరరావు మద్రాసు ఆకాశవాణి నుంచి తొలి తెలుగు రేడియో పుస్తక సమీక్షను చేశారు. 1948 డిసెంబర్ 1న విజయవాడ కేంద్రం ప్రారంభమయ్యాక మద్రాసు తెలుగు కార్యక్రమాలు తగ్గాయి. 1950 ఏప్రిల్ 1న నైజాం రేడియోను భారత ప్రభుత్వం స్వీకరించి, ఆకాశవాణిగా ప్రసారాలను కొనసాగించింది. 1963లో కడప, విశాఖపట్నం కేంద్రాలు మొదలయ్యాయి. పాతికేళ్ల క్రితం మరో ఎనిమిది జిల్లా స్థాయి రేడియో కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం మొదలైంది. నేటి వ్యాపార టీవీ చానళ్లు, ప్రైవేటు ఎఫ్ఎం రేడియో చానళ్ల ముందు ఆకాశవాణి వెలతెల పోతున్నట్టనిపించవచ్చు. కానీ టీవీ న్యూస్ చానళ్లు అరగంటలో ఇవ్వలేని వార్తా సమాచారాన్ని ఆకాశవాణి ఐదు నిమిషాల బులెటిన్లు ఇవ్వగలవు. సరళమైన వార్తా భాష స్థిరపడటానికి ఆకాశవాణి చేసిన కృషి ఎనలేనిది. నాటి ప్రసారాల ఒరవడిని అనుసరిస్తే తెలుగు చానళ్లలో పరిశుభ్రమైన తెలుగు వినే భాగ్యం కలుగుతుంది. జూన్ 16 ఆకాశవాణి మద్రాసు కేంద్రం 76వ జన్మదినం (వ్యాసకర్త ‘ఆకాశవాణి’ ప్రయోక్త) - నాగసురి వేణుగోపాల్ -
అంకెలు బోధనకీ ఓ లెక్కుంది
ప్రపంచ గణిత దినోత్సవం నేడు: క్రీడా గుణంతో గణితాన్ని బాలబాలికలకు పరిచయం చేయడమే పరమోద్దేశం. గణితంలోని అనువర్తనాల విస్తృతిని పరిచయం చేయడం మరో ఉద్దేశం. ఇప్పుడు చాలా దేశాలలో ఈ సంరంభం విస్తరించింది. దేనికోసమైనా నిరీక్షించవలసినపుడు కాలక్షేపానికి అన్నట్టు కొన్నిచోట్ల గళ్ల నుడికట్టు కాగితాలు ఇస్తూ ఉంటారు. అడ్డంగా, నిలువుగా, ఏటవాలుగా ఎలా కూడినా ఒకే మొత్తం రావాలి. ఒక అంకెను రెండోసారి ఉపయోగించకూడదు. ఒక పొరపాటు జరిగితే మిగిలేది తప్పుల తడకే. అందుకే ఏకాగ్రతతో తీక్షణంగా ఆ పని చేస్తారు. ఇంతకీ ఇది గణిత సాధనా? వినోద క్రీడా? నిజం చెప్పాలంటే, ఆ రెండూ కూడా. ఇలాంటి వాటినే ఎడ్యుకేషనల్ గేమ్స్ అని పిలుస్తారు. ఆట విడుపు, సాధన రెండూ జమిలిగా ఉన్న ఈ ప్రక్రియలను విద్యా పరమైన క్రీడలుగా గుర్తిస్తున్నారు. ఇలాంటి ఎడ్యుకేషనల్ గేమ్స్‌ను విస్తరింప చేయడానికే మార్చి 12వ తేదీని ‘ప్రపంచ గణిత దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. అయితే డిసెంబర్ 22న జరుపుకునే జాతీయ గణితశాస్త్ర దినోత్సవం వేరు. ఇది భారతీయ గణితశాస్త్ర అద్భుతం శ్రీనివాస రామానుజం జన్మదినం. మన దేశానికే పరిమితం. అంకెలు, లెక్కలు, లెక్కించడం స్పష్టతకు చిరునామా. ఇదంతా గణితం. ఇది అస్పష్టతకూ, అయోమయానికీ సుదూరం. ఇల్లాలు చేసే వంటలో కూడా గణన, లెక్కింపు ఉన్నాయి. జీతం పెరిగినపుడు, విద్యార్థి మార్కులు తెలిసినపుడు, బ్యాంకులో నగదు తీసేటపుడు, వేసేటపుడు, ఇల్లు కట్టేటపుడు, ఇల్లు మారేటపుడు లెక్కింపు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సంగీతానికీ, ఛందస్సుకీ కూడా లెక్కలు ముఖ్యమే. అసలు జీవితానికీ, సమాజానికీ ఓ లెక్కుంది. వీటిని గమనించకుండా మాకు లెక్కలంటే ఇష్టంలేదనడం, ‘బోర్’ అనడం అర్థంలేని విషయం. ఈ భావన నుంచి బయటకు రావడానికి ఎడ్యుకేషనల్ గేమ్స్ (విద్యాక్రీడ) సాయపడతాయి. బాలబాలికలను విద్యాక్రీడలతో పరిచయం చేసే పని 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా మొదలయింది. మార్చి 12కు ముందే గణితంలో రకరకాల పోటీలు నిర్వహిస్తారు. వాటి లక్ష్యం బాలబాలికలు. క్రీడా గుణంతో గణితాన్ని వారికి పరిచయం చేయడమే పరమోద్దేశం. గణితంలోని అనువర్తనాల విస్తృతిని పరిచయం చేయడం మరో ఉద్దేశం. ఇప్పుడు చాలా దేశాలలో ఈ సంరంభం విస్తరించింది. విద్యార్జన అనేది క్రమంగా నిరాసక్తంగా, ఆనందం కలిగించని అంశంగా మారిపోతోంది. ఈ దుస్థితిని బద్దలు కొట్టకపోతే ప్రమాదం. ఇందుకు బాలబాలికలను తప్పు పట్టడం సరికాదు. గణిత సమస్యను ఉపాధ్యాయుడు నల్లబల్ల మీద సాధిస్తాడు. కానీ అది బాలలకు అర్థం కావాలంటే తపస్సు చేయాలి. వెంటనే వచ్చే ప్రశ్న - ఇంతకష్టమెందుకు? ఇలాంటి ప్రశ్న విద్యార్థి సంధిస్తే ఉపాధ్యాయుడు జవాబు చెప్పగలిగి ఉండాలి. ఆ జవాబు కూడా విద్యార్థి అనుభవాల నుంచి రాబట్టే విధంగా ఉండాలి. గణితశాస్త్రం ప్రయోజనం ఏమిటని ఎవరైనా విద్యార్థిని లేదా పరిశోధన చేసిన విద్యావేత్తను అడిగినా స్పష్టమైన సమాధానాలు రావు. అంతేకాదు, గణితమంటే మరింత గందరగోళానికి గురి చేసే అభిప్రాయాలు వెలువడతాయి. ఈ అంశం మీద ఉన్న అభిప్రాయం అలాంటిది. దీనికి మనం పాఠ్యపుస్తకాలను, పరీక్షలను విమర్శించడం కంటె, ఇలాంటి ప్రశ్న ఎదురైనపుడు బోధకులు అనుసరించవలసిన ధోరణి మీద దృష్టి పెట్టడం అవసరం. ఏడవ తరగతి పాఠ్య పుస్తకాలలో ఒకచోట మున్నుడిలో చక్కని వివరణ ఉంది. ‘గణితశాస్త్ర ప్రయోజనం విశ్వాంతరాళంలో వస్తువుల మధ్యదూరం లెక్కించడం’ అని స్పష్టంగా ఉంది. ఈ వాక్యంలోని నిగూఢత్వాన్నీ, విస్తృతినీ, పరిధినీ ఉపాధ్యాయుడు అందుకోవాలి. అది సాధ్యం కావాలంటే మరింత అధ్యయనం చేయాలి. కొంత సాధన చేయాలి. ఇవి వీలైనపుడు గణిత బోధన, సాధనఅలుపునివ్వని క్రీడలా కనిపిస్తుంది. విద్యార్థులు కూడా గణితాన్ని ఆస్వాదించగలుగుతారు. విశ్వంలోని పదార్థ ప్రవృత్తిని సులభంగా ఆకళింపు చేసుకోగలుగుతారు. ఎడ్యుకేషనల్ గేమ్స్ ఆశయం ఇదే. (వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త) డా॥నాగసూరి వేణుగోపాల్ -
దిగజారని శ్రేణి, వాడి తగ్గని ‘వాణి’
ఎఫ్ఎం వంటి అధునాతన పరిజ్ఞానం కలిసిరావడంతో - ప్రయాణం చేస్తూ రేడియోను ఆనందంగా వినవచ్చు. సరిగ్గా ఈ విషయంలోనే రేడియో - అటు టెలివిజన్నూ, ఇటు పత్రికలతోను వస్తున్న పోటీని తట్టుకుని నిలబడగలుగుతున్నది. సమాచార వ్యవస్థలో రేడియో తొలి సంచల నమే. వార్తాపత్రికను మించిన సౌలభ్యం, టీవీ చానల్‌కు అతీతమైన సౌకర్యం రేడియోలో సాధారణ మానవుడికి లభించింది. అందుకే ఎన్ని దశాబ్దాలు గడిచినా ఆదరణ తగ్గలేదు. పత్రికారంగం కొత్తరూపు దాల్చింది. పరిధి పెంచుకుంది. టీవీ చానళ్ల హవా చెప్పక్కర్లేదు. అయినా రేడియో జనమాధ్యమంగా తన ప్రత్యేకతను నిలుపుకోవడానికి ఎన్నో కారణా లు కనిపిస్తాయి. సమాచార వ్యవస్థలో ప్రజా స్వామ్యానికి పెద్దపీట వేసిన వ్యవస్థ ఇది. సరి హద్దులు ఆపలేవు. రేడియో మన వెంట వచ్చే ప్రత్యక్ష ప్రసారం. 2012 నుంచి ప్రతి యేటా ఫిబ్రవరి 13వ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపు కుంటున్నారు. 1946 ఫిబ్రవరి 13 ఐక్యరాజ్య సమితి రేడియో మొదలైన తేదీ. ఈ కారణం గా ఫిబ్రవరి 13 తేదీని రేడియో దినోత్సవానికి ఎంపిక చేశారు. 2011 సెప్టెంబర్ 28న యునె స్కో 36వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకు న్నారు. 2012 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ సందర్భంగా రేడియో మాధ్యమం ప్రాధాన్యతను తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ధనిక దేశాలకు కాకుండా ఇతర దేశాలకు రేడియో చాలా రకాలుగా తగిన మాధ్యమం. కేవలం మీడియం లేక పోతే షార్ట్ ప్రసారాలు ఉన్నప్పుడు- కేటా యింపులలో అగ్ర దేశా ల దోపిడీ ఉండేది. ఎక్కువ ఫ్రీక్వెన్సీలు వారు తీసుకోవడమే కాక, అత్యంత శక్తిగల ప్రసారాలు చేసేవి. దీనితో తక్కువ శక్తి గల ప్రసారాలకు ఆటంకాలుగా ఏర్పడేవి. ఈ సమ స్యకు పూర్తిస్థాయి పరిష్కారం ఎఫ్ఎం (ఫ్రీక్వె న్సీ మాడ్యులేషన్)తో లభించింది. వాతావర ణం దెబ్బతీయని ప్రసారం ఎఫ్ఎంతో సాధ్య మైంది. అలాగే ప్రయాణం చేస్తూ రేడియో వినే సదుపాయం కలిగింది. 1995లో మన అత్యున్నత న్యాయస్థానం గొప్ప తీర్పు చెప్పి ఫ్రీక్వెన్సీలు ప్రజల పరం కావాలని వక్కాణిం చింది. ఇది మన దేశ రేడియో ప్రసారాలలో పెద్ద మలుపు. ఎంతో మంది ప్రైవేట్ రేడియో ఆపరేటర్లు ప్రవేశించారు. వీరంతా పత్రిక, టెలివిజన్ రంగాలలో తల పండినవారు. మిర్చి, మ్యాంగో, చాకొలెట్, ఫీపర్ వంటి పూర్తి స్థాయి వాణిజ్య స్థాయి కార్యక్రమాలతో ఈ రేడియో ప్రసారాలు రాణిస్తున్నాయి. మనిషికి చాలా అనువైన జనమాధ్యమం - రేడియో! టీవీ చానళ్లకు రేడియో సౌలభ్యం ఉండదు. వార్తా పత్రి కలు చదవాలంటే చదు వురావాలి. పత్రిక అం దుబాటులోకి రావాలి. అప్పుడే వార్తాపత్రిక పఠనమైనా సాధ్యం కాగలదు. ఆ రెండు మాధ్యమాలతో పోలిస్తే రేడియోకు దినసరి ఖర్చు చాలా తక్కువ! పైగా పని పాడు చేసుకోకుండా రేడియో ప్రసా రాలు వినవచ్చు. రేడియో చాలా చౌక అయిన, సరళమైన సాంకేతిక అద్భుతం. వినడం ఎంత తేలికో, కార్యక్రమాల నిర్మాణం కూడా అంతే తేలిక! ఒక్క మనిషే కార్యక్రమం రూపొందిం చి, ప్రసారం చేయగల సదుపాయం ఉంది. ఇలాంటి సౌలభ్యాలు రేడియోకు పుష్క లంగా ఉన్నాయి కనుక ఇంత పోటీలో కూడా రేడియో నిలబడింది. ఉపగ్రహ ప్రసారం సాధ్యం కావడంతో రేడియో ప్రసారాల నాణ్య త దెబ్బతినలేదు. ఎఫ్ఎం వంటి అధునాతన పరిజ్ఞానం కలసిరావడంతో- ప్రయాణం చేస్తూ రేడియోను ఆనందంగా వినవచ్చు. సరిగ్గా ఈ విషయంలోనే రేడియో- అటు టెలివిజన్నూ, ఇటు పత్రికలతోను వస్తున్న పోటీని తట్టుకుని నిలబడగలుగుతున్నది. ప్రత్యక్ష ప్రసారాల్లో టెలిఫోన్ కలసిపోవడం అనేది ఒక సాంకేతిక అంశం కూడా; దాని ఫలితంగా సాధ్యమైన రేడియో కార్యక్రమాల సృజనాత్మక అద్భుతం. ఇది ప్రజాస్వామిక ధోరణికి దారితీసింది. రేడియో ప్రసారాలు కేవలం నాలుగు గోడల మధ్యనే పరిమితం కాక, వ్యవసాయ క్షేత్రం లోనో, వంటింట్లోనో, కర్మా గారంలోనో ఉండే వ్యక్తి రేడియో కార్యక్ర మంలో పాలుపంచుకునే వీలు కలిగింది. కొం దరే మాట్లాడాలనే నియమాన్ని అధిగమించి, ఎవరైనా మాట్లాడగల సదుపాయం ఇచ్చింది. ఒకటి మాత్రం వాస్తవం. పొలంలో పని చేసే రైతుకూ, ఇంట్లో పాడి చేసుకునే గృహి ణికి, కార్యరంగంలో శ్రమిస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యకర్తకు, విద్యాలయంలో చదువు కునే విద్యార్థికీ తోడ్పడే ప్రసారాలు ఇందులో తక్కువే! కొండకోనల్లో సాగిపోయే గిరిజను డికి ఉపయోగపడే రేడియో ప్రసారాలు రాగ లవా అని ఎంతో మంది ప్రశ్నిస్తున్నారు. ఎక్కు వ భావనాశక్తికి దోహదపడే రేడియో మాధ్య మాన్ని మరింత ప్రయోజనకరంగా, సృజనా త్మకంగా వినియోగించడానికి ప్రపంచమంతా ఆలోచించాలి! దీనికి ప్రపంచ రేడియో దినో త్సవం చక్కని సందర్భం. డా. నాగసూరి వేణుగోపాల్ (వ్యాసకర్త ఆకాశవాణి ఉద్యోగి, రచయిత) (ప్రపంచ రేడియో దినోత్సవం నేడు)