అమరజీవి త్యాగాన్ని గుర్తుచేస్తూ... సాయి చంద్‌ పాదయాత్ర | Actor Sai Chand Padayatra From Chennai to Padamati Palle | Sakshi
Sakshi News home page

అమరజీవి త్యాగాన్ని గుర్తుచేస్తూ... సాయి చంద్‌ పాదయాత్ర

Published Fri, Dec 23 2022 1:09 PM | Last Updated on Fri, Dec 23 2022 1:09 PM

Actor Sai Chand Padayatra From Chennai to Padamati Palle - Sakshi

ప్రముఖ సినీనటుడు సాయి చంద్‌ ‘మా భూమి’ (1980) చిత్రంతో పరిచయమై, పేరు తెచ్చుకుని ఇటీవల కాలంలో శేఖర్‌ కమ్ముల ‘ఫిదా’ (2017) చిత్రంలో తెలంగాణ మాండలికంలో తండ్రి పాత్రను గొప్పగా రక్తి కట్టించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకుని 69 ఏళ్లు నిండి 70వ సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా... డిసెంబర్‌ 15న మదరాసు నుంచి సుమారు మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే పడమటి పల్లె గ్రామానికి కాలినడకన ఒంటరిగా బయల్దేరారు. సోమవారానికి ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకుంది. 7వ రోజైన బుధవారానికి కావలికి సమీపంలో కొనసాగింది.


పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్‌ 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంటరిగా దీక్ష ప్రారంభించినట్లుగానే సాయిచంద్‌ తన అనుచరుడు భీమినేని రాయుడుతో తన నడకను మద్రాసు తెలుగు మిత్రుల వీడ్కోలుతో ప్రారంభించారు. మద్రాసు, మైలాపూరులోని స్పీకర్‌ బులుసు సాంబమూర్తి ఇంటి ఆవరణలో పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు నిరాహారదీక్ష చేసి భారత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడానికి శ్రీకారం చుట్టారు. పొట్టి శ్రీరాములు స్మారక స్థలి నుంచి బయలు దేరిన సాయిచంద్‌ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో, సింగ రాయకొండకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పడమటి పల్లెకు నడుస్తూ ఉన్నారు.

1956లో జూన్‌ 25న సంస్కర్త, పోరాటశీలి త్రిపురనేని రామస్వామి చౌదరి మనవడిగా; ప్రఖ్యాత రచయిత, మేధావి త్రిపురనేని గోపీచంద్‌ కుమారుడిగా సాయిచంద్‌ జన్మించారు. తొలిదశ నుంచీ అభ్యుదయ భావాలు పుష్కలంగా ఉన్న సాయిచంద్‌ బాల్యం విజయవాడలో గోరాగారి నాస్తిక కేంద్రంలో సాగింది. రచయిత, గాయకుడు కూడా అయినటువంటి సాయిచంద్‌ ప్రస్తుత సమాజానికి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చెయ్యాలని ఈ నడక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 

1876లో ధాత కరువు వచ్చి తిండీ, నీళ్ళు లేక ప్రజలు, పశువులు అలమటించాల్సి వచ్చింది. అప్పట్లో కనిగిరి తాలూకాలోని పడమటి పల్లె అనే కుగ్రామం నుంచి బతుకు తెరువు కోసం పొట్టి శ్రీరాములు కుటుంబం తమిళ సీమకు తరలి వెళ్లింది. మదరాసు నగరం జార్జి టౌన్‌లోని అన్నా పిళ్ళై వీధిలో 163వ నంబరు గల గృహంలో 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు. శ్రీరాములుకు 12 ఏళ్ళు రాకుండానే తండ్రి గురవయ్య గతించారు. ప్రాథమిక విద్య మద్రాసులోనే జరిగింది. తర్వాత బొంబాయిలోని విక్టో రియా జూబిలీ టెక్నికల్‌ ఇనిస్టిట్యూట్‌లో చదువుకున్నారు. 1920 ప్రాంతంలో శానిటరీ ఇంజనీరింగ్‌ చదువు కార ణంగా రైల్వే శానిటరీ ఇంజనీరుగా బొంబాయిలో ఉద్యోగం లభించింది.  ఆ సమయంలో తల్లి, భార్య, ఒక కుమారుడు చాలా తక్కువ వ్యవధిలో కనుమరుగవడం గొప్ప విషాదం. పదేళ్ళ తరువాత గాంధీజీ ప్రభావానికి లోనైన తర్వాత 1930 ఏప్రిల్‌లో ముఖాముఖి కలిశారు. గాంధీజీ అనుమతి పొంది, ఉద్యోగానికి అదే నెలలో రాజీనామా చేసి సబర్మతీ ఆశ్రమం బయలుదేరారు. ఇదీ స్థూలంగా పొట్టి శ్రీరాములు జీవిత నేపథ్యం. 

తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరికతో తొలి సమావేశం బాపట్లలో 1913లో జరిగింది. ఆ తరువాత నాలుగు దశాబ్దాలకు పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు ఎందుకు బలిపెట్టవలసి వచ్చిందో చరిత్రలోకి వెళ్లి చూడాలి.

తెలుగు వారి ప్రత్యేక రాష్ట్రం కోసం ఎస్‌కే ధార్‌ కమీషన్‌ (1948), జేవీపీ కమిటీ (1949), మరో మూడు కమిటీలు రిపోర్టులిచ్చాయి. అయితే సి. రాజగోపాలా చారి, జవహర్‌లాల్‌ నెహ్రూ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి వంటివారి సొంత ఆలోచనల కారణంగా చాలా పరిణామాలు సంభవించాయి. గాంధీజీకి వియ్యంకుడై 1952 జనవరి 26 దాకా అధికారం చలాయించిన, సొంత భాష ప్రయోజనాల కోసం తపించిన తమిళుడైన సి. రాజగోపాలాచారి తెలుగు వారికి పెద్ద రాష్ట్రం ఏర్పడటాన్ని వ్యతిరేకించారంటారు. బెంగాల్‌ వంటి ప్రాంతాల్లో మాదిరిగా కమ్యూనిస్టు పార్టీ తెలుగు ప్రాంతంలో స్థిరపడి తనకి ఇబ్బంది కలిగించకూడదని నెహ్రూ భావనలు, నీలం సంజీవ రెడ్డి స్థానిక రాజకీయ ప్రయోజనాలు వెరసి రాష్ట్ర అవతరణను అడ్డుకున్నాయి.

వీటన్నిటినీ గమనించిన పొట్టి శ్రీరాములు చలించి తన వంతుగా నిరాహారదీక్షకు దిగారు. దీక్ష ప్రారంభించిన తర్వాత కూడా అదేమీ పెద్ద ప్రభావం చూపబోదని పలు నివేదికలు మదరాసు నుంచి ఢిల్లీ వెళ్ళాయి. అయితే పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ అయిన తర్వాతనే  తెలుగువారి మనోభీష్టం బయటి ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఆ కారణంగానే 1956లో తెలుగు, తమిళం, కన్నడం మలయాళం భాషలవారికి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 

ఇంతటి ఘనమైన త్యాగ చరిత్రను, పొట్టి శ్రీరాములు వంటి సాధారణవ్యక్తి నిరుపమాన త్యాగాన్ని తెలుగు వారికి గుర్తు చెయ్యాలని 66 ఏళ్ళ అవివాహితుడైన సాయి చంద్‌ తన కాలినడకతో తెలియచెప్పాలని ప్రయత్నిస్తున్నారు! (క్లిక్ చేయండి: కొత్త సంవత్సరం బాగుంటుందా?)

- డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ 
ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement