Potti Sreeramulu
-
YS Jagan: అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం
-
పొట్టిశ్రీరాములుకు సీఎం జగన్ ఘన నివాళులు
సాక్షి,అమరావతి: అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అమరజీవి నడిచిన దారిలో...
‘నాకు శ్రీరాములు వంటి పదకొండు మంది అను చరులు ఉంటే చాలు. నేను ఒక్క సంవత్సరంలో బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేస్తాను’ అని పొట్టి శ్రీరాములు అంకిత భావం, ఉపవాస సామర్థ్యం గురించి వ్యాఖ్యానిస్తూ గాంధీజీ అన్నారు. తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీ యుడైన శ్రీరాములు గొప్పదనానికి ఇంతకంటే కితాబు ఏముంటుంది? పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ‘పెద్ద మనుషుల ఒప్పందం’ ఫలితంగా తెలంగాణ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో 1956 నవంబర్ 1న ‘ఆంధ్రప్రదేశ్’ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏటా నవంబర్ ఒకటవ తేదీ నాడు జరుపుకోవడం ఆనవాయితీ అయింది. అయితే 2014లో ఏపీ తెలంగాణ నుంచి విడి పోయిన తర్వాత నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1 నుంచి మార్చి వేశారు. ఇది అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి జరిగిన మహా అపరాధంగా భావించాలి. అయితే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ తప్పును సరిదిద్ది ఎప్పటిలాగే నవంబర్ 1 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతూ శ్రీరాములు త్యాగానికి ఘన నివాళులర్పిస్తున్నారు. మద్రాస్ రాష్ట్రంలో కలిసి ఉన్న తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు చరిత్ర సృష్టించారు. పొట్టి శ్రీరాములు మరణ వార్త తెలిసి వేలాదిమంది తెలుగు ప్రజలు మద్రాస్‌లోని మౌంట్ రోడ్‌కు చేరుకోవడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ప్రజా ఆస్తుల విధ్వంసం జరిగింది. తెలుగు ప్రాంతాలైన విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, తెనాలి, ఒంగోలు, కనిగిరి, నెల్లూరులతో సహా అనేక ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటాయి. అనకాపల్లి, విజయవాడ లలో పోలీసులు ఏడుగురిని కాల్చి చంపారు. ఫలితంగా మద్రాస్, ఆంధ్రా ప్రాంతాలలో పెద్ద ఎత్తున నాలుగు రోజుల పాటు ప్రజాందోళన కొనసాగింది. దీంతో కేంద్ర సర్కారు దిగివచ్చి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ 1952 డిసెంబరు 19న ప్రకటించారు. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా తెలుగు మాట్లాడే వారి కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఇది దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది అయ్యింది. అనంతరం, తెలంగాణను కలుపుతూ తెలుగు మాట్లాడే జిల్లాలు అన్నీ కలిసి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. నెల్లూరు జిల్లాలోని పడమటపల్లిలో 1901లో శ్రీరాములు జన్మించారు. అయితే ఆ ప్రాంతంలో కరవు పరిస్థితులు నెలకొనడంతో వారి కుటుంబం మద్రాసుకు తరలి వెళ్లింది. అక్కడే పాఠశాలలో శ్రీరాములు తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. తర్వాత శానిటరీ ఇంజనీరింగ్ బొంబాయిలోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చేశారు. కళాశాల విద్య తర్వాత, ముంబైలోని ‘గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే’లో చేరారు. దురదృష్టవశాత్తు తన భార్యను, అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోయారు. ఆయన జీవితంలో జరిగిన అత్యంత విషాదకర సంఘటన ఇది. ఆ సంఘటనను ఆయన జీర్ణించు కోలేకపోయారు. మనోవేదనతో రెండు సంవత్సరాల తరువాత ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు గాంధీజీ నిర్వహిస్తున్న సబర్మతి ఆశ్రమంలో చేరారు. గాంధీజీ ఆశయాలకు ప్రభావితులై దళితుల అభ్యున్నతికి విశేషమైన కృషి చేశారు. సమాజంలోని అంటరానితనాన్నీ, అసమానతలనూ నిరసించి అట్ట డుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త. కుల, మతాలకు అతీతంగా అట్టడుగు వర్గాల ఇళ్లలో భోజనం చేసేవారు. దళితుల హక్కులకు మద్దతుగా ఉపవాసాలు చేశారు. నెల్లూరు మూలపేట వేణుగోపాల స్వామి ఆలయంలో దళితుల ప్రవేశానికి మద్దతుగా ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. వారి హక్కుల సాధనకు కాళ్లకు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో గొడుగు లేకుండా తిరిగే వారు. సమసమాజ స్థాపన కోసం గాంధీజీ సిద్ధాంతాలను ఆచరిస్తున్న ఆయన్ని చూసి కొంతమంది స్థానికులు పిచ్చివాడిగా భావించేవారు. దళితులకు సంఘీభావం తెలిపినందుకు ఒక దశలో అగ్రకులాల వారి ఆగ్రహానికి గురయ్యారు. ప్రత్యేకించి తన వైశ్య కులం వారు ఆయన్ని కులం నుంచి బహిష్కరించినట్లుగా ప్రకటించారు. అయినా ఆయన అవేవీ పట్టించుకోకుండా తన సంకల్పం కోసం దీక్షతో ముందుకు సాగిపోయారు. తదనంతర కాలంలో కానీ ఆయన గొప్పతనం ఏమిటో వాళ్లకు అర్థం కాలేదు. దళితుల అభ్యున్నతికీ, అణగారిన వర్గాల సంక్షే మానికీ కృషి చేయడం నాయకుల బాధ్యత అని చెప్పిన పొట్టి శ్రీరాములు బాటలోనే నేటి సీఎం జగన్ మోహన్ రెడ్డి పయనించడం ముదావహం. పి. విజయబాబు వ్యాసకర్త ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులు (నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం) -
HYD: తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలో తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహల తొలగింపు వివాదాస్పదంగా మారింది. నూతన సచివాలయం ముందున్న విగ్రహాలను అధికారులు తొలగించడంతో వివాదం చోటుచేసుకుంది. కాగా, కొత్త సచివాలయం ఏర్పాటు సందర్భంగా రోడ్డు వెడెల్పులో భాగంగా విగ్రహాలను తొలగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహల తొలగించడంపై పలువురు భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అధికారులు విగ్రహాలను మరోచోట ప్రతిష్టిస్తామని చెప్పారు. అయితే, విగ్రహాలను ఎక్కడ పెడతారనే దానిపై మాత్రం అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. -
అమరజీవి త్యాగాన్ని గుర్తుచేస్తూ... సాయి చంద్ పాదయాత్ర
ప్రముఖ సినీనటుడు సాయి చంద్ ‘మా భూమి’ (1980) చిత్రంతో పరిచయమై, పేరు తెచ్చుకుని ఇటీవల కాలంలో శేఖర్ కమ్ముల ‘ఫిదా’ (2017) చిత్రంలో తెలంగాణ మాండలికంలో తండ్రి పాత్రను గొప్పగా రక్తి కట్టించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకుని 69 ఏళ్లు నిండి 70వ సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా... డిసెంబర్ 15న మదరాసు నుంచి సుమారు మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే పడమటి పల్లె గ్రామానికి కాలినడకన ఒంటరిగా బయల్దేరారు. సోమవారానికి ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకుంది. 7వ రోజైన బుధవారానికి కావలికి సమీపంలో కొనసాగింది. పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంటరిగా దీక్ష ప్రారంభించినట్లుగానే సాయిచంద్ తన అనుచరుడు భీమినేని రాయుడుతో తన నడకను మద్రాసు తెలుగు మిత్రుల వీడ్కోలుతో ప్రారంభించారు. మద్రాసు, మైలాపూరులోని స్పీకర్ బులుసు సాంబమూర్తి ఇంటి ఆవరణలో పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు నిరాహారదీక్ష చేసి భారత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడానికి శ్రీకారం చుట్టారు. పొట్టి శ్రీరాములు స్మారక స్థలి నుంచి బయలు దేరిన సాయిచంద్ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో, సింగ రాయకొండకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పడమటి పల్లెకు నడుస్తూ ఉన్నారు. 1956లో జూన్ 25న సంస్కర్త, పోరాటశీలి త్రిపురనేని రామస్వామి చౌదరి మనవడిగా; ప్రఖ్యాత రచయిత, మేధావి త్రిపురనేని గోపీచంద్ కుమారుడిగా సాయిచంద్ జన్మించారు. తొలిదశ నుంచీ అభ్యుదయ భావాలు పుష్కలంగా ఉన్న సాయిచంద్ బాల్యం విజయవాడలో గోరాగారి నాస్తిక కేంద్రంలో సాగింది. రచయిత, గాయకుడు కూడా అయినటువంటి సాయిచంద్ ప్రస్తుత సమాజానికి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చెయ్యాలని ఈ నడక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 1876లో ధాత కరువు వచ్చి తిండీ, నీళ్ళు లేక ప్రజలు, పశువులు అలమటించాల్సి వచ్చింది. అప్పట్లో కనిగిరి తాలూకాలోని పడమటి పల్లె అనే కుగ్రామం నుంచి బతుకు తెరువు కోసం పొట్టి శ్రీరాములు కుటుంబం తమిళ సీమకు తరలి వెళ్లింది. మదరాసు నగరం జార్జి టౌన్‌లోని అన్నా పిళ్ళై వీధిలో 163వ నంబరు గల గృహంలో 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు. శ్రీరాములుకు 12 ఏళ్ళు రాకుండానే తండ్రి గురవయ్య గతించారు. ప్రాథమిక విద్య మద్రాసులోనే జరిగింది. తర్వాత బొంబాయిలోని విక్టో రియా జూబిలీ టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకున్నారు. 1920 ప్రాంతంలో శానిటరీ ఇంజనీరింగ్ చదువు కార ణంగా రైల్వే శానిటరీ ఇంజనీరుగా బొంబాయిలో ఉద్యోగం లభించింది. ఆ సమయంలో తల్లి, భార్య, ఒక కుమారుడు చాలా తక్కువ వ్యవధిలో కనుమరుగవడం గొప్ప విషాదం. పదేళ్ళ తరువాత గాంధీజీ ప్రభావానికి లోనైన తర్వాత 1930 ఏప్రిల్‌లో ముఖాముఖి కలిశారు. గాంధీజీ అనుమతి పొంది, ఉద్యోగానికి అదే నెలలో రాజీనామా చేసి సబర్మతీ ఆశ్రమం బయలుదేరారు. ఇదీ స్థూలంగా పొట్టి శ్రీరాములు జీవిత నేపథ్యం. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరికతో తొలి సమావేశం బాపట్లలో 1913లో జరిగింది. ఆ తరువాత నాలుగు దశాబ్దాలకు పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు ఎందుకు బలిపెట్టవలసి వచ్చిందో చరిత్రలోకి వెళ్లి చూడాలి. తెలుగు వారి ప్రత్యేక రాష్ట్రం కోసం ఎస్కే ధార్ కమీషన్ (1948), జేవీపీ కమిటీ (1949), మరో మూడు కమిటీలు రిపోర్టులిచ్చాయి. అయితే సి. రాజగోపాలా చారి, జవహర్లాల్ నెహ్రూ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి వంటివారి సొంత ఆలోచనల కారణంగా చాలా పరిణామాలు సంభవించాయి. గాంధీజీకి వియ్యంకుడై 1952 జనవరి 26 దాకా అధికారం చలాయించిన, సొంత భాష ప్రయోజనాల కోసం తపించిన తమిళుడైన సి. రాజగోపాలాచారి తెలుగు వారికి పెద్ద రాష్ట్రం ఏర్పడటాన్ని వ్యతిరేకించారంటారు. బెంగాల్ వంటి ప్రాంతాల్లో మాదిరిగా కమ్యూనిస్టు పార్టీ తెలుగు ప్రాంతంలో స్థిరపడి తనకి ఇబ్బంది కలిగించకూడదని నెహ్రూ భావనలు, నీలం సంజీవ రెడ్డి స్థానిక రాజకీయ ప్రయోజనాలు వెరసి రాష్ట్ర అవతరణను అడ్డుకున్నాయి. వీటన్నిటినీ గమనించిన పొట్టి శ్రీరాములు చలించి తన వంతుగా నిరాహారదీక్షకు దిగారు. దీక్ష ప్రారంభించిన తర్వాత కూడా అదేమీ పెద్ద ప్రభావం చూపబోదని పలు నివేదికలు మదరాసు నుంచి ఢిల్లీ వెళ్ళాయి. అయితే పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ అయిన తర్వాతనే తెలుగువారి మనోభీష్టం బయటి ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఆ కారణంగానే 1956లో తెలుగు, తమిళం, కన్నడం మలయాళం భాషలవారికి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇంతటి ఘనమైన త్యాగ చరిత్రను, పొట్టి శ్రీరాములు వంటి సాధారణవ్యక్తి నిరుపమాన త్యాగాన్ని తెలుగు వారికి గుర్తు చెయ్యాలని 66 ఏళ్ళ అవివాహితుడైన సాయి చంద్ తన కాలినడకతో తెలియచెప్పాలని ప్రయత్నిస్తున్నారు! (క్లిక్ చేయండి: కొత్త సంవత్సరం బాగుంటుందా?) - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి -
‘వయసులో చిన్నవాడైనా నాకు అవకాశం కల్పించాడు’
సాక్షి, విజయవాడ : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 67వ వర్ధంతి సందర్భంగా స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం సభ నిర్వహించారు. ఈ సభకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు గారి వర్థంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పొట్టి శ్రీరాములు మనుమరాలిని పిలిచి సన్మానించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారని కొనియాడారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించడం, పొట్టి శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం ముదావహమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఆయన త్యాగాన్ని విస్మరించిందని విమర్శించారు. పొట్టి శ్రీరాములు పేరిట తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్దని గుర్తు చేశారు. ఆయన వద్ద అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగించారని మండిపడ్డారు. సీఎం జగన్ వయసులో చిన్నవాడైనా త్యాగధనులను గుర్తించి స్మరించుకునే అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. .పట్టుదల, నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన పొట్టి శ్రీరాములు భావితరాలకు స్పూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. -
'పొట్టి శ్రీరాములు చరిత్రను నలుదిశలా వ్యాపిస్తాం'
సాక్షి, వైఎస్సార్ : రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములును ఎన్నటికీ మరువకూడదని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కడపలో ఎంపీ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో మా ప్రభుత్వం ఇప్పటి నుంచి ప్రతి ఏడాది నవంబర్ 1న అవతరణ వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహిస్తోందని తెలిపారు. అలాగే పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను నలుదిశలా వ్యాపించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గత అయిదు సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొట్టి శ్రీరాములును విస్మరించి అవతరణ వేడుకలు నిర్వహించకపోవడం భాదకరమన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాశ్, ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యలు జిల్లా కలెక్టర్ హరికిరణ్‌ను కలిసి సోమశిల ముంపు గ్రామ ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అట్లూరు, గోపవరం మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజల సమస్యలను కూడా పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. -
ప్రత్యేక హోదా కోసం..
ఆనందపేట (గుంటూరు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు గుంటూరును కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేపడుతోంది. బీజేపీ, టీడీపీలు రాష్ట్ర ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్త్తూ ఈనెల 2వ తేదీ స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోని బళ్ళారి రాఘవ ఆడిటోరియంలో సామూహిక దీక్షా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి జిన్నాటవర్ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ, సభా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హిందూకళాశాల సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఐదు రోజులపాటు నిరాహార దీక్ష శిబిరాన్ని కొనసాగించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితోపాటు, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు రెండు ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు ఒంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి గుంటూరులో సామూహిక దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితోపాటు, పార్టీ రాష్ట్రముఖ్య నాయకులు హాజరు కానున్నారని జిల్లా నాయకులు వెల్లడించారు. -
అరవై ఏళ్లు.. నాలుగు రాష్ట్రాలు
-
అరవై ఏళ్లు.. నాలుగు రాష్ట్రాలు
ఇదీ.. ఆంధ్ర రాష్ట్ర ప్రజల చరిత్ర తొలుత మద్రాసు రాష్ట్రంలో.. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా 48 ఏళ్లు సమైక్యాంధ్రప్రదేశ్‌గా.. నేటి నుంచి తెలంగాణ లేకుండా ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) అవతరణ దినోత్సవం ఎప్పుడో? హైదరాబాద్: అరవై ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ (కోస్తా, రాయలసీమ) ప్రాంతం నాలుగు రాష్ట్రాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. రాష్ట్రం మారినప్పుడల్లా ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఏంతో కాలం పోరాడి సాధించుకున్న ప్రాంతాన్ని కొద్దికొద్దిగా కోల్పోతూ ఈ ప్రాంతం చిన్నబోతూ వస్తోంది. మద్రాసు రాష్ట్రం.. ఆంధ్ర రాష్ట్రం.. (సమైక్య) ఆంధ్రప్రదేశ్.. తెలంగాణను మినహాయించిన ఆంధ్రప్రదేశ్.. ఇలా నాలుగు మార్లు స్వరూపం మారిపోతూ వచ్చింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పోరాడి రాష్ట్రం సాధించుకున్నారు. పొట్టి శ్రీరాములు వంటి నేత ప్రాణత్యాగం చేసిన తరువాత ఈ ప్రాంతం 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది. దీంతో ఇక్కడి ప్రజల చరిత్ర రెండో రాష్ట్రం కిందకు వెళ్లింది. తరువాత కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్ర రాష్ట్రం, అప్పటి వరకు ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాలతో 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది. మూడో రాష్ట్ర చరిత్రలో ఈ ప్రాంత ప్రజలు భాగస్వాములయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతం వేరు చేయడంతో సోమవారం (2014 జూన్ 2) నుంచి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఇక నుంచి నాలుగో రాష్ట్ర చరిత్రకు కోస్తా, రాయలసీమ ప్రజలు మారిపోవాల్సి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారే సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతంలో భాగమైన బళ్లారి తదితర ప్రాంతాలు కర్ణాటక రాష్ట్రానికి వెళ్లగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భద్రాచలం వంటి ప్రాంతం (కొన్ని మండలాలు మినహా) ఇప్పు డు తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమైంది. అవతరణ దినం వేడుక ఎప్పుడో? తెలంగాణను మినహాయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై గందరగోళం నెలకొంది. సోమవారం సమైక్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోతుండడంతో ఈ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుందా? లేదంటే ఇప్పుటి వరకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుగుతున్న నవంబరు 1వ తేదీనే కొనసాగిస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు. గతంలో ఆంధ్ర రాష్ట్రంగా ఉన్న ప్రాం తమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మిగిలిపోవడంతో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిన అక్టోబరు 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినంగా కొనసాగించాలన్న వాదన మొదలైంది. వీటిలో ఏ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలన్నది కొత్త ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం మేరకే ఉంటుందని అధికారులు అంటున్నారు. -
అమరజీవి త్యాగం మరువలేనిది
వెఎస్ఆర్ సీపీ నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగం మరువలేనిదని వైఎస్ఆర్ సీపీ నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతిని పురస్కరించుకుని వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత స్థానిక తాతా బిల్డింగ్స్ సమీపంలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్లబ్ కార్యదర్శి పవన్‌కుమార్‌తో కలిసి మాతా శిశు వైద్యశాలలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి దేసు వెంకటసుబ్బారావు, వేములు శ్రీమనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో.. పొట్టిశ్రీరాములు జయంతిని పురస్కరించుకుని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాంప్లెక్స్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు తాతా వెంకట చెంచయ్య గుప్తా, కార్యదర్శి ఇస్కాల వేణుగోపాల్, మాజీ కార్యదర్శి కూరపాటి సత్యనారాయణ, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తూను గుంట రామమోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములుజయంతి వేడుకలను స్థానిక వైశ్యాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్ల కాశీరావు మాట్లాడుతూ అమరజీవి త్యాగాన్ని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షుడు తాతా సుబ్బారావు, కోశాధికారి గ్రంధె వెంకటరామభద్రారావు, ఉపాధ్యక్షుడు బాబు, పెరుమాళ్ల గిరి, కార్యదర్శి నరసింహారావు, మండల అధ్యక్షుడు మోదుకూరి శ్రీనివాసరావు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు పొట్టి శ్రీరాములు వర్ధంతి
-
అమరజీవే స్ఫూర్తి
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఆశయంతో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి, అశువులు బాశారు. ఆ మహనీయుని ప్రాణ త్యాగం తెలుగుజాతి పురోభివృద్ధికి ఆదర్శం. ఇదే స్ఫూర్తితో ప్రజలు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తగిన సహకారం అందించాల’ని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ కోరారు. శుక్రవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై... జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జిల్లా జడ్జి వెంకటేశ్వరరావు, డీఐజీ బాలకృష్ణ, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఏజేసీ జయచందర్, జెడ్పీ సీఈఓ విజయేందిర, డీఆర్వో హేమసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగుజాతి చరిత్ర ఉన్నంత వరకు అమరజీవి ఘనకీర్తి విరాజిల్లుతూనే ఉంటుందన్నారు. దేశంలో తెలుగు సంస్కృతికి, మధురమైన తెలుగు భాషకు విశిష్ట స్థానం ఉంద న్నారు. దీన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల భాషలో పాలనా వ్యవహారాలను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 552 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా... ఇప్పటి వరకు 436 మి.మీ నమోదయ్యిందని తెలిపారు. మొక్కల పెంపకం విరివిగా చేపట్టి వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా జిల్లాలో కరువు నివారణకు కృషి చేస్తామన్నారు. పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయడానికి రెవెన్యూ డివిజన్లలో ‘ప్రజావాణి’ ప్రారంభించామని తెలిపారు. వడ్డీలేని పంట రుణాల పథకం ద్వారా ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో 5.70 లక్షల మంది రైతులకు రూ.2,658 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ.2,509 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఖరీఫ్-2012 ఇన్పుట్ సబ్సిడీ రూ.648.88 కోట్లకు గాను ఇప్పటి వరకు 3.49 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.350 కోట్లు జమ చేశామని తెలిపారు. మిస్‌మ్యాచింగ్ ఖాతాలను సరిచేసి మిగిలిన మొత్తంతో పాటు త్వరలో రెండో విడతగా 24 మండలాల రైతులకు పరిహారం అందిస్తామన్నారు.జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు రూ.7,676 కోట్లతో రూపొందించిన ‘ప్రాజెక్ట్ అనంత’ అమలుకు జిల్లా స్థాయి కమిటీని, ప్రత్యేక అధికారి నియామకం చేపట్టినట్లు గుర్తు చేశారు. త్వరలో 600 అంగన్వాడీ కార్యకర్తల నియామకానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఏడో విడత భూపంపిణీ కోసం ఇప్పటి వరకు 9,538 ఎకరాలు గుర్తించామన్నారు. బీర్జీఎఫ్ కింద రూ.38.56 కోట్లతో 2,571 పనులు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు సాంబమూర్తిని జిల్లా కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, పట్టుపరిశ్రమశాఖ జేడీ అరుణకుమారి, ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్ఓ శాంతకుమారి, పౌరసరఫరాల డీఎం వెంకటేశం, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి, డ్వామా పీడీ సంజయ్ప్రభాకర్, నగర పాలక సంస్థ కమిషనర్ టి.రంగయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రభాకరరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ రామసుబ్బారావు, హౌసింగ్ పీడీ ప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్ఈ రవికుమార్, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, మెప్మా పీడీ మల్లీశ్వరిదేవి, కంటి వైద్య నిపుణులు అక్బర్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
సభా ప్రాంగణానికి పొట్టి శ్రీరాములు పేరు
ఏపీఎన్జీవోలు ఎల్బీ స్టేడియంలో రేపు నిర్వహించనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభా ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. సభావేదికకు బూరుగుల రామకృష్ణారావు పేరు పెట్టారు. ఎల్బీ స్టేడియం ప్రధాన ద్వారాలకు కొమరం భీమ్, బెజవాడ గోపాలకృష్ణారెడ్డి, కృష్ణదేవరాయ, సురవరం ప్రతాప్‌రెడ్డి, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు. సాంసృతిక వేదికకు గురజాడ అప్పారావు పేరు పెట్టారు. మరోవైపు ఏపీ ఎన్జీవోల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్బీ స్టేడియమ్లో రేపు జరిగే సమావేశానికి ఉద్యోగులు మాత్రమే హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులు ఉన్న వారినే సభకు అనుమతించాలని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. కాగా, సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సజావుగా జరిగేందుకు తెలంగాణ వాదులు సహకరించాలని అశోక్ బాబు కోరారు. -
సమైక్యాంధ్రను పరిరక్షించుకుంటాం
చెన్నై, సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్ర అట్టుడికి పోతోంది. చెన్నైలోని తెలుగువారు సైతం ఉద్యమబాట పట్టారు. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మైలాపూరులోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో బుధవారం నిరాహారదీక్ష జరిగింది. పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించిన చోట వెలసిన స్మారక మందిరంలోని ఆయన విగ్రహానికి ముందుగా నివాళులర్పించారు. తర్వాత సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి తంగుటూరి రామకృష్ణ ప్రసంగించారు. ఒక మంచికి, మరో చెడ్డకు సైతం తెలుగువారే ముందుండి నిలిచారని అన్నారు. ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారు కావడం అదృష్టమన్నారు. ఒకే భాషను మాట్లాడుకునే వారికి రెండు రాష్ట్రాలు అనే దుష్ట సంప్రదాయానికి నాంది పకిలిన టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ తెలుగువారే కావడం అత్యంత దురదృష్టకరమన్నారు. నిరాహారదీక్షలు చేస్తే చాలు ప్రత్యేక రాష్ట్రాలు వస్తాయనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం దేశానికి చాటిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరాభివృద్ధి సమష్టికృషిగా ఆయన అభివర్ణించారు. విభజన నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలే విభేదిస్తున్నారని పేర్కొన్నారు. అర్థం లేని డిమాండ్ నిరాహారదీక్ష సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. వీరికి కెన్సెస్ అధినేత కె.నరసారెడ్డి పండ్ల రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌లోనే అర్థం లేదని విమర్శించారు. ఎలాంటి చర్యలు చేపడితే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందో విశ్లేషించుకుని దానిపై దృష్టి సారించాలన్నారు. అలా చేయకుండా ప్రత్యేక రాష్ట్రం కోరడం అవివేకమని అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారి సంఖ్య 30 లక్షలు దాటిందన్నారు. ఈ రెండు ప్రాంతాల వారే లేకుంటే హైదరాబాద్ లేదు, హైదరాబాద్ లేకుంటే తెలంగాణకు గుర్తింపే లేదని అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల తీవ్రవాదం, శాంతిభద్రతల సమస్య వంటివి ఏర్పడగలవని ఏనాడో రుజువైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా విభజన నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. అనంతరం ఘంటసాల రత్నకుమార్ మాట్లాడారు. సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి చెన్నైలోని తెలుగువారు మద్దతు పలకడం కనీస కర్తవ్యమని అన్నారు. ఈ ఆశయాన్ని సాధించే వరకు ఉద్యమాన్ని విరమించకూడదని కోరారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ఉద్యమాన్ని లేవదీశారని రంగనాయకులు అన్నారు. పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తుల త్యాగాల ఫలంగా సిద్ధించిన ఆంధ్రప్రదేశ్‌ను కొందరి స్వార్థం కోసం విభజించరాదని ఉప్పులూరి విజయలక్ష్మి అన్నారు. విదేశీవనితగా భారత్‌లోకి అడుగుపెట్టిన సోనియాగాంధీకి ఆంధ్రప్రదేశ్ విలువ గురించి ఏమి తెలుసని కృష్ణారావు విమర్శించారు. విభజన ద్రోహులకు, సమైకాంధ్ర ఉద్యమకారులకు తెలుగు సంఘాల వారు ప్రకటించిన అవార్డులను ఆస్కా ట్రస్టీ శ్రీనివాసులురెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.నారాయణ గుప్త, స్మారక మందిరం కార్యదర్శి రామకృష్ణ, ఆస్కా ట్రస్టీలు ఎరుకలయ్య, విజయేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.