
అరవై ఏళ్లు.. నాలుగు రాష్ట్రాలు
ఇదీ.. ఆంధ్ర రాష్ట్ర ప్రజల చరిత్ర
తొలుత మద్రాసు రాష్ట్రంలో.. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా
48 ఏళ్లు సమైక్యాంధ్రప్రదేశ్‌గా.. నేటి నుంచి తెలంగాణ లేకుండా
ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) అవతరణ దినోత్సవం ఎప్పుడో?
హైదరాబాద్: అరవై ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ (కోస్తా, రాయలసీమ) ప్రాంతం నాలుగు రాష్ట్రాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. రాష్ట్రం మారినప్పుడల్లా ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఏంతో కాలం పోరాడి సాధించుకున్న ప్రాంతాన్ని కొద్దికొద్దిగా కోల్పోతూ ఈ ప్రాంతం చిన్నబోతూ వస్తోంది. మద్రాసు రాష్ట్రం.. ఆంధ్ర రాష్ట్రం.. (సమైక్య) ఆంధ్రప్రదేశ్.. తెలంగాణను మినహాయించిన ఆంధ్రప్రదేశ్.. ఇలా నాలుగు మార్లు స్వరూపం మారిపోతూ వచ్చింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పోరాడి రాష్ట్రం సాధించుకున్నారు. పొట్టి శ్రీరాములు వంటి నేత ప్రాణత్యాగం చేసిన తరువాత ఈ ప్రాంతం 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది. దీంతో ఇక్కడి ప్రజల చరిత్ర రెండో రాష్ట్రం కిందకు వెళ్లింది. తరువాత కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్ర రాష్ట్రం, అప్పటి వరకు ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాలతో 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది. మూడో రాష్ట్ర చరిత్రలో ఈ ప్రాంత ప్రజలు భాగస్వాములయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతం వేరు చేయడంతో సోమవారం (2014 జూన్ 2) నుంచి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఇక నుంచి నాలుగో రాష్ట్ర చరిత్రకు కోస్తా, రాయలసీమ ప్రజలు మారిపోవాల్సి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారే సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతంలో భాగమైన బళ్లారి తదితర ప్రాంతాలు కర్ణాటక రాష్ట్రానికి వెళ్లగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భద్రాచలం వంటి ప్రాంతం (కొన్ని మండలాలు మినహా) ఇప్పు డు తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమైంది.
అవతరణ దినం వేడుక ఎప్పుడో?
తెలంగాణను మినహాయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై గందరగోళం నెలకొంది. సోమవారం సమైక్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోతుండడంతో ఈ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుందా? లేదంటే ఇప్పుటి వరకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుగుతున్న నవంబరు 1వ తేదీనే కొనసాగిస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు. గతంలో ఆంధ్ర రాష్ట్రంగా ఉన్న ప్రాం తమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మిగిలిపోవడంతో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిన అక్టోబరు 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినంగా కొనసాగించాలన్న వాదన మొదలైంది. వీటిలో ఏ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలన్నది కొత్త ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం మేరకే ఉంటుందని అధికారులు అంటున్నారు.