‘నాకు శ్రీరాములు వంటి పదకొండు మంది అను చరులు ఉంటే చాలు. నేను ఒక్క సంవత్సరంలో బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేస్తాను’ అని పొట్టి శ్రీరాములు అంకిత భావం, ఉపవాస సామర్థ్యం గురించి వ్యాఖ్యానిస్తూ గాంధీజీ అన్నారు. తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీ యుడైన శ్రీరాములు గొప్పదనానికి ఇంతకంటే కితాబు ఏముంటుంది? పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ‘పెద్ద మనుషుల ఒప్పందం’ ఫలితంగా తెలంగాణ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో 1956 నవంబర్ 1న ‘ఆంధ్రప్రదేశ్’ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏటా నవంబర్ ఒకటవ తేదీ నాడు జరుపుకోవడం ఆనవాయితీ అయింది.
అయితే 2014లో ఏపీ తెలంగాణ నుంచి విడి పోయిన తర్వాత నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1 నుంచి మార్చి వేశారు. ఇది అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి జరిగిన మహా అపరాధంగా భావించాలి. అయితే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ తప్పును సరిదిద్ది ఎప్పటిలాగే నవంబర్ 1 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతూ శ్రీరాములు త్యాగానికి ఘన నివాళులర్పిస్తున్నారు.
మద్రాస్ రాష్ట్రంలో కలిసి ఉన్న తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు చరిత్ర సృష్టించారు. పొట్టి శ్రీరాములు మరణ వార్త తెలిసి వేలాదిమంది తెలుగు ప్రజలు మద్రాస్‌లోని మౌంట్ రోడ్‌కు చేరుకోవడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ప్రజా ఆస్తుల విధ్వంసం జరిగింది. తెలుగు ప్రాంతాలైన విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, తెనాలి, ఒంగోలు, కనిగిరి, నెల్లూరులతో సహా అనేక ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటాయి.
అనకాపల్లి, విజయవాడ లలో పోలీసులు ఏడుగురిని కాల్చి చంపారు. ఫలితంగా మద్రాస్, ఆంధ్రా ప్రాంతాలలో పెద్ద ఎత్తున నాలుగు రోజుల పాటు ప్రజాందోళన కొనసాగింది. దీంతో కేంద్ర సర్కారు దిగివచ్చి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ 1952 డిసెంబరు 19న ప్రకటించారు. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా తెలుగు మాట్లాడే వారి కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఇది దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది అయ్యింది. అనంతరం, తెలంగాణను కలుపుతూ తెలుగు మాట్లాడే జిల్లాలు అన్నీ కలిసి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది.
నెల్లూరు జిల్లాలోని పడమటపల్లిలో 1901లో శ్రీరాములు జన్మించారు. అయితే ఆ ప్రాంతంలో కరవు పరిస్థితులు నెలకొనడంతో వారి కుటుంబం మద్రాసుకు తరలి వెళ్లింది. అక్కడే పాఠశాలలో శ్రీరాములు తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. తర్వాత శానిటరీ ఇంజనీరింగ్ బొంబాయిలోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేశారు. కళాశాల విద్య తర్వాత, ముంబైలోని ‘గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే’లో చేరారు.
దురదృష్టవశాత్తు తన భార్యను, అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోయారు. ఆయన జీవితంలో జరిగిన అత్యంత విషాదకర సంఘటన ఇది. ఆ సంఘటనను ఆయన జీర్ణించు కోలేకపోయారు. మనోవేదనతో రెండు సంవత్సరాల తరువాత ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు గాంధీజీ నిర్వహిస్తున్న సబర్మతి ఆశ్రమంలో చేరారు.
గాంధీజీ ఆశయాలకు ప్రభావితులై దళితుల అభ్యున్నతికి విశేషమైన కృషి చేశారు. సమాజంలోని అంటరానితనాన్నీ, అసమానతలనూ నిరసించి అట్ట డుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త. కుల, మతాలకు అతీతంగా అట్టడుగు వర్గాల ఇళ్లలో భోజనం చేసేవారు. దళితుల హక్కులకు మద్దతుగా ఉపవాసాలు చేశారు. నెల్లూరు మూలపేట వేణుగోపాల స్వామి ఆలయంలో దళితుల ప్రవేశానికి మద్దతుగా ఆయన నిరాహార దీక్ష చేపట్టారు.
వారి హక్కుల సాధనకు కాళ్లకు చెప్పులు
లేకుండా ఎర్రటి ఎండలో గొడుగు లేకుండా తిరిగే వారు. సమసమాజ స్థాపన కోసం గాంధీజీ సిద్ధాంతాలను ఆచరిస్తున్న ఆయన్ని చూసి కొంతమంది స్థానికులు పిచ్చివాడిగా భావించేవారు. దళితులకు సంఘీభావం తెలిపినందుకు ఒక దశలో అగ్రకులాల వారి ఆగ్రహానికి గురయ్యారు. ప్రత్యేకించి తన వైశ్య కులం వారు ఆయన్ని కులం నుంచి బహిష్కరించినట్లుగా ప్రకటించారు. అయినా ఆయన అవేవీ పట్టించుకోకుండా తన సంకల్పం కోసం దీక్షతో ముందుకు సాగిపోయారు. తదనంతర కాలంలో కానీ ఆయన గొప్పతనం ఏమిటో వాళ్లకు అర్థం కాలేదు.
దళితుల అభ్యున్నతికీ, అణగారిన వర్గాల సంక్షే మానికీ కృషి చేయడం నాయకుల బాధ్యత అని చెప్పిన పొట్టి శ్రీరాములు బాటలోనే నేటి సీఎం జగన్ మోహన్ రెడ్డి పయనించడం ముదావహం.
పి. విజయబాబు
వ్యాసకర్త ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులు
(నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం)
అమరజీవి నడిచిన దారిలో...
Published Wed, Nov 1 2023 4:58 AM | Last Updated on Wed, Nov 1 2023 5:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment