భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతీక నవంబరు 1 | AP Formation Day November 1 In Telugu | Sakshi
Sakshi News home page

భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతీక నవంబరు 1

Published Sun, Nov 1 2020 7:55 AM | Last Updated on Sun, Nov 1 2020 7:55 AM

AP Formation Day November 1 In Telugu - Sakshi

బ్రిటిష్‌ ఇండియాలో భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం క్రీ.శ. 1910 నుండే భారతీయుల కృషి మొదలయ్యింది. 1912లో పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జాతీయాభిమాని అయిన కొవ్వూరి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ సభలు జరిగాయి. అప్పుడే కొండ వెంకటప్పయ్య పంతులు, జొన్నవిత్తుల గురునాథం తెలుగువారికి ప్రత్యేకరాష్ట్రం గురించి ఆలోచన మొదలుపెట్టారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి స్వాతంత్య్ర సమరయోధులు, ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య, సెనగపల్లి రామస్వామిగుప్త, మోచర్ల రామచంద్రరావు, పురాణం వెంకటప్పయ్య పంతులు, బి.యన్‌.శర్మ లాంటి మేధావులు తెలుగు భాష మాట్లాడేవాళ్ళందరికీ ఒక ప్రత్యేకరాష్ట్రం ఉండాలని, మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడిపోవాలని పోరాడారు. 

1913 మే 20న బాపట్లలో సర్‌ బయ్యా నరసింహేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన సమగ్ర ఆంధ్రమహాసభలో ప్రత్యేక ఆంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. పురాణం వెంకటప్పయ్య పంతులు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రతిపాదనని బాపట్ల ఆంధ్రోద్యమ సభలో ప్రవేశపెట్టగా సమావేశమై ఉన్న 800 మంది ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తరువాత జరిగిన ఆంధ్రోద్యమ సభలకు పానుగంటి రామారాయణింగారు, మోచర్ల రామచంద్రరావు, సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు,  సర్‌ విజయానంద గజపతి అధ్యక్షులుగా ఉండి ప్రత్యేక ఆంధ్రను బలపరిచారు. ఇందులో సర్వేపల్లి రాధాకృష్ణయ్య (ఆయన తెలుగులో అలానే సంతకం చేసేవారు) అధ్యక్షత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఆ సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా వున్నారు. ప్రత్యేక ఆంధ్రకు ప్రభుత్వం సుముఖంగా లేదు. స్వతహాగా మితవాది, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే విద్యాజీవి రాధాకృష్ణ పండితుడు సైతం ప్రత్యేక ఆంధ్ర ఆవశ్యకతని గుర్తించి ఆంధ్ర తీర్మానాన్ని బలపరిచే సభకు అధ్యక్షత వహించారు. అదే సభకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్‌ ముత్తా వెంకట సుబ్బారావు ముఖ్య అతిథి, సభాప్రారంభకులు.  (చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు)

గుంటూరు నగరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ’దేశభక్త’ కొండ వెంకటప్పయ్య పంతులు 1940 వరకు జరిగిన ప్రత్యేక ఆంధ్రోద్యమానికి తన శక్తియుక్తులను సంపూర్ణంగా ధారపోశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు సహా జాతీయ రాజ కీయ పక్షాలన్నీ భాషాప్రయుక్తరాష్ట్రాలను బలపరిచాయి. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ రాష్ట్రాన్ని కలిపి విశాలాంధ్ర ఏర్పడాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశ వ్యాప్తంగా ఏర్పడాలనీ ఉద్యమించారు. స్వాతంత్య్రం అనంతరం 1948లో నాటి హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో జరిగిన సైనిక చర్యతో హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమై హైదరాబాద్‌ రాష్ట్రంగా ఏర్పడింది. 

తరువాత కాలంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గాంధీజీ శిష్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్‌ 19 నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్‌తో మహర్షి బులుసు సాంబ మూర్తిగారి యింటిలో మద్రాసులో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించి డిసెంబర్‌ 15వ తేదీన ఆత్మార్పణ చేసుకున్నారు. వారి త్యాగాల ఫలితంగా నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్‌ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరులో హైకోర్టును ప్రారంభించి వికేంద్రీకరణకు నాడే బీజం నాటారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా 11 జిల్లాలతో టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్నికయ్యారు. తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలనే బలమైన ప్రజల కోరికకు అనుగుణంగా 1956 నవంబర్‌ 1న హైదరాబాద్‌ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినారు. ఈవిధంగా మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది.  (నేడు ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు)

తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ బలంగా ఉండాలని కోరుకున్న నేటి మన సీఎం వై.యస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి నాడు సమైక్య ఉద్యమాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున పోరాడారు. రాష్ట్రం బలంగా ఉంటేనే కేంద్రంతో పోరాడే శక్తి ఉంటుందని మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలమని భావించి తెలుగు ప్రజలతో మమేకమై సదస్సులు, బహిరంగ సభలు, నిరాహారదీక్షలు లాంటి బహుముఖ కార్యక్రమాలను వై.యస్‌.జగన్‌ నిర్వహించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ మోసపూరిత మాటలు చెబుతూ, ఒకవైపు ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఆమోదిస్తూ, మరొకవైపు సమైక్య ఉద్యమం బలపరుస్తున్నట్లు నటించారు. కాంగ్రెస్, బీజేపీలు ఏకమైన క్షణంలో తెలుగు జాతిని విచ్ఛిన్నం చేస్తూ 2014 జూన్‌ 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలుగా కేంద్ర ప్రభుత్వం విడగొట్టింది.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తరచూ కాంగ్రెస్‌ని దుష్టకాంగీ అని అభివర్ణిస్తూ ఉండేవారు. ప్రముఖ కథారచయిత , ప్రబుద్దాంధ్ర పత్రికా సంపాదకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తమ సంపాదకీయాలలో ‘కాంగ్రెస్‌ ఆంధ్రుల పాలిట నెత్తిమీద పిడుగు వంటిది. ఆంధ్రులకు ఎప్పటికయినా కాంగ్రెస్‌ చేటు  తెస్తుంది’ అని స్వతంత్రానికి పూర్వమే హెచ్చరిస్తూ ఉండేవారు. ఆ మాటలను నిజం చేస్తూ పార్లమెంటు తలుపులను మూసి మరీ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రులను అవమానకరంగా విడదీసింది. ఆ తరువాత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నవంబర్‌ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించకుండా.. అపాయింట్‌ డేగా ప్రకటించిన జూన్‌ 2ను నవ నిర్మాణదీక్షాదినంగా ప్రకటించి అమలు చేశారు. నేటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్‌ 1వ తేదీని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించి అమలు చేయడం హర్షణీయం. మన సంస్కృతిని, మన పూర్వీకులు మనకు ఇచ్చిన గౌరవాన్ని కొనసాగించడాన్ని, తెలుగు ప్రముఖులను గౌరవించుకోవటానికి ఆంధ్రుల చరిత్రను స్మరించుకోవడానికి, రాబోవుకాలంలో దిశానిర్దేశాలు ఎంచుకోవటానికి గొప్ప అవకాశంగా నవంబర్‌ ఒకటిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుందాం.

వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి 
వ్యాసకర్త చైర్మన్, మద్య విమోచన ప్రచార కమిటీ, రాష్ట్ర అధ్యక్షులు, జన చైతన్య వేదిక
మొబైల్‌ : 99499 30670

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement