AP Formation Day 2020
-
అవతరణ దినోత్సవం ఓ గౌరవం.. ఓ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ ఒకటిన రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించడం ద్వారా మళ్లీ ఆంధ్రులకు ఒక గౌరవం, ఒక గుర్తింపు తెచ్చారు. ప్రతి రాష్ట్రానికి అవతరణ దినోత్సవం ఉంటుంది. కాని 2014 నుంచి ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి ఉత్సవం లేకుండా జరిగిపోయింది. నాటి సీఎం చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్షల పేరుతో పెద్ద ప్రహసనం సృష్టించారు. చాలామంది విజ్ఞులు, మేధావులు, నవంబర్ ఒకటి లేదా, అక్టోబర్ ఒకటో తేదీన అవతరణ దినోత్సవం జరపాలని సూచించారు. అయినా ఆయన వినిపించుకోలేదు. తెలంగాణ ఏర్పడిందని తెలంగాణ ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటుంటే, వాటికి వ్యతిరేకంగా నవనిర్మాణ దీక్షల పేరుతో రోదనల కార్యక్రమం చేపట్టేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ ఆంధ్రులకు తీరని అన్యాయం చేశారని, ఆంధ్రుల పొట్టకొట్టారని ఇలా ఏవేవో డైలాగులు చెప్పడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, దీక్షలకు హాజరైన పార్టీ నేతలు, కార్యకర్తలతో ఏవేవో ప్రతిజ్ఞలు చేయించేవారు. ఏపీ ప్రజలను ఒక సమైక్య సెంటిమెంటుతో మభ్యపెట్టాలని ఆయన విశ్వప్రయత్నం చేశారు. కాని ప్రజలు ఆయన మాయలో పడలేదని గత ఎన్నికల్లో రుజువు అయింది. తదుపరి సీఎం అయిన వైఎస్ జగన్ పద్ధతి ప్రకారం నవంబర్ ఒకటిని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించి, అందుకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం ముదావహం. తద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఒక ఉనికి ఉందని ఆయన దేశానికి తెలియచేసినట్లయింది. ఒకప్పుడు కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ ప్రావిన్స్‌లో భాగంగా ఉండేవి. కానీ ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్‌తో పెద్ద ఉద్యమం నడిపారు. చివరికి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో కేంద్రంలోని జవహర్లాల్ ప్రభుత్వం దిగి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని 1953 అక్టోబర్ ఒకటిన ఏర్పాటు చేసింది. ఆ సమయంలో హైదరాబాద్ రాష్ట్రం వేరుగా ఉండేది. ఆ రాష్ట్రంలో తెలుగు ప్రాంతం అయిన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల లోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. తదుపరి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలన్న ఆకాంక్ష దేశంలోని పలు రాష్ట్రాలలో వచ్చింది. అప్పటికే తెలుగువారంతా ఒక రాష్ట్రంగా ఏర్పడాలన్న ఆకాంక్ష పెరిగి ఆంధ్రప్రదేశ్ అవతరణకు దారి తీసింది. అయితే తెలంగాణ నేతలు కొందరు తమకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని డిమాండ్ చేసేవారు. అయినా ఇరు రాష్ట్రాల శాసనసభల మెజార్టీ నిర్ణయం ప్రకారం 1956 నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తదుపరి ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయి. అయినా కేంద్రం ఉమ్మడి ఏపీ విభజనకు అంగీకరించలేదు. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు కదా.. 1998లో కాకినాడలో జరిగిన సమావేశంలో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం తీసుకొచ్చింది. 1999లో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అప్పటివరకు మంత్రిగా ఉన్న కేసీఆర్‌కు కొత్త క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వలేదు. కొద్ది కాలానికి ఉపసభాపతి పదవి ఇచ్చినా, ఆయన అవమానంగా ఫీల్ అయ్యారు. ఆ తరుణంలో తెలంగాణ రాజకీయ ఉద్యమానికి సన్నాహాలు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి సొంత పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని డిమాండ్ చేసేవారు. అందుకు ఆమె అంగీకరించి తెలంగాణకు అనుకూల ప్రకటన చేస్తూనే దేశంలోని మరికొన్ని ఇతర రాష్ట్రాలకు లింక్ పెట్టారు. తదుపరి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డాయి.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ కేసీఆర్ కేంద్రమంత్రి పదవినుంచి, అలాగే టీఆర్ఎస్ మంత్రులు రాష్ట్రం నుంచి వైదొలిగారు. ఆ తర్వాత వైఎస్ హయాంలో టీఆర్ఎస్ కొంత బలహీనపడింది. ఆ తరుణంలో తెలుగుదేశంలో తెలంగాణ నేతలు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేసేవారు. అప్పుడుకూడా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు నడిపి ఆంధ్ర, రాయలసీమ నేతల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారు. మరోవైపున కేంద్రం ఎలాగూ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వదని పార్టీ నేతలతో చెబుతుండేవారు. 2009లో టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి తెలుగుదేశం పోటీచేసినా ఆ కూటమి అధికారంలోకి రాలేక పోయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఒంటి చేత్తో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చారు. కాని అనూహ్యంగా వైఎస్ మరణంతో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పుడు మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని అధిష్టానాన్ని కోరినా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంగీకరించలేదు. సీనియర్ వృద్ధనేత రోశయ్యకు అవకాశం ఇచ్చారు. తదుపరి రోశయ్య ఆధ్వర్యంలో ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా, టీడీపీ అప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పింది. అసెంబ్లీలో సైతం తెలంగాణ తీర్మానం మీరు పెడతారా, తమను పెట్టమంటారా అన్నంతవరకు టీడీపీ వెళ్లింది. ఈ క్రమంలో కేంద్రంలో కాంగ్రెస్ వైఖరిలో కూడా తేడా వచ్చింది. సడన్‌గా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా యూపీఏ పక్షాన, కాంగ్రెస్ తరపున ఆనాటి హోం మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. కాని అప్పుడు చంద్రబాబు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అంతా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆంద్ర, రాయలసీమ ప్రాంతాల ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిం చారు. దాంతో కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పెండింగులో పెట్టి మళ్లీ సంప్రదింపుల ప్రక్రియ, శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు తదితర చర్యలు చేపట్టింది. రోశయ్య తర్వాత సీఎం అయిన కిరణ్‌కుమార్ రెడ్డి పూర్తిగా సమైక్యవాది. కాని ఆయన పరిస్థితిని అదుపు చేయలేకపోతున్నారన్న అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దిశగా ముందుకు వెళ్లింది. ఆ తరుణంలో కిరణ్ కుమార్‌రెడ్డి కొందరు టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా చంద్రబాబుకు కబురు చేసి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వవద్దని వర్తమానం పంపించారు. కాని చంద్రబాబు మాత్రం రెండోసారి కూడా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. అప్పటికే కాంగ్రెస్ రాజకీయాలలో మార్పులు వచ్చి కడప ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీ ఆర్టికల్ మూడు కింద దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని తొలుత చెప్పినా, ఆ తర్వాత రాష్ట్రం సమైక్యంగా ఉండాలని స్పష్టం చేసింది. కాని చంద్రబాబు మాత్రం రెండు కళ్ల సిద్ధాంతం అంటూ ప్రచారం చేశారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రవాదన, ఏపీలో సమైక్యవాదానికి అనుకూలంగా వ్యవహరించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరచేవారు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందంటూ యాత్రలు కూడా చేశారు. ఈ రకంగా డబుల్ గేమ్ ఆడుతూనే వ్యూహాత్మకంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు మోదీ వేవ్ బాగా ఉండడం, పవన్ కళ్యాణ్ తాను పోటీచేయకుండా టీడీపీకి సహకరించడం, అలాగే రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామన్న నినాదాల ద్వారా 2014లో అధికారంలోకి రాగలిగారు. అంతకుముందు జరిగిన 18 ఉపఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవని టీడీపీ, 2014లో అధికారంలోకి రావడానికి అనేక అంశాలు కలిసివచ్చాయి. ఆ తర్వాత ఆయన ఉమ్మడి హైదరాబాద్‌ను పదేళ్లపాటు రాజధానిగా ఉపయోగించుకునే అవకాశం ఉండగా, ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, కేసీఆర్‌తో రాజీపడి రాత్రికి రాత్రి విజయవాడ వెళ్లిపోయారు. అదే సమయంలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆరంభించారు. మరో వైపు చంద్రబాబు పరోక్షంగా దానిని వ్యతిరేకిస్తూ నవనిర్మాణ దీక్షల పేరుతో రోజూ ఎక్కడో ఓ చోట ఒక సభ పెట్టి కేసీఆర్, జగన్‌ల వల్ల రాష్ట్రం విడిపోయిందని చిత్రమైన వాదన చేసేవారు. ఇలా ఐదేళ్లపాటు నవనిర్మాణ దీక్షలు చేస్తూ అక్కడ కూడా డబుల్ గేమ్ ఆడుతుండేవారు. ఒక వైపు రాష్ట్రం తీవ్ర కష్టాల్లో ఉంది.. నష్టాలలో ఉంది. ఆదాయం లేదు.. అంటూ రోదన వినిపించేవారు. మరో వైపు తాను ఎంతో అభివృద్ధి చేస్తున్నానని, ఆయా రంగాలలో రాష్ట్రం దూసుకు వెళుతోందని, కేంద్రం కన్నా ఎక్కువ అభివృద్ధిని సాధిస్తున్నామని, గ్రోత్ రేట్ రెండు అంకెల్లో సాధించామని రకరకాల లెక్కలు ప్రచారం చేసేవారు. బీజేపీతో విడిపోయిన తర్వాత కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ధర్మపోరాట దీక్షలు అంటూ ప్రతి జిల్లాలోను సభలు నిర్వహించి బీజేపీ నేతలను, మోదీని పలు రకాలుగా దూషించేవారు. చంద్రబాబు నాయుడు పాలించిన ఐదేళ్లలో అవతరణ ఉత్సవం లేకుండా చేశారు. పైగా దీక్షల పేరుతో వందల కోట్ల రూపాయలను వృథాగా ఖర్చు పెట్టారు. నిజంగానే చంద్రబాబుకు వాటిపై చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా నవనిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు చేయాలి కదా.. ఇప్పుడు ఆయన వాటన్నిటిని వదిలిపెట్టి, ప్రధాని మోదీని ఎలా ప్రసన్నం చేసుకోవాలా అన్నదానిపై తంటాలు పడుతున్నారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ నవంబర్ ఒకటిన రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపడం అందరికీ సంతోషం కలిగించే విషయం. దీని ద్వారా ఏపీలో ప్రతిభావంతులను, వివిధరంగాలలో ప్రముఖులను సత్కరించుకోవడం, ఆంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇది ఒక అవకాశం. ఏది ఏమైనా ఆంధ్రులకు నవంబర్ ఒకటి ఉత్సవాన్ని పునరుద్ధరించినందుకు జగన్‌కు అభినందనలు, ధన్యవాదాలు తెలియచేద్దాం. -కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
‘తండ్రిని చూసి ఎవరైనా అప్పు ఇస్తారు.. కానీ’
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ రెవెన్యూ లోటును కేంద్రం పట్టించుకోవడం లేదని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసి వాటిని కేంద్రం పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కాకినాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్ ఆరేళ్ల వయస్సున్న బాలుడు లాంటింది. తండ్రిని చూసి ఎవరైనా అప్పు ఇస్తారు కానీ.. బాలుడ్ని చూసి ఇవ్వరు. ఆర్థికంగా చిన్న రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తే ఆశించిన ప్రయోజనాలు చేకూరవు. జీఎస్టీ, పోలవరం నిధులను కేంద్రం ఎగనామ పెట్టడం ఏపీ ప్రజలకు బాధాకరం. కరోనా కారణంగా మీ పాట్లు మీరు పడండి అని కేంద్రం ఉచిత సలహ ఇస్తే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోలేరు. ఏ ప్రయోజనాలను ఆశించి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారో.. ఆ ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత కేంద్రం పై ఉందని’’ సుభాస్ చంద్రబోస్ పేర్కొన్నారు. (చదవండి: గత పాలకుల వల్లే విభజన అన్యాయం: సజ్జల) ఆయన స్వార్థం కోసమే పనిచేశారు.. విజయవాడ: నవ నిర్మాణ దీక్షల పేరుతో చంద్రబాబు స్వార్థం కోసం పనిచేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రజలకు మేలు చేసేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగుతుందన్నారు. ‘‘ఇతర రాష్ట్రాలు ఏపీలో అమలు చేస్తున్న పథకాలపై దృష్టి పెట్టాయి. పొట్టి శ్రీరాములు వంటి మహనీయుని త్యాగాలను నేటి తరాలు తెలుసుకోవాలి. టీడీపీ ప్రభుత్వం ఏమి చేసిందో, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమి చేస్తుందో రైతులకు బాగా తెలుసు. టీడీపీకి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. రైతులకు ఇవ్వాల్సిన నిధులు చంద్రబాబు ఎగ్గొట్టితే ఆ బాకీలు వైఎస్ జగన్ చెల్లించారు. ఐదేళ్లలో టీడీపీ రైతుల కోసం కేటాయించిన నిధులు 13000 కోట్లు.. ఏడాదికి రైతు భరోసా కింద సీఎం జగన్ కేటాయించిన నిధులు 13000 కోట్లు. పరిపాలనలో టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అనుకూల మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అమరావతి, పోలవరంలలో కూడా చంద్రబాబు అవినీతి వల్ల అభివృద్ధి ఆగిపోయింది. చంద్రబాబు, లోకేష్ లకు వైఎస్సార్సీపీ పాలన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని’’ సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు. (చదవండి: ఏపీకి పూర్వ వైభవం: ఆళ్ల నాని) -
గత పాలకుల వల్లే విభజన అన్యాయం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: గత పాలకుల వల్లే ఆరేళ్లుగా విభజన అన్యాయం జరిగిందని, రాష్ట్రం వెనుకబాటుతో కున్నారిళ్లిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధితో రాష్ట్రాన్ని సీఎం జగన్ గాడినపెట్టారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్.. దేశంలోనే నెంబర్‌వన్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. (చదవండి: గ్రామాల రూపురేఖలు మార్చాం: సీఎం జగన్) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలం గుర్తుంచుకోవాలన్నారు. కోవిడ్ కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండానే వేడుకలు చేసుకుంటున్నామని తెలిపారు. ‘‘తెలుగువారందరి బంగారు భవిష్యత్తు కోసం పాటుపడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. వైఎస్సార్ కాంగ్రెస్‌కి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సీఎం జగన్ నేతృత్వంలో సఫలం చేస్తాం. వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ప్రజల్లో మమేకం అయ్యి, అభివృద్ధి దిశగా కర్తవ్య దీక్షకు పునరంకితం అవ్వాలి. సీఎం జగన్ వెంట మడమ తిప్పని సైనికులు గా పని చేయాలని’’ ఆయన పిలుపునిచ్చారు. (చదవండి: భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతీక నవంబరు 1) -
'మూడు రాజధానులతో అభివృద్ధికి శ్రీకారం'
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం సందర్భంగా రాష్ట్రమంతటా వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశాఖ కలెక్టర్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి అవంతి శ్రీనివాసరావు, తెలుగు భాష సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. జాతీయ పతానికి గౌరవ వందనం చేసి, పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. (పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన సీఎం) ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు పోరాట పటిమ ఉంది. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు అభివృద్ధికి శ్రీకారం చూడుతుంది. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుంది. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాభివృద్ధికి కొందరు అడ్డుపడినా.. వెనకడుగు వేయకుండా ప్రభుత్వం అభివృద్ధి దిశగా వెళ్తోంది. జిల్లాలో 2.53 లక్షల మందికి 4,457 ఎకరాల ప్రభుత్వ, అసైన్ భూమి సేకరించి త్వరలో లబ్దిదారులకు అందిస్తాం. తెలుగు వారు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. విశాఖ పరిపాలనా రాజధానిగా ఎదుగుతోందని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనావాస్ అన్నారు. 'జిల్లాలో ఎక్కువగా ఉన్న ప్రభుత్వ భూమిని ఉపయోగించి అభివృద్ధి చేస్తాం. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా అవతరించేలా చేస్తాం' అని మంత్రి అన్నారు. తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ... మన రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1నాడే చేయాలి. మన నుంచి తెలంగాణ వేరు పడింది కానీ మన రాష్ట్రం అలాగే ఉంది. రాష్ట్రంలో తెలుగు అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. -
ఏపీకి పూర్వ వైభవం: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జాతీయ జెండా ఆవిష్కరించి.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పొట్టి శ్రీ రాములు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరి, కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, ఎస్పీ నారాయణ నాయక్, జాయింట్ కలెక్టర్లు వెంకట రమణా రెడ్డి, తేజ్ భరత్, ఆర్డీవో పనబాక రచన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనితా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం జరపాలని నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. -
ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కృషికి, సహృదయతకి ఆంధ్రప్రదేశ్ మారుపేరు. ఆంధ్రులు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభివృద్ధికి ప్రార్థిస్తున్నానని’’ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అమిత్ షా శుభాకాంక్షలు.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాలకు, భారతదేశం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చేసిన అపారమైన కృషి ప్రశంసనీయం. మోదీ ప్రభుత్వం,అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్ర శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేస్తోందని’ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టాం: సీఎం జగన్
-
రాష్ట్ర అవతరణ ఉత్సవాలు
-
గ్రామాల రూపురేఖలు మార్చాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలను తృణపాయంగా అర్పించిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దేశంలో బాటలు వేసిన ఆ మహాశయున్ని స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మళ్లీ కొనసాగించటం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆదివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. (చదవండి: సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు) ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 64 ఏళ్లు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు అమరులయ్యారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతోనే రాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను పాదయాత్రలో గుర్తించాను. రాష్ట్రంలోని అన్ని గ్రామాల రూపురేఖలను మార్చాం. అవినీతి, వివక్ష లేకుండా 17 నెలల పాలన సాగింది. వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టాం. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని’’ సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘గతంలో చదువులు, ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ఇళ్ల కోసం 32 లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. బయటవారి కత్తిపోట్లు, సొంతవారి వెన్నుపోట్లతో దగా పడ్డాం. కులాల కలుపు మొక్కలు రాష్ట్ర పరువు తీస్తున్నాయి. వ్యవస్థలను వ్యక్తులు మేనేజ్ చేస్తున్న విధానం రాష్ట్రాన్ని దెబ్బతీస్తోంది. ప్రజాబలం, దేవుడి ఆశీస్సులతో ముందుకువెళ్తున్నామని’’ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. -
జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఉదయం 9.00 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో జరిగే కార్యక్రమానికి హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ‘మా తెలుగు తల్లికి’ గీతాలాపన అనంతరం జాతీయ పతాకం ఎగురేశారు. అనంతరం తెలుగు తల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లా మంత్రులు అందుబాటులో లేకపోతే జిల్లా ఇన్చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో జాతీయ జెండా ఎగరేశారు. ప్రజల ఆనందకర జీవనమే ప్రభుత్వానికి విజయసూచిక -గవర్నర్ విశ్వభూషణ్ సాక్షి, అమరావతి: ప్రజల ఆనందకర జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయసూచికని.. ఆ మేరకు పాలన సాగాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. ప్రజలే ప్రాధాన్యతగా అమలు చేస్తున్న విధానాలను ప్రభుత్వం కొనసాగించాలి. సామాన్యుల కలలను సాకారం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని తన సందేశంలో గవర్నర్ పేర్కొన్నారు. (సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు) అంకితభావం, నిబద్ధతతో ముందుకెళదాం ప్రజలకు సీఎం జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: నేడు (నవంబర్ 1) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పొట్టి శ్రీరాములుతోపాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయి. మహానుభావుల త్యాగాలను మననం చేసుకుంటూ.. వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం మనమంతా అంకితభావం, నిబద్ధతతో ముందుకెళదాం’ అని సీఎం పేర్కొన్నారు. తాడేపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భాను, ఎమ్మెల్యేలు జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ అవినాష్, నగర్ అధ్యక్షుడు భవ కుమార్, కార్యాలయ ఇంచార్జ్ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతీక నవంబరు 1
బ్రిటిష్ ఇండియాలో భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం క్రీ.శ. 1910 నుండే భారతీయుల కృషి మొదలయ్యింది. 1912లో పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జాతీయాభిమాని అయిన కొవ్వూరి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభలు జరిగాయి. అప్పుడే కొండ వెంకటప్పయ్య పంతులు, జొన్నవిత్తుల గురునాథం తెలుగువారికి ప్రత్యేకరాష్ట్రం గురించి ఆలోచన మొదలుపెట్టారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి స్వాతంత్య్ర సమరయోధులు, ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య, సెనగపల్లి రామస్వామిగుప్త, మోచర్ల రామచంద్రరావు, పురాణం వెంకటప్పయ్య పంతులు, బి.యన్.శర్మ లాంటి మేధావులు తెలుగు భాష మాట్లాడేవాళ్ళందరికీ ఒక ప్రత్యేకరాష్ట్రం ఉండాలని, మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడిపోవాలని పోరాడారు. 1913 మే 20న బాపట్లలో సర్ బయ్యా నరసింహేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన సమగ్ర ఆంధ్రమహాసభలో ప్రత్యేక ఆంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. పురాణం వెంకటప్పయ్య పంతులు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రతిపాదనని బాపట్ల ఆంధ్రోద్యమ సభలో ప్రవేశపెట్టగా సమావేశమై ఉన్న 800 మంది ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తరువాత జరిగిన ఆంధ్రోద్యమ సభలకు పానుగంటి రామారాయణింగారు, మోచర్ల రామచంద్రరావు, సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు, సర్ విజయానంద గజపతి అధ్యక్షులుగా ఉండి ప్రత్యేక ఆంధ్రను బలపరిచారు. ఇందులో సర్వేపల్లి రాధాకృష్ణయ్య (ఆయన తెలుగులో అలానే సంతకం చేసేవారు) అధ్యక్షత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఆ సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా వున్నారు. ప్రత్యేక ఆంధ్రకు ప్రభుత్వం సుముఖంగా లేదు. స్వతహాగా మితవాది, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే విద్యాజీవి రాధాకృష్ణ పండితుడు సైతం ప్రత్యేక ఆంధ్ర ఆవశ్యకతని గుర్తించి ఆంధ్ర తీర్మానాన్ని బలపరిచే సభకు అధ్యక్షత వహించారు. అదే సభకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ ముత్తా వెంకట సుబ్బారావు ముఖ్య అతిథి, సభాప్రారంభకులు. (చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు) గుంటూరు నగరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ’దేశభక్త’ కొండ వెంకటప్పయ్య పంతులు 1940 వరకు జరిగిన ప్రత్యేక ఆంధ్రోద్యమానికి తన శక్తియుక్తులను సంపూర్ణంగా ధారపోశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు సహా జాతీయ రాజ కీయ పక్షాలన్నీ భాషాప్రయుక్తరాష్ట్రాలను బలపరిచాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి విశాలాంధ్ర ఏర్పడాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశ వ్యాప్తంగా ఏర్పడాలనీ ఉద్యమించారు. స్వాతంత్య్రం అనంతరం 1948లో నాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో జరిగిన సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. తరువాత కాలంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గాంధీజీ శిష్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19 నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్‌తో మహర్షి బులుసు సాంబ మూర్తిగారి యింటిలో మద్రాసులో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించి డిసెంబర్ 15వ తేదీన ఆత్మార్పణ చేసుకున్నారు. వారి త్యాగాల ఫలితంగా నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరులో హైకోర్టును ప్రారంభించి వికేంద్రీకరణకు నాడే బీజం నాటారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా 11 జిల్లాలతో టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్నికయ్యారు. తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలనే బలమైన ప్రజల కోరికకు అనుగుణంగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినారు. ఈవిధంగా మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. (నేడు ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు) తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలని కోరుకున్న నేటి మన సీఎం వై.యస్. జగన్మోహన్ రెడ్డి నాడు సమైక్య ఉద్యమాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున పోరాడారు. రాష్ట్రం బలంగా ఉంటేనే కేంద్రంతో పోరాడే శక్తి ఉంటుందని మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలమని భావించి తెలుగు ప్రజలతో మమేకమై సదస్సులు, బహిరంగ సభలు, నిరాహారదీక్షలు లాంటి బహుముఖ కార్యక్రమాలను వై.యస్.జగన్ నిర్వహించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ మోసపూరిత మాటలు చెబుతూ, ఒకవైపు ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఆమోదిస్తూ, మరొకవైపు సమైక్య ఉద్యమం బలపరుస్తున్నట్లు నటించారు. కాంగ్రెస్, బీజేపీలు ఏకమైన క్షణంలో తెలుగు జాతిని విచ్ఛిన్నం చేస్తూ 2014 జూన్ 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా కేంద్ర ప్రభుత్వం విడగొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తరచూ కాంగ్రెస్‌ని దుష్టకాంగీ అని అభివర్ణిస్తూ ఉండేవారు. ప్రముఖ కథారచయిత , ప్రబుద్దాంధ్ర పత్రికా సంపాదకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తమ సంపాదకీయాలలో ‘కాంగ్రెస్ ఆంధ్రుల పాలిట నెత్తిమీద పిడుగు వంటిది. ఆంధ్రులకు ఎప్పటికయినా కాంగ్రెస్ చేటు తెస్తుంది’ అని స్వతంత్రానికి పూర్వమే హెచ్చరిస్తూ ఉండేవారు. ఆ మాటలను నిజం చేస్తూ పార్లమెంటు తలుపులను మూసి మరీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులను అవమానకరంగా విడదీసింది. ఆ తరువాత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించకుండా.. అపాయింట్ డేగా ప్రకటించిన జూన్ 2ను నవ నిర్మాణదీక్షాదినంగా ప్రకటించి అమలు చేశారు. నేటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నవంబర్ 1వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించి అమలు చేయడం హర్షణీయం. మన సంస్కృతిని, మన పూర్వీకులు మనకు ఇచ్చిన గౌరవాన్ని కొనసాగించడాన్ని, తెలుగు ప్రముఖులను గౌరవించుకోవటానికి ఆంధ్రుల చరిత్రను స్మరించుకోవడానికి, రాబోవుకాలంలో దిశానిర్దేశాలు ఎంచుకోవటానికి గొప్ప అవకాశంగా నవంబర్ ఒకటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుందాం. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వ్యాసకర్త చైర్మన్, మద్య విమోచన ప్రచార కమిటీ, రాష్ట్ర అధ్యక్షులు, జన చైతన్య వేదిక మొబైల్ : 99499 30670 -
చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు
ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ చిరస్మరణీయుడు. 1953, అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా నవంబర్ 1, 1956న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ రాష్ట్ర అవతరణకు జరిగిన రాజకీయ పోరాట నేప«థ్యాన్ని తలంచుకున్నప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం గుర్తుకు రాక మానదు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ తన బ్రాండ్ ఇమేజ్ను కోల్పోకుండా వుండాలంటే గతంలో లాగానే నవంబర్ 1నాడే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే నాడు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబునాయుడు తెలుగు ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కాడు. సంప్రదాయంగా వస్తున్న మన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చరిత్రతో పనే లేదని చంద్రబాబు పక్కన పెట్టేశాడు. తెలంగాణ ఏర్పడిన జూన్ 2ను ఏపీ చరిత్రలో చీకటిరోజుగా అభివర్ణిస్తూ నవనిర్మాణ దీక్షల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటు తేదీని ఆ రాష్ట్రం అవతరణ దినోత్సవంగా జరుపుకుంటోంది. అయితే, 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిదేళ్ల పాటు నిర్వహించలేదు. ఎంతో చరిత్ర ఉన్న ఏపీకి రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలని అనేక మంది ప్రముఖులు, సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. (నేడు ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు) అయినా స్పందన లేదు. ఇక, ఏపీలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దీనిపై కేంద్ర ప్రభుత్వంతో కసరత్తు చేసింది. కేంద్రం సైతం తాము గతంలోనే సూచనలు చేసామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం ఇచ్చింది. ఫలితంగా అయిదేళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవం లేని ఏపీ 2019 నుండి నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆంధ్ర అవతరణ దినోత్సవం అంటే ఒక సంస్కృతి. అది మన పూర్వీకులకు మనం ఇచ్చే గౌరవం. తెలుగు ప్రముఖులను గౌరవించుకోవడానికి, ఆంధ్రుల చరిత్రను స్మరించుకోవడానికి, రాబోయే కాలంలో దిశానిర్దేశాలు ఎంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. దాదాపు 58 సంవత్సరాల తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు రెండు తెలుగు రాష్ట్రాలుగా 2014 జూన్ 2 నుంచి అమలులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ 2014 జూన్ 2 నుండి మూడు సంవత్సరాల వరకు కొనసాగింది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23న శంకుస్థాపన జరిగింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభమై పరిపాలన మొదలైంది. సమీకృత అభివృద్ధి. పరిపాలన వికేంద్రీకరణ కొరకు, అమరావతిని కేవలం శాసనరాజధానిగా పరిమితం చేసి, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా వైఎస్ జగన్ ప్రభుత్వం మార్పులు చేసిన చట్టానికి 2020 జూలై 31 న గవర్నర్ ఆమోదముద్ర పడింది. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాతఃస్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకోసం జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. తెలుగు ప్రజల, వాసవి సంఘాల ఆకాంక్షల ఫలితంగా నవంబర్ 1నే ఆంధ్రప్రదేశ్ అవతరణ రెండో ఏడాది జయప్రదంగా జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి అభినందనలు. (నేడు రాష్ట్రావతరణ దినోత్సవం) దింటకుర్తి వీర రాఘవ ఉదయ్ కుమార్ అధ్యక్షులు, వాసవీ విద్యార్థ్ధి ఫెడరేషన్