సాక్షి, అమరావతి: తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలను తృణపాయంగా అర్పించిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దేశంలో బాటలు వేసిన ఆ మహాశయున్ని స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మళ్లీ కొనసాగించటం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆదివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. (చదవండి: సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు)
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 64 ఏళ్లు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు అమరులయ్యారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతోనే రాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను పాదయాత్రలో గుర్తించాను. రాష్ట్రంలోని అన్ని గ్రామాల రూపురేఖలను మార్చాం. అవినీతి, వివక్ష లేకుండా 17 నెలల పాలన సాగింది. వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టాం. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని’’ సీఎం జగన్ పేర్కొన్నారు.
‘‘గతంలో చదువులు, ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ఇళ్ల కోసం 32 లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. బయటవారి కత్తిపోట్లు, సొంతవారి వెన్నుపోట్లతో దగా పడ్డాం. కులాల కలుపు మొక్కలు రాష్ట్ర పరువు తీస్తున్నాయి. వ్యవస్థలను వ్యక్తులు మేనేజ్ చేస్తున్న విధానం రాష్ట్రాన్ని దెబ్బతీస్తోంది. ప్రజాబలం, దేవుడి ఆశీస్సులతో ముందుకువెళ్తున్నామని’’ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment