V Lakshman reddy
-
భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతీక నవంబరు 1
బ్రిటిష్ ఇండియాలో భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం క్రీ.శ. 1910 నుండే భారతీయుల కృషి మొదలయ్యింది. 1912లో పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జాతీయాభిమాని అయిన కొవ్వూరి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభలు జరిగాయి. అప్పుడే కొండ వెంకటప్పయ్య పంతులు, జొన్నవిత్తుల గురునాథం తెలుగువారికి ప్రత్యేకరాష్ట్రం గురించి ఆలోచన మొదలుపెట్టారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి స్వాతంత్య్ర సమరయోధులు, ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య, సెనగపల్లి రామస్వామిగుప్త, మోచర్ల రామచంద్రరావు, పురాణం వెంకటప్పయ్య పంతులు, బి.యన్.శర్మ లాంటి మేధావులు తెలుగు భాష మాట్లాడేవాళ్ళందరికీ ఒక ప్రత్యేకరాష్ట్రం ఉండాలని, మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడిపోవాలని పోరాడారు. 1913 మే 20న బాపట్లలో సర్ బయ్యా నరసింహేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన సమగ్ర ఆంధ్రమహాసభలో ప్రత్యేక ఆంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. పురాణం వెంకటప్పయ్య పంతులు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రతిపాదనని బాపట్ల ఆంధ్రోద్యమ సభలో ప్రవేశపెట్టగా సమావేశమై ఉన్న 800 మంది ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తరువాత జరిగిన ఆంధ్రోద్యమ సభలకు పానుగంటి రామారాయణింగారు, మోచర్ల రామచంద్రరావు, సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు, సర్ విజయానంద గజపతి అధ్యక్షులుగా ఉండి ప్రత్యేక ఆంధ్రను బలపరిచారు. ఇందులో సర్వేపల్లి రాధాకృష్ణయ్య (ఆయన తెలుగులో అలానే సంతకం చేసేవారు) అధ్యక్షత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఆ సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా వున్నారు. ప్రత్యేక ఆంధ్రకు ప్రభుత్వం సుముఖంగా లేదు. స్వతహాగా మితవాది, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే విద్యాజీవి రాధాకృష్ణ పండితుడు సైతం ప్రత్యేక ఆంధ్ర ఆవశ్యకతని గుర్తించి ఆంధ్ర తీర్మానాన్ని బలపరిచే సభకు అధ్యక్షత వహించారు. అదే సభకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ ముత్తా వెంకట సుబ్బారావు ముఖ్య అతిథి, సభాప్రారంభకులు. (చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు) గుంటూరు నగరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ’దేశభక్త’ కొండ వెంకటప్పయ్య పంతులు 1940 వరకు జరిగిన ప్రత్యేక ఆంధ్రోద్యమానికి తన శక్తియుక్తులను సంపూర్ణంగా ధారపోశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు సహా జాతీయ రాజ కీయ పక్షాలన్నీ భాషాప్రయుక్తరాష్ట్రాలను బలపరిచాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి విశాలాంధ్ర ఏర్పడాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశ వ్యాప్తంగా ఏర్పడాలనీ ఉద్యమించారు. స్వాతంత్య్రం అనంతరం 1948లో నాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో జరిగిన సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. తరువాత కాలంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గాంధీజీ శిష్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19 నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్‌తో మహర్షి బులుసు సాంబ మూర్తిగారి యింటిలో మద్రాసులో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించి డిసెంబర్ 15వ తేదీన ఆత్మార్పణ చేసుకున్నారు. వారి త్యాగాల ఫలితంగా నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరులో హైకోర్టును ప్రారంభించి వికేంద్రీకరణకు నాడే బీజం నాటారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా 11 జిల్లాలతో టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్నికయ్యారు. తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలనే బలమైన ప్రజల కోరికకు అనుగుణంగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినారు. ఈవిధంగా మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. (నేడు ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు) తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలని కోరుకున్న నేటి మన సీఎం వై.యస్. జగన్మోహన్ రెడ్డి నాడు సమైక్య ఉద్యమాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున పోరాడారు. రాష్ట్రం బలంగా ఉంటేనే కేంద్రంతో పోరాడే శక్తి ఉంటుందని మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలమని భావించి తెలుగు ప్రజలతో మమేకమై సదస్సులు, బహిరంగ సభలు, నిరాహారదీక్షలు లాంటి బహుముఖ కార్యక్రమాలను వై.యస్.జగన్ నిర్వహించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ మోసపూరిత మాటలు చెబుతూ, ఒకవైపు ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఆమోదిస్తూ, మరొకవైపు సమైక్య ఉద్యమం బలపరుస్తున్నట్లు నటించారు. కాంగ్రెస్, బీజేపీలు ఏకమైన క్షణంలో తెలుగు జాతిని విచ్ఛిన్నం చేస్తూ 2014 జూన్ 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా కేంద్ర ప్రభుత్వం విడగొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తరచూ కాంగ్రెస్‌ని దుష్టకాంగీ అని అభివర్ణిస్తూ ఉండేవారు. ప్రముఖ కథారచయిత , ప్రబుద్దాంధ్ర పత్రికా సంపాదకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తమ సంపాదకీయాలలో ‘కాంగ్రెస్ ఆంధ్రుల పాలిట నెత్తిమీద పిడుగు వంటిది. ఆంధ్రులకు ఎప్పటికయినా కాంగ్రెస్ చేటు తెస్తుంది’ అని స్వతంత్రానికి పూర్వమే హెచ్చరిస్తూ ఉండేవారు. ఆ మాటలను నిజం చేస్తూ పార్లమెంటు తలుపులను మూసి మరీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులను అవమానకరంగా విడదీసింది. ఆ తరువాత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించకుండా.. అపాయింట్ డేగా ప్రకటించిన జూన్ 2ను నవ నిర్మాణదీక్షాదినంగా ప్రకటించి అమలు చేశారు. నేటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నవంబర్ 1వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించి అమలు చేయడం హర్షణీయం. మన సంస్కృతిని, మన పూర్వీకులు మనకు ఇచ్చిన గౌరవాన్ని కొనసాగించడాన్ని, తెలుగు ప్రముఖులను గౌరవించుకోవటానికి ఆంధ్రుల చరిత్రను స్మరించుకోవడానికి, రాబోవుకాలంలో దిశానిర్దేశాలు ఎంచుకోవటానికి గొప్ప అవకాశంగా నవంబర్ ఒకటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుందాం. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వ్యాసకర్త చైర్మన్, మద్య విమోచన ప్రచార కమిటీ, రాష్ట్ర అధ్యక్షులు, జన చైతన్య వేదిక మొబైల్ : 99499 30670 -
ఆయన పాటలోనే సామాజిక చైతన్యం ఉంది
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వంగపండు ప్రసాదరావు సాంస్కృతిక రంగానికి ఓ ఆణిముత్యం. అలాంటి ఆణిముత్యం భౌతికంగా దూరం కావడం బాధాకరం. వంగపండు పాటలోనే సామాజిక చైతన్యం ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. గుంటూరు: ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. వంగపండు మృతికి మంగళవారం ఆయన ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లిన కళాకారుడు వంగపండు. ఆయన విజయనగరం జిల్లా వాసి కావడం తెలుగువారికి గర్వకారణమన్నారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో వంగపండు ప్రజల్లో చైతన్యం నింపారని, దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తన పాటలతో వినిపించిన గొప్ప కళాకారుడని తెలిపారు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ఉర్రూతలూగించి.. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఒక మేరుశిఖరంగా వంగపండు నిలిచిపోతారని లక్ష్మణరెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్ర గళం వంగపండు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారన్న వార్త దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. వందలాది జానపద గేయాలతో అయన ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చారని వంగపండు కుటుంబ సభ్యులకు లక్ష్మణరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. (ఉత్తరాంధ్ర పాట ఊపిరి ఆగింది: నారాయణమూర్తి) -
కురిచేడు మృతుల ఘటన బాధాకరం: లక్ష్మణరెడ్డి
సాక్షి, గుంటూరు: ఆల్కహాల్ తీసుకోవడంతో అది మనిషి రోగ నిరోధక శక్తిపై గణనీయమైన ప్రభావం చూపే ప్రమాదముందని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులో మద్యం అందుబాటులో లేదని శానిటైజర్ తాగి ప్రాణాలొదిలిన ఘటనపై లక్ష్మణరెడ్డి తీవ్రంగా చలించి శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. మద్యం, మత్తు పదార్ధాలు వ్యసనంగా మారి వత్తిడికి గురవడంతోనే పేదలు వివిధ ప్రత్యామ్నాలకు పోయి ప్రాణాలమీదికి తెచ్చుకోవడం బాధాకరమన్నారు. అలాంటి వ్యసనపరులను మద్యం, మత్తుల నుంచి విముక్తి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం డి- అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 15చోట్ల ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఏరియా ఆస్పత్రులలో డి- అడిక్షన్ కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. మరో 10 చోట్ల సైతం ఈ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టిందని తెలియజేశారు. (మద్యానికి బానిసై.. ప్రాణాలు కోల్పోయి..) వ్యక్తిగత కౌన్సిలింగ్‌తో పాటు వ్యసనపరులు తాగుడుకు దూరమైనప్పుడు కనిపించే లక్షణాలకు తగిన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వ వైద్యులు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ మనసును నియంత్రించుకోవడం కూడా అవసరమేనని లక్ష్మణరెడ్డి చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ కోవిడ్ సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు పొగతాగడం, మద్యం, మత్తు మందులు వినియోగించడం చేయరాదని సూచించిందని గుర్తుచేశారు. మద్యం, మత్తు ఒక్కసారిగా ఆగిపోతే చేతులు, కాళ్లు వణకడం, గందరగోళానికి గురి కావడం, కొన్ని కేసులలో ఫిట్స్‌కు గురి కావడం జరుగుతుందని..ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మద్యం తీసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో నష్టమే ఎక్కువ ఉందని తెలిపారు. మద్యం తీసుకుంటే ఆందోళన కాస్త తగ్గించవచ్చేమో కానీ మద్యం ప్రియులు డిప్రెషన్లోకి చేరుకునేందుకు తోడ్పడుతుందని వెల్లడించారు. (కురిచేడులో విషాదం..) సాధారణ రోజుల్లో తాము ఎంత తాగాలనే దానిపై మద్యం ప్రియులకు ఓ అంచనా ఉంటుందని.. కానీ, కరోనా లాంటి కాటస్ట్రోపిక్ ఈవెంట్స్ లాంటివి ఈ మొత్తాన్ని అధికం చేస్తాయని హెచ్చరించారు. మద్యపానం వల్ల వైరస్ దరిచేరదన్నది అపోహ మాత్రమేనని...నిజానికి లివర్, శ్వాస సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మద్యం అధికంగా సేవించడం వల్ల కోపం, నిరాశ, డిప్రెషన్‌లోనికి జారిపోవడంతో పాటుగా గృహ హింస లాంటివి సైతం పెరిగే అవకాశాలున్నాయని సైకాలజిస్టులు చెబుతుండటం గమనార్హం అన్నారు. మద్యపానం మానేయడంతో బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడంతో పాటుగా సరిగా నిద్ర పట్టడం, భావోద్వేగాలు నియంత్రణలో ఉండటం లాంటి ప్రయోజనాలెన్నో ఉన్నాయని వివరించారు. మద్యపానం మానేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని.. కాలేయ ఆరోగ్యం, బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గేందుకు అవకాశం ఉండటంతో పాటుగా కొన్ని రకాల కేన్సర్లు కూడా నివారించబడే అవకాశాలున్నాయని చెప్పారు. ఆల్కహాల్ తీసుకోకపోవడంతో బరువు కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చన్నారు. లిక్కర్లో ఉండే కేలరీలతో బరువు పెరగడమే కాకుండా, ఆల్కహాల్ వల్ల తెలియకుండానే అధికంగా తినడం జరుగుతుందన్నారు. ఒత్తిడితోనే చాలామంది మద్యం తీసుకుంటుంటారని.. దాన్ని నియంత్రించుకోగలిగితే చాలా వరకూ అలవాటుకు దూరం కావచ్చని తెలిపారు. వ్యాయమాలు, యోగా లాంటి వాటితో ఈ ఒత్తిడిని కొంతమేర నియంత్రించుకోవచ్చని లక్ష్మణరెడ్డి సూచించారు. (శానిటైజర్ అమ్మకాలపై కీలక ప్రకటన) ఖాళీగా ఉంటే చెడు ఆలోచనలు వచ్చే ప్రమాదమున్నందున ప్రతీ ఒక్కరు ఏదొక ఉపయోగకరమైన పని కల్పించుకుంటే ఈ అలవాటుకు దూరం కావచ్చన్నారు. మనసును మద్యం నుంచి ఇతర అంశాలపైకి దృష్టి మళ్లించడం మంచిదన్నారు. మద్యం దొరకడం లేదనే బెంగతో కొంతమంది కృశించిపోతున్నారని.. దానికి బదులు కరోనా తనకు మద్యం అలవాటు మాన్పించేందుకు ఓ అవకాశం ఇచ్చిందని ప్రతీ ఒక్కరూ భావించాలన్నారు. ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా ఉంటుందని ఉద్భోదించారు. వత్తిడి తట్టుకోలేని వారు స్నేహితులు, కుటుంబసభ్యుల సలహాలను తీసుకోవడమే మంచిదని... వారి సలహాలతో పాటు సకాలంలో ఆయా జిల్లాకేంద్రాల్లోని డి-అడిక్షన్ కేంద్రాలకు వెళ్లడం లాభించవచ్చని లక్ష్మణరెడ్డి సూచించారు. -
సీఎం చేతిలో ఆయన కీలుబొమ్మ
సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడి చేతిలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు కీలుబొమ్మగా మారారని జనచైతన్య వేదిక రాష్ట్రాధ్యక్షులు లక్ష్మణ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతున్న అశోక్ బాబు.. బెంగళూరులో రాజకీయ ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రాజకీయ ప్రచారం నిర్వహిస్తున్న అశోక్ బాబును వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్జీవోల ప్రయోజనాల కన్నా.. అశోక్ బాబు టీడీపీ ప్రయోజనాలు కోసం కృషి చేస్తున్నారని లక్ష్మణ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. అశోక్ బాబు చేస్తున్న ఎన్నికల ప్రచారంపై బీజేపీ నాయకులు కూడా నిప్పులు చెరిగారు. -
'నాలుగు రోజులైనా నిందితులను పట్టుకోలేదు'
హైదరాబాద్: తుళ్లూరు మండలంలోని రైతుల ఆస్తుల విధ్వంసాన్ని ప్రతిపక్షాలు చేయించాయనడం సరికాదని జన చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాజధాని భూముల్లో విధ్వంసం జరిగి నాలుగురోజులైనా ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని అన్నారు. రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని.... అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని లక్ష్మణ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో రాజధానిని నిర్మించి కృష్ణానదిని మరో మూసీ నదిగా మార్చవద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతల నుంచి స్వచ్ఛందంగా భూములు సేకరించాలి... రైతులను భయబ్రాంతులకు గురి చేయొవద్దని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. భూములు పారిశ్రామికవేత్తలు, బినామీలకు కట్టబెట్టాలని చూసే ఐక్యంగా ఉద్యమిస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని లక్ష్మణ్‌రెడ్డి హెచ్చరించారు. పోలీసు యంత్రాంగంపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి చినరాజప్ప చేసిన ప్రకటనలను ఈ సందర్బంగా లక్ష్మణ్‌రెడ్డి ఖండించారు.