కురిచేడు మృతుల ఘటన బాధాకరం: లక్ష్మణరెడ్డి | Vallamreddy Lakshman Reddy Comments On Kurichedu Issue | Sakshi
Sakshi News home page

'కురిచేడు శానిటైజర్ మృతుల ఘటన బాధాకరం'

Published Fri, Jul 31 2020 2:06 PM | Last Updated on Fri, Jul 31 2020 2:08 PM

Vallamreddy Lakshman Reddy Comments On Kurichedu Issue - Sakshi

సాక్షి, గుంటూరు: ఆల్కహాల్‌ తీసుకోవడంతో అది మనిషి రోగ నిరోధక శక్తిపై గణనీయమైన ప్రభావం చూపే ప్రమాదముందని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులో మద్యం అందుబాటులో లేదని శానిటైజర్ తాగి ప్రాణాలొదిలిన ఘటనపై లక్ష్మణరెడ్డి తీవ్రంగా చలించి శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. మద్యం, మత్తు పదార్ధాలు వ్యసనంగా మారి వత్తిడికి గురవడంతోనే పేదలు వివిధ ప్రత్యామ్నాలకు పోయి ప్రాణాలమీదికి తెచ్చుకోవడం బాధాకరమన్నారు. అలాంటి వ్యసనపరులను మద్యం, మత్తుల నుంచి విముక్తి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం డి- అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 15చోట్ల ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఏరియా ఆస్పత్రులలో డి- అడిక్షన్ కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. మరో 10 చోట్ల సైతం ఈ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టిందని తెలియజేశారు. (మద్యానికి బానిసై.. ప్రాణాలు కోల్పోయి..)

వ్యక్తిగత కౌన్సిలింగ్‌తో పాటు వ్యసనపరులు తాగుడుకు దూరమైనప్పుడు కనిపించే లక్షణాలకు తగిన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వ వైద్యులు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ మనసును నియంత్రించుకోవడం కూడా అవసరమేనని లక్ష్మణరెడ్డి చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ కోవిడ్‌ సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు పొగతాగడం, మద్యం, మత్తు మందులు వినియోగించడం చేయరాదని సూచించిందని గుర్తుచేశారు. మద్యం, మత్తు ఒక్కసారిగా ఆగిపోతే చేతులు, కాళ్లు వణకడం, గందరగోళానికి గురి కావడం, కొన్ని కేసులలో ఫిట్స్‌కు గురి కావడం జరుగుతుందని..ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మద్యం తీసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో నష్టమే ఎక్కువ ఉందని తెలిపారు. మద్యం తీసుకుంటే ఆందోళన కాస్త తగ్గించవచ్చేమో కానీ మద్యం ప్రియులు డిప్రెషన్‌లోకి చేరుకునేందుకు తోడ్పడుతుందని వెల్లడించారు.  (కురిచేడులో విషాదం..)

సాధారణ రోజుల్లో తాము ఎంత తాగాలనే దానిపై మద్యం ప్రియులకు ఓ అంచనా ఉంటుందని.. కానీ, కరోనా లాంటి కాటస్ట్రోపిక్‌ ఈవెంట్స్‌ లాంటివి ఈ  మొత్తాన్ని అధికం చేస్తాయని హెచ్చరించారు. మద్యపానం వల్ల వైరస్‌ దరిచేరదన్నది అపోహ మాత్రమేనని...నిజానికి లివర్‌, శ్వాస సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం  ఉందని పేర్కొన్నారు. మద్యం అధికంగా సేవించడం వల్ల కోపం, నిరాశ, డిప్రెషన్‌లోనికి జారిపోవడంతో పాటుగా గృహ హింస లాంటివి సైతం పెరిగే అవకాశాలున్నాయని సైకాలజిస్టులు చెబుతుండటం గమనార్హం అన్నారు. మద్యపానం మానేయడంతో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరగడంతో పాటుగా సరిగా నిద్ర పట్టడం, భావోద్వేగాలు నియంత్రణలో ఉండటం లాంటి ప్రయోజనాలెన్నో ఉన్నాయని వివరించారు. 

మద్యపానం మానేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని.. కాలేయ ఆరోగ్యం, బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తగ్గేందుకు అవకాశం ఉండటంతో పాటుగా కొన్ని రకాల కేన్సర్‌లు కూడా నివారించబడే అవకాశాలున్నాయని చెప్పారు. ఆల్కహాల్‌ తీసుకోకపోవడంతో బరువు కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చన్నారు. లిక్కర్‌లో ఉండే కేలరీలతో బరువు పెరగడమే కాకుండా, ఆల్కహాల్‌ వల్ల తెలియకుండానే అధికంగా తినడం జరుగుతుందన్నారు. ఒత్తిడితోనే చాలామంది మద్యం తీసుకుంటుంటారని.. దాన్ని నియంత్రించుకోగలిగితే చాలా వరకూ అలవాటుకు దూరం కావచ్చని తెలిపారు. వ్యాయమాలు, యోగా లాంటి వాటితో ఈ ఒత్తిడిని కొంతమేర నియంత్రించుకోవచ్చని లక్ష్మణరెడ్డి సూచించారు. (శానిటైజ‌ర్ అమ్మ‌కాల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న‌)

ఖాళీగా ఉంటే చెడు ఆలోచనలు వచ్చే ప్రమాదమున్నందున ప్రతీ ఒక్కరు ఏదొక ఉపయోగకరమైన పని కల్పించుకుంటే ఈ అలవాటుకు దూరం కావచ్చన్నారు. మనసును మద్యం నుంచి ఇతర అంశాలపైకి దృష్టి మళ్లించడం మంచిదన్నారు. మద్యం దొరకడం లేదనే బెంగతో కొంతమంది కృశించిపోతున్నారని.. దానికి బదులు కరోనా తనకు మద్యం అలవాటు మాన్పించేందుకు ఓ అవకాశం ఇచ్చిందని ప్రతీ ఒక్కరూ భావించాలన్నారు. ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా ఉంటుందని ఉద్భోదించారు. వత్తిడి తట్టుకోలేని వారు స్నేహితులు, కుటుంబసభ్యుల సలహాలను తీసుకోవడమే మంచిదని... వారి సలహాలతో పాటు సకాలంలో ఆయా జిల్లాకేంద్రాల్లోని డి-అడిక్షన్ కేంద్రాలకు వెళ్లడం లాభించవచ్చని లక్ష్మణరెడ్డి సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement