అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఆశయంతో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి, అశువులు బాశారు. ఆ మహనీయుని ప్రాణ త్యాగం తెలుగుజాతి పురోభివృద్ధికి ఆదర్శం. ఇదే స్ఫూర్తితో ప్రజలు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తగిన సహకారం అందించాల’ని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ కోరారు. శుక్రవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై... జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఆయనతో పాటు ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జిల్లా జడ్జి వెంకటేశ్వరరావు, డీఐజీ బాలకృష్ణ, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఏజేసీ జయచందర్, జెడ్పీ సీఈఓ విజయేందిర, డీఆర్వో హేమసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగుజాతి చరిత్ర ఉన్నంత వరకు అమరజీవి ఘనకీర్తి విరాజిల్లుతూనే ఉంటుందన్నారు. దేశంలో తెలుగు సంస్కృతికి, మధురమైన తెలుగు భాషకు విశిష్ట స్థానం ఉంద న్నారు. దీన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల భాషలో పాలనా వ్యవహారాలను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 552 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా... ఇప్పటి వరకు 436 మి.మీ నమోదయ్యిందని తెలిపారు. మొక్కల పెంపకం విరివిగా చేపట్టి వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా జిల్లాలో కరువు నివారణకు కృషి చేస్తామన్నారు.
పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయడానికి రెవెన్యూ డివిజన్‌లలో ‘ప్రజావాణి’ ప్రారంభించామని తెలిపారు. వడ్డీలేని పంట రుణాల పథకం ద్వారా ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో 5.70 లక్షల మంది రైతులకు రూ.2,658 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ.2,509 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఖరీఫ్-2012 ఇన్‌పుట్ సబ్సిడీ రూ.648.88 కోట్లకు గాను ఇప్పటి వరకు 3.49 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.350 కోట్లు జమ చేశామని తెలిపారు. మిస్‌మ్యాచింగ్ ఖాతాలను సరిచేసి మిగిలిన మొత్తంతో పాటు త్వరలో రెండో విడతగా 24 మండలాల రైతులకు పరిహారం అందిస్తామన్నారు.జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు రూ.7,676 కోట్లతో రూపొందించిన ‘ప్రాజెక్ట్ అనంత’ అమలుకు జిల్లా స్థాయి కమిటీని, ప్రత్యేక అధికారి నియామకం చేపట్టినట్లు గుర్తు చేశారు.
త్వరలో 600 అంగన్‌వాడీ కార్యకర్తల నియామకానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఏడో విడత భూపంపిణీ కోసం ఇప్పటి వరకు 9,538 ఎకరాలు గుర్తించామన్నారు. బీర్‌జీఎఫ్ కింద రూ.38.56 కోట్లతో 2,571 పనులు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు సాంబమూర్తిని జిల్లా కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, పట్టుపరిశ్రమశాఖ జేడీ అరుణకుమారి, ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ శాంతకుమారి, పౌరసరఫరాల డీఎం వెంకటేశం, డీఆర్‌డీఏ పీడీ నీలకంఠారెడ్డి, డ్వామా పీడీ సంజయ్‌ప్రభాకర్, నగర పాలక సంస్థ కమిషనర్ టి.రంగయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రభాకరరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ రామసుబ్బారావు, హౌసింగ్ పీడీ ప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రవికుమార్, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, మెప్మా పీడీ మల్లీశ్వరిదేవి, కంటి వైద్య నిపుణులు అక్బర్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
అమరజీవే స్ఫూర్తి
Published Sat, Nov 2 2013 5:43 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement