కోతకొచ్చిన వెదురు సాగు
ఆరంభంలోనే అధరహో
ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి
తోట వద్దకే క్యూ కడుతున్న వ్యాపారులు
చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో వెలుగులు నింపే సామర్థ్యమున్న ఆకుపచ్చని బంగారం అది. సారవంతం లేని భూమైనా పర్వాలేదు.. గ్యారంటీగా పంట పండుతుంది. రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది. రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే పంటగా గుర్తింపు పొందిన ఆ పంటే వెదురు సాగు. గ్రామీణ పేదలకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించే వనరు కూడా వెదురే కావడం గమనార్హం. వెదురు వినియోగం పెరిగే కొద్ది మార్కెట్‌లో దాని విలువ బంగారంతో సమానంగా ఎగబాకుతోంది. అందుకే దీనిని ‘గ్రీన్ గోల్డ్’ (ఆకుపచ్చని బంగారం)గా ముద్దుగా పిలుస్తుంటారు. స్వల్ప పెట్టుబడితో దీర్ఘకాలిక ఆదాయం పొందే ఈ పంటపై ఓ చిరుద్యోగి దృష్టి సారించి సఫలీకృతుడయ్యారు. సాగు ఆరంభంలో అందరూ నవ్వుకున్నా... పట్టువీడని విక్రమార్కుడిలా సత్ఫలితాలు సాధించారు. అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
రాయదుర్గం: అనంతపురం జిల్లాలో వెదురు సాగు (Bamboo Cultivation) రైతు అంటూనే ఠక్కున గుర్తొచ్చేది గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన పాటిల్ వంశీకృష్ణారెడ్డి. జిల్లాలో తొలిసారి వెదురు సాగుకు శ్రీకారం చుట్టి అటు ఉద్యానశాఖ అధికారుల్లో, ఇటు అన్నదాతల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఆయన బళ్లారిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగిగా స్థిరపడ్డారు. కరోనా (Carona) కారణంగా ఉద్యోగం వీడి వ్యవసాయంపై దృష్టి సారించారు. అందరిలా వరి, మొక్కజొన్న, రాగి, సజ్జ, పత్తి (Cotton) లాంటి పంటలు కాకుండా వినూత్న ఆలోచనతో 10 ఎకరాల్లో వెదురు సాగు చేపట్టారు. ఎకరాకు రూ.50 వేలు చొప్పన రూ.5 లక్షలు పెట్టుబడి అయింది. మూడేళ్ల పాటు పంటను కాపాడుతూ వచ్చారు. ఇది చూసిన చాలా మంది హేళనగా మాట్లాడారు. అయినా ఆయన వెనుదిరిగి చూడలేదు.
మూడేళ్ల తర్వాత కోతలు..
వంశీకృష్ణారెడ్డి సాగు చేసిన వెదురు పంట మూడేళ్ల తర్వాత ప్రస్తుతం కోతకు వచ్చింది. ఎకరాకు 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. మార్కెట్లో టన్ను వెదురు ధర రూ.6 వేలు పలుకుతోంది. నాణ్యమైన వెదురు కావడంతో వంశీకృష్ణారెడ్డి పొలం వద్దకే కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ధర పెంచేందుకు కూడా వెనుకాడడం లేదు. సరాసరి ఎకరాకు 20 టన్నులతో పదెకరాలకు 200 టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. టన్ను రూ.6 వేలతో లెక్కించినా రూ.12 లక్షల ఆదాయం ఇంటి వద్దకే సమకూరింది. వచ్చే ఏడాది 25 నుంచి 30 టన్నులు, ఐదో ఏడాది 45 నుంచి 50 టన్నులకుపైగా దిగుబడి వస్తుందని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కసారి పంట కోతలు చేపడితే..
ఆ తర్వాత కేవలం నీటి తడులతోనే పంట ఏపుగా పెరుగుతుందని పేర్కొటున్నారు. పైగా కోత దశకు వచ్చిన వెదురు పంటలో వ్యర్థమన్నదే ఉండదంటున్నారు. చిన్న పరిమాణంలో ఉన్న వెదురు కర్రలకు సంబంధించి టన్ను రూ.5వేలకు పైగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. వీటిని టమాట, ఇతర పంటల సాగులో ఊతకర్రలుగా వినియోగిస్తుంటారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయి..
సాగుకు యోగ్యంగా లేని భూములైన సరే నీటి వసతి ఉంటే వెదురు సాగుకు అనుకూలం. వెదురు సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందజేస్తాం. ఎకరం పది సెంట్లలో నర్సరీ ఏర్పాటు చేసుకుంటే రూ.10 లక్షలు ఇస్తాం. వెదురు మొక్కలు రాయితీతో అందించడంతో పాటు ప్రధాన పంటగా సాగు చేస్తే హెక్టారుకు రూ.50 వేలు చెల్లిస్తాం.
– నరసింహరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment