నిమ్మలకుంట తోలు బొమ్మలకు అంతర్జాతీయ గుర్తింపు
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న తయారీదారులు
విదేశాల్లోనూ శిక్షణ ఇచ్చిన ఘనత
ఒకప్పుడు తెరవెనుక లేలేత వెలుగుల మధ్య సందడి చేసిన బంగారక్క.. కేతిగాడు.. జుట్టుపోలిగాడు.. అల్లాటప్పగాడు రూపం మార్చేసుకున్నారు. తోలు బొమ్మలాటకు ఆదరణ కరువైన తరుణంలో అలనాటి తోలు బొమ్మలు కొత్తరూపు సంతరించుకుని అలంకరణ వస్తువులుగా జనాన్ని అలరిస్తున్నాయి. లాంతర్లు, ఇళ్లలో గోడలకు అమర్చుకునే అందమైన కర్టెన్లు, హ్యాండ్ బ్యాగుల రూపంలో మార్కెట్‌లోకి వస్తున్నాయి.
ధర్మవరం రూరల్: కరువు.. కళలు పేరు చెబితే గుర్తొచ్చేది ఉమ్మడి అనంతపురం జిల్లానే. ధర్మవరం మండలం నిమ్మలకుంటలో తయారయ్యే తోలుబొమ్మలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటి తయారీదారులు ఏ డిగ్రీలు చేయకపోయినా.. ఇతర దేశాలకు వెళ్లిమరీ తోలు బొమ్మల తయారీలో శిక్షణ సైతం ఇస్తున్నారు.
కేవలం పొట్టకూటి కోసం పేద కళాకారులు అంకితభావంతో చేస్తున్న ఈ పని కళాభిమానుల మనసు దోచుకుంటోంది. ఇళ్లలో అంతర్గత అలంకరణ (ఇంటీరియర్ డెకరేషన్) పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ నిమ్మలకుంట కళాకారులు తయారు చేసే తోలు బొమ్మల్ని కొని తీరాల్సిందే అనేంత అందంగా తీర్చిదిద్దుతున్నారు.
తరతరాలుగా ఇదే వృత్తి
ధర్మవరం పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తి వెళ్లే రహదారిపై గల నిమ్మలకుంట కళాకారులు తరతరాలుగా హస్తకళల్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరంతా తోలు బొమ్మలాట ప్రదర్శనతో పాటు తోలుబొమ్మల తయారీలోనూ అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. వీరి పూర్వీకులు ఎడ్లబండ్లపై గ్రామాలు తిరుగుతూ తోలు బొమ్మలాట ప్రదర్శించేవారు. కాలక్రమేణా సినిమాలు, టీవీల ప్రభావం ఎక్కువ కావడంతో తోలుబొమ్మల ప్రదర్శనకు ఆదరణ కరువైంది.
బొమ్మలాటనే నమ్ముకున్న కుటుంబాలు తోలుబొమ్మల తయారీ, విక్రయం వైపు దృష్టి సారించారు. మేక, గొర్రె, జంతువుల చర్మాలతో ల్యాంప్‌సెట్స్ (లాంతర్లు), ఇళ్లలో గోడలకు అమర్చుకునే అందమైన కర్టెన్లు, హ్యాండ్ బ్యాగులు తదితర ఆకృతుల్లో తోలుబొమ్మల్ని తయారు చేస్తున్నారు. వీటిని ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై తదితర ప్రాంతాలలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో తోలుబొమ్మలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు 200 వరకు ఉన్నాయి.
తయారీ ఇలా..
మేక తోలును మాత్రమే బొమ్మల తయారీకి ఉపయోగిస్తున్నారు. మేక చర్మాన్ని బాగా కడిగిన తర్వాత ఎండబెడతారు. ఎండిన చర్మంపై తయారు చేయాలనుకున్న బొమ్మను మొదట పెన్సిల్‌తో గీస్తారు. చిన్నచిన్న రంధ్రాల ద్వారా మిగతా భాగాన్ని తొలగించి బొమ్మకు రంగులు వేస్తారు.
ఒక బొమ్మ తయారీకి మూడు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. తయారైన బొమ్మలను హ్యాండ్లూమ్ సొసైటీ ద్వారా పట్టణాలలో మార్కెటింగ్ చేస్తున్నారు. గతంలో కొద్దిమంది మాత్రమే ఈ బొమ్మలను తయారు చేసేవారు. మార్కెటింగ్ సదుపాయం అందుబాటులోకి రావడంతో తయారీదారులు పెరుగుతున్నారు.
పద్మశ్రీ వరించింది
తోలుబొమ్మలాటకు ఆదరణ కరువైన తరువాత ఆ కళాకారులంతా వివిధ ప్రాంతాల్లో స్థిరపడి వేర్వేరు వృత్తుల్లోకి మారిపోగా.. దళవాయి కడేరావు, వీరనారప్ప, అంజినప్ప అనే కళాకారులు మాత్రం ఇదే వృత్తిని కొనసాగిస్తూ నిమ్మలకుంట గ్రామంలో స్థిరపడ్డారు. వీరి వారసులే గ్రామంలో తోలుబొమ్మలకు జీవం పోస్తున్నారు.
వీరితో పాటు ఇతర కులాల వారు కూడా తోలుబొమ్మల తయారీ నేర్చుకుని.. ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. తోలుబొమ్మల ప్రదర్శనకు విశేష గుర్తింపు తె చ్చినందుకు గాను గ్రామానికి చెందిన దళవాయి చలపతిరావును 2020వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం వరించింది.
అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా చలపతిరావు అవార్డు అందుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన శివమ్మ అనే కళాకారిణి ‘శిల్పగురు’ అవార్డుకు ఎంపికైంది. షిండేరావు, శ్రీరాములు వంటి కళాకారులు సైతం అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment