
చింతను నమ్ముకుని జీవనం సాగిస్తున్న మడకశిర ప్రజలు
నియోజకవర్గ వ్యాప్తంగా 2 లక్షల వరకు చింతచెట్లు
సుమారు 20 వేల కుటుంబాలకు జీవనాధారం
సాక్షి, పుట్టపర్తి: అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అనేక గ్రామాల ప్రజలు చింత చెట్టును నమ్ముకుని నిశ్చింతగా జీవనం సాగిస్తున్నారు. మడకశిర నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి దాదాపు 20 వేల కుటుంబాలు చింతచెట్లనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 334 గ్రామాలు ఉండగా.. సుమారు 2 లక్షల చింతచెట్లు ఉన్నాయి. ప్రధాన మార్కెట్ అయిన హిందూపురం మార్కెట్‌కు వచ్చే సరుకులో అత్యధికంగా మడకశిర నుంచే వస్తుంది.
గత మూడేళ్ల నుంచి చింత రైతులకు కూలీ వ్యయం బాగా పెరిగింది. చింతపండు ధర మాత్రం యథావిధిగా ఉండటంతో ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదని రైతులు చెబుతున్నారు. చింతకాయలు కోసేందుకు కూలీలకు రోజుకు రూ.800 చొప్పున ఇవ్వాలి. మిగతా నూర్పిడి పనులకు అయితే రోజుకు రూ.300 ఇస్తారు.
చింతపండును శుద్ధి చేసి మార్కెట్‌కు తరలించేందుకు క్వింటాల్‌కు రూ.2 వేల చొప్పున అదనంగా భరించాల్సి ఉంటుంది. పండు బాగా ఉంటే నాణ్యత ఆధారంగా క్వింటాల్ రూ.30 వేల వరకు ధర పలుకుతుంది. సరుకు బాగా లేకపోతే ధరలో వ్యత్యాసం ఉంటుంది. కొందరు సరిగా శుద్ధిచేయలేక తక్కువ ధరకు విక్రయిస్తుంటారు.
హిందూపురం యార్డ్‌లో విక్రయాలు..
ఏటా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు వారానికి రెండు రోజులు (సోమ, గురు) చొప్పున హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చింతపండు విక్రయాలు జరుగుతాయి. సీజన్‌లో గరిష్టంగా 28 సార్లు అమ్మకాలు ఉంటాయి. మార్కెట్ యార్డులో సుమారు 70 ట్రేడ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఒక్కో ఏజెన్సీ నుంచి సగటున 100 టన్నుల చింతపండు ఎగుమతి అవుతుంది. అందులో సగంపైగా మడకశిర నియోజకవర్గం నుంచి వస్తుండటం విశేషం. మిగతా సరుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి చేరుతుంది.
సీజన్ ముగిశాక శీతల గిడ్డంగుల్లోకి..
రైతుల నుంచి సేకరించిన సరుకును హిందూపురం మార్కెట్‌లో బాక్సుల్లో నింపి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. సీజన్ పూర్తయ్యే లోగా మిగిలిన సరుకును స్థానికంగా ఉన్న శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. లారీ చింతపండుకు ఏడాదికి రూ.25 వేలు చొప్పున అద్దె చెల్లించి శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. మడకశిరకు సమీపంలోనే హిందూపురం ఉండటంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా కలిసివస్తాయి.
ఈ సారి ఖర్చు పెరిగింది
గతంతో పోలిస్తే ఈసారి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేను 16 ఏళ్ల నుంచి చింత చెట్ల నుంచి ఫలసాయం పొందుతున్నా. ప్రతి ఏటా లాభాలు వచ్చేవి. అయితే ఈసారి మాత్రం ఖర్చు పెరిగింది. ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రవాణా ఖర్చులు మిగులుతాయి. – రైతు జయరామప్ప, మెట్టబండపాళ్యం, మడకశిర మండలం
దిగుబడి తగ్గింది
మా తోట చుట్టూ 25 చింత చెట్లు ఉన్నాయి. ఈ ఏడాది వింత రోగం వచ్చి దిగుబడి తగ్గింది. అందుకే ఒక్కో చెట్టును రూ.2 వేల చొప్పున వ్యాపారికి అమ్మేశాను. దిగుబడి బాగా ఉండి ఉంటే చెట్టు రూ.3 వేలు పైగా ధర పలికేది. – వీరాముద్దప్ప, మద్దనకుంట, అమరాపురం మండలం
చింతపండు మార్కెట్ – హిందూపురం
లావాదేవీలు – ప్రతి సోమ, గురువారం
సీజన్ – ఫిబ్రవరి నుంచి ఏప్రిల్
యార్డ్‌లో ట్రేడ్ ఏజెన్సీలు – 70
ఒక్కో ఏజెన్సీ నుంచి – 100 టన్నులవరకు ఎగుమతి
Comments
Please login to add a commentAdd a comment