Tamarind tree
-
చింత చిగురు.. నోరూరు
కైకలూరు: పచ్చబంగారంలా చిటారు కొమ్మన మిలమిల మెరిసే చింత చిగురును తింటే ఆరోగ్యంపై చింత అవసరం లేదంటారు పెద్దలు. నోటికి పుల్లడి రు చి ఇస్తూనే.. తినేకొ ద్దీ తినాలపిస్తుంది. చింత చిగురుకు కొ ల్లేరు రొయ్యలు, చేపలకు దట్టిస్తే.. ఇక భోజన ప్రియులకు పండగే. పులుపులో చింత చిగురుకు మరీ డిమాండ్. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాల్లో చిగురుతో వండిన చేప, రొయ్య, కోడి, వేట వంటి మాంసాహార కూరలను అందరూ లొట్టలేసుకోవాల్సిందే. ఈ సీజన్లో లేలేత చింత చిగురు అందుబాటులోకి వచ్చింది. పల్లెటూర్ల నుంచి మహిళలు చింత చిగురును తీసుకువచ్చి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. చింత చిగురులో పలు పోషకాహారాలు మెండుగా ఉండటంతో అధిక ధర పలుకుతున్నా దీనికి డిమాండ్ బాగుంది. ఇదే సీజన్లో.. చైత్రమాసం దాటిన వెంటనే చింత చెట్లకు చిగురు అందుబాటులోకి వస్తోంది. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో బుట్టయగూడెం, నూజివీడు, పాలకొల్లు, నరసాపురం, కైకలూరు, నూజివీడు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో చింత చిగురు అందుబాటులో ఉంది. కైకలూరు నియోజకవర్గంలో గోపాలపురం, వెంకటాపురం, పరసావానిపాలెం, చిగురుకోట, వడాలి గ్రామాల నుంచి చింత చిగురును తీసుకొచ్చి కైకలూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ధర విషయానికి వస్తే 100 గ్రాములు రూ.100కి విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఆర్డర్లను బట్టి సరఫరా చేస్తున్నారు. చెట్లు తగ్గిపోవడంతో గతంలో కంటే చిగురు ఎక్కువగా లభించడం లేదని గోపాలపురం గ్రామానికి చెందిన విక్రయ మహిళ వాకాని శకుంతల ‘సాక్షి’కి తెలిపారు. ఆహా ఏమి రుచి.. శాకాహార, మాంసాహార కూరలకు చింత చిగురును దట్టిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చింత చిగురుతో చేసిన వంటకాలు ప్రత్యేక డిష్‌గా గుర్తింపు పొందుతున్నాయి. శాకాహార, మాంసాహారాల్లో పలురకాలుగా చింత చిగురుతో వంటకాలు చేస్తారు. పోషకాల గని చింత చిగురులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.06 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం, 140 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీíÙయం, విటమిన్ ‘సి’ 3 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చింత చిగురుతో అనేక ప్రయోజనాలు ఉన్నా యని ప్రకటించింది. ఉపయోగాలివీ.. 👉 చింత చిగురులో ఉన్న ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్టరాల్‌ను తగ్గించి, మంచి కొలెస్టరాల్‌ను పెంచుతాయి. 👉 శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 👉యాంటీ ఇన్ఫల్మేటరీ గుణాలు ఉన్నాయి. చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, నోటి పూత తగ్గుతాయి. 👉 చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 👉మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. 👉పైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది. 👉 వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని తగ్గిస్తుంది. 👉గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. 👉నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఔషధంగా పనిచేస్తుంది. 👉జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. 👉విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. 👉ఎముకుల దృఢత్వం, థైరాయిడ్ నివారణకు దోహదపడుతుంది. 👉షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 👉కీళ్ల వాపుల నివారణ, మలేరియా నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. 👉 తల్లిపాలను మెరుగుపరుస్తుంది.100 గ్రాములు రూ.100 చింత చెట్లు పూర్వం రహదారుల వెంబడి కనిపించేవి. ఏటా జూన్, జూలై నెలల్లో ఎక్కువగా చింత చిగురును విక్రయించేవాళ్లం. ఇప్పుడు రోడ్లు వెడల్పు చేయడంతో చాలా చెట్లను తొలగించారు. కొన్నిచోట్ల మాత్రమే చింత చెట్లు కనిపిస్తున్నాయి. పలువురు వైద్యం కోసం అని చెప్పి మా వద్ద చింత చిగురు కొంటున్నారు. ప్రస్తుతం 100 గ్రాముల చిగురును రూ.100 ధరకు విక్రయిస్తున్నాం. –వి.మంగమ్మ, ఆకుకూరల విక్రయదారు, గోపాలపురంచింత చెట్లను పెంచాలి చింత చెట్లను తొలగించిన ప్రాంతాల్లో మరో చెట్టును నాటాలి. పట్టణీకరణతో చాలా చెట్లు తొలగిస్తున్నారు. ఆకుకూరలకు కలిదిండి మండలం గోపాలపురం గ్రామం పేరు. మా కుటుంబం చింత చిగురును విక్రయిస్తోంది. చిగురును సేకరించడం అంతు సులువైన పనికాదు. చింత చెట్లను పెంచే విధంగా అందరికి అవగాహన కలిగించాలి. చింత చిగురుతో లాభాలెన్నో ఉన్నాయి. – వాకాని నాగ సుబ్రహ్మణ్యం, ఉప సర్పంచ్, గోపాలపురం -
చింత గింజలోయ్.. మంచి కాసులోయ్..
మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో తెలీదు కానీ.. చింత కాయలతో పాటు వాటి గింజలకూ కాసులు రాలుతున్నాయి. చింత పిక్కలాట.. వామన గుంటలు.. వైకుంఠపాళీ.. అష్టా–చెమ్మా వంటి ఆటలకు మాత్రమే వినియోగించే చింత గింజలు వ్యాపారులకు, కూలీలకు సిరులు కురిపిస్తున్నాయి. వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా మారిన చింత పిక్కలు ఇప్పుడు అమెజాన్ లాంటి ఈ–కామర్స్ ఆన్లైన్ సైట్లలోనూ అమ్ముడుపోతున్నాయి. ఏటా వేలాది టన్నుల చింత గింజలు మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నాయి. పిఠాపురం: చింత గింజలూ వ్యాపార వస్తువుగా మారాయి. వ్యాపారులకు మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి. దీంతో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుతో పాటు పలు ప్రాంతాల్లో చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు వెలిసాయి. చింతపండు వ్యాపారుల నుంచి చింత గింజలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. అక్కడ వాటిని శుభ్రం చేసి.. గింజలకు పైన ఉండే తోలు తొలగించి గుజరాత్, మహారాష్ట్ర, సూరత్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తోలు తీసిన చింత గింజల టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతోంది. కాకినాడ జిల్లాలో రోజుకు 60 టన్నుల వరకు చింత గింజలు లభ్యమవుతుండగా 20 టన్నుల వరకు ప్రాసెసింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో విస్తరించి ఉన్న అన్ని అటవీ ప్రాంతాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, హిందూపురం తదితర ప్రాంతాల్లో చింత గింజలు లభ్యమవుతున్నాయి. కాకినాడ, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో చింత గింజల్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఏటా 18 వేల టన్నుల చింత గింజలు ఎగుమతి అవుతుండగా.. వాటి విలువ రూ.36 కోట్ల పైమాటే. వీటి కొనుగోళ్లు, ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.65 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. ఏడాదంతా వ్యాపారం చింత పిక్కలను ప్రాసెసింగ్ చేసే ఫ్యాక్టరీలు ఏడాదంతా పని చేస్తున్నాయి. చింతపండు సీజనల్‌గా మాత్రమే లభిస్తున్నప్పటికీ.. కోల్డ్ స్టోరేజిలలో నిల్వ ఉంచి ఏడాదంతా గింజలు తొలగించి అమ్ముతుంటారు. దీనివల్ల ఏడాదంతా చింత గింజలు అందుబాటులో ఉంటున్నాయి. చింతగింజలను కేజీ రూ.5 నుంచి రూ.8కి కొంటున్నారు. తోలు తీసిన తరువాత కేజీ రూ.20కి పైగా అమ్ముతారు. ప్రత్యక్షంగా చింతపండు గింజలు తీసే కుటుంబాలు రాష్ట్రంలో 10 వేలకు పైగా ఉండగా.. వ్యాపారాలు, ఫ్యాక్టరీలలో పని చేసే కార్మిక కుటుంబాలు వెయ్యి వరకు ఉన్నాయి. చింతపండు వ్యాపారులే గింజలను సేకరిస్తారు. ఐదు కేజీల చింతపండులోంచి కేజీ చింత గింజలు వస్తాయి. ప్రాసెసింగ్ ఇలా.. చింతపండు నుంచి వేరు చేసిన గింజలను చింతపండు వ్యాపారులు ఫ్యాక్టరీలకు విక్రయిస్తారు. వాటిని ప్రాసెసింగ్ యూనిట్లలోని బాయిలర్‌లో (240 డిగ్రీల వేడి వద్ద) నీటితో శుభ్రం చేస్తారు. అనంతరం దానిపై ఉండే తొక్కను తొలగించి బస్తాల్లో నింపుతారు. వాటిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళతారు. రాష్ట్రంలోని హిందూపురంలో చింత గింజల పౌడర్ తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాక్టరీలలో ఈ గింజలను వైట్ పౌడర్‌గా మార్చి.. ఏ1, ఏ2, ఏ3, ఏ4 గ్రేడ్లుగా విభజించి జర్మనీ, జపాన్, ఇండోనేషియా, మలేషియా, టర్కీ, రష్యా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చింత గింజల పౌడర్ ధర కేజీ రూ.400 వరకు ఉంది. ఉపయోగాలివీ రంగులు చిక్కగా.. పటిష్టంగా ఉండడానికి ఆయా కంపెనీలు చింతగింజల పౌడర్‌ను ఉపయోగిస్తాయి. పట్టు వస్త్రాలకు తళతళలాడే మెరుపుతో పాటు పెళుసుగా ఉండేందుకు, గంజి పట్టించేందుకు వస్త్ర పరిశ్రమలూ ఈ పౌడర్‌ను వినియోగిస్తున్నాయి. మస్కిటో కాయిల్స్ తయారీలోనూ (యూరప్‌లో దీనిని ఎక్కువగా వాడుతున్నారు) దీనిని ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాల మందుల తయారీలోనూ వాడుతుండటం వల్ల ఫార్మా కంపెనీలు ఈ పౌడర్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ప్లైవుడ్ షీట్స్, పేపర్ తయారీతోపాటు జూట్ పరిశ్రమలోనూ ఉపయోగిస్తారు. పాలిస్టర్ గమ్, ప్లాస్టిక్ తయారీలోనూ దీనిని వాడతారు. చింత గింజల్లో ఫైబర్, ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ ఉండటంతో ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయని చెబుతుండటంతో పలువురు వంటకాల్లోనూ వినియోగిస్తున్నారు. ఆన్లైన్లో విక్రయిస్తున్నాం చింత గింజలను శుభ్రం చేసి గ్రేడ్ల వారీగా విభజిస్తున్నాం. మా వద్ద ఉన్న సరుకు వివరాలను ఆన్లైన్లో పెడితే.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మా గ్రామంలో చాలాకాలంగా చింతపండు నుంచి గింజలను వేరుచేసే పనిని మహిళలు చేస్తుంటారు. అందువల్ల మా గ్రామంలో ఎక్కువగా చింత గింజలు లభ్యమవుతాయి. దీంతో నేను చింత గింజల ఫ్యాక్టరీ నడుపుతున్నాను. –ఓరుగంటి రాంబాబు, చింత గింజల ఫ్యాక్టరీ యజమాని, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం తూర్పు గోదావరి జిల్లాలో ఒకటే ఉంది చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు పెద్దగా ఎక్కడో గాని ఉండవు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చింతపిక్కల ఫ్యాక్టరీ ఒకటి మాత్రమే రిజిస్టర్ అయ్యింది. జిల్లాలో చింత గింజల ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుంది. వీటిని సేకరించి ఇక్కడే తొక్క తీసి ఎగుమతి చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లో చింత గింజల్ని పౌడర్‌గా మార్చి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే పూర్తి సహకారం అందిస్తాం. –తామాడి మురళి, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల శాఖ, కాకినాడ -
Health Tips: తరచూ చింత చిగురును తింటే..
చింతచిగురును తలచుకోగానే నోట్లో నీళ్లు ఊరతాయి. పులుపు సంగతి ఎలా ఉన్నా చింతచిగురును తీసుకోవడం వల్ల మనకెన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ క్రమంలో చింత చిగురును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి తెలుసుకుందాం. ► చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది. ► ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింతచిగురు చెడు కొలెస్టరాల్‌ను తగ్గించి మంచి కొలెస్టరాల్‌ను పెంచుతుంది. చలి జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ► చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ► కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి. ►పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింతచిగురులో ఉన్నాయి. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు తమ ఆహారంలో చింత చిగురును భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. చింత చిగురును పేస్టులా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రింజెంట్‌లా పనిచేస్తుంది. మూత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది. -
Chinta Chiguru: కిలో రూ.500.. అయినా తగ్గేదేలే!
సాక్షి, అమలాపురం: ‘ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా!.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా!.. అడ్డ విస్తరిలో ఆరు రుచులు ఉండగా.. బతుకు పండగ చేయరా’ అని ఒక సినిమా పాటలో అన్నట్టు మానవ జీవితంలో ‘రుచి’ని మించిన మాధుర్యం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే రుచికి ఇచ్చే ప్రాధాన్యం శుచికి కూడా ఇవ్వరన్నది విదితమే. అందులోనూ ఆతిథ్యానికి పేరొందిన కోనసీమలో రుచికరమైన వంటలకు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. రకరకాల రుచికరమైన కూరల కోసం ఆస్తులు కూడా అమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదేమో. కోనసీమ వాసులకు పులసకే కాదు.. సాధారణంగా గోదారికి ఎదురీదే పులసలకు ప్రసిద్ధి కోనసీమ. కానీ దానితో పాటు సీజన్ వారీగా దొరికే పలు రకాల ఆహార ఉత్పత్తులపై కోనసీమ వాసులకు ఆసక్తి ఎక్కువే. దాని ఖరీదు ఎంతైనా వెనకాడరు. ఈ సీజన్లో దొరికే ‘చింత చిగురు (వాడుక భాషలో చింతాకు)’ ఒకటి. దీనితో చేసే శాకాహార, మాంసాహార వంటలకు దాసోహం కానివారంటూ ఉండరు. వివిధ రకాల కూరలకు సరిపడినంత కంటే కొంచెం అదనంగా పులపునిచ్చే చింతాకుకు ఫిదా కానివారు ఉండరు. అందుకే గుప్పెడు చింతాకు రూ.25 అన్నా వెనుకాడరు. ప్రస్తుత మార్కెట్లో వంద గ్రాముల చింత చిగురు ధర రూ.50 వరకు ఉంది. అంటే కిలో రూ.500 అన్నమాట. వారపు సంతలు, రోజువారీ సంతలు, ఇళ్లకు వచ్చేవారి వద్ద చింతాకు ఎగబడి కొంటున్నారు. చింత చిగురు పప్పు, చింతాకు కూర (ఉల్లిపాయలు వేసి), చింత చిగురు పనస పిక్కల కూర శాకాహారల జిహ్వ చాపల్యాన్ని తీర్చేవే. మాంసాహార వంటల్లో చింత చిగురు ఇచ్చే రుచి మరింత స్పైసీగా ఉంటుంది. చింత చిగురు పచ్చిరొయ్యలు, ఎండు రొయ్యల రుచి ఆస్వాదించాల్సిందే తప్ప వర్ణించతరం కాదు. కోనసీమ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని బంధు, మిత్రులకు కూరలు తయారు చేసి పంపేవారున్నారిక్కడ. ఇక మేక బోటీని చింతచిగురుతో కలిపి తింటే జీవితాంతం ఆ రుచి మనసుని వదలిపోదంటే నమ్మండి! ముద్ద నోటిలో పెట్టుకుంటే వేడివేడి అన్నంలో వెన్నపూసలా నమలకుండానే కరిగిపోతోందని మాంసప్రియులు లొట్టలు వేస్తూ గొప్పలు చెబుతారు. ఇవే కాకుండా చింతాకు మాంసం, చింత చిగురు మదుళ్లు (చిన్న రకం చేపలు), చింత చిగురు కొతుకు పరిగి (చేప పిల్లలు) కూరలు సైతం పుల్లపుల్లగా లాగించేవారెందరో..! చైత్రమాసం దాటిన వెంటనే చింతచెట్టు చిగురు సేకరించి విక్రయిస్తుంటారు. అయితే ఒకప్పుడు వచ్చినట్టు ఇప్పుడు చింతాకు మార్కెట్‌కు రావడం లేదు. చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో పాటు దీనిని సేకరించడం పెద్ద ప్రయాసగా మారింది. చెట్టు చివరి భాగంలో ఉండే లేత చిగురు చెట్లు ఎక్కి కోసేవారు తగ్గడం వల్ల చింతాకుకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. మేము ఎక్కువ ధర పెట్టి కొంటాం చింతాకు కోసేవారి నుంచి మేము ఎక్కవ ధర పెట్టి కొంటున్నాం. రేటు తక్కువ ఉన్నప్పుడు సంతలకు పట్టుకుని వెళితే రోజుకు రూ.300 మిగిలేది. ఇప్పుడు రేటు పెరిగినా అంతే ఆదాయం వస్తోంది. వచ్చే వారం మాకు చింతాకు కావాలని ముందుగా చెప్పి కొనేవారు ఎక్కువ మంది ఉన్నారు. – అనంతలక్ష్మి, గంగలకుర్రు, అంబాజీపేట మండలం సీజన్లో తినాల్సిందే సీజన్లో చింతాకుతో తయారు చేసే కూరలు ఒకసారైనా తినాల్సిందే. చింతాకుతో చేసిన ఎటువంటి కూరైనా ఇష్టమే. మాకు హైదరాబాద్‌లో విరివిరిగా చింతాకు దొరుకుతోంది. అయితే మా ఇంటి వద్ద నుంచి వండి పంపించిన చింతాకు కూరల రుచేవేరు. – పి.రాజేష్, కఠారులంక, పి.గన్నవరం మండలం -
ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వాటి గురించి పిల్లలకు తెలుసా!
ఉగాది సమయం ఆ వేప పూత ఆ మావి వగరు ఆ చింత చిగురు ‘పదిగ్రాముల వేపపూత 200 రూపాయలు’... ఆన్లైన్లో చూసి కొనేంతగా ఎదిగాం. ప్రకృతితో కలిసి చేసేదే పండగ... ఉగాది వేళలో మావిచిగురు కోకిల పాట... గాలికి ఊగే వేపపూత... ఈకాలపు పిల్లలకు తెలియని దూరానికి చేరాం. గతంలో వేప చెట్టు, మావిడి చెట్టు... ప్రతి వీధిలో ఉండేవి. ఇప్పుడు? పండగ హడావిడికి సిద్ధమవుతున్నాం. ప్రకృతి స్తబ్దతను గమనిస్తున్నామా? ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వేపచెట్టు. వేపపువ్వు చేదుకి. మామిడి చెట్టు. మామిడి పిందె వగరుకి. చింతచెట్టు. పులుపు రుచికి. కొన్నిచోట్ల కొబ్బరి కోరు వేస్తారు. అంటే కొబ్బరి చెట్టు. మరికొన్ని చోట్ల బాగా మగ్గిన అరటిపండు ముక్కలు కలుపుతారు. అంటే అరటి చెట్టు. ఇవన్నీ ఇప్పుడు ఎన్ని ఇళ్లల్లో ఉన్నాయి. పిల్లలు ఎంతమంది వీటిని తాకి చూస్తున్నారు. ఎందరు వీటి నీడలో ఆడుతున్నారు. ఎందరు వీటిని చూశాం అని చెబుతున్నారు. నగరం అయినా.. పట్టణం అయినా.. పల్లె అయినా. ఆ వేప కొమ్మలు... చెట్టు పెంచడం మన ఆచారం. చెట్టుతో పాటు ఇల్లు ఉండాలనుకోవడం మన సంస్కృతి. ప్రతి వీధికి వేప చెట్టు అరుగు ఉండేది. వీధిలోని ఒకటి రెండు ఇళ్ల వాళ్లయినా ముంగిలిలో వేప చెట్టు వేసుకునేవారు. కొన్ని చెట్లు పెరిగి పెద్దవై ప్రహరీగోడను కప్పేసేవి. చెట్ల కొమ్మలు ఇంటి వైపుకు వాలి నీడను పెంచేసేవి. పిల్లలు రాలిన వేప ఆకులు తొక్కుకుంటూ ఆడుకునేవారు. పసుపుపచ్చటి వేపపండ్లు తుంచి వగరు తీపితో ఉండే వాటి రుచిని చూసేవారు. వాటి గింజలను గుజ్జును పారేసి ఖాళీ డిప్పలలో పుల్లను గుచ్చి ఆడుకునేవారు. వేణ్ణీళ్లలో వేపాకులను కలిపి తల్లులు స్నానం చేయిస్తుండేవారు. నెలకు ఒకటి రెండుసార్లు లేత వేపాకులను నూరి చిన్ని ముద్దలను చేసి చక్కెర అద్ది మింగించేవారు. దడుపు చేస్తే, జ్వరం వస్తే వేప మండలు దిష్టి తీసి నెమ్మది కలిగించేవారు. వేపపుల్లతో పళ్లుతోమడం అలవాటు చేసేవారు. వేపబద్దతో నాలిక గీసుకోవడం ఆరోగ్యం. ఉగాది పండగ రోజు వేపపూత పిల్లల చేతే కోయించేవారు. వేప బెరడుకు బంక కారితే పిల్లలు దానిని గిల్లి సీసాల్లో దాచుకునేవారు. వేప కాండంపై పాకే గండు చీమలు, గెంతుతూ వెళ్లే ఉడతలు, కొమ్మల్లో గూడు పెట్టే కాకులు, ఇంట్లో కోళ్లు పెంచుతుంటే గనక అవి ఎరిగి రాత్రిళ్లు ఆ కొమ్మలపైనే తీసే నిద్ర... పండగలో చెట్టును పెట్టింది చెట్టును కాపాడుకోమని. ప్రకృతిని తెలుసుకోమని. ఇవాళ పెద్ద చెట్లు వేస్తున్న ఇళ్లు ఎన్ని? పెద్ద చెట్లకు వీలైన స్థలం ఎక్కడ దొరుకుతోంది? పూల కుండీలు, మిద్దెతోట... సర్దుబాటు జీవనం... రెక్కలు సాచిన విశాలమైన వృక్షాలు గత చరిత్రగా మారాయి. ఆ మామిడి పిందెలు... మామిడి చెట్టు ఉన్న ఇంటికి మర్యాద జాస్తి. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా వచ్చి మామిడి ఆకులు అడుగుతారు. ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే ‘ఆ మామిడి చెట్టున్న ఇల్లు’ అని చెబుతారు. మామిడి చెట్లు చాలామటుకు శుభ్రంగా ఉంటుంది. వాటి గుబురు ఆకులను చూస్తే ఆనందం కలుగుతుంది. వచ్చిన బంధువులంతా ‘ఏ మామిడి’ అని ఆరా తీస్తారు. బంగినిపల్లో, బెంగుళూరో, నీలమో, నాటు మామిడో... ఏదో ఒక జవాబు చెప్పాలి. పిల్లలు మామిడి కొమ్మలకు తాళ్లు కట్టి ఊయల ఊగుతారు. చిన్న కొమ్మలపై ఎక్కి కూచుంటారు. వేసవి వస్తే ఒళ్లంతా విరగబూసే మామిడి పూత మీద అందరి కళ్లు పడతాయి. పిందెల వేస్తున్నప్పటి నుంచి దిష్టి తగలకుండా యజమానులు నానా పాట్లు పడతారు. ఉండుండి పాడిగాలి వీచి పిందె రాలితే అదో బాధ. కోతుల దండు ఊడి పడితే వాటిని తరిమికొట్టే వరకూ గాబరా. కాయ గుప్పిటంత పెరిగాక కోసి పచ్చడి చేస్తే ఆ రుచి అద్భుతం. ఉగాది పచ్చడి మన ఇంటి కాయ తెచ్చే రుచి అద్భుతం. చిటారున గుబురులో పండిన కాయ పిల్లలు నిద్ర లేచి చెట్టు కిందకు వెళితే రాలి కనపడుతుంది. కోయిలలు వచ్చి పాట పాడి పిల్లలను బదులివ్వమంటుంది. చిలుకలు పండిన కాయలను సుష్టుగా భోం చేసి ఎర్ర ముక్కులు చూపించి పోతాయి. మామిడి చెట్టు ఉంటే ఇంట్లో ఇంకో మనిషి ఉన్నట్టే. కాని కారు పార్కింగ్ కోసం ఆ చెట్టును వదిలేసిన ఇళ్లే ఇప్పుడు. పిల్లలూ... మామిడిపండ్లను మీరు మోర్ మార్కెట్స్‌లోనే చూడక తప్పదు. చింతచెట్టు కథలు జాస్తి... చింతచెట్టు ఇంట్లో పెంచరు. ఆ చెట్టు ఊరిది. ప్రతి ఊళ్లో చింతచెట్టు అరుగు ఉంటుంది. అది మనుషులు కూడా తమ చింతలు మాట్లాడుకునేంత గాఢమైన నీడను కలిగి ఉంటుంది. వేసవి మధ్యాహ్నాలు చింత చెట్టు కింద పట్టే నిద్ర సామాన్యంగా ఉండదు. చింతకాయలు కాస్తే పిల్లలు వాటిని రాళ్లతో రాల్చి నోట పెట్టుకుంటారు. ఆడవాళ్లు దోటీలు పట్టుకుని వచ్చి చింత చిగురు కోసి వండుతారు. ఊరికి కొత్తగా ఎవరైనా వస్తే చింత చెట్టు ఆరా తీస్తుంది. గూడు లేని వాళ్లకు రాత్రిళ్లు అది ఇల్లు అవుతుంది. కాని చింత చెట్టు అంటే భయం కూడా ఉంటుంది. దెయ్యాలు దానిలో టూ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుని ఉంటాయని పుకార్లు ఉంటాయి. చింతచెట్టు కింద పడుకున్నవారి గుండెల మీద రాత్రుళ్లు దెయ్యం కూచుంటుంది. చింతచెట్టుకు రాత్రిళ్లు కార్బన్ డై ఆక్సైడ్ విడిచే సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్లే తగిన ఆక్సిజన్ అందక ఈ భ్రాంతులు. చింతచెట్టు లేని బాల్యం చాలా బోసి. కొంగలు వాలడానికి ఇష్టపడే చెట్టు అది. ఇవాళ ఊళ్లలో ఫ్లెక్సీలు ఉన్నాయి. విగ్రహాలు ఉన్నాయి. చింత చెట్టు మాత్రం లేదు. ఆలోచించాలి అందరం... గతంలో ఎన్నో ఇళ్ల పెరళ్లలో అరటి చెట్లు ఉండేవి. చాలా ఇళ్లల్లో కొబ్బరి చెట్లు వేసేవారు. బాదం చెట్లు పెంచే ఇళ్లకు లెక్క ఉండేది కాదు. చెట్టుకు వదిలాకే కట్టుబడికి స్థలం వదిలేవారు. కట్టేది ఒక ఇల్లయితే చెట్టు నీడ ఒక ఇల్లు అని ఆ కాలంలో తెలుసు. కాని ఇవాళ కాంక్రీట్ ఇళ్లు మాత్రమే కట్టి వేడి పెంచుతున్నాం. ఎండ మండుతోందని అవస్థలు పడుతున్నాం. ఉగాది అంటే చెట్లకు ప్రాభవ సమయాలు ఉన్నట్టు బతుకుకు కూడా ప్రాభవ సమయాలు ఉంటాయని తెలుసుకోవడం. తీపిని ఆస్వాదించడంతో పాటు చేదును మింగాలని తెలుసుకోవడం. తుఫానొచ్చి కొమ్మలు విరిగి పడినా మళ్లీ చిగురించవచ్చని తెలుసుకోవడం. చెట్టుకు పిల్లల్ని దూరం చేయవద్దు. బాల్యాన్ని అరుచితో నింపొద్దు. ఆలోచించండి. కొత్త ఉగాదికి ఆహ్వానం పలకండి. -
Chinta Chiguru: చింతలు తీర్చే చిగురు
చింత చిగురు.. ఇప్పుడంటే అంతా కమర్షియల్ అయింది కానీ గతంలో పల్లెటూర్లలో అలా నడుచుకుంటూ వెళ్లి కోసుకొచ్చుకొనేవాళ్లు. పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో చింతచిగురు చేరిస్తే దాని రుచే వేరంటారు భోజన ప్రియులు. కేవలం రుచి కోసమే కాదని, చింత చిగురు వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రధానంగా ఏప్రిల్– జూలై మాసాల్లో దొరికే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి, అవేంటో చూద్దాం.. ఇందులోనే ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్దకం సమస్య తొలగిపోతుంది. విరేచనం సులభంగా అయ్యేలా చూస్తుంది. పైల్స్ ఉన్న వారికి, జీర్ణాశయ సంబంధ సమస్యలు ఉన్నవారికి చింతచిగురు బాగా పనిచేస్తుంది. చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. టడయాబెటీస్ ఉన్న వారు చింత చిగురును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి క్రమంగా తగ్గుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, టార్టారిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ తదితరాలు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఎముకల ధృఢత్వానికి తోడ్పడతాయి. చింత చిగురును మెత్తగా నూరి కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గుతాయి. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, పగుళ్లు వంటి నోటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్కర్వీ, మలేరియా వ్యాధులకు కూడా ఈ చిగురు చక్కగా పనిచేస్తుంది. కడుపులోని నులి పురుగులకు కూడా చింతచిగురు మంచి ఔషధం. చింతచిగురు టీ కానీ, చింతచిగురును వేణ్ణీళ్లలో మరిగించి కొంచెం తేనె కలుపుకుని తాగినా కానీ సాధారణ జలుబు, దగ్గులాంటివి మాయం అవుతాయి. చింతచిగురు జ్యూస్ ఆడవాళ్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గిస్తుంది. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్ సమస్య కూడా దీనివల్ల తగ్గుముఖం పడుతుంది. కేవలం చిన్న చిన్న రోగాలకే కాదు.. పలు రకాల కాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. వందగ్రాముల చింత చిగురులో దాదాపుగా 239 కాలరీల శక్తి, ఒక్కగ్రాము ఫ్యాట్, 3 గ్రాముల ప్రోటీన్, 26 ఎంజీ సోడియం, 63 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దాదాపు 16 శాతం ఐరన్, 6 శాతం విటమిన్ సీ, 1 శాతం విటమిన్ ఏ ఉంటాయి. సో... ఈసారి చింతచిగురు కనిపిస్తే వదలకండి! (చదవండి: నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే.. !) -
చింతలు తీర్చే ఎర్రచింత!
తీవ్ర కరువు, గాలివానలు వంటి తీవ్రమైన ప్రకృతి వైవపరీత్యాలను సైతం తట్టుకోవడంతోపాటు రైతుకు స్థిరంగా ఏటేటా మంచి ఆదాయాన్నివ్వగలిగిన మంచి తోట పంట ‘ఎర్ర చింత’. దీని అసలు పేరు ‘అనంత రుధిర’. ఇది సహజ రకమే. అనంతపురం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల కృషి ఫలితంగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అధికారికంగా విడుదలైంది. ఈ చింతపండు ఎరుపు రంగులో ఉండటం, సాధారణ చింతలో కన్నా పోషక విలువలు అధికంగా కలిగి ఉండడంతో ఇతర ఉత్పత్తుల్లో కలపడానికి.. అంటే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఇది బాగా అనుకూలమైనది. బత్తాయి తదితర పండ్ల తోటలు ఎండిపోతున్న తీవ్ర కరువు పరిస్థితుల్లోను, గాలివానలకు తట్టుకొని దిగుబడిని ఇవ్వగలగడం దీని ప్రత్యేకత.. చింతపండుతో దక్షిణాదిప్రజలకు, రైతులకు విడదీయరాని అనుబంధం ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చింత సాగు జరుగుతోంది. ఇంట్లో రోజువారీ వంటల్లో వాడుకోవడానికి, నిల్వపచ్చడి పెట్టుకోవడానికి మాత్రమే చింతపండును ప్రస్తుతం మనం వాడుతున్నాం. చింతపండు అంటే నల్లగానే ఉంటుంది కదా అనుకోవద్దు. ఎందుకంటే ఇటీవలే ఎర్రని చింత రకం ఒకటి వెలుగులోకి వచ్చింది. పొలుసు ఒలిచిన తర్వాత చింతపండు మామూలు చింత రకాలకు భిన్నంగా ఎర్ర చింత రకాన్ని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఐదేళ్లపాటు కొనసాగిన పరిశోధనల ఫలితంగా ఎరుపు రంగులో ఉండే చింత రకం రైతులకు అందుబాటులోకి వచ్చింది. ‘అనంత రుధిర’ అనే పేరుతో ఈ కొత్త రకాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి దేశవ్యాప్తంగా విడుదల చేసింది. గింజలు తీసిన ఎర్రచింతపండు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఉద్యాన శాస్త్రవేత్తలు విడుదల చేసిన చింత రకాలు రెండే రెండు. ఉత్తరప్రదేశ్‌లో యోగేశ్వర్ అనే రకం(దీని వివరాలు పెద్దగా అందుబాటులో లేవు) మొదటిది కాగా, మన అనంతపురం శాస్త్రవేత్తలు గుర్తించి, అభివృద్ధి చేసి వెలుగులోకి తెచ్చిన ‘ఎర్ర చింత’(అనంత రుధిర) రెండోది కావడం విశేషం. రేకులకుంటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానంలో 40కి పైగా రకాల చింతచెట్లను సాగు చేస్తూ పరిశోధనలు సాగిస్తున్నారు. వీటిలో 30 ఏళ్ల వయసున్న ఒక చెట్టు కాయల్లో గుజ్జు ఎర్రగా ఉన్నట్లు, ఈ చెట్టు ప్రతి ఏటా కాయలు కాస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎర్ర చింతపండుతో తయారైన వివిధ ఉత్పత్తులు దీనికి ‘ఛాంపియన్ ట్రీ’ అని పేరు పెట్టి ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. ఈ చెట్టు కొమ్మల ద్వారా అంట్లను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందిస్తున్నారు. ఈ ఏడాది కనీసం 20 వేల అంట్లు ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఈ రకం మొక్కలు కొన్నిటిని ఈ పరిశోధనా స్థానంలో నాటారు. అవి పూతకు వచ్చిన తర్వాత ఆ చెట్లకు కూడా అంట్లు కట్టడం ప్రారంభిస్తామని డా. శ్రీనివాసులు తెలిపారు. ‘అనంత రుధిర’ రకంతోపాటు సాధారణరకాలైన తెట్టు అమాలిక, ధార్వాడ్ సెలక్షన్–1, ధార్వాడ్ సెలక్షన్–2 చింత రకాల అంటు మొక్కలు కూడా రేకులకుంటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి. పంపిణీకి సిద్ధంగా ఉన్న ఎర్రచింత అంటుమొక్కలు ఎర్ర చింతకు గుత్తులుగా కాయలు ఉద్యాన క్షేత్రంలో ఉన్న అనంత రుధిర రకం ప్రతి ఏటా కాపు కాస్తున్నది. కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. పిందెను విరిచి చూస్తే రక్తం మాదిరిగా ఎర్రగా కండ కనిపిస్తుంది. కాయ ముదిరిన తర్వాత రోజ్ రెడ్‌లోకి మారుతుంది. యాంటోసైనిన్స్ అనే పిగ్మెంట్ కారణంగా ఎరుపు రంగు సహజసిద్ధంగానే వస్తున్నదని డా. శ్రీనివాసులు తెలిపారు. ఆరోగ్యదాయకం మామూలు చింత రకాల నుంచి వచ్చే చింతకాయల ద్వారా చింతతొక్కు, చింతపండుగానే ఎక్కువగా ఆహారంలో ఉపయోగిస్తారు. అయితే, ఎర్రచింతతో అనేక ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ రకం చింతపండు, ఇతర ఉత్పత్తులు ఆరోగ్యపరంగా మనిషి ఎంతగానో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మానవ శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ (చెడు కలిగించే పదార్థాల)ను ఇవి నిర్వీర్యం చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఇందులో టార్టారిక్ యాసిడ్, భాస్వరం, పొటాషియం, నియాసిన్, రెబోఫ్లేవీన్, బీటా కెరోటిన్ లాంటి విటమిన్లు, మినరల్స్(ఖనిజాలు) ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా టార్టారిక్ యాసిడ్ 16 శాతం ఉంటుంది. దీన్ని చింత తొక్కుగా, చింతపండుగా వంటకాల్లో వాడితే మంచి రుచిని ఇస్తుందన్నారు. ఆకర్షణీయంగా ఆహారోత్పత్తులు ఎరుపు రంగు ఆక్షణీయంగా ఉంటుంది కాబట్టి ఎర్ర చింతపండుతో పులిహోర, సాంబారును మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. ఎర్ర చింతపండును వినియోగించి జామ్, జెల్లీ, సాస్, చిక్కటిగుజ్జు, పొడి, టోఫీస్(చాక్లెట్లు), బేకరీ పదార్ధాల తయారీలో వాడుకుండే ఆయా ఉత్పత్తులు సహజమైన ఎర్ర రంగుతో అదనపు పోషక విలువలతో కూడి మరింత ఆకర్షణీయంగా మారుతాయని డా. శ్రీనివాసులు అంటున్నారు. ఎగుమతుల పెరుగుదలకు కూడా అవకాశం ఉంటుంది. ఐదో ఏడాది నుంచి దిగుబడి ‘అనంత రుధిర’ రకం సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమైనవే అయినప్పటికీ, ఎర్రగరప నేలలు, తేలికపాటి నల్ల రేగళ్లలో మంచి దిగుబడులు వస్తాయని డా.శ్రీనివాసులు తెలిపారు. సాధారణంగా చింత మొక్కలను చౌడు నేలల్లోనో, వ్యవసాయానికి పనికిరాని భూముల్లోనో నాటుతూ ఉంటారని.. అయితే సాగు యోగ్యమైన భూముల్లో ఇతర తోట పంటల మాదిరిగానే చింత అంట్లను నాటుకొని, డ్రిప్ ద్వారా నీటిని, ఎరువులను అందిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఆయన అంటున్నారు. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 8 మీటర్ల ఎడంలో ఎకరాకు 62 మొక్కలు నాటుకోవచ్చు. చెట్లు, కొమ్మలు గుబురుగా, దట్టంగా పెరుగుతాయి, కొన్ని దశాబ్దాల పాటు పెద్ద చెట్లుగా ఎదుగుతాయి కాబట్టి ఎటు చూసినా 8 మీటర్ల దూరంలో చింత మొక్కలు నాటుకోవాలన్నారు. మొక్కలు నాటిన తర్వాత ఐదో ఏడాది కాపునకు వస్తాయి. పూత వచ్చిన 7–8 నెలలకు పండ్లు తయారవుతాయి. తొలి ఏడాది చెట్టుకు 15–20 కిలోల చింతపండ్ల దిగుబడి వస్తుంది. 10–12 సంవత్సరాల చెట్టు ఏటా 40–50 కిలోల దిగుబడినిస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఒక్కో చెట్టుకు ఏటా 70–80 కిలోల చొప్పున చింత పండ్ల దిగుబడి వస్తుంది. చింత పండ్లను సేకరించి పైన పొలు, ఈనెలు, గింజలు తీసేస్తే.. 40–45 శాతం మేరకు నికరంగా చింతపండు చేతికి వస్తుందని డా. శ్రీనివాసులు తెలిపారు. ఏటా కాపు కాయడం ఈ రకం విశిష్టత కావడంతో రైతుకు లాభదాయకంగా ఉంటుంది. అంటు మొక్కలు నాటుకుంటే 70–80 ఏళ్ల వరకు దిగుబడినిస్తాయి. చింత గింజలు నాటితే చెట్లు 10–12 ఏళ్లకు గానీ కాపునకు రావు. కానీ, వందేళ్ల వరకు దిగుబడినిస్తాయి. అయితే, గింజ నాటినప్పటికన్నా అంటు నాటుకున్నప్పుడు జన్యుపరంగా ఖచ్చితమైన నాణ్యమైన చెట్లు రావడానికి అవకాశం ఉందన్నారు. అంతర పంటలుగా పప్పు ధాన్యాలు చింత మొక్కల మధ్య ఎటుచూసినా 8 మీటర్ల దూరం ఉంటుంది కాబట్టి.. మామిడి, చీనీ తోటల్లో మాదిరిగానే.. చింత తోటలు నాటిన కొన్ని ఏళ్ల పాటు రైతులు నిశ్చింతగా అంతర పంటలు వేసుకోవచ్చని డా. శ్రీనివాసులు తెలిపారు. అన్ని రకాల కూరగాయ పంటలు, వేరుశనగ, అలసంద, పెసర, మినుము, బీన్స్ వంటి పప్పుజాతి పంటలను అంతరపంటలుగా సాగు చేసుకోవచ్చన్నారు. చింత చెట్లకు కాయతొలిచే పురుగు ఒక్కటే సమస్యగా గుర్తించారు. మూడు నాలుగు నెలల పాటు ఉండే పిందె దశలో 1 మి.లీ క్లోరిఫైరిపాస్ లేదా 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1 మి.లీ డైక్లోరోవాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కాయతొలిచే పురుగును నివారించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. డ్రిప్ ద్వారా నీటిని తగుమాత్రంగా అందించాలి. సేంద్రియ ఎరువులు, వేప చెక్కతో పాటు తగిన మోతాదులో రసాయన ఎరువులు వేసుకోవాలని డా. శ్రీనివాసులు సిఫారసు చేస్తున్నారు. అయితే, ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించే రైతులు తమ పద్ధతుల ప్రకారం ఎరువులను, కషాయాలను వాడుకుంటూ చింత తోటలు సాగు చేసుకోవచ్చు. – గంగుల రామలింగారెడ్డి, సాక్షి, అంతపురం అగ్రికల్చర్ ఎర్ర గరప, రేగడి నేలలు అనుకూలం ఎర్ర చింత చెట్ల సాగుకు ఎర్ర గరప నేలలతోపాటు తేలికపాటి నల్లరేగడి నేలలు అనుకూలం. కోస్తా ప్రాంతాల్లో సారవంతమైన భూముల్లో అయితే మెట్ట ప్రాంతాల్లో కన్నా అధిక దిగుబడి కూడా రావచ్చు. గాలి వానలకు దీని కాయలు పండిన దశలో కూడా రాలిపోవు. తక్కువ వర్షపాతం ఉండే రాయలసీమ వంటి ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులను సైతం తట్టుకొని బతుకుతుంది. అందువల్లనే బత్తాయి, దానిమ్మ, నిమ్మ తోటలు ఎండిపోతున్న ప్రాంతాల్లో రైతులు ఇటీవల కాలంలో చింత మొక్కలు నాటుకుంటున్నారు. ఇతర తోటల్లో మాదిరిగా డ్రిప్ పెట్టుకొని, ఎరువులు వేసుకొని కొంచెం శ్రద్ధ చూపితే ఎటువంటి భూముల్లోనైనా చక్కగా పెరిగి దశాబ్దాలపాటు లాభదాయకమైన దిగుబడినిస్తుంది. ఎర్ర చింత అంటు మొక్కలకు రైతుల నుంచి ఇప్పటికే గిరాకీ బాగా వచ్చింది. తెలంగాణ ఉద్యాన శాఖ వారు కూడా 3 వేల మొక్కలకు ఆర్డర్ ఇచ్చారు. వచ్చే నెలలో వారికి సరఫరా చేస్తున్నాం. టిష్యూకల్చర్ పద్ధతి విజయవంతం కాకపోవడంతో అంటు మొక్కలనే రైతులకు అందిస్తున్నాం. ఎర్రచింతపండును వంటకాల్లో చింతపండుగా కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో వాడటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎగుమతి అవకాశాలు కూడా ఎక్కువే. – డా. బి. శ్రీనివాసులు (73826 33667), అధిపతి, డా. వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, రేకులకుంట, అనంతపురం జిల్లా -
పుల్లగా ఉన్నా ఫుల్లుగా నచ్చుతుంది
చిగురుండగా చింత ఏల?చిత్ర చిత్ర చింత వంటలు ఇక వంట గదంతా చింతాకు చితాచితాడైనింగ్ టేబులంతా పుల్లగా ఫుల్లుగా...ఎంజాయ్ చేయండి!!! చింత చిగురు పులిహోర కావలసినవి: బియ్యం – 2 కప్పులు; చింత చిగురు – ఒక కప్పు; పచ్చి సెనగపప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; వేయించిన పల్లీలు – రెండు టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు – 15; ఎండు మిర్చి – 5; ఇంగువ – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కరివేప – 2 రెమ్మలు; పచ్చి మిర్చి – 4 (నిలువుగా మధ్యకు చీల్చాలి) తయారీ: ►చింత చిగురును శుభ్రంగా కడిగి పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి ►బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి అన్నం వండి, వేడిగా ఉండగానే ఒక పెద్ద పాత్రలోకి ఆరబోయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ధనియాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, వేయించిన పల్లీలు వేసి వేయించాక, ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా ►పొడి చేయాలి చింతచిగురు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, పసుపు, ఎండు మిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి ►చింత చిగురు మిశ్రమం వేసి బాగా కలిపి దింపేయాలి ►అన్నంలో వేసి కలియబెట్టాలి ►ఉప్పు, జీడి పప్పులు జత చేసి మరోమారు కలిపి, గంటసేపటి తరవాత తినాలి. చింత చిగురు చారు కావలసినవి: చింత చిగురు – ఒక కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – రెండు రెమ్మలు తయారీ: ►చింతచిగురును శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ►బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా ముద్దలా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వరుసగా వేసి వేయించాలి ►చింత చిగురు ముద్ద, తగినన్ని నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి ►ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి చారును మరిగించాలి ►వేడి వేడి అన్నంలో కమ్మని నేయి వేసుకుని, అప్పడంతో నంచుకుని తింటే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. చింత చిగురు పొడి కావలసినవి: చింత చిగురు – 100 గ్రా; పల్లీలు – 4 టేబుల్ స్పూన్లు; ధనియాలు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 10; వెల్లుల్లి రెబ్బలు – 2; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ: ►చింత చిగురులోని కాడలను తీసేసి, చింత చిగురును శుభ్రంగా కడగాలి ►పొడి వస్త్రం మీద ఆరేసి, తడి పోయేవరకు ఆరబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పల్లీలు, ధనియాలు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►అదే బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక చింత చిగురు వేసి బాగా పొడిపొడిగా అయ్యేవరకు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►పదార్థాలన్నీ చల్లారాక, ముందుగా పల్లీల మిశ్రమాన్ని మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా ఉండేలా పొడి చేయాలి ►వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►చివరగా వేయించిన చింత చిగురు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►పొడిపొడిలా ఉండేలా జాగ్రత్తపడాలి ►అన్నం, దోసె, ఇడ్లీలలోకి రుచిగా ఉంటుంది. చింత చిగురు – దోసకాయ కూర కావలసినవి: చింత చిగురు – ఒక కప్పు, దోసకాయలు – పావు కేజీ; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – రెండు టీ స్పూన్లు; బెల్లం పొడి – అర టీ స్పూను తయారీ: ►చింతచిగురును శుభ్రంగా కడగాలి ►దోసకాయ తొక్క తీసి సన్నగా ముక్కలు తరగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి ►దోసకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ►ముక్కలు బాగా మగ్గిన తరవాత చింత చిగురు, పసుపు జత చేసి కలియబెట్టి మూత ఉంచాలి ►బాగా ఉడికిన తరవాత కరివేపాకు, బెల్లం పొడి వేసి కలిపి దింపేయాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. చింత చిగురు పప్పు కావలసినవి: కందిపప్పు – ఒక కప్పు, చింతచిగురు – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పచ్చిమిర్చి – 4 (నిలువుగా మధ్యకు చీల్చాలి); ఎండుమిర్చి – 4; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి లేదా నూనె – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినన్ని; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; వెల్లుల్లి రెబ్బలు – 5 తయారీ: ►కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జతచేసి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించాక తరవాత దింపేయాలి ►చింత చిగురును శుభ్రంగా కడగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వరుసగా వేసి దోరగా వేయించాలి ►చింత చిగురు వేసి పచ్చి వాసన పోయేవరకు దోరగా వేయించాలి ►పసుపు, ఉప్పు జత చేయాలి ►ఉడికించిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా అయ్యేలా మెదపాలి ►ఉడుకుతున్న చింత చిగురులో పప్పు వేసి బాగా కలపాలి ►కరివేపాకు, కొత్తిమీర వేసి కలియబెట్టి దింపేయాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. చింత చిగురు – కొబ్బరిపచ్చడి కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు; చింత చిగురు – అర కప్పు; పచ్చిమిర్చి – 6; ఎండు మిర్చి – 6; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ►చింత చిగురును శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద ఆరబోయాలి ►స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక, చింత చిగురు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ►ఉప్పు, పసుపు జత చేసి బాగా కలిపి దింపి చల్లార్చాలి ►చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ►చింత చిగురు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►చివరగా కొబ్బరి ముక్కలు వేసి పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ►కొద్దికొద్దిగా నీరు జత చేస్తూ మిక్సీ పడితే, పచ్చడి మెత్తగా వచ్చి, రుచిగా ఉంటుంది ►అన్నంలో వేడి వేడి నెయ్యి జత చేసి కలుపుకుంటే రుచిగా ఉంటుంది. చింత చిగురు మాంసం కావలసినవి మటన్ – 500 గ్రాములు (అర కేజీ); కొత్తిమీర – ఒక కట్ట; ధనియాల పొడి – టీ స్పూన్; అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; కొబ్బరి తురుము – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; పుదీనా ఆకులు – కప్పు; ఆవాలు – టీస్పూన్; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; చింతచిగురు – 200 గ్రాములు; పసుపు – అర టీ స్పూన్ తయారీ: ►వెడల్పాటి బాణలి స్టౌమీద ఉంచి, వేడయ్యాక నూనె వేయాలి ►నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించాలి ►దీంట్లో అల్లం–వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి ►ఉల్లిపాయలు వేగాక మటన్ వేసి కలపాలి. పైన మూత ఉంచి, ఐదు నిమిషాలు వేగనివ్వాలి ►తర్వాత దీంట్లో అర కప్పు నీళ్లు, ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరి తురుము, కారం వేసి ఉడకనివ్వాలి ►మటన్ ముక్క ఉడికేంత వరకు ఉంచి, చింతచిగురు వేసి కలపాలి ►ఐదు నిమిషాలు వేగనివ్వాలి ►గ్రేవీ లేకుండా ముక్క బాగా వేగినదీ లేనిదీ సరిచూసుకుని కొత్తిమీర చల్లి, దింపేయాలి. చింత చిగురు చికెన్ కావలసినవి: చికెన్ – అర కేజీ; చింతచిగురు – 150 గ్రాములు; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; పచ్చి మిర్చి – 3; పసుపు – పావు టీ స్పూన్; కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూన్; గరం మసాలా – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – 5 టేబుల్ స్పూన్లు; దాల్చిన చెక్క – రెండు చిన్న ముక్కలు; ఏలకులు – 2 ; లవంగాలు – 3 తయారీ: ►చింత చిగురు కడిగి, నీళ్లన్నీ పోయేవరకు జల్లెడలో వేసి ఉంచాలి ►పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి ►దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు వేసి వేయించాలి ►దీంట్లోనే ఉల్లిపాయ తరుగు, నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి వేసి కలపాలి ►ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. చికెన్ వేసి కలిపి మూత ఉంచి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ►తర్వాత మూత తీసి కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి ►మూత పెట్టి పావు గంట సేపు సన్నని మంట మీద ఉడకనివ్వాలి ►గరం మసాలా, కొబ్బరి తురుము వేసి కలిపి, చివరగా చింత చిగురు వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు వేగాక దించాలి. చింత లేనట్లే! చింత చెట్టులో అనేక ఔషధాలు ఉన్నాయి. చింత పండు, చింత చిగురు, చింత బెరడు... అన్ని భాగాలూ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. సంస్కృతంలో దీనిని చించా అంటారు. ►విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా చింతపండు దంతాల చిగుళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పళ్ల నుంచి రక్తస్రావం జరగకుండా చూస్తుంది. ►రోగనిరోధక శక్తికి సి విటమిన్ అవసరం. ►చింత చిగురు జీర్ణశక్తిని పెంచి, జీర్ణమండలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ►పులుపు రుచి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ►కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ►చింత చిగురుని కుండలో పెట్టి మూత పెట్టేసి, పొయ్యి మీద ఉంచితే, ఆ వేడికి అవి మాడినట్లుగా అవుతాయి. ఆ ఆకులను పొడి చేసి, జల్లెడ పట్టిన మెత్తటి పొడిలో నువ్వుల నూనె కలిపి, కాలిన గాయాల మీద పూసుకుంటే గాయాలు త్వరగా మానతాయి. కొత్త చర్మం త్వరగా వస్తుంది. ►జలుబు చేసినప్పుడు చింతపండు రసంలో చెంచాడు నెయ్యి, అర చెంచాడు మిరియాల పొడి చేర్చి, కాచి వేడివేడిగా తాగితే ముక్కుదిబ్బడ త్వరగా తగ్గుతుంది. ►చింతపండును నీళ్లలో నానబెట్టి రసం తీసి, పల్చగా చేసి, కొద్దిగా మిరియాలు, లవంగాలు, ఏలకులు చేర్చి తాగిస్తే ఆకలి మందగించినవారికి ఆకలి పుడుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ►జ్వరం, జలుబు, అజీర్ణ వ్యాధులను చింతపండు బాగా తగ్గిస్తుంది. ►ఎటువంటి అనారోగ్యం వచ్చినా చింతపండు చారుతో అన్నం తినిపిస్తే అది మంచి పథ్యంగా పనిచేస్తుంది. ►జ్వరం వచ్చినప్పుడు చింతపండు నీళ్లలో లవంగాలు, ఏలకులు, కర్పూరం వేసి కాచి, మూడు చెంచాల చొప్పున ఇస్తుంటే వేడి తగ్గుతుంది. ►క్యాన్సర్ నుంచి రక్షించే పదార్థాల కోసం చేసే పరీక్షల్లో చింతపండుకి క్యాన్సర్ రక్షణ గుణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల నిత్యం చింతపండు వాడటం ఆరోగ్య రక్షణకు అవసరం. ►జీర్ణమండల ఆరోగ్యానికి అవసరమైన పెక్టిన్ అనే పదార్థం చింతపండులో అధికంగా ఉంది. -
చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇల్లందకుంట మండలం లక్ష్మాజిపల్లెకు చెందిన ఎండీ. రజాక్(52) ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడి గురువారం మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. రజాక్ ఇంటి సమీపంలోని చింతచెట్టకు ఉన్న చింతకాయను చెట్టు ఎక్కి తెంపుతుండగా కాలుజారి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కాగా వరంగల్ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. -
చెట్టు కిందే గొత్తికోయ మహిళ ప్రసవం
* కవలలు జననం.. ఒకరు మృతి.. చికిత్స పొందుతున్న మరొకరు * రోడ్డుమార్గం లేక ఆస్పత్రికి చేరుకోలేకపోయిన గర్భిణి ఏటూరునాగారం: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి రోడ్డుమార్గం లేక కావడిపై మోసుకొస్తుండగా.. నడిరోడ్డుపైనే ఓ చింతచెట్టు కింద ప్రసవించిన ఘటన మంగళవారం జరిగింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురం పరిధిలోని లింగాపురం గొత్తికోయగూడేనికి చెందిన మాడవి పోసమ్మకు మంగళవారం పురిటి నొప్పులు వచ్చాయి. గూడేనికి సరైన రోడ్డు లేక 108, ఇతర వాహనాలు కానీ వచ్చే పరిస్థితి లేదు. దీంతో భర్త భద్రయ్యతో పాటు మరికొందరు మంచానికి తాళ్లు కట్టి పోసమ్మను మోసుకుం టూ 2 కి.మీ. దూరం వచ్చారు. అప్పటికే ఓ ఆటోను పిలిపించారు. కానీ, ఆ ఆటో కూడా మార్గమధ్యలో బురదలో కూరుకుపోయింది. అంతా కలసి ఆటోను బయటకు లాగినా.. పోసమ్మకు నొప్పులు ఎక్కువ కావడంతో గోగుపల్లిలోని ఓ చింత చెట్టుకింద నిలిపివేశారు. దీంతో ఆ చెట్టు కిందే స్థానిక మహిళలంతా కలసి చుట్టూ చీరలు కట్టి.. తమకు తెలిసిన విధంగా పురుడు పోశారు. పోసమ్మకు ఇద్దరు మగ శిశువులు జన్మించగా, అందులో ఒక బాబు మృతి చెందాడు. గోగుపల్లి సబ్‌సెంటర్ ఏఎన్ ఎం ధనలక్ష్మీ ఈ నెల మొదటి వారంలోనే గొత్తికోయగూడేనికి వెళ్లి పోసమ్మను సామాజిక ఆస్పత్రిలో చేరాలని సూచించింది. అరుునా, ఆమె వెళ్లకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పోసమ్మకు రక్తస్రావం అవుతుండడంతో గోగుపల్లి నుంచి 108లో ఆస్పత్రికి తరలించారు. అనార్యోగంతో ఉన్న మరో బిడ్డను పిల్లల ఆస్పత్రికి తరలించగా, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. -
చింతే తోడూ నీడ
'నాకు ఆస్తిపాస్తుల్లేవు.. రేయింబవళ్లు కూలికి పోయి.. నా నలుగురు బిడ్డల్ని కంటికి రెప్పలా పెంచాను. వారిని ప్రయోజకుల్ని చేశాను. ఇపుడేమో వయసు మీద పడింది. కష్ట పడలేని స్థితిలో ఉన్నా. ఆదరించి ఆదుకుంటారనుకున్న కన్నబిడ్డలు ఛీదరించుకున్నారు. దీంతో ఇలా రోడ్డున పడ్డాను. పక్కనున్న చింత చెట్టు తొర్రలో తలదాచుకుంటున్నాను' ఇది.. తల్లిదండ్రుల బాగోగులు చూడని బిడ్డల మానవత్వానికి ఓ ప్రశ్నలా.. సమాజ గమనానికి ఉదాహరణలా మిగిలిన ఎనభై ఏళ్ల ఓ వృద్ధుడి దీన గాథ. తిరుపతి మంగళం : ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్రీనివాసులు(80). చెట్టు తొర్రనే నీడగా చేసుకుని, కనిపించిన వారినల్లా చేయి చాచి అడుగుతూ.. ఆకలితో అలమటిస్తూ.. జీవిత చరమాంకంలో ఒంటరిగా నరక యాతన అనుభవిస్తున్నాడు. విషయం తెలియడంతో 'సాక్షి' ఆయనను పలకరించింది. కన్నీటితో తన మనోవేదనను, గుండెల్లో గూడుకట్టుకున్న బాధను, పడిన కష్టనష్టాలను ఏకరువు పెట్టాడు. శ్రీనివాసులు.. నగరి నియోజకవర్గంలోని ఇరుగువాయి గ్రామానికి చెందిన వాడు. నలుగురు సంతానం. కొడుకులు కుప్పయ్య, జయరామ్, పొన్నుస్వామితో పాటు కూతురు మల్లీశ్వరి ఉన్నారు. వారిని కంటికి రెప్పలా పెంచాడు. ఆస్తిపాస్తులేవీ లేకున్నా.. కన్న బిడ్డల్నే ఆస్తులుగా భావించి.. బాధ్యత గా పెంచి పెద్ద చేశాడు. వారికి పెళ్లిళ్లు చేసి ప్రయోజకుల్ని చేశాడు. ఇద్దరు కొడుకులు మంగళంలోని వెంకటేశ్వర కాలనీ, మరో కొడుకు బొమ్మల క్వార్టర్స్, కూతురు తిరుపతిలోని తాతయ్యగుంటలో స్థిరపడ్డారు. కాాలం పరుగులో వయసు మీద పడింది. భార్య ఐదారేళ్ల క్రితం చనిపోయింది. కూలికి వెళ్లి కష్ట పడలేని స్థితి. దీంతో ఇంటికి పరిమితమయ్యాడు. కన్న బిడ్డలపై ఆధారపడాల్సి వచ్చింది. తిరుపతి, వెంకటేశ్వర కాలనీలోని కొడుకుల వద్దకు చేరాడు. తమకు బరువయ్యావంటూ కన్న కొడుకులూ.. కోడళ్ల చీదరింపులు తప్పలేదు. గుండె బరువుతో బయటకు వచ్చేశాడు. ఇది తెలిసి తాతయ్యగుంటలో కూతురు తండ్రిని అక్కున చేర్చుకుంది. కొంత కాలం కంటికి రెప్పలా చూసుకుంది. అయితే కొడుకులు తిరిగి తండ్రిని తమ వెంట తీసుకెళ్లారు. తర్వాత నాలుగు రోజులకే ఛీదరింపులు, అవమానాలు మళ్లీ మొదలయ్యాయి. అంతే.. కన్నబిడ్డలపై మమకారం వదిలేసి.. మనసు చంపుకుని రోడ్డున పడ్డాడు. అయిన వారెందరున్నా.. ఒకరికి భారం కాకూడదనుకున్నాడు.. దాదాపు రెండు నెలల క్రితం తిరుపతి కరకంబాడి మార్గంలోని అక్కారాంపల్లికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఓ చింతచెట్టును ఆశ్రయంగా చేసుకున్నాడు. చెట్టు తొర్రలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఎంత ఎండలు కాసినా, వాన కురిసినా అక్కడి నుంచి కదలడం లేదు. చలించిన మాజీ సర్పంచ్... ఈ వృద్ధుడిని చూసి తిమ్మినాయుడుపాళెం మాజీ సర్పంచ్ ఆదం సుధాకర్‌రెడ్డి చలించి పోయారు. ఉదయం, రాత్రి తన ఇంటి వద్ద నుంచి భోజనం అందిస్తున్నాడు. మధ్యాహ్నం వృద్ధుడు ఉంటున్న చెట్టు పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు అందించే భోజనాన్ని ఆయనకు పెట్టిస్తున్నాడు. అతని జానెడు కడుపునకు నాలుగు మెతుకులు అందించి మానవత్వం చాటుకుంటున్నాడు. ఈ వృద్ధుడిని దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాల్సి ఉంది.