పుల్లగా ఉన్నా ఫుల్లుగా నచ్చుతుంది | Many types of dishes can be done with tamarind | Sakshi
Sakshi News home page

పుల్లగా ఉన్నా ఫుల్లుగా నచ్చుతుంది

Published Sat, Apr 20 2019 3:25 AM | Last Updated on Sat, Apr 20 2019 3:25 AM

Many types of dishes can be done with tamarind - Sakshi

చిగురుండగా చింత ఏల?చిత్ర చిత్ర చింత వంటలు ఇక వంట గదంతా చింతాకు చితాచితాడైనింగ్‌ టేబులంతా పుల్లగా ఫుల్లుగా...ఎంజాయ్‌ చేయండి!!!

చింత చిగురు పులిహోర
కావలసినవి: బియ్యం – 2 కప్పులు; చింత చిగురు – ఒక కప్పు; పచ్చి సెనగపప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; వేయించిన పల్లీలు – రెండు టేబుల్‌ స్పూన్లు; జీడి పప్పులు – 15; ఎండు మిర్చి – 5; ఇంగువ – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; కరివేప – 2 రెమ్మలు; పచ్చి మిర్చి – 4 (నిలువుగా మధ్యకు చీల్చాలి)
తయారీ:  
►చింత చిగురును శుభ్రంగా కడిగి పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి
►బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి అన్నం వండి, వేడిగా ఉండగానే ఒక పెద్ద పాత్రలోకి ఆరబోయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ధనియాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, వేయించిన పల్లీలు వేసి వేయించాక, ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా ►పొడి చేయాలి చింతచిగురు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, పసుపు, ఎండు మిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి
►చింత చిగురు మిశ్రమం వేసి బాగా కలిపి దింపేయాలి
►అన్నంలో వేసి కలియబెట్టాలి
►ఉప్పు, జీడి పప్పులు జత చేసి మరోమారు కలిపి, గంటసేపటి తరవాత తినాలి.

చింత చిగురు చారు
కావలసినవి: చింత చిగురు – ఒక కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – రెండు రెమ్మలు
తయారీ:
►చింతచిగురును శుభ్రంగా కడగాలి
►తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి
►బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా ముద్దలా చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వరుసగా వేసి వేయించాలి
►చింత చిగురు ముద్ద, తగినన్ని నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి
►ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి చారును మరిగించాలి
►వేడి వేడి అన్నంలో కమ్మని నేయి వేసుకుని, అప్పడంతో నంచుకుని తింటే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది.


చింత చిగురు పొడి
కావలసినవి: చింత చిగురు – 100 గ్రా; పల్లీలు – 4 టేబుల్‌ స్పూన్లు; ధనియాలు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 10; వెల్లుల్లి రెబ్బలు – 2; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత
తయారీ:
►చింత చిగురులోని కాడలను తీసేసి, చింత చిగురును శుభ్రంగా కడగాలి
►పొడి వస్త్రం మీద ఆరేసి, తడి పోయేవరకు ఆరబెట్టాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పల్లీలు, ధనియాలు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి
►అదే బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక చింత చిగురు వేసి బాగా పొడిపొడిగా అయ్యేవరకు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి
►పదార్థాలన్నీ చల్లారాక, ముందుగా పల్లీల మిశ్రమాన్ని మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా ఉండేలా పొడి చేయాలి
►వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి
►చివరగా వేయించిన చింత చిగురు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి
►పొడిపొడిలా ఉండేలా జాగ్రత్తపడాలి
►అన్నం, దోసె, ఇడ్లీలలోకి రుచిగా ఉంటుంది.

చింత చిగురు – దోసకాయ కూర
కావలసినవి: చింత చిగురు – ఒక కప్పు, దోసకాయలు – పావు కేజీ; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – రెండు టీ స్పూన్లు; బెల్లం పొడి – అర టీ స్పూను
తయారీ:
►చింతచిగురును శుభ్రంగా కడగాలి
►దోసకాయ తొక్క తీసి సన్నగా ముక్కలు తరగాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి
►దోసకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి
►ముక్కలు బాగా మగ్గిన తరవాత చింత చిగురు, పసుపు జత చేసి కలియబెట్టి మూత ఉంచాలి
►బాగా ఉడికిన తరవాత కరివేపాకు, బెల్లం పొడి వేసి కలిపి దింపేయాలి
►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.


చింత చిగురు పప్పు
కావలసినవి: కందిపప్పు – ఒక కప్పు, చింతచిగురు – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పచ్చిమిర్చి – 4 (నిలువుగా మధ్యకు చీల్చాలి); ఎండుమిర్చి – 4; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి లేదా నూనె – ఒక టేబుల్‌ స్పూను; నీళ్లు – తగినన్ని; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; వెల్లుల్లి రెబ్బలు – 5
తయారీ:
►కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జతచేసి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించాక తరవాత దింపేయాలి
►చింత చిగురును శుభ్రంగా కడగాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వరుసగా వేసి దోరగా వేయించాలి
►చింత చిగురు వేసి పచ్చి  వాసన పోయేవరకు దోరగా వేయించాలి
►పసుపు, ఉప్పు జత చేయాలి
►ఉడికించిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా అయ్యేలా మెదపాలి
►ఉడుకుతున్న చింత చిగురులో పప్పు వేసి బాగా కలపాలి
►కరివేపాకు, కొత్తిమీర వేసి కలియబెట్టి దింపేయాలి
►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.

చింత చిగురు – కొబ్బరిపచ్చడి
కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు; చింత చిగురు – అర కప్పు; పచ్చిమిర్చి – 6; ఎండు మిర్చి – 6; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్‌ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు
తయారీ:
►చింత చిగురును శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద ఆరబోయాలి
►స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి
►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక, చింత చిగురు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి
►ఉప్పు, పసుపు జత చేసి బాగా కలిపి దింపి చల్లార్చాలి
►చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి
►చింత చిగురు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి
►చివరగా కొబ్బరి ముక్కలు వేసి పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి
►కొద్దికొద్దిగా నీరు జత చేస్తూ మిక్సీ పడితే, పచ్చడి మెత్తగా వచ్చి, రుచిగా ఉంటుంది
►అన్నంలో వేడి వేడి నెయ్యి జత చేసి కలుపుకుంటే రుచిగా ఉంటుంది.


చింత చిగురు మాంసం కావలసినవి
మటన్‌ – 500 గ్రాములు (అర కేజీ); కొత్తిమీర – ఒక కట్ట; ధనియాల పొడి – టీ స్పూన్‌; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌; కొబ్బరి తురుము – టీ స్పూన్‌; జీలకర్ర – టీ స్పూన్‌; పుదీనా ఆకులు – కప్పు; ఆవాలు – టీస్పూన్‌; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; చింతచిగురు – 200 గ్రాములు; పసుపు – అర టీ
స్పూన్‌
తయారీ:
►వెడల్పాటి బాణలి స్టౌమీద ఉంచి, వేడయ్యాక నూనె వేయాలి
►నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించాలి
►దీంట్లో అల్లం–వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి
►ఉల్లిపాయలు వేగాక మటన్‌ వేసి కలపాలి. పైన మూత ఉంచి, ఐదు నిమిషాలు వేగనివ్వాలి
►తర్వాత దీంట్లో అర కప్పు నీళ్లు, ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరి తురుము, కారం వేసి ఉడకనివ్వాలి
►మటన్‌ ముక్క ఉడికేంత వరకు ఉంచి, చింతచిగురు వేసి కలపాలి
►ఐదు నిమిషాలు వేగనివ్వాలి
►గ్రేవీ లేకుండా ముక్క బాగా వేగినదీ లేనిదీ సరిచూసుకుని కొత్తిమీర చల్లి, దింపేయాలి.


చింత చిగురు చికెన్‌
కావలసినవి: చికెన్‌ – అర కేజీ; చింతచిగురు – 150 గ్రాములు; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌; పచ్చి మిర్చి – 3; పసుపు – పావు టీ స్పూన్‌; కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూన్‌; గరం మసాలా – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – 5 టేబుల్‌ స్పూన్లు; దాల్చిన చెక్క – రెండు చిన్న ముక్కలు; ఏలకులు – 2 ; లవంగాలు – 3
తయారీ: 
►చింత చిగురు కడిగి, నీళ్లన్నీ పోయేవరకు జల్లెడలో వేసి ఉంచాలి
►పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి
►దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు వేసి వేయించాలి
►దీంట్లోనే ఉల్లిపాయ తరుగు, నిలువుగా కట్‌ చేసిన పచ్చి మిర్చి వేసి కలపాలి
►ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. చికెన్‌ వేసి కలిపి మూత ఉంచి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి
►తర్వాత మూత తీసి కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి
►మూత పెట్టి పావు గంట సేపు సన్నని మంట మీద ఉడకనివ్వాలి
►గరం మసాలా, కొబ్బరి తురుము వేసి కలిపి, చివరగా చింత చిగురు వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు వేగాక దించాలి. 


చింత లేనట్లే!
చింత చెట్టులో అనేక ఔషధాలు ఉన్నాయి. చింత పండు, చింత చిగురు, చింత  బెరడు... అన్ని భాగాలూ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. సంస్కృతంలో దీనిని చించా అంటారు. 
►విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా చింతపండు దంతాల చిగుళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పళ్ల నుంచి రక్తస్రావం జరగకుండా చూస్తుంది.  
►రోగనిరోధక శక్తికి సి విటమిన్‌ అవసరం.
►చింత చిగురు జీర్ణశక్తిని పెంచి, జీర్ణమండలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలిని కూడా పెంచుతుంది.
►పులుపు రుచి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
►కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
►చింత చిగురుని కుండలో పెట్టి మూత పెట్టేసి, పొయ్యి మీద ఉంచితే, ఆ వేడికి అవి మాడినట్లుగా అవుతాయి. ఆ ఆకులను పొడి చేసి, జల్లెడ పట్టిన మెత్తటి పొడిలో నువ్వుల నూనె కలిపి, కాలిన గాయాల మీద పూసుకుంటే గాయాలు త్వరగా మానతాయి. కొత్త చర్మం త్వరగా వస్తుంది. 
►జలుబు చేసినప్పుడు చింతపండు రసంలో చెంచాడు నెయ్యి, అర చెంచాడు మిరియాల పొడి చేర్చి, కాచి వేడివేడిగా తాగితే ముక్కుదిబ్బడ త్వరగా తగ్గుతుంది.
►చింతపండును నీళ్లలో నానబెట్టి రసం తీసి, పల్చగా చేసి, కొద్దిగా మిరియాలు, లవంగాలు, ఏలకులు చేర్చి తాగిస్తే ఆకలి మందగించినవారికి ఆకలి పుడుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
►జ్వరం, జలుబు, అజీర్ణ వ్యాధులను చింతపండు బాగా తగ్గిస్తుంది. 
►ఎటువంటి అనారోగ్యం వచ్చినా చింతపండు చారుతో అన్నం తినిపిస్తే అది మంచి పథ్యంగా పనిచేస్తుంది.
►జ్వరం వచ్చినప్పుడు చింతపండు నీళ్లలో లవంగాలు, ఏలకులు, కర్పూరం వేసి కాచి, మూడు చెంచాల చొప్పున ఇస్తుంటే వేడి తగ్గుతుంది.
►క్యాన్సర్‌ నుంచి రక్షించే పదార్థాల కోసం చేసే పరీక్షల్లో చింతపండుకి క్యాన్సర్‌ రక్షణ గుణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల నిత్యం చింతపండు వాడటం ఆరోగ్య రక్షణకు అవసరం.
►జీర్ణమండల ఆరోగ్యానికి అవసరమైన పెక్టిన్‌ అనే పదార్థం చింతపండులో అధికంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement