చింతే తోడూ నీడ | elderly man lives under tramarind tree in chittoor district | Sakshi
Sakshi News home page

చింతే తోడూ నీడ

Published Tue, Jul 21 2015 10:14 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

చింతే తోడూ నీడ

చింతే తోడూ నీడ

'నాకు ఆస్తిపాస్తుల్లేవు.. రేయింబవళ్లు కూలికి పోయి.. నా నలుగురు బిడ్డల్ని కంటికి రెప్పలా పెంచాను. వారిని ప్రయోజకుల్ని చేశాను. ఇపుడేమో వయసు మీద పడింది. కష్ట పడలేని స్థితిలో ఉన్నా. ఆదరించి ఆదుకుంటారనుకున్న కన్నబిడ్డలు ఛీదరించుకున్నారు. దీంతో ఇలా రోడ్డున పడ్డాను. పక్కనున్న చింత చెట్టు తొర్రలో తలదాచుకుంటున్నాను' ఇది.. తల్లిదండ్రుల బాగోగులు చూడని బిడ్డల మానవత్వానికి ఓ ప్రశ్నలా.. సమాజ గమనానికి ఉదాహరణలా మిగిలిన ఎనభై ఏళ్ల ఓ వృద్ధుడి దీన గాథ.
 తిరుపతి మంగళం :
 ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్రీనివాసులు(80). చెట్టు తొర్రనే నీడగా చేసుకుని, కనిపించిన వారినల్లా చేయి చాచి అడుగుతూ.. ఆకలితో అలమటిస్తూ.. జీవిత చరమాంకంలో ఒంటరిగా నరక యాతన అనుభవిస్తున్నాడు. విషయం తెలియడంతో 'సాక్షి' ఆయనను పలకరించింది. కన్నీటితో తన మనోవేదనను, గుండెల్లో గూడుకట్టుకున్న బాధను, పడిన కష్టనష్టాలను ఏకరువు పెట్టాడు.
 

శ్రీనివాసులు.. నగరి నియోజకవర్గంలోని ఇరుగువాయి గ్రామానికి చెందిన వాడు. నలుగురు సంతానం. కొడుకులు కుప్పయ్య, జయరామ్, పొన్నుస్వామితో పాటు కూతురు మల్లీశ్వరి ఉన్నారు. వారిని కంటికి రెప్పలా పెంచాడు. ఆస్తిపాస్తులేవీ లేకున్నా.. కన్న బిడ్డల్నే ఆస్తులుగా భావించి.. బాధ్యత గా పెంచి పెద్ద చేశాడు. వారికి పెళ్లిళ్లు చేసి ప్రయోజకుల్ని చేశాడు. ఇద్దరు కొడుకులు మంగళంలోని వెంకటేశ్వర కాలనీ, మరో కొడుకు బొమ్మల క్వార్టర్స్, కూతురు తిరుపతిలోని తాతయ్యగుంటలో స్థిరపడ్డారు. కాాలం పరుగులో వయసు మీద పడింది. భార్య ఐదారేళ్ల క్రితం చనిపోయింది. కూలికి వెళ్లి కష్ట పడలేని స్థితి. దీంతో ఇంటికి పరిమితమయ్యాడు. కన్న బిడ్డలపై ఆధారపడాల్సి వచ్చింది. తిరుపతి, వెంకటేశ్వర కాలనీలోని కొడుకుల వద్దకు చేరాడు. తమకు బరువయ్యావంటూ కన్న కొడుకులూ.. కోడళ్ల చీదరింపులు తప్పలేదు. గుండె బరువుతో బయటకు వచ్చేశాడు. ఇది తెలిసి తాతయ్యగుంటలో కూతురు తండ్రిని అక్కున చేర్చుకుంది. కొంత కాలం కంటికి రెప్పలా చూసుకుంది. అయితే కొడుకులు తిరిగి తండ్రిని తమ వెంట తీసుకెళ్లారు. తర్వాత నాలుగు రోజులకే ఛీదరింపులు, అవమానాలు మళ్లీ మొదలయ్యాయి. అంతే.. కన్నబిడ్డలపై మమకారం వదిలేసి.. మనసు చంపుకుని రోడ్డున పడ్డాడు. అయిన వారెందరున్నా.. ఒకరికి భారం కాకూడదనుకున్నాడు.. దాదాపు రెండు నెలల క్రితం తిరుపతి కరకంబాడి మార్గంలోని అక్కారాంపల్లికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఓ చింతచెట్టును ఆశ్రయంగా చేసుకున్నాడు. చెట్టు తొర్రలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఎంత ఎండలు కాసినా, వాన కురిసినా అక్కడి నుంచి కదలడం లేదు.
 చలించిన మాజీ సర్పంచ్...
 ఈ వృద్ధుడిని చూసి తిమ్మినాయుడుపాళెం మాజీ సర్పంచ్ ఆదం సుధాకర్‌రెడ్డి చలించి పోయారు. ఉదయం, రాత్రి తన ఇంటి వద్ద నుంచి భోజనం అందిస్తున్నాడు. మధ్యాహ్నం వృద్ధుడు ఉంటున్న చెట్టు పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు అందించే భోజనాన్ని ఆయనకు పెట్టిస్తున్నాడు. అతని జానెడు కడుపునకు నాలుగు మెతుకులు అందించి మానవత్వం చాటుకుంటున్నాడు. ఈ వృద్ధుడిని దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement