సాక్షి, అమలాపురం: ‘ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా!.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా!.. అడ్డ విస్తరిలో ఆరు రుచులు ఉండగా.. బతుకు పండగ చేయరా’ అని ఒక సినిమా పాటలో అన్నట్టు మానవ జీవితంలో ‘రుచి’ని మించిన మాధుర్యం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే రుచికి ఇచ్చే ప్రాధాన్యం శుచికి కూడా ఇవ్వరన్నది విదితమే. అందులోనూ ఆతిథ్యానికి పేరొందిన కోనసీమలో రుచికరమైన వంటలకు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. రకరకాల రుచికరమైన కూరల కోసం ఆస్తులు కూడా అమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదేమో.
కోనసీమ వాసులకు పులసకే కాదు..
సాధారణంగా గోదారికి ఎదురీదే పులసలకు ప్రసిద్ధి కోనసీమ. కానీ దానితో పాటు సీజన్ వారీగా దొరికే పలు రకాల ఆహార ఉత్పత్తులపై కోనసీమ వాసులకు ఆసక్తి ఎక్కువే. దాని ఖరీదు ఎంతైనా వెనకాడరు. ఈ సీజన్‌లో దొరికే ‘చింత చిగురు (వాడుక భాషలో చింతాకు)’ ఒకటి. దీనితో చేసే శాకాహార, మాంసాహార వంటలకు దాసోహం కానివారంటూ ఉండరు. వివిధ రకాల కూరలకు సరిపడినంత కంటే కొంచెం అదనంగా పులపునిచ్చే చింతాకుకు ఫిదా కానివారు ఉండరు. అందుకే గుప్పెడు చింతాకు రూ.25 అన్నా వెనుకాడరు. ప్రస్తుత మార్కెట్‌లో వంద గ్రాముల చింత చిగురు ధర రూ.50 వరకు ఉంది. అంటే కిలో రూ.500 అన్నమాట. వారపు సంతలు, రోజువారీ సంతలు, ఇళ్లకు వచ్చేవారి వద్ద చింతాకు ఎగబడి కొంటున్నారు. చింత చిగురు పప్పు, చింతాకు కూర (ఉల్లిపాయలు వేసి), చింత చిగురు పనస పిక్కల కూర శాకాహారల జిహ్వ చాపల్యాన్ని తీర్చేవే.
మాంసాహార వంటల్లో చింత చిగురు ఇచ్చే రుచి మరింత స్పైసీగా ఉంటుంది. చింత చిగురు పచ్చిరొయ్యలు, ఎండు రొయ్యల రుచి ఆస్వాదించాల్సిందే తప్ప వర్ణించతరం కాదు. కోనసీమ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని బంధు, మిత్రులకు కూరలు తయారు చేసి పంపేవారున్నారిక్కడ. ఇక మేక బోటీని చింతచిగురుతో కలిపి తింటే జీవితాంతం ఆ రుచి మనసుని వదలిపోదంటే నమ్మండి! ముద్ద నోటిలో పెట్టుకుంటే వేడివేడి అన్నంలో వెన్నపూసలా నమలకుండానే కరిగిపోతోందని మాంసప్రియులు లొట్టలు వేస్తూ గొప్పలు చెబుతారు. ఇవే కాకుండా చింతాకు మాంసం, చింత చిగురు మదుళ్లు (చిన్న రకం చేపలు), చింత చిగురు కొతుకు పరిగి (చేప పిల్లలు) కూరలు సైతం పుల్లపుల్లగా లాగించేవారెందరో..!
చైత్రమాసం దాటిన వెంటనే చింతచెట్టు చిగురు సేకరించి విక్రయిస్తుంటారు. అయితే ఒకప్పుడు వచ్చినట్టు ఇప్పుడు చింతాకు మార్కెట్‌కు రావడం లేదు. చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో పాటు దీనిని సేకరించడం పెద్ద ప్రయాసగా మారింది. చెట్టు చివరి భాగంలో ఉండే లేత చిగురు చెట్లు ఎక్కి కోసేవారు తగ్గడం వల్ల చింతాకుకు మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది.
మేము ఎక్కువ ధర పెట్టి కొంటాం
చింతాకు కోసేవారి నుంచి మేము ఎక్కవ ధర పెట్టి కొంటున్నాం. రేటు తక్కువ ఉన్నప్పుడు సంతలకు పట్టుకుని వెళితే రోజుకు రూ.300 మిగిలేది. ఇప్పుడు రేటు పెరిగినా అంతే ఆదాయం వస్తోంది. వచ్చే వారం మాకు చింతాకు కావాలని ముందుగా చెప్పి కొనేవారు ఎక్కువ మంది ఉన్నారు.
– అనంతలక్ష్మి, గంగలకుర్రు, అంబాజీపేట మండలం
సీజన్‌లో తినాల్సిందే
సీజన్‌లో చింతాకుతో తయారు చేసే కూరలు ఒకసారైనా తినాల్సిందే. చింతాకుతో చేసిన ఎటువంటి కూరైనా ఇష్టమే. మాకు హైదరాబాద్‌లో విరివిరిగా చింతాకు దొరుకుతోంది. అయితే మా ఇంటి వద్ద నుంచి వండి పంపించిన చింతాకు కూరల రుచేవేరు.
– పి.రాజేష్, కఠారులంక, పి.గన్నవరం మండలం
Comments
Please login to add a commentAdd a comment