Health Tips: తరచూ చింత చిగురును తింటే.. | Amazing Health Benefits of Tamarind Leaves In Telugu | Sakshi
Sakshi News home page

Tamarind Leaves: చింత చిగురుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

Published Sat, Jun 18 2022 8:29 PM | Last Updated on Sat, Jun 18 2022 8:45 PM

Amazing Health Benefits of Tamarind Leaves In Telugu - Sakshi

చింతచిగురును తలచుకోగానే నోట్లో నీళ్లు ఊరతాయి. పులుపు సంగతి ఎలా ఉన్నా చింతచిగురును తీసుకోవడం వల్ల మనకెన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ క్రమంలో చింత చిగురును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి తెలుసుకుందాం.

► చింత చిగురులో డైటరీ ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం తొలగిపోతుంది. పైల్స్‌ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది.

► ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింతచిగురు చెడు కొలెస్టరాల్‌ను తగ్గించి మంచి కొలెస్టరాల్‌ను పెంచుతుంది. చలి జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి.  

► చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి.

► కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురులో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్‌ గుణాలు దీంట్లో ఉన్నాయి.

►పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింతచిగురులో ఉన్నాయి. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని  సంతరించుకుంటాయి.  థైరాయిడ్‌ సమస్యలతో బాధపడుతున్న వారు తమ ఆహారంలో చింత చిగురును భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిస్‌ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

చింత చిగురును పేస్టులా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్‌ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రింజెంట్‌లా పనిచేస్తుంది. మూత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement