ప్రతీకాత్మక చిత్రం
Health Tips In Telugu- Varicose Veins: సాధారణంగా గుండె... మిగతా మానవ శరీరమంతటికీ తన నుంచి వెలువడే రక్తనాళాల ద్వారా రక్తాన్ని సరఫరా చేస్తుంటుంది. ఈ రక్తనాళాలను ధమనులు అంటారు. మళ్లీ కొన్ని రక్తనాళాల ద్వారా గుండెకు రక్తం చేరుతుంది. ఇలా గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్ని సిరలుగా చెబుతారు.
కాళ్ల దగ్గర ఉండే ఈ సిరలు దెబ్బతినడం, లేదా పై వైపునకు వెళ్లాల్సిన రక్తం సాఫీగా ప్రవహించకపోవడంతో కాళ్ల కింది భాగంలో, ప్రధానంగా పిక్కల వంటి చోట్ల రక్తనాళాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఇలా కనిపించడాన్ని ‘వేరికోస్ వెయిన్స్’ అంటారు. ఆ కండిషన్‌పై అవగాహన కోసం... సంక్షిప్తంగా ఈ కథనం.
ఇతర శరీర భాగాల విషయంలో ఎలా ఉన్నప్పటికీ కాళ్ల విషయానికి వస్తే భూమి ఆకర్షణ శక్తి వల్ల గుండెకు చేరాల్సిన రక్తప్రసరణ కాస్త ఆలస్యమవుతుంది. అంతేకాదు... వయసు పైబడటం, స్థూలకాయం, కుటుంబ చరిత్ర వంటి అంశాలతోనూ, ట్రాఫిక్ పోలీసులు, బస్‌కండక్టర్లు వంటి వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా నిలబడే ఉండటం వంటి కొన్ని వృత్తిపనుల్లో రక్తప్రసరణ ఆలస్యం అవుతుంది.
మహిళల్లో గర్భం దాల్చడం, హార్మోన్లు ప్రభావం వంటి అంశాలూ రక్తప్రసరణను ఆలస్యమయ్యేలా చేయవచ్చు. ఈ సమస్య శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. కానీ సాధారణంగా మోకాలి కింది భాగం నుంచి పాదాల వరకు వచ్చినప్పుడు ఈ పరిస్థితి చాలా ఇబ్బంది పెడుతుంది.
ఈ సమస్య వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించి, పడుకునే సమయంలో కాలిని కాస్త ఎత్తుగా ఉండేలా కాలికింద దిండు వేసుకుంటే సరిపోతుంది. కానీ వేరికోస్ వెయిన్స్ బాధిస్తుంటే డాక్టర్ సహాయం అవసరం.
వేరికోస్ వెయిన్స్ అంటే
కొన్ని సందర్భాల్లో మాత్రం పరిస్థితి ఇంకాస్త తీవ్రంగా ఉంటుంది. కాలి రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా; లేదా మోకాలి కింద ఉండే రక్తనాళాలు దెబ్బతిన్నా లేదా అవి బలహీనపడ్డా, ఆ రక్తనాళాల్లో రక్తాన్ని కిందికి పోకుండా నిలిపే కొన్ని కవాటాలు బలహీనపడటం వల్ల ఒక్కోసారి గుండెకు చేరాల్సిన రక్తసరఫరా సాఫీగా సాగదు.
అలాంటప్పుడు మోకాలి కింది రక్తనాళాలు ఉబ్బినట్టుగా ఉండటం, సాలీడు కాళ్లను పోలిన ఉబ్బుతో కనిపించడం, అలా ఉబ్బిన రక్తనాళాలు నీలం, ఎరుపు రంగులో కనిపిస్తుంటే ఆ కండిషన్‌ను ‘వేరికోస్ వెయిన్స్’గా చెబుతారు.
నిర్ధారణ పరీక్షలు
వేరికోస్ వెయిన్స్ నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు చేస్తారు. వీనస్ అల్ట్రాసౌండ్, లోపలి రక్తనాళాలను చూస్తూ పరిస్థితి తెలుసుకునేందుకు సీటీ, ఎమ్మారై, ‘వీనోగ్రామ్’ వంటి పరీక్షలు చేస్తారు.
చికిత్సలు
పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు లేదా అప్పటికే రక్తనాళాలు ఉబ్బి బాగా బయటికి కనిపిస్తూ, తీవ్రమైన నొప్పి వస్తున్నప్పుడు శస్త్రచికిత్స ద్వారా పరిస్థితిని చక్కబరచాల్సి వస్తుంది. ఇందులో దెబ్బతిన్న రక్తనాళాలను శస్త్రచికిత్సతో తొలగిస్తారు.
ఈ ప్రక్రియను ‘వీన్ లైగేషన్ అండ్ స్ట్రిప్పింగ్’ అంటారు. అయితే ఇప్పుడు శస్త్రచికిత్సను అంతగా ఉపయోగించడం లేదు. వైద్యశాస్త్రంలో వచ్చిన గణనీయమైన పురోగతి వల్ల ఇప్పుడు వేరికోస్ లేజర్ చికిత్సలు, గ్లూ చికిత్సల వంటి ఇతర అధునాతన ప్రక్రియలు, చికిత్స మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
అది కూడా కోత పెట్టడంతో కాకుండా కేవలం రక్తనాళాల్లోకి (ఇంట్రావీనస్) కాన్యులా పంపడం వంటి సులువైన ప్రక్రియలతోనూ చికిత్స సాధ్యమవుతోంది.
-డాక్టర్ శ్రీధర్‌రెడ్డి బద్దం , సీనియర్ కన్సల్టెంట్, వాస్క్యులార్ అండ్ ఆంకో ఇంటర్వెన్షనల్ స్పెషలిస్ట్
చదవండి: Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే..
దుర్వాసన లేకుండా బాత్‌రూమ్ శుభ్రంగా ఉంచుకోండిలా! లేదంటే అతిథులు యాక్ అంటూ పారిపోతారు మరి..
Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment