గుత్తులుగా ఎర్ర చింత కాయలు, కాయ లోపల ఎర్రని కండ
తీవ్ర కరువు, గాలివానలు వంటి తీవ్రమైన ప్రకృతి వైవపరీత్యాలను సైతం తట్టుకోవడంతోపాటు రైతుకు స్థిరంగా ఏటేటా మంచి ఆదాయాన్నివ్వగలిగిన మంచి తోట పంట ‘ఎర్ర చింత’. దీని అసలు పేరు ‘అనంత రుధిర’. ఇది సహజ రకమే. అనంతపురం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల కృషి ఫలితంగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అధికారికంగా విడుదలైంది.
ఈ చింతపండు ఎరుపు రంగులో ఉండటం, సాధారణ చింతలో కన్నా పోషక విలువలు అధికంగా కలిగి ఉండడంతో ఇతర ఉత్పత్తుల్లో కలపడానికి.. అంటే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఇది బాగా అనుకూలమైనది. బత్తాయి తదితర పండ్ల తోటలు ఎండిపోతున్న తీవ్ర కరువు పరిస్థితుల్లోను, గాలివానలకు తట్టుకొని దిగుబడిని ఇవ్వగలగడం దీని ప్రత్యేకత..
చింతపండుతో దక్షిణాదిప్రజలకు, రైతులకు విడదీయరాని అనుబంధం ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చింత సాగు జరుగుతోంది. ఇంట్లో రోజువారీ వంటల్లో వాడుకోవడానికి, నిల్వపచ్చడి పెట్టుకోవడానికి మాత్రమే చింతపండును ప్రస్తుతం మనం వాడుతున్నాం. చింతపండు అంటే నల్లగానే ఉంటుంది కదా అనుకోవద్దు. ఎందుకంటే ఇటీవలే ఎర్రని చింత రకం ఒకటి వెలుగులోకి వచ్చింది.
పొలుసు ఒలిచిన తర్వాత చింతపండు
మామూలు చింత రకాలకు భిన్నంగా ఎర్ర చింత రకాన్ని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఐదేళ్లపాటు కొనసాగిన పరిశోధనల ఫలితంగా ఎరుపు రంగులో ఉండే చింత రకం రైతులకు అందుబాటులోకి వచ్చింది. ‘అనంత రుధిర’ అనే పేరుతో ఈ కొత్త రకాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి దేశవ్యాప్తంగా విడుదల చేసింది.
గింజలు తీసిన ఎర్రచింతపండు
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఉద్యాన శాస్త్రవేత్తలు విడుదల చేసిన చింత రకాలు రెండే రెండు. ఉత్తరప్రదేశ్‌లో యోగేశ్వర్ అనే రకం(దీని వివరాలు పెద్దగా అందుబాటులో లేవు) మొదటిది కాగా, మన అనంతపురం శాస్త్రవేత్తలు గుర్తించి, అభివృద్ధి చేసి వెలుగులోకి తెచ్చిన ‘ఎర్ర చింత’(అనంత రుధిర) రెండోది కావడం విశేషం. రేకులకుంటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానంలో 40కి పైగా రకాల చింతచెట్లను సాగు చేస్తూ పరిశోధనలు సాగిస్తున్నారు. వీటిలో 30 ఏళ్ల వయసున్న ఒక చెట్టు కాయల్లో గుజ్జు ఎర్రగా ఉన్నట్లు, ఈ చెట్టు ప్రతి ఏటా కాయలు కాస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఎర్ర చింతపండుతో తయారైన వివిధ ఉత్పత్తులు
దీనికి ‘ఛాంపియన్ ట్రీ’ అని పేరు పెట్టి ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. ఈ చెట్టు కొమ్మల ద్వారా అంట్లను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందిస్తున్నారు. ఈ ఏడాది కనీసం 20 వేల అంట్లు ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఈ రకం మొక్కలు కొన్నిటిని ఈ పరిశోధనా స్థానంలో నాటారు. అవి పూతకు వచ్చిన తర్వాత ఆ చెట్లకు కూడా అంట్లు కట్టడం ప్రారంభిస్తామని డా. శ్రీనివాసులు తెలిపారు. ‘అనంత రుధిర’ రకంతోపాటు సాధారణరకాలైన తెట్టు అమాలిక, ధార్వాడ్ సెలక్షన్–1, ధార్వాడ్ సెలక్షన్–2 చింత రకాల అంటు మొక్కలు కూడా రేకులకుంటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి.
పంపిణీకి సిద్ధంగా ఉన్న ఎర్రచింత అంటుమొక్కలు
ఎర్ర చింతకు గుత్తులుగా కాయలు
ఉద్యాన క్షేత్రంలో ఉన్న అనంత రుధిర రకం ప్రతి ఏటా కాపు కాస్తున్నది. కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. పిందెను విరిచి చూస్తే రక్తం మాదిరిగా ఎర్రగా కండ కనిపిస్తుంది. కాయ ముదిరిన తర్వాత రోజ్ రెడ్‌లోకి మారుతుంది. యాంటోసైనిన్స్ అనే పిగ్‌మెంట్ కారణంగా ఎరుపు రంగు సహజసిద్ధంగానే వస్తున్నదని డా. శ్రీనివాసులు తెలిపారు.
ఆరోగ్యదాయకం
మామూలు చింత రకాల నుంచి వచ్చే చింతకాయల ద్వారా చింతతొక్కు, చింతపండుగానే ఎక్కువగా ఆహారంలో ఉపయోగిస్తారు. అయితే, ఎర్రచింతతో అనేక ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ రకం చింతపండు, ఇతర ఉత్పత్తులు ఆరోగ్యపరంగా మనిషి ఎంతగానో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మానవ శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ (చెడు కలిగించే పదార్థాల)ను ఇవి నిర్వీర్యం చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఇందులో టార్టారిక్ యాసిడ్, భాస్వరం, పొటాషియం, నియాసిన్, రెబోఫ్లేవీన్, బీటా కెరోటిన్ లాంటి విటమిన్లు, మినరల్స్(ఖనిజాలు) ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా టార్టారిక్ యాసిడ్ 16 శాతం ఉంటుంది. దీన్ని చింత తొక్కుగా, చింతపండుగా వంటకాల్లో వాడితే మంచి రుచిని ఇస్తుందన్నారు.
ఆకర్షణీయంగా ఆహారోత్పత్తులు
ఎరుపు రంగు ఆక్షణీయంగా ఉంటుంది కాబట్టి ఎర్ర చింతపండుతో పులిహోర, సాంబారును మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. ఎర్ర చింతపండును వినియోగించి జామ్, జెల్లీ, సాస్, చిక్కటిగుజ్జు, పొడి, టోఫీస్(చాక్లెట్లు), బేకరీ పదార్ధాల తయారీలో వాడుకుండే ఆయా ఉత్పత్తులు సహజమైన ఎర్ర రంగుతో అదనపు పోషక విలువలతో కూడి మరింత ఆకర్షణీయంగా మారుతాయని డా. శ్రీనివాసులు అంటున్నారు. ఎగుమతుల పెరుగుదలకు కూడా అవకాశం ఉంటుంది.
ఐదో ఏడాది నుంచి దిగుబడి
‘అనంత రుధిర’ రకం సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమైనవే అయినప్పటికీ, ఎర్రగరప నేలలు, తేలికపాటి నల్ల రేగళ్లలో మంచి దిగుబడులు వస్తాయని డా.శ్రీనివాసులు తెలిపారు. సాధారణంగా చింత మొక్కలను చౌడు నేలల్లోనో, వ్యవసాయానికి పనికిరాని భూముల్లోనో నాటుతూ ఉంటారని.. అయితే సాగు యోగ్యమైన భూముల్లో ఇతర తోట పంటల మాదిరిగానే చింత అంట్లను నాటుకొని, డ్రిప్ ద్వారా నీటిని, ఎరువులను అందిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఆయన అంటున్నారు. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 8 మీటర్ల ఎడంలో ఎకరాకు 62 మొక్కలు నాటుకోవచ్చు.
చెట్లు, కొమ్మలు గుబురుగా, దట్టంగా పెరుగుతాయి, కొన్ని దశాబ్దాల పాటు పెద్ద చెట్లుగా ఎదుగుతాయి కాబట్టి ఎటు చూసినా 8 మీటర్ల దూరంలో చింత మొక్కలు నాటుకోవాలన్నారు. మొక్కలు నాటిన తర్వాత ఐదో ఏడాది కాపునకు వస్తాయి. పూత వచ్చిన 7–8 నెలలకు పండ్లు తయారవుతాయి. తొలి ఏడాది చెట్టుకు 15–20 కిలోల చింతపండ్ల దిగుబడి వస్తుంది. 10–12 సంవత్సరాల చెట్టు ఏటా 40–50 కిలోల దిగుబడినిస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఒక్కో చెట్టుకు ఏటా 70–80 కిలోల చొప్పున చింత పండ్ల దిగుబడి వస్తుంది.
చింత పండ్లను సేకరించి పైన పొలు, ఈనెలు, గింజలు తీసేస్తే.. 40–45 శాతం మేరకు నికరంగా చింతపండు చేతికి వస్తుందని డా. శ్రీనివాసులు తెలిపారు. ఏటా కాపు కాయడం ఈ రకం విశిష్టత కావడంతో రైతుకు లాభదాయకంగా ఉంటుంది. అంటు మొక్కలు నాటుకుంటే 70–80 ఏళ్ల వరకు దిగుబడినిస్తాయి. చింత గింజలు నాటితే చెట్లు 10–12 ఏళ్లకు గానీ కాపునకు రావు. కానీ, వందేళ్ల వరకు దిగుబడినిస్తాయి. అయితే, గింజ నాటినప్పటికన్నా అంటు నాటుకున్నప్పుడు జన్యుపరంగా ఖచ్చితమైన నాణ్యమైన చెట్లు రావడానికి అవకాశం ఉందన్నారు.
అంతర పంటలుగా పప్పు ధాన్యాలు
చింత మొక్కల మధ్య ఎటుచూసినా 8 మీటర్ల దూరం ఉంటుంది కాబట్టి.. మామిడి, చీనీ తోటల్లో మాదిరిగానే.. చింత తోటలు నాటిన కొన్ని ఏళ్ల పాటు రైతులు నిశ్చింతగా అంతర పంటలు వేసుకోవచ్చని డా. శ్రీనివాసులు తెలిపారు. అన్ని రకాల కూరగాయ పంటలు, వేరుశనగ, అలసంద, పెసర, మినుము, బీన్స్ వంటి పప్పుజాతి పంటలను అంతరపంటలుగా సాగు చేసుకోవచ్చన్నారు. చింత చెట్లకు కాయతొలిచే పురుగు ఒక్కటే సమస్యగా గుర్తించారు.
మూడు నాలుగు నెలల పాటు ఉండే పిందె దశలో 1 మి.లీ క్లోరిఫైరిపాస్ లేదా 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1 మి.లీ డైక్లోరోవాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కాయతొలిచే పురుగును నివారించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. డ్రిప్ ద్వారా నీటిని తగుమాత్రంగా అందించాలి. సేంద్రియ ఎరువులు, వేప చెక్కతో పాటు తగిన మోతాదులో రసాయన ఎరువులు వేసుకోవాలని డా. శ్రీనివాసులు సిఫారసు చేస్తున్నారు. అయితే, ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించే రైతులు తమ పద్ధతుల ప్రకారం ఎరువులను, కషాయాలను వాడుకుంటూ చింత తోటలు సాగు చేసుకోవచ్చు.
– గంగుల రామలింగారెడ్డి, సాక్షి, అంతపురం అగ్రికల్చర్
ఎర్ర గరప, రేగడి నేలలు అనుకూలం
ఎర్ర చింత చెట్ల సాగుకు ఎర్ర గరప నేలలతోపాటు తేలికపాటి నల్లరేగడి నేలలు అనుకూలం. కోస్తా ప్రాంతాల్లో సారవంతమైన భూముల్లో అయితే మెట్ట ప్రాంతాల్లో కన్నా అధిక దిగుబడి కూడా రావచ్చు. గాలి వానలకు దీని కాయలు పండిన దశలో కూడా రాలిపోవు. తక్కువ వర్షపాతం ఉండే రాయలసీమ వంటి ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులను సైతం తట్టుకొని బతుకుతుంది. అందువల్లనే బత్తాయి, దానిమ్మ, నిమ్మ తోటలు ఎండిపోతున్న ప్రాంతాల్లో రైతులు ఇటీవల కాలంలో చింత మొక్కలు నాటుకుంటున్నారు. ఇతర తోటల్లో మాదిరిగా డ్రిప్ పెట్టుకొని, ఎరువులు వేసుకొని కొంచెం శ్రద్ధ చూపితే ఎటువంటి భూముల్లోనైనా చక్కగా పెరిగి దశాబ్దాలపాటు లాభదాయకమైన దిగుబడినిస్తుంది. ఎర్ర చింత అంటు మొక్కలకు రైతుల నుంచి ఇప్పటికే గిరాకీ బాగా వచ్చింది. తెలంగాణ ఉద్యాన శాఖ వారు కూడా 3 వేల మొక్కలకు ఆర్డర్ ఇచ్చారు. వచ్చే నెలలో వారికి సరఫరా చేస్తున్నాం. టిష్యూకల్చర్ పద్ధతి విజయవంతం కాకపోవడంతో అంటు మొక్కలనే రైతులకు అందిస్తున్నాం. ఎర్రచింతపండును వంటకాల్లో చింతపండుగా కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో వాడటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎగుమతి అవకాశాలు కూడా ఎక్కువే.
– డా. బి. శ్రీనివాసులు (73826 33667), అధిపతి, డా. వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, రేకులకుంట, అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment