YSR Horticulture University
-
జాతీయ స్థాయి మార్కెట్లోకి మన వంగడాలు
రాష్ట్రంలోని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 18 రకాల వంగడాలు దేశవ్యాప్తంగా వినియోగంలోకి రానున్నాయి. ఈ యూనివర్సిటీ ఇప్పటికే రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసిన 15 వంగడాలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన వాము (వర్ష), వస (స్వర్ణస్వర), పసుపు (లామ్ స్వర్ణ) వంగడాలను జాతీయ స్థాయి మార్కెట్లోకి విడుదల చేస్తూ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజిట్‌లో ప్రచురించింది.దేశవ్యాప్తంగా వినియోగించేందుకు వీలుగా వెంకట్రామన్నగూడెం, గుంటూరు లాం, బాపట్ల, తిరుపతి, కొవ్వూరు, పెద్దాపురం ఉద్యాన పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు ఈ వంగడాలను అభివృద్ధి చేశారు. రెండు రంగు (ద్వివర్ణ)లలో తోటకూర, వంగపండు రంగు చిక్కుడు, ఎర్రటి చింత వంటి వెరైటీలతో పాటు జెమినీ వైరస్‌ను తట్టుకునే క్రాంతి, చైత్ర, తనీ్వ, సిరి వంటి మిరప రకాలు కూడా వీటిలో ఉన్నాయి. కొత్తగా జాతీయ మార్కెట్లోకి వస్తున్న వంగడాలు, వాటి ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. – సాక్షి, అమరావతిపసుపు (లామ్ స్వర్ణ) : అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక రకం (260–270 రోజులు). పసుపు పొడి ముదురు నిమ్మ పసుపు రంగులో ఉంటుంది. అధిక ఎండు కొమ్ముల రికవరి (24%) లో 3–4% కుర్కుమిన్ వద్ద పదార్ధం కల్గి ఉంటుంది. హెక్టారుకు 40–42 టన్నుల పచ్చి పసుపు, 9.8 నుంచి 11.3 టన్నుల ఎండు కొమ్ముల దిగుబడినిస్తుంది. వస (స్వర్ణస్వర) : 8–9 నెలల పంట కాల పరిమితితో అధిక దిగుబడినిచ్చే రకం. దీనిలో బిటా ఆసరోన్– (15.90 మి. గ్రా/ గ్రాము) అధికంగా వుంటుంది. మొక్క మధ్యస్థ పెరుగుదలతో (56.40 సెం.మీ), ఆకులు అధికంగా కలిగి ఉంటుంది. దగ్గర దగ్గరగా నాటుకోవడానికి అనువైన రకం. వస కొమ్ములు మంచి పొడవు (44.88 సెం.మీ), వెడల్పు (6.53 సెం.మీ) సరాసరి బరువు (112.30 గ్రా.) ఉంటాయి. చిత్తడి నేలల్లో సాగుకు అనుకూలం, హెక్టారుకి 28 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. వాము (వర్ష) : అధిక దిగుబడినిచ్చే, దీర్ఘకాలిక రకం (140–145 రోజులు). నీటి పారుదల, వర్షాధార ప్రాంతాల్లో సాగుకి అనుకూలం, అధిక నూనె శాతం (7–8%)తో పాటు సువాసన కలిగిన ఈ రకం సువాసన పరిశ్రమలకి అనుకూలం. గింజ ఆకర్షణీయమైన గోధుమ రంగుతోమధ్యస్థ పరిమాణంలో ఉండటం వలన మార్కెట్లో గిరాకీ అధికంగా ఉంటుంది. హెక్టారుకి 10–12 క్వింటాళ్ళు దిగుబడినిస్తుంది. మిరప (క్రాంతి) : అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక (210–230 రోజులు) రకం. మొక్కలు నిటారుగా పొడవుగా పెరుగుతాయి. కాయలు మధ్యస్థ పొడవుతో పచి్చగా ఉన్నప్పుడు ముదురు ఆకుపచ్చ రంగులో, పండినప్పుడు ఆకర్షణీయమైన ముదురు ఎరుపు రంగులో ఉండి అధిక ఘాటును కలిగి ఉంటాయి. నేరుగా విత్తడానికి (సాలు తోటలు) అనుకూలమైన రకం. ఆకు ముడత (జెమిని వైరస్) తెగులు, బెట్టను సమర్ధంగా తట్టుకోగలదు. వర్షాధార పంటగా హెక్టార్‌కు 48 క్వింటాళ్లు, నీటి పారుదల కింద 65 క్వింటాళ్లు చొప్పున అధిక ఎండు మిరప దిగుబడినిస్తుంది. మిరప (చైత్ర): అధిక దిగుబడినిచ్చే మధ్యకాలిక (180–190 రోజులు) రకం. మొక్కలు గుబురుగా పెరిగి, ఆకులు దట్టంగా ఉండడం వల్ల కాయలు ఎండ వేడిమిని తట్టుకోగలుగుతాయి. కాయలు పచ్చిగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగులో, పక్వానికి వచి్చనప్పుడు మెరుపుతో కూడిన ఎరుపు రంగులో ఉంటాయి. పచ్చి మిర్చి, ఎండు మిరపగా కూడా ఉపయోగపడుతుంది. నేరుగా విత్తడానికి అనుకూలమైన రకం. ఆకుముడతను పూర్తిగా, బెట్టను కొంతవరకు తట్టుకోగలదు. వర్షాధార పంటగా హెక్టారుకి 46 క్వింటాళ్లు, నీటి పారుదల కింద 65 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. మిరప (తన్వీ) : అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక (210–230 రోజులు) రకం. మొక్కలు మధ్యస్థంగా పెరుగుతాయి. ఆకుపచ్చ రంగులోనున్న కాయలు రంగు తిరిగే దశలో తొలుత కుంకుమ వర్ణంలోకి, ఆ తర్వాత ముదురు ఎరుపు రంగులోకి మారతాయి. కాయలు సన్నగా అధిక ఘాటును కలిగి ఉంటాయి. నిల్వ సమయంలో రంగును త్వరగా కోల్పోవు. ఆకు ముడత, పండు కుళ్ళు తెగుళ్ళను తట్టుకుంటుంది. ఎగుమతికి అనువైన రకం. వర్షాధార పంటగా హెక్టారుకి 48 క్వింటాళ్లు, నీటి పారుదల కింద 65 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. పచ్చి మిరప (సిరి): మొక్కలు నిటారుగా, పొడవుగా పెరుగుతాయి. అధిక పచ్చి మిరప దిగుబడినిచ్చే మధ్యకాలిక (180–200 రోజులు) రకం. కాయలు పసుపుతో కూడిన లేత ఆకు పచ్చ రంగు నిగారింపుతో మధ్యస్థ పొడవు, మధ్యస్థ ఘాటును కలిగివుంటాయి. నాటిన రెండున్నర నెలల నుండి పచ్చి మిర్చి కోతకు సిద్ధమవుతుంది. హెక్టారుకి 310 నుంచి 320 క్వింటాళ్ల పచ్చి మిరప దిగుబడినిస్తుంది. చిక్కుడు (శ్రేష్ఠ) : మొక్కలు మధ్యస్థంగా పెరిగి, సంవత్సరం పొడవునా సాగుకు అనువైన రకం. నిర్దిష్టమైన కాంతి/చీకటి అవసరం లేకుండా పూతనిచ్చే రకం. కాయలు ఉదా రంగును కలిగి నాటిన 80 – 85 రోజుల్లో కోతకొస్తాయి. హెక్టారుకి 19 టన్నుల దిగుబడి వస్తుంది. కర్ర పెండలం (ఆదిత్య): వరి కోత తరువాత లోతట్టు, మాగాణి భూముల్లో సాగుకు అనువైన స్వల్పకాలిక రకం (7 నెలలు). మొక్కలు నిటారుగా పెరిగి కోత సులభంగా ఉంటుంది. ఖరీఫ్‌లో వర్షాధారంతోపాటు నీటి పారుదల కింద కూడా సాగు చేయొచ్చు. కసావా మెజాయిక్ వైరస్‌ను తట్టుకుంటుంది. హెక్టారుకి 40 టన్నులు దిగుబడినిస్తుంది.పెండలం (శబరి): దుంపలు పొడవుగా పెరిగి పై తోలు ముదురు గోధుమ వర్ణంలో, కండ మీగడ వర్ణంలో ఉంటుంది. దుంపలు మంచి నాణ్యత కలిగి, చిప్స్ తయారీకి పనికొస్తాయి. 25 – 30 శాతం పిండి పదార్ధం ఉంటుంది. ఆకుమచ్చ తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. హెక్టారుకి 45 – 50 టన్నుల దిగుబడినిస్తుంది. తోట కూర (వర్ణ) : ఆకులు మధ్య భాగాన ఊదా రంగు కలిగి ద్వివర్ణంలో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆంధోసైనిన్ వర్ణ పదార్ధాన్ని (61.55 మి.గ్రా/ 100గ్రా) కలిగి ఉంటాయి. మొక్కలు ఆలస్యంగా పూతకు రావడం వల్ల నాటిన 60 రోజులలో 3 సార్లు కోతకు వస్తుంది. మొక్కలు త్వరగా పెరుగుతాయి. ఏడాది పొడవునా పండించేందుకు వీలైన రకం. హెక్టారుకి 25 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. నిమ్మ (వకుళ): చెట్టు మధ్యస్థంగా ఎదిగి, అధిక సాంద్రత పద్ధతిలో సాగుకు అనువైన రకం. త్వరగా కాపుకు వచి్చ, కాయలు గుత్తులుగా కాస్తుంది. కాయలు సగటున 45 గ్రాముల బరువుతో, 45 శాతం రసం కలిగి తోలు మందంగా మెరుపును కల్గి ఉంటుంది. పచ్చళ్ళకు అనువైన రకం. బాక్టీరియా గజ్జి తెగులును తట్టుకుంటుంది. హెక్టారుకి 39 టన్నుల దిగుబడినిస్తుంది. జీడిమామిడి (బీపీపీ–10): గుత్తి కాపుతో అధిక దిగుబడినిచ్చే రకం. గింజ పెద్దదిగా (8.1 గ్రా) ఉండి, అధిక పప్పు (29.3%), ఎక్స్పోర్ట్ గ్రేడు (డబ్ల్యూ 210) రకం. అధికంగా ద్విలింగ పుష్పాలను (55.21 %) ఇవ్వడమే కాకుండా ద్విలింగ పుష్పదశ ముందుగా ఉంటుంది. సగటున చెట్టుకి 21 కిలోల దిగుబడి వస్తుంది. ఆకు, పూత, గింజలనాశించే పురుగులను తట్టుకుంటుంది.జీడిమామిడి (బీపీపీ–11): త్వరగా కాపునిచ్చే గుత్తికాపు రకం. పూత, కాయ దశలో నీటి ఎద్దడిని తట్టుకొనే రకం. అధిక సాంద్రతలో నాటడానికి అనువైనది. మధ్యస్థ గింజ పరిమాణం (6.8 గ్రా.), ఒత్తైన పుష్ప గుచ్ఛాలతో, అధిక పప్పు దిగుబడి (28.5%)ని ఇవ్వగల ఎక్స్పోరŠట్ట్ గ్రేడ్ (డబ్ల్యూ 240) రకం. చెట్టు సగటు దిగుబడి 17 కిలోలు. ఆకు, పూత, గింజలనాశించే చీడపీడలను తట్టుకుంటుంది. తమలపాకు (స్వర్ణకపూరి): కొమ్మలు, తీగలు ఎక్కువగా ఉండి, అత్యధిక పెరుగుదల సామర్థ్యాన్ని కలిగిన రకం. పెద్దగా, మృదువైన, లేత ఆకుపచ్చ రంగు ఆకులతో, పొడవైన కాడలు కలిగి ఎగుమతికి అనువైన రకం. స్థానిక రకాలకంటే 20 నుంచి 25 శాతం అధిక దిగుబడి ఇస్తుంది. హెక్టారుకు 53,820 పంతాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఫైటోప్తెరా మొదలు కుళ్ళు తెగులును మధ్యస్తంగా తట్టుకోగలదు. సంకరీకరణలో, సంవత్సరం పొడవునా పుషి్పంచే వంగడం. వాము (లామ్ ఆజవాన్–2): మొక్కలు ఒక మీటరు పొడవుతో అధిక కొమ్మలు, పువ్వులను కలిగి ఉంటాయి. 145 – 175 రోజుల పంటకాలంతో అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక రకం. ఖరీఫ్‌కు అనుకూలం. అధిక నూనె శాతం (3–4%), సువాసన ఉంటాయి. వర్షాధార పంటగా హెక్టారుకి 6 నుంచి 13 క్వింటాళ్లు, నీటి పారుదల పంటగా 12 నుంచి 15 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. ఖరీఫ్ సీజన్లో వాతావరణ పరిస్థితులను బట్టి స్థానిక రకాలపై 30 నుంచి 60 శాతం ఎక్కువ దిగుబడులు ఇస్తుంది.చింత (తెట్టు అమలిక) : నాటిన తర్వాత 70–80 ఏళ్ల వరకు కాపునిస్తుంది. 20 ఏళ్ల వయసున్న చెట్టు ఏడాదికి సరాసరి 150 – 220 కిలోల దిగుబడినిస్తుంది. కాయలు 50–56 శాతం గుజ్జుతో పెద్దగా, వెడల్పుగా కొద్దిగా వంకర తిరిగి చివర్లు గుండ్రంగా వుంటాయి. గుజ్జు మందంగా, మెత్తగా, ముదురు గోధుమ రంగులో ఉంటుంది. చింత (అనంత రుధిర): అన్ని ప్రాంతాలకు అనువైన, క్రమం తప్పక అధిక దిగుబడినిచ్చే రకం. గుజ్జు (43.3%) ఆకర్షణీయమైన ఎరుపు రంగులో, ఆంథోసైనిన్ వర్ణ పదార్థం అధికంగా కల్గి ఉంటుంది. ఎరుపు రంగు గుజ్జు కలిగి ఉండటం వలన ఊరగాయలు, క్యాండీ, జామ్, సిరప్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అనువైన రకం. పచ్చి కాయల్లో బీటాకెరోటిన్ (188.23 మైక్రో గ్రాము/100గ్రా) అధికంగా ఉంటుంది. 10 ఏళ్ల వయస్సులో చెట్టుకి 50–60 కిలోలు, 20 ఏళ్ల వయసున్న చెట్లు 150 నుంచి 220 కిలోల దిగుబడినిస్తాయి. రైతుల ఆదాయం పెంచే రకాలు వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 18 వంగడాలను జాతీయ స్థాయిలో విడుదల చేయడం గర్వంగా ఉంది. జాతీయ స్థాయిలో మన మిరపకున్న ప్రాముఖ్యత దృష్ట్యా మిరపలో జెమిని వైరస్‌ను తట్టుకునే క్రాంతి, చైత్ర, తన్వి రకాలు దేశీయ మార్కెట్లో రైతులకు అందుబాటులోకి రాబోతున్నాయి. చింత, నిమ్మ రకాలు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఎంతగానో ఉపయోగకరం. విశిష్ట లక్షణాలు కలిగిన ఈ నూతన వంగడాలు రైతుల ఆదాయం పెంచడంలో కీలకంగా మారనున్నాయి. అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు. – డాక్టర్ తోలేటి జానకీరామ్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం -
పూల రంగులు మార్చేయండి
సాక్షి, అమరావతి: పెళ్లిళ్లు.. వేడుకల్లో భారీగా వినియోగించే పూలను ఒకే రంగులోకి మార్చాలంటే టింటింగ్ పద్ధతి మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. ఈ పద్ధతిలో ఒక్కొక్క పువ్వును మాత్రమే రంగు మార్చాల్సి వస్తోంది. ఇలా చేయడం చాలా కష్టతరమైన పని. ఒకేసారి అన్ని పూల రంగును సులువుగా మార్చేందుకు ఇంతవరకు ఎలాంటి పద్ధతి కనుగొనలేదు. ప్రపంచంలోనే తొలిసారి ఈ సమస్యకు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తిరుపతిలో ఉన్న ఉద్యాన పరిశోధన స్థానం ఓ చక్కని పరిష్కారాన్ని కనుగొంది. పువ్వుల నుంచి ఇంకులను తయారు చేసి.. వాటితో విలువ ఆధారిత వస్తువులను తయారు చేసేందుకు పీహెచ్డీ విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా పూల ఇంకులను వినియోగించి ఒకేసారి మనకు నచ్చిన రంగులో భారీ ఎత్తున పూలను ఉత్పత్తి చేసుకునే విధానాన్ని కనుగొన్నారు. ఎలా తయారు చేస్తారంటే.. సేకరించిన పూలను మెత్తగా గ్రైండ్ చేస్తారు. ఆ తర్వాత ప్రకృతి సిద్ధంగా లభించే ద్రవ్యాలను జతచేసి మరోసారి గ్రైండింగ్ చేస్తారు. ఇలా వచ్చిన ద్రవ్యాలను వడగట్టి వాటి సహజతత్వం కోల్పోకుండా శీతలీకరణ చేయడం ద్వారా రంగు ద్రావణాన్ని తయారు చేస్తారు. ఎంపిక చేసిన తెలుపు రంగు పూలపై.. వాటిని కోసేందుకు ముందు ఆ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. స్ప్రే చేసిన వెంటనే పూల రంగు మనకు కావాల్సిన రంగులోకి సహజ సిద్ధంగా మారిపోతుంది. గంటసేపు ఆరిన తరువాత పువ్వుల్ని కోత కోసి నిల్వ చేసుకోవచ్చు. ఈ విధానంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో పూలను కావాల్సిన రంగులోకి మార్చుకునే వెసులుబాటు ఉంది. ప్రయోగం ఇలా.. తిరుమల శ్రీవారి సేవకు ఉపయోగిస్తున్న పూల నుంచి తయారు చేసిన రంగులతో కోతకు సిద్ధంగా ఉన్న తెల్ల రంగు చామంతి పూలపై ప్రయోగించి ఫలితాలను రాబట్టారు. కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటుందని గుర్తించారు. అలాగే పూర్ణిమ రకం చామంతి తోటలోని పూలపై ఇలా తయారు చేసిన పూల రంగును ప్రయోగాత్మకంగా పిచికారీ చేసి వాటి రంగు, తాజాదనాన్ని పరిశీలించారు. ఇది నూరు శాతం సహజసిద్ధంగా తయారవడంతోపాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపలేదని గుర్తించారు. వినియోగదారుల కోరిక మేరకు అవసరమైతే వారు కోరుకున్న సువాసనల కోసం సెంట్‌ను అద్దుకునే వెసులుబాటు సైతం ఉంది. ప్రస్తుతానికి తిరుమల శ్రీవారి సేవకు ఉపయోగించే పూలను ఉచితంగా సేకరిస్తున్నారు. వాడిన పూలను కొనుగోలు చేస్తే కిలోకు సుమారుగా రూ.10 ఖర్చవుతుంది. వీటి ద్వారా ఒక లీటర్ రంగు తయారీకి రూ.20 నుంచి రూ.50 వరకు ఖర్చవుతుంది. లీటర్ ద్రావణం 15–20 మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. ఒక ఎకరాకు 2 వేల లీటర్ల ద్రావణం అవసరమవుతుంది. మరింత విస్తృతంగా పరిశోధనలు జెక్స్ బెరా (వైట్), రోజా (వైట్) ఇతర రకాల పూలపై కూడా ప్రయోగాలు చేసేందుకు ఉద్యాన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పూల రంగులతో పెన్నుల తయారీపైనా పరిశోధనలు చేస్తున్నారు. రంగుల కోసం ప్రస్తుతం ఏ పూలను వినియోగిస్తున్నారంటే రోజా (మిరాబుల్ రెడ్), డెకరేషన్‌కు ఉపయోగించే బంతి (ఆరంజ్), చామంతి (ఎల్లో), తామర (పింక్, వైట్), ఆర్కిడ్స్ (సోనియా రకం పర్పల్ కలర్)ను ఉపయోగిస్తున్నారు. తోటల్లోని పూలపై స్ప్రే చేసినప్పుడు వాతావరణంలో తేమను బట్టి వాటి రంగులు మారే అవకాశం ఉందని గుర్తించారు. సాఫ్ట్ ల్యాండ్ స్కేపింగ్ ఇండస్ట్రీ, ఫ్లోరిస్ట్స్–బాక్వీ షాప్స్, ఇన్‌స్టంట్‌గా కలర్ చేంజ్ చేసి కస్టమర్ చాయిస్‌కు అనుగుణంగా బాంక్విట్స్ను ఇచ్చేందుకు ఉపయోగించవచ్చు. చాలా ఆనందంగా ఉంది రసాయనాలు కలపకుండా ప్రకృతిలో లభించే పూల నుంచే సహజ సిద్ధమైన రంగులను తయారు చేయవచ్చని నిరూపించాం. తద్వారా ఏక మొత్తంలో ఒకే రంగు పూలను తయారు చేసేందుకు వీలుగా నూతన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భాగస్వామి అయినందుకు చాలా ఆనందంగా ఉంది. – జగదీశ్వరి, పీహెచ్డీ విద్యార్థిని, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, తాడేపల్లిగూడెం పరిశోధన విజయవంతం పువ్వుల నుంచి ఇంకులను తయారు చేసి వాటి ద్వారా విలువ ఆధారిత వస్తువులను తయారు చేసే క్రమంలో పలువురు పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులు చేసిన ఈ తరహా ప్రయోగం సక్సెస్ అయ్యింది. 10 రోజుల్లో 8 వేల లీటర్ల ద్రావణం తయారు చేశాం. ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటివరకు సైడ్ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఇతర పూల విషయంలో ఈ తరహా ప్రయోగం చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోననే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. పూలకు సెంట్స్ యాడ్ చేసే విషయంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. – ఆర్.నాగరాజు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా స్థానం ఫ్లోరీ కల్చర్ ఇండస్ట్రీలో ముందడుగు ఫ్లోరీ కల్చర్ ఇండస్ట్రీలో ఇదో గొప్ప చారిత్రాత్మక ముందడుగుగా పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు ఇలా ఏక మొత్తంలో ఒక రంగు పూలను కావాల్సిన రంగులోకి మార్చుకునే సాంకేతికత ఎక్కడా లేదు. ఈ తరహా ప్రయోగం జరిగినట్టుగా జర్నల్స్‌లో కూడా ఎక్కడా లేదు. కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన పీహెచ్డీ విద్యార్థిని జగదీశ్వరి బృందంకు నా అభినందనలు. – టి.జానకీరామ్, వీసీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
డ్రై ఫ్లవర్ టెక్నాలజీ కళాకృతులకు విశేష ఆదరణ...
-
ఉద్యాన పంటలతో పోషకాహార భద్రత
తాడేపల్లిగూడెం: ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా పోషకాహార భద్రత లభిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ‘ట్రైబల్ హార్టికల్చర్’ (గిరిజన ఉద్యాన పంటలు) అనే అంశంపై రెండు రోజులు నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సు సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పంటలతోపాటు ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులు అ«ధిక రాబడులు పొందే అవకాశం ఉందన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ తోలేటి జానకీరామ్ మాట్లాడుతూ.. మన దేశంలో ఉద్యాన పరిశ్రమ 320 మిలియన్ టన్నుల ఉత్పత్తితో స్థూల జాతీయోత్పత్తిలో 33 శాతంగా ఉందన్నారు. కేంద్రీయ ఉష్ణ మండల ఉద్యాన పంటల కేంద్రం (లక్నో) డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ సింగ్ వర్చువల్‌గా గిరిజన ప్రాంతాల్లో లాభసాటిగా ఉద్యాన పంటల సాగుపై వివరించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులు సమర్పించిన 102 పరిశోధన పత్రాలపై ఈ సదస్సులో చర్చించారు. భారతీయ ఆయిల్ఫామ్ పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆర్కే మాధుర్ తదితరులు పాల్గొన్నారు. -
గుచ్చదు.. ఈ గులాబీ, లిసియాంతస్ పూలతో లాభాల గుబాళింపు
తాడేపల్లిగూడెం: లిసియాంతస్.. ముళ్లులేని గులాబీ పువ్వు. నీలం.. ఆకుపచ్చ.. పసుపు.. గులాబీ.. తెలుపు.. నీలం.. పికోటీ.. చాంపేన్. ఎన్నెన్నో రంగుల్లో ఉండే ఈ లిసియాంతస్ పువ్వుల్ని చూస్తే కళ్లు ఆనందంతో విప్పారతాయి. చూపు తిప్పనివ్వని సౌందర్యం వాటి సొంతం. ఏక రేకలైనా.. బహురేకలైనా.. ఆ పుష్పాల అందాలు మనసుల్ని దూదిపింజలా మార్చేస్తాయి. స్వప్నలోకంలో విహరింపజేస్తాయి. లిసియాంతస్ పువ్వులు గులాబీ పూలను పోలి ఉంటాయి కానీ.. వీటికి ముళ్లు మాత్రం ఉండవు. రెండు నుంచి మూడు వారాలకు పైగా వాడిపోవు. వీటి సాగు ప్రయోగం మన రాష్ట్రంలో ఫలిస్తే.. కృషీవలులకు లాభాల గుబాళింపేనంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన వర్సిటీ ఉప కులపతి డాక్టర్ తోలేటి జానకిరామ్. ఈ పూల విశేషాలేమిటో.. సాగు ప్రయోగం ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దామా. సమ శీతోష్ణ వాతావరణంలోనూ.. లిసియాంతస్ సాగుకు శీతల వాతావరణం అవసరం. సమశీతోష్ణ వాతావరణంలోనూ లిసియాంతస్ పెరుగుతుందని రుజువు కావడంతో రావడంతో రక్షిత సాగు పద్ధతిలో హైటెక్ పాలీహౌస్, ఫ్యాన్, పాడ్ పాలీహౌస్, కూలింగ్, మిస్ట్ చాంబర్లలో వీటిని పెంచుతున్నారు. తమిళనాడులోని ఊటీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోనూ ఇప్పటికే వీటిని సాగు చేస్తున్నారు. పాలీ హౌస్‌లలో సాగు చేసే ఈ పుష్పాలకు వాణిజ్య విలువలు అధికం. ఎగుమతికి అనుకూలమైనవి. అందుకే.. ఇది మంచి లాభదాయకమైన ఉద్యాన పంట. మన దగ్గరా కొన్ని ప్రాంతాలు అనుకూలమే! గులాబీ మాదిరిగా అంటు పద్ధతిలో కాకుండా విత్తనాలు చల్లి సాగు చేసుకోవచ్చు. వీటి సాగుకు మన రాష్ట్రంలోనూ కొన్ని ప్రాంతాల వాతావరణం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక విత్తన కంపెనీ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఉద్యాన పరిశోధన స్థానం ద్వారా ప్రయోగాత్మకంగా సాగు చేయించేందుకు వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సమాయత్తమవుతోంది. గతంలో చింతపల్లి కేంద్రంలో సిమ్లా యాపిల్‌ను ప్రయోగాత్మకంగా పండించారు. లిసియాంతస్ సాగుకు ఈ పరిశోధన స్థానం బాగుంటుందని సకాటా సీడ్స్ సంస్థ ప్రతినిధులు గుర్తించారు. అరుదైన ఆర్కిడ్స్ పూల సాగు కోసం ఈ కేంద్రంలో విశిష్ట రక్షిత సాగు కేంద్రం ఉంది. ఇక్కడే లిసియాంతస్ పువ్వుల సాగుకు త్వరలో శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గత నెలలో ఉద్యాన వర్సిటీలో ఉప కులపతి డాక్టర్ జానకిరామ్ పర్యవేక్షణలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ మెన్ అసోసియేషన్, పాలీహౌస్ ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ పూల సాగుపై ఔత్సాహిక రైతులకు రైతులకు అవగాహన కల్పించారు. ప్రేమకు ప్రతీకగా.. ప్రపంచంలోనే అందమైన పువ్వులుగా పేరున్న లిసియాంతస్ పుష్పాలను ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. జెంటియన్ కుటుంబానికి చెందిన ఈ పువ్వును టెక్సాస్ బ్లూబెల్గా కూడా పిలుస్తారు. ఇకో, డబులిని, రోసిత, ఎక్స్కలిబర్, మరయాకి, రోసిత రోసన్నో, వోయేజ్, అబూ రోసిత పేర్లతోనూ లిసియాంతస్ను పిలుస్తున్నారు. బొకేలు, పూల అలంకరణకు అనుకూలమైన ఈ పుష్పాలు పువ్వులు ఏక, బహుళ రేకలతో గులాబీ, కామేలియా ఆకారంలో వైవిధ్యంగా ఉంటాయి. ఆసియా ఖండంలో 50 ఏళ్ల క్రితమే ప్రాచుర్యం పొందిన ఈ పువ్వులు మృదువైన రేకలతో అలరిస్తాయి. ఒకటి లేదా రెండు మూడు జతల నారు మొక్కలను కలిపి నాటుకోవచ్చు. నేల శుద్ధీకరణ, ఆవిరి శుద్ధీకరణ, హాట్ వాటర్ స్టెరిలైజేషన్ పద్ధతిలో నారు తయారీకి సమాయత్తం కావచ్చు. వీటికి ఎక్కువ ఎరువులు అవసరం లేదు. కాల్షియం నైట్రేట్ ఆధారిత ఎరువులు స్వల్పంగా వాడితే చాలు. త్వరలోనే ప్రయోగాలు అపురూపమైన లిసియాంతస్ పువ్వులను వాడుకలోకి తెచ్చే క్రమంలో వీటి సాగుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఇందుకు సంబంధించి సకాటా సీడ్స్ సంస్థతో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టాం. వీటి సాగుకు చింతపల్లి పరిశోధన స్థానం అనుకూలమని సీడ్స్ సంస్థ ప్రతినిధులు పరిశీలనకు వెళ్లి వచ్చిన తర్వాత చెప్పారు. పుష్పాల సైకిల్‌ను పరిశీలించడానికి ప్రయోగం చేయనున్నాం. ఈ ప్రయత్నం విజయవంతమైతే రైతులకు లాభాల పంట అందుబాటులోకి వస్తుంది. –డాక్టర్ తోలేటి జానకిరామ్, వైస్ చాన్సలర్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
విదేశీ మారకద్రవ్యం పెంచేలా పరిశోధనలు
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తుల సాగులో మరింత స్వయం సమృద్ధి సాధించాల్సిన ఆవశ్యకత ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (ఐఐపీఎం) డైరెక్టర్ రాకేష్ మోహన్‌జోషి అన్నారు. దిగుమతులను తగ్గించి, విదేశీ మారక ద్రవ్యం పెంచేందుకు ఎగుమతులను ప్రోత్సహించేలా పరిశోధనలు సాగాలన్నారు. గుంటూరు లాంలోని ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. మన దేశంలో నూటికి 60 శాతం మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అదే అమెరికాలో 3–4 శాతం మంది, న్యూజిలాండ్‌లో 3–5 శాతం మంది మాత్రమే ఈ రంగంపై ఆధారపడ్డారని చెప్పారు. మన దేశ మార్కెట్లోకి వచ్చే ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల్లో మెజార్టీ వాటా అమెరికాదేనన్నారు. ఆర్బీకేల సేవలు అమోఘం ఏపీలో రైతు భరోసా కేంద్రాలు సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు అందించడంతో పాటు పరిశోధనా ఫలితాలు క్షేత్ర స్థాయిలో రైతులకు చేరవేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని జోషి కొనియాడారు. ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీ ఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ పరిశోధనాలయాలు రైతుల పాలిట దేవాలయాలని పేర్కొన్నారు. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ టి. జానకిరామ్ తదితరులు మాట్లాడారు. -
వంగడాలకు ఊపిరి..
ఉద్యాన విత్తనం వ్యవసాయ క్షేత్రాల్లో సిరులు పండిస్తోంది.. రైతును రాజును చేస్తూ వారి గోతాల్లో విత్తం నింపుతోంది.. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో 2007లో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతన వంగడాలకు ఊపిరి పోస్తోంది. రాష్ట్రంలోని ఉద్యాన రైతులకే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులకు లాభాల పంట పండించేందుకు ఈ వంగడాలు ఉపయోగపడుతున్నాయి. తాడేపల్లిగూడెం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన వెంకట్రా మన్నగూడెంలోని ఉద్యాన వర్సిటీ దేశంలోనే రెండోది కావడం గమనార్హం. ఉద్యాన రైతులకు జవసత్వాలు నింపుతూ చీడపీడలను తట్టుకుని, అధిక దిగుబడులు ఇచ్చేలా విత్తనాలను ఇక్కడ రూపొందిస్తున్నారు. వర్సిటీ పరిధిలోని 20 పరిశోధనా స్థానా ల్లో చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైతుల మేలు కోసం నేలసారానికి అనుగుణంగా మొలకెత్తడం, తెగుళ్లను తట్టుకోవడం, వాతావరణ ప్రతికూల ప్రభావాలను తట్టుకోవడం, టిష్యూ కల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్‌కు అనువుగా ఉండేలా విత్తనాలను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకూ 14 రకాల ఉద్యాన పంటలకు సంబంధించి విడుదల చేసిన 23 వంగడాలు దేశంలో, రా ష్ట్రంలో రైతులకు లాభాల పంటను పండిస్తున్నాయి. ఉద్యాన వర్సిటీ వంగడాలను అందించడంతో పాటు ఆగ్రోటెక్నిక్స్, ప్లాంట్ ప్రొటెక్షన్, పోస్టు హార్వెస్టు టెక్నాలజీ పద్ధతులను రైతులకు చేరువ చేస్తోంది. 2017లో అధికారికంగా బయట ప్రపంచంలోకి వచ్చి న ఉద్యాన వంగడాలు ఐదేళ్లుగా రైతులకు ఎనలేని ప్రయోజనాలు కలిగిస్తున్నాయి. ఉద్యాన విద్యకు పెద్దపీట రాష్ట్రంలో 20 ఉద్యాన పరిశోధనా స్థానాలు కలిగి ఉన్న వర్సిటీలో ఉద్యాన విద్యకు పెద్దపీట వేస్తు న్నారు. నాలుగు ఉద్యాన కళాశాలలు, నాలుగు ప్రైవే ట్ ఉద్యాన కళాశాలలు, నాలుగు ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్‌లు, నాలుగు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా విద్యకు ఉపకరించే అంశాలను బోధిస్తున్నారు. బీఎస్సీ హానర్స్ హార్టీకల్చర్, ఎమ్మెస్సీ హార్టీకల్చర్, పీహెచ్‌డీలో ప్రత్యేకంగా ఫ్రూట్ సైన్స్, విజిటబుల్ సైన్స్, ప్లాంటేషన్ స్పైసెస్, మెడిసినల్ క్రాప్స్, ఫ్టోరీకల్చర్ లాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్, పోస్టు హా ర్వెస్టు టెక్నాలజీ, ప్లాంట్ పాథాలజీ, ఎంటమాలజీ కోర్సులను అందిస్తున్నారు. 13 రకాలు నోటిఫై ఉద్యాన వర్సిటీ ఊపిరిపోసిన 23 రకాల వంగడాల్లో 13 రకాలు నోటిఫై అయ్యాయి. వీటిని దేశవ్యాప్తంగా రైతులు వినియోగించవచ్చు. ఈ వంగడాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా వస్తాయి. నిరంతరం వంగడాల పరిశోధనలు సాగుతున్నాయి. ఒక కొత్త వంగడం విడుదల చేయాలంటే బహు వార్షిక పంటలకు 15 ఏళ్లు, ఏక వార్షిక పంటకు 8 ఏళ్లు పడుతుంది. కొబ్బరిలో నాలుగు, కర్ర పెండలం, ధనియాలు, పసుపు, చేమ, మిరపలో 620, 625, 111 మొదలైన 13 రకాలు నోటిఫై అయ్యాయి. – ఆర్వీఎస్కే రెడ్డి. ఉద్యాన వర్సిటీ పరిశోధన సంచాలకులు నిరంతర కృషి ఉద్యాన వర్సిటీ నుంచి నూతన వంగడాల విడుదలకు నిత్యం కృషి జరుగు తోంది. రాబోయే వంగడాలలో క్వాలిటీ డిసీజ్ ఫ్రీ ప్లాంటు మెటీరియల్, న్యూట్రిషన్ క్వాలిటీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కొబ్బరి విషయంలో అంబాజీపేటతో విజయరాయిలో కూడా సీడ్ లింక్స్ తయారు చేస్తున్నాం. – డాక్టర్ తోలేటి జానకిరామ్, ఉద్యానవర్సిటీ వీసీ -
ఉద్యాన విస్తరణకు డిజిటల్ సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) వన్‌స్టాప్ కేంద్రాలుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ స్ఫూర్తితో ఉద్యానరంగంలో డిజిటల్ విస్తరణ సేవలకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. విస్తరణ విభాగాన్ని బలోపేతం చేయడం ద్వారా వర్సిటీకి అనుబంధంగా ఉన్న 42 సంస్థలను ఆర్బీకేలతో అనుసంధానిస్తూ ‘రీచింగ్ ది అన్ రీచ్డ్’ అనే నినాదంతో పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలను అమలు చేస్తోంది. డిజిటల్ సమాచార వ్యవస్థను శాటిలైట్ సమాచార వ్యవస్థకు అనుసంధానం చేస్తూ పరిశోధనల ఫలితాలతో పాటు సాంకేతిక సమాచారాన్ని నేరుగా రైతులకు చేరవేస్తోంది. అందుబాటులోకి తీసుకొచ్చిన విస్తరణ సేవలిలా.. రైతు సలహా కేంద్రం ద్వారా వర్సిటీలోని 42 సంస్థలను అనుసంధానం చేసి సాంకేతికతను బదలాయిస్తున్నారు. ఫోన్ నంబరు 96180 21200 ద్వారా రైతులకు విస్తరణ సేవలతోపాటు నిరంతర సలహాలందిస్తున్నారు. మొక్కల పరిరక్షణ సలహా కేంద్రం (ప్లాంట్ ప్రొటెక్షన్ అడ్వైజరీ సెల్) ద్వారా వివిధ ఉద్యాన పంటలను ఆశిస్తున్న చీడపీడలపై నిఘా ఉంచుతూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఉద్యాన నైపుణ్య శిక్షణ కేంద్రంలో రైతులతో పాటు యువత, మహిళలకు నైపుణ్యతలో శిక్షణనిస్తున్నారు. అడ్వాన్స్ డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, పనస, తాటి, జీడిమామిడి తదితర పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్–విలువ జోడింపు, అడ్వాన్స్ నర్సరీ యాజమాన్యం, చిన్న తరహా పౌల్ట్రీ ఫామ్స్ నిర్వహణ, ఆక్వాసాగు, పుట్టగొడుగుల పెంపకం, జీవనియంత్రణ కారకాల ఉత్పత్తి–వాడకం వంటి విషయాల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ‘హార్టీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్’ ద్వారా ఉద్యాన, వ్యవసాయ పట్టభద్రులతోపాటు గ్రామీణ యువత, మహిళలను ఉద్యానరంగంలో వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కౌన్సెలింగ్, టెక్నికల్–బిజినెస్ మానిటరింగ్, కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెన్సీ, బిజినెస్ ప్లాన్ తయారీ, ఇంక్యుబేషన్, పైలెట్ స్కేల్ ప్రొడక్షన్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఆన్లైన్ శిక్షణ కేంద్రం ద్వారా వివిధ రకాల శిక్షణ ఇస్తున్నారు. ఇన్ఫర్మేషన్ కియోస్క్ ద్వారా ఉద్యానపంటల సాగు విధానాలు, సస్యరక్షణ చర్యలు, సాంకేతిక విధానాలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. రైతులతో వెబినార్లు, శాస్త్రవేత్తలతో ఫోన్ ఇన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యానవాణి–90.8 ఎఫ్ఎం (కమ్యూనిటీ రేడియో స్టేషన్) ద్వారా రోజు వాతావరణం, నెలవారీ ఉద్యానపంటల్లో చేపట్టాల్సిన చర్యలు, అవసరమైన సలహాలు సూచనలు ప్రసారం చేస్తున్నారు. వర్సిటీ కార్యక్రమాల వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు వాడే రైతుల కోసం అభివృద్ధి చేసిన వైఎస్సార్ ఉద్యానబంధు యాప్ ద్వారా 33 రకాల ఉద్యానపంటల సాగు సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ఇతర ప్రముఖ చానళ్ల ద్వారా ఫోన్ ఇన్ లైవ్, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 50కిపైగా పంటల వారీగా రైతులతో ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో శాస్త్రవేత్తలు, అధికారులు, ఆర్బీకే సిబ్బందిని భాగస్వామ్యం చేశారు. వీటిద్వారా రైతులతోపాటు గ్రామీణ యువత, మహిళలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వర్సిటీ అనుబంధ సంస్థలను ఆర్బీకేలతో అనుసంధానించారు. ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్, ఆర్బీకే చానల్ ద్వారా పరిశోధన ఫలితాలు, సాంకేతిక సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నారు. ఆధునిక ఎలక్ట్రానిక్ విభాగం ద్వారా నూతన సాంకేతిక విధానాలపై శాస్త్రవేత్తలు, çసంబంధిత నిపుణులతో రికార్డు చేసి ఆర్బీకేల్లోని స్మార్ట్ టీవీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆర్బీకేలకు అనుసంధానించాం గుణాత్మక విద్య, పరిశోధన ఫలితాలు రైతులకు చేరవేసే లక్ష్యంతో విస్తరణ విభాగాన్ని బలోపేతం చేశాం. వర్సిటీలోని 42 సంస్థల ద్వారా నిరంతరం ప్రత్యక్ష, అంతర్జాల మాధ్యమాల ద్వారా పలు సంప్రదాయ విస్తరణ కార్యక్రమాలను రైతులకు అందుబాటులో తీసుకొచ్చాం. శాస్త్ర, సాంకేతిక సమాచారం అందించడం ప్రధాన లక్ష్యంగా ఆర్బీకేలకు అనుబంధంగా ఇవి పనిచేస్తున్నాయి. – డాక్టర్ టి.జానకిరామ్, వైస్ చాన్సలర్ -
గిరి సీమల్లో సిరుల సేద్యం
కొండవాలు ప్రాంతాల్లో సంప్రదాయ పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న అడవి బిడ్డలు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తూ తమ సుస్థిరాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ పరిశోధనా ఫలితాలను పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం తరఫున వారికి అవసరమైన ఆర్థిక తోడ్పాటునిస్తోంది. దీంతో వారు సాగులో మెళకువలు, సాంకేతిక శిక్షణ పొందుతూ సంతృప్తికర స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుంటూ పిల్లలనూ బాగా చదివించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సాగులో సాధిస్తున్న విజయాలపై ప్రత్యేక కథనం.. సాక్షి, అమరావతి: సమగ్ర వ్యవసాయ విధానంలో వరి ఆధారిత పంట–పాడి–మత్స్య సాగు చేసేందుకు కృషి విజ్ఞాన కేంద్రం అడవి బిడ్డలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా జీడి మామిడి అంటు కట్టు విధానం, అపరాలు, చేపల సాగు, రబ్బర్, చిరు ధాన్యాలు, జీడి మామిడి ప్రాసెసింగ్, మేకలు, గొర్రెలు, పెరటి కోళ్లు, తేనెటీగలు, పుట్ట గొడుగులు, నర్సరీ పెంపకంతో పాటు పనసతో సహా వివిధ రకాల పంటల విలువాధారిత ఉత్పత్తులు, వర్మీ కంపోస్ట్ తయారీపై గడిచిన మూడేళ్లుగా గిరిజనులకిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాలిస్తున్నాయి. ఎంతలాగంటే.. మత్స్య సంపద ద్వారా 57 శాతం, వరి సాగు ద్వారా 24 శాతం, ఉద్యాన పంటల ద్వారా 5.13 శాతం, మేకల పెంపకం ద్వారా 4.8 శాతం ఆదాయాన్ని వీరు ఆర్జిస్తున్నారు. రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణతో ఏజెన్సీలో చిరుధాన్యాల సాగు రెండేళ్లలో గణనీయంగా పెరిగింది. వీటిని ప్రాసెస్ చేసి అమ్మడం ద్వారా గిరిజనులు ఏటా రూ.27వేల ఆదాయాన్ని అదనంగా ఆర్జించగలుగుతున్నారు. అలాగే.. ► రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు కేవీకే ద్వారా సాగులో మెళకువలపై అధికారులు రెండేళ్లుగా శిక్షణనిస్తూనే రబ్బర్ టాపింగ్, ప్రాసెసింగ్ పరికరాలు సమకూర్చుతున్నారు. దీంతో నేడు ఎగుమతి చేయదగ్గ నాణ్యమైన రబ్బర్ షీట్లను ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఆరునెలల పాటు సేకరించే రబ్బర్ పాల ద్వారా ఒక్కో రైతు రూ.2.5 లక్షలు ఆర్జిస్తున్నారు. తేనెటీగల పెంపకం యూనిట్లో ఉత్పత్తిని పరిశీలిస్తున్న గిరిజన రైతులు ► అటవీ ప్రాంతంలో విరివిగా లభించే అడ్డాకుల ద్వారా గిరి మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలన్న సంకల్పంతో మారేడుమిల్లి మండలం బోధగండి పంచాయతీ మంగంపాడు గ్రామంలో విస్తరాకుల పరిశ్రమను ఏర్పాటుచేశారు. ఫలితంగా నేడు ఒక్కో మహిళ రూ.3వేల పెట్టుబడితో నెలకు రూ.18వేలు ఆర్జిస్తోంది. ► పెరటి కోళ్ల పెంపకం ద్వారా మరింత ఆదాయం ఆర్జించేందుకు వీలుగా హైదరాబాద్‌లోని జాతికోళ్ల పరిశోధనా కేంద్రం నుంచి శ్రీనిధి, వనశ్రీ, వనరాజా, గాగస్, అశీల్, కడక్‌నాథ్ వంటి మేలు జాతి కోడి పిల్లలను అధికారులు తెప్పించి పంపిణీ చేస్తున్నారు. వీటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. ఇలా ప్రతిఏటా 2వేల కోళ్లను 200 గిరిజన మహిళలకు అందజేస్తుండడంతో ఇళ్ల వద్దే ఉంటూ గిరిజన మహిళలు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ► మేకలు, గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు హింగోలిలో కేవీకే అభివృద్ధి చేసిన అధిక వ్యాధి నిరోధకశక్తి కలిగిన ఉస్మానాబాది రకం మేకలను ఒక్కొకరికి మూడు చొప్పున ఇస్తున్నారు. 10–12 నెలల వయస్సు వరకు పెంచిన తర్వాత ఒక్కోదాన్ని రూ.8వేల నుంచి రూ.10వేల విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ► ఇక పనస విలువాధారిత ఉత్పత్తుల తయారిపైనా శిక్షణనివ్వడంతో గిరిజనులు ప్రతినెలా రూ.12వేల అదనపు ఆదాయం పొందుతున్నారు. ► తేనెటీగల పెంపకంపైనా శిక్షణనివ్వడంతో సొంత పొలాలతో పాటు అటవీ ప్రాంతంలో కూడా విలువాధారిత తేనె ఉత్పత్తును తయారుచేస్తున్నారు. తద్వారా ఏటా రూ.40 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ► అంతేకాదు.. పుట్ట గొడుగుల పెంపకం యూనిట్లను ఏర్పాటుచేసి పాల పుట్ట గొడుగులు, గులాబీ, తెలుపు ముత్యపు చిప్ప పుట్ట గొడుగుల పెంపకంపై తర్ఫీదు ఇస్తున్నారు. గిరిజన రైతులకు మేకల యూనిట్‌ను అందజేస్తున్న అధికారులు పెట్టుబడి పోనూ 50వేలు మిగులుతోంది నేను పదో తరగతి చదువుకున్నా. నాకున్న రెండున్నర ఎకరాల్లో వర్షాధారంపై ఆధారపడి కొర్రలు, రాగులు పండించి సంతలకుపోయి అమ్ముకుంటే పెట్టుబడి పోను రూ.17,500 మిగిలేది. ప్రభుత్వం మినీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను అందించింది. ప్రాసెసింగ్ చేసి ఎలా అమ్మాలో స్థానిక కేవీకే ద్వారా శిక్షణ పొందాను. ఇప్పుడు అదనంగా మరో రూ.32,300 ఆదాయం వస్తోంది. మొత్తం మీద రూ.49,800 మిగులుతోంది. – పల్లలబొజ్జ్డి నారాయణరెడ్డి, బొద్దగుంట, వై.రామవరం మండలం మేకల పెంపకంతో అదనపు ఆదాయం గతంలో నాలుగు ఎకరాల్లో వరి, మినుము, కందులు సాగుచేసేవాడిని. పంట పండితే నాలుగు డబ్బులు లేకుంటే పస్తులుండాల్సి వచ్చేది. స్థానిక కేవీకే ద్వారా ఉస్మానాబాదీ రకానికి చెందిన రెండు మేకలు, ఓ మేకపోతు తీసుకున్నా. ఈతకు రెండు పిల్లల చొప్పున ఏడాదికి నాలుగు పిల్లలు వస్తున్నాయి. మరోవైపు.. వ్యవసాయం ద్వారా ఏటా రూ.55వేల ఆదాయం.. ఏటా 3–4 మేకలను అమ్ముకోవడం ద్వారా అదనంగా మరో రూ.24వేలు వస్తోంది. – కంగల రామస్వామి దొర, ఐ.పోలవరం, రంపచోడవరం మండలం నెలకు రూ.11,500 ఆదాయం రెండేళ్ల క్రితం మాకు శ్రీనిధి, వనశ్రీ, గఘస్ కోళ్లను అందించారు. పొలం పనులు చేసుకుంటూ వాటిని పెంచుకుంటున్నా. ఏడాది వయస్సున్న కోడిని రూ.500 నుంచి రూ.600లకు అమ్ముతున్నా. గుడ్లు, కోళ్ల అమ్మకాల ద్వారా నెలకు రూ.11,500 నికర ఆదాయం వస్తోంది. – కాలుం రామతులసి, ఐ.పోలవరం, రంపచోడవరం మండలం సొంతంగా మార్కెటింగ్ మూడేళ్ల క్రితం తేనెటీగల పెంపకాన్ని చేపట్టా. శిక్షణ, సాంకేతిక సలహాలతో సొంత పొలంతో పాటు అటవీ ప్రాంతంలో తేనెటీగల పెంపకం యూనిట్లు పెట్టా. 3 నెలలకోసారి 60 కేజీల తేనె, 20 కేజీల మైనం తీస్తున్నా. వాటి ద్వారా నెలకు రూ.16వేల చొప్పున ఆర్జిస్తున్నా. గతేడాది నుంచి తేనె విలువా«ధారిత ఉత్పత్తులైన మురబ్బ, అల్లం తేనె, విప్పపువ్వు తేనేలతో పాటు మైనంతో తయారుచేసిన క్రాక్‌క్రీమ్, లిప్‌బామ్ వంటి ఉత్పత్తులను తయారుచేసి ‘గిరిమధుర నేచురల్ ప్రొడక్టŠస్’ పేరిట మార్కెటింగ్ చేస్తున్నా. – జగతా భావన కృష్ణ, రంపచోడవరం సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం ప్రభుత్వాదేశాల మేరకు గిరిజనుల్లో ఆదాయ వనురులను పెంపొందించడమే లక్ష్యంగా ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున విస్తరణ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం. మైదాన ప్రాంతాల్లో మాదిరిగానే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులను సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు శిక్షణతో పాటు ఆర్థిక తోడ్పాటునూ అందిస్తున్నాం. – డాక్టర్ టి. జానకీరామ్, వైస్ చాన్సలర్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, తాడేపల్లిగూడెం ఇంటి వద్దే జాతి కోళ్లు పెంచుకుంటున్న గిరిజనులు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామానికి చెందిన ఎం. సావిత్రి కుటుంబ సభ్యులు 13మంది సంఘంగా ఏర్పడి వరి, జీడి మామిడి పంటలు సాగుచేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో స్థానిక సామాజిక చెరువులో బొచ్చు, గడ్డిమోసు, శీలావతి వంటి చేçపలను సాగుచేస్తున్నారు. ఇలా ఏటా ఆహార ధాన్యాల ద్వారా రూ.34వేలు, కూరగాయల సాగు ద్వారా రూ.24 వేలు, మత్స్యసాగు ద్వారా రూ.73వేలు ఆర్జిస్తున్నారు. కడక్‌నాథ్, గాఘస్ కోళ్ల పెంపకం ద్వారా మరో రూ.16,800 ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి మండలం పందిరిమామిడి గ్రామానికి చెందిన కత్తుల సోమిరెడ్డి. గతంలో వీళ్లు 70మంది కలిసి కూరగాయలు పండిస్తే ఒక్కొక్కరికి రూ.7వేలకు మించి వచ్చేది కాదు. కానీ, ఇప్పుడు వీరంతా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రబ్బరు సాగు, ప్రాసెసింగ్‌లో శిక్షణ పొంది ప్రాసెసింగ్ యూనిట్ తీసుకున్నారు. ఇప్పుడు నాణ్యమైన రబ్బరును ఉత్పత్తి చేస్తూ ఓ సంఘంగా ఏర్పడ్డారు. కేరళ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఫలితంగా.. గడిచిన ఆర్నెల్లలో 1,200 కేజీల రబ్బరును ప్రాసెస్ చేసి ఎగుమతి చేయడంద్వారా ఒక్కొక్కరం రూ.2.5 లక్షలు ఆర్జించామని.. ఖర్చులు పోనూ ఒక్కో రైతుకు రూ.1.50 లక్షలు మిగులుతోందని సోమిరెడ్డి చెబుతున్నాడు. -
త్వరలో రెండు కొత్త నిమ్మ రకాలు
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ద్వారా రెండు కొత్త నిమ్మ రకాలను విడుదల చేయనున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ టి.జానకీరాం తెలిపారు. తిరుపతిలోని చీనీ, నిమ్మ పరిశోధన స్థానాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఇక్కడ అభివృద్ధి చేస్తున్న చీనీ, నిమ్మ మొక్కల నర్సరీని పరిశీలించారు. రైతులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఏఎల్–94–14, టీఏఎల్–94–13 అనే రెండు కొత్త నిమ్మ రకాలను రూపొందించామన్నారు. త్వరలోనే వీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఇందులో టీఏఎల్–94–14 రకం ఊరగాయ తయారీకి ఉపయోగకరమన్నారు. సీఎస్ఐఆర్ సంస్థ నుంచి పరిశోధన ప్రాజెక్ట్ లభించిందని, తిరుపతి పరిశోధన స్థానంలో ఈ ప్రాజెక్ట్ చేపడతామని చెప్పారు. వర్సిటీ ఈ ఏడాదిని చీనీ, నిమ్మ సంవత్సరంగా గుర్తించి ఈ పంటల సాగు విస్తీర్ణం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాది కాలంలో 1.5 లక్షల చీనీ, నిమ్మ మొక్కలను రైతులకు అందించినట్టు చెప్పారు. గుంటూరు లాం ఫామ్‌లో మిరప, అనంతరాజు పేట పరిశోధన స్థానంలో కనకాంబరం పూలపై పరిశోధనల కోసం రెండు సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ పరిశోధన సంచాలకులు ఆర్వీఎస్కే రెడ్డి, విస్తరణ సంచాలకులు బి.శ్రీనివాసులు, తిరుపతి చీనీ, నిమ్మ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఆర్.నాగరాజు పాల్గొన్నారు. -
ఉద్యాన వర్సిటీలో ఎన్ఆర్ఐ కోటా.. తొలిసారిగా అమలు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో తొలిసారి ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాలో బీఎస్సీ హార్టికల్చర్ హానర్స్ కోర్సులో అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులిచ్చారు. సీట్ల భర్తీ కోసం మార్గదర్శకాలు విడుదల చేశారు. మార్గదర్శకాలివే.. ► యూనివర్సిటీ కాలేజీల్లో 15% సీట్లను ఈ కోటా కింద మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ► ఈ కోటాలో సీట్లు పొందే వారికి రిజర్వేషన్లు వర్తించవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర రాయితీలు వర్తించవు. ► ఇంటర్లో 50 శాతం మార్కులు లేదా బైపీసీ, ఎంబైపీసీతో సమానమైన పరీక్షలో అర్హత పొంది ఉండాలి. ►విద్యార్థులు తప్పనిసరిగా పదో తరగతి, ఇంటర్మీడియట్ స్థాయిల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివి ఉండాలి. ►అడ్మిషన్ సమయంలో ఇంగ్లిష్‌లో ప్రావీణాన్ని తెలిపే ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్), టెస్ట్ ఆఫ్ ఫారిన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (టీవోఎఫ్‌ఈఎల్) సర్టిఫికెట్లను సమర్పించాలి. అలాగే.. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్, జనన ధ్రువీకరణ పత్రం, టీసీ, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్తో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ►సీటు పొందిన వారు ప్రతీ ఏటా 3500 యూఎస్ డాలర్లు ఇన్స్టిట్యూషనల్ ఫీజు కింద చెల్లించాలి. హాస్టల్, ఇతర ఫీజులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ►సీటు పొందిన ప్రతి విద్యార్థి గ్రూప్ హెల్త్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్ (యువరక్ష) ప్రీమియం చెల్లించాలి. ►ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పొందిన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధీనంలో ఉన్నట్టుగా ధ్రువీకరణ పత్రం, స్పాన్సర్ కోటాలో సీటు పొందే వారికి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారి పాస్‌పోర్ట్, వీసా నకలు సమర్పించాలి. -
కొత్త వంగడాల రూపకల్పనలో వైఎస్సార్ వర్సిటీ రికార్డు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొత్త రకాల వంగడాలను అభివృద్ధి చేయడంలో అరుదైన రికార్డు నెలకొల్పింది. వర్సిటీ అభివృద్ధి చేసిన 13 కొత్త ఉద్యాన వంగడాలను కేంద్రం నోటిఫై చేసింది. ఇంతకుముందు వర్సిటీ అభివృద్ధి చేసిన 16 వంగడాలకు ఇప్పటికే గుర్తింపు లభించగా.. తాజాగా నోటిఫై చేసిన 13 వంగడాలతో కలిపి యూనివర్సిటీ ఏర్పడ్డాక 13 ఏళ్లలో మొత్తంగా 29 నూతన ఉద్యాన వంగడాలను రైతుల ముంగిటకు చేర్చి రికార్డు సృష్టించింది. ఒకేసారి ఇన్ని వంగడాలను అభివృద్ధి చేయడం, వాటిని కేంద్రం నోటిఫై చేయడం దేశంలోని వ్యవసాయ, ఉద్యాన యూనివర్సిటీల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. 2007లో ప్రస్థానం మొదలై.. ఉద్యాన పంటల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెం వద్ద ఉద్యాన యూనివర్సిటీని నెలకొల్పారు. 19 పరిశోధనా కేంద్రాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాలు, 4 ఉద్యాన కళాశాలలు, 4 ఉద్యాన పాలిటెక్నిక్‌లు, 4 అనుబంధ ఉద్యాన కళాశాలలు, 7 అనుబంధ ఉద్యాన పాలిటెక్నిక్‌లతో విస్తరించింది. అధిక దిగుబడులనిచ్చే కొత్త రకాల వంగడాల రూపకల్పన, సమర్థ యాజమాన్య పద్ధతులపై పరిశోధనలు చేయడం ద్వారా ఈ యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే మిరపలో 5, ధనియాలులో 7, మెంతులులో 1, చామలో 2, కందలో ఒకటి చొప్పున కొత్త వంగడాలను వర్సిటీ అభివృద్ధి చేసింది. వీటిని గతంలో కేంద్రం నోటిఫై చేయగా.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇవి సాగులో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. 90 శాతం సుగంధ ద్రవ్యాలు, 60 శాతం మిరప, కొబ్బరి హైబ్రీడ్ రకాలు విస్తరించడం వర్సిటీ పరిశోధనల ఫలితమే. తాజాగా వర్సిటీ పరిశోధనా కేంద్రాల్లో రెండేళ్ల క్రితం అభివృద్ధి చేసిన 23 వంగడాలను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు పంపింది. వాటిలో 13 వంగడాలు సాగుకు యోగ్యమైనవిగా గుర్తించిన భారత ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసింది. భవిష్యత్‌లో సాగు విస్తరణ కార్యక్రమాల్లో అందించే రాయితీలు, ప్రోత్సాహకాలను ఈ కొత్త వంగడాలకు కూడా వర్తింపచేస్తారు. ఈ గుర్తింపు ఉద్యాన రంగంలో మరిన్ని పరిశోధనలకు, ఏపీని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిస్తుంది. సాంకేతికతను బదలాయించేందుకు చర్యలు ఈ నూతన రకాలు సాంద్ర పద్ధతిలో అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు ఎంతగానో అనుకూలం. వీటి సాంకేతికతను వాణిజ్య పరంగా వివిధ సంస్థలకు బదలాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ టి.జానకిరామ్, ఉప కులపతి, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ అందుబాటులోకి కొత్త రకాల విత్తన మొక్కలు పురుగులు, తెగుళ్లను తట్టుకుని నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే రకాలివి. తాజాగా విడుదల చేసిన విత్తన మొక్కలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి, పరిశోధన సంచాలకులు, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
ఒకే పొలం.. ప్రతి నెలా ఆదాయమే!
ఒకే భూమిలో అడుగడుగునా ఆదాయం పొందేలా సమీకృత వ్యవసాయం వైపు అన్నదాతలు అడుగులు వేస్తున్నారు. ఏడాది పొడవునా ప్రతినెలా ఆదాయం ఆర్జిస్తూ తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుంటున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాల రైతులు సమీకృత వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నారు. కొద్దిపాటి భూమిలోనే అందుబాటులో ఉన్న సహజ వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పాడి పశువులు, సన్న జీవాలు, పెరటి కోళ్లు, తేనెటీగలు, పుట్ట గొడుగులు, చేపలు పెంచుకుంటూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న ఈ తరహా సాగుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుండగా.. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ సాంకేతికంగా సహకారం అందిస్తోంది. 2016లో గిరిజన గ్రామాలైన పండుగూడెం, బండార్లగూడెంలో 4 క్షేత్రాల్లో పరిచయం చేసిన సమీకృత వ్యవసాయం ఇప్పుడు 89 క్షేత్రాలకు విస్తరించింది. – సాక్షి, అమరావతి బహుళ ఆదాయ పంటలు: అందుబాటులో ఉన్న భూమిని (3 ఎకరాలు) 5 భాగాలుగా విభజించి సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో వరి, చిరు ధాన్యాలు, పప్పు, నూనె గింజలు సాగు చేస్తూ కుటుంబానికి ఆహార భద్రత కల్పించుకుంటున్నారు. పావు ఎకరంలో బహుళ వార్షిక పశుగ్రాసాలను, మరో పావు ఎకరంలో పప్పుజాతి పశు గ్రాసాలు సాగు చేస్తున్నారు. అర ఎకరంలో ఉద్యాన పంటలు, వాటిలో అంతర పంటలుగా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. మరో అర ఎకరంలో మూగజీవాలు, కోళ్ల పెంపకం కోసం షెడ్లు, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసుకోగా, మిగిలిన భూమిలో వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. వరి పొలం చుట్టూ తీసిన కందకంలో 1,000 నుంచి 1,500 వరకు చేపలను పెంచుతున్నారు. చెరువు చుట్టూ పండ్ల చెట్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇవి కాకుండా పాడి పశువులు, మేకలు, గొర్రెలు, పెరటి కోళ్లు, బాతులు, కముజు పిట్టలు, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంతో అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇలా 3 ఎకరాల్లో సమీకృత వ్యవసాయం ద్వారా నికరంగా రూ.3.60 లక్షల నుంచి రూ.4.20 లక్షల ఆదాయం లభిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తోంది నాకు నాలుగెకరాలు ఉంది. రెండెకరాల్లో వరి వేశాం. మరో ఎకరంలో మిర్చి సాగు చేస్తున్నాం. ఎకరంలో చేపల చెరువు వేశాం. మొదటి పంట వరి, రెండో పంట మొక్కజొన్న వేస్తాం. రెండూ ఎకరాకు 30 బస్తాల చొప్పున దిగుబడి ఇస్తున్నాయి. పాడి గేదెలు, మూడు గొర్రెలు ఇచ్చారు. వాటిద్వారా రూ.50 వేల వరకు ఆదాయం వస్తోంది. చేపల ద్వారా రూ.లక్ష ఆదాయం వచ్చింది. కోళ్ల ద్వారా ఏటా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వస్తోంది. – మడకం వీరాస్వామి, ఎర్రాయి గూడెం, పశ్చిమ గోదావరి ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం సన్న, చిన్నకారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. ముందుకొచ్చే రైతులకు కేవీకేల ద్వారా శిక్షణనిస్తున్నాం. చేపలు, పాడి గేదెలు, కోళ్లు, వాటికి మేత అందిస్తున్నాం. ఏడాది పొడవునా ఆదాయం ఆర్జిస్తున్నారు. – డాక్టర్ తోలేటి జానకిరామ్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ చదవండి: చక్కనైన ఓ చిరుగాలి -
వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది..
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి మేలు కలిగేలా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంకలనం చేసిన ఉద్యాన పంటల పంచాంగం ఆవిష్కరణ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఆర్థిక ప్రయోజనాలు, ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కలిగించేలా మన వ్యయసాయ పద్దతులుండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమతమని, అందుకు తగ్గట్టుగా మనందరం కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యాన సాగులో ఆరోగ్యానికి మరింతగా ఉపకరించే కొత్త పంటలను ప్రోత్సాహించాలని, పురుగు మందులు, రసాయనాల వినియోగం తగ్గిస్తూ అధిక దిగుబడి వచ్చేలా పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాలని శాస్త్రవేత్తలకు సూచించారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయానికి, మన రాష్ట్ర ఉద్యాన పంటల ఉత్పత్తలకు జాతీయ స్థాయిలో ఉన్నత గుర్తింపు ఉందని, ఈ గుర్తింపును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉన్నతికి ఉప కులపతి డా జానకి రామ్, వారి శాస్త్రవేత్తల బృందం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. 98 ఉద్యాన పంటల సమగ్ర సమాచారంతో రైతులకు సులువుగా అవగాహన కలిగించేలా ఉద్యాన పంటల పంచాంగం రూపొందించారని మంత్రి ప్రశంసించారు. ఉద్యాన పంచాంగ పుస్తకాలు ప్రతి ఆర్బీకేలో ఉండేలా చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయ అధికారులకు సూచించారు. ఉద్యాన పంటల సాగుపై నిర్వహిస్తున్న "తోటబడి" శిక్షణా కార్యక్రమాల్లో ఉద్యాన శాస్త్రవేత్తలు మరింత శ్రద్ధ చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డా పూనమ్ మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్, ఉప కులపతి డా జానకి రామ్ తదితర అధికారులు పాల్గొన్నారు. చదవండి: రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన -
కొబ్బరి దింపు.. ఉండదిక జంకు
సాక్షి, అమరావతి: కొబ్బరి చెట్టు నుంచి కాయల్ని కోసి నేలకు దించే (కొబ్బరి దింపు) విషయంలో రైతులు పడే వెతలు అన్నీఇన్నీ కావు. కొబ్బరి దింపు కార్మికులకు ఆదాయం తక్కువగా ఉండటం.. దింపు సమయంలో తరచూ ప్రమాదాల బారిన పడుతుండటంతో ఈ వృత్తిలోకి కొత్తగా వచ్చే వారు ఉండటం లేదు. దీనివల్ల రైతులకు కొబ్బరి దింపు తలకు మించిన భారంగా మారింది. దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ సమస్యకు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అంబాజీపేట ఉద్యాన పరిశోధనా కేంద్రం పరిష్కారం చూపుతోంది. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం చూపుతోంది. ‘కొబ్బరి వృక్షమిత్ర’ పేరిట శిక్షణ కొబ్బరి చెట్టుపైకి సునాయాసంగా ఎక్కగలిగే పరికరాన్ని కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీబీడీ) రూపొందించింది. ఈ పరికరం ఆధారంగా కొబ్బరి చెట్లు ఎక్కడం, కాయల్ని కోసి దించడంపై అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం ‘కొబ్బరి వృక్షమిత్ర’ పేరిట శిక్షణ ఇస్తోంది. 18–45 ఏళ్ల మధ్య వయసు కలిగి 7వ తరగతి వరకు చదివిన యువతీ, యువకులను కొబ్బరి వృక్ష మిత్రలుగా తీర్చిదిద్దుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ చెట్లు ఎక్కడం, కాయలు దెబ్బతినకుండా నేలకు దించడం, కొబ్బరి తోటల్లో తెగుళ్ల నివారణ, ఎరువులు, పురుగుల మందుల ఉత్తమ యాజమాన్య పద్ధతులపై తర్ఫీదు ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 20 మందికి చొప్పున 6 రోజుల పాటు ఇస్తున్న శిక్షణ కోసం ఉద్యాన వర్సిటీ రూ.1,06,500 ఖర్చు చేస్తోంది. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్తో పాటు రూ.2,500 విలువ గల చెట్టు ఎక్కే పరికరాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 26 బ్యాచ్‌లుగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పట్టణానికి చెందిన 520 మందికి ఇక్కడ శిక్షణ ఇచ్చారు. తాజాగా అంబాజీపేట పరిశోధనా కేంద్రం సహకారంతో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, విశాఖ జిల్లా అచ్యుతాపురం, చిత్తూరు జిల్లా కలికిరి, కృష్ణా జిల్లా గరికిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా (కేవీకే) శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. దింపు కార్మికులకూ పెరుగుతున్న ఆదాయం సాధారణంగా సంప్రదాయ కొబ్బరి దింపు కార్మికులు రోజుకు 30నుంచి 40 చెట్ల కాయల్ని దించగలరు. అదే శిక్షణ పొందిన వృక్ష మిత్రలైతే 70నుంచి 80 చెట్ల కాయలను దించగలుగుతున్నారు. సంప్రదాయ దింపు కార్మికులు రోజుకు రూ.300 సంపాదిస్తుండగా.. వృక్షమిత్రలు రోజుకు రూ.500 కంటే ఎక్కువ సంపాదించగలుగుతున్నారు. శిక్షణ పొందాలనుకుంటే.. ఆసక్తి గల నిరుద్యోగులు ఎంతమంది ముందుకొచ్చినా శిక్షణ ఇచ్చేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉంది. శిక్షణ పొందగోరే అభ్యర్థులు అంబాజీపేటలోని ఉద్యాన పరిశోధన కేంద్రం ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్ 08856–243847 లేదా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు (సెల్: 83095 38808)ను సంప్రదించవచ్చు. అభ్యర్థులకు సమీపంలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. స్థానికంగా ఉపాధి పొందగోరే యువత మాత్రమే కాకుండా కొబ్బరి తోటలు పెంచే రైతులు సైతం శిక్షణ పొందవచ్చు. నేనే దింపు తీసుకుంటున్నా నాకు మూడెకరాల కొబ్బరితోట ఉంది. దింపు సమస్యతో చాలా ఇబ్బందిపడే వాడిని. అంబాజీపేట కేంద్రంలో శిక్షణ పొందా. ఇప్పుడు కార్మికులపై ఆధారపడకుండా నా తోటలో నేనే స్వయంగా కాయలు దింపుకోగలుగుతున్నా. దీనివల్ల నెలకు రూ.2 వేలకు పైగా మిగులుతోంది. – మట్టపర్తి వెంకట సుబ్బారావు, శిక్షణ పొందిన రైతు రోజుకు రూ.500 సంపాదిస్తున్నా నేను కూలీ పనులు చేసుకునే వాడిని. రోజూ రూ.300కు మించి ఆదాయం వచ్చేది కాదు. అంబాజీపేట కేంద్రంలో శిక్షణ తీసుకున్నాను. ఉచితంగా ఇచ్చిన పరికరం సాయంతో సులభంగా కొబ్బరిచెట్లు ఎక్కి కాయల్ని దింపు తీస్తున్నాను. రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నా. – నెల్లి నవీన్, కొబ్బరి వృక్షమిత్ర, గంగలకుర్రు, తూర్పు గోదావరి సమయం.. పెట్టుబడి కలిసొస్తుంది. నాకు పదెకరా>ల కొబ్బరి తోట ఉంది. దశాబ్దాలుగా దింపు సమస్య ఎదుర్కొన్నా. శిక్షణ పొందిన కొబ్బరి వృక్షమిత్రలు రావడంతో దింపు కోసం ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు సమయం, పెట్టుబడి కూడా కలిసి వస్తోంది. – చేకూరి సూర్యనారాయణ, డైరెక్టర్, కృషివల కోకోనట్ ప్రొడ్యూసర్స్ సొసైటీ దింపు సమస్యకు శాశ్వత పరిష్కారం విశ్వవిద్యాలయం ద్వారా అంబాజీపేట పరిశోధనా కేంద్రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. శిక్షణ సందర్భంగా సాగులో యాజమాన్య మెళకువలపైనా తర్ఫీదు ఇస్తున్నాం. కొబ్బరి వృక్ష మిత్రల రాకతో కొబ్బరి దింపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. – డాక్టర్ టి.జానకిరామ్, వైస్ చాన్సలర్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ -
తెల్లదోమ విజృంభణ
సర్పిలాకార తెల్లదోమ దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్యానతోటలు అతలాకుతలమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలను ఇది పీల్చి పిప్పి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం పూల ð ¬క్కలకు ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలనూ తెల్లదోమ చుట్టుముట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల రైతాంగంతోపాటు తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంత కొబ్బరి, ఆయిల్ పామ్ రైతులను సైతం కలవరపెడుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు అధికారులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఉద్యాన శాఖ సమీక్షలో ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమైన అధికార యంత్రాంగం సీఎం ఆదేశాలతో నివారణ చర్యలను ఉధృతం చేసింది. రూగోస్ తెల్లదోమ ఇలా వ్యాపిస్తుంది ► వలయాకారపు తెల్లదోమ (రూగోస్) ప్రధానంగా గాలి ద్వారా తొలుత కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్లను ఆశిస్తుంది. వీటిలో చక్కెర ఎక్కువ ఉండటమే దీనికి ప్రధాన కారణం. ► అక్కడి నుంచి జామ, మామిడి, పూలు, అలంకరణ మొక్కలను ఆశిస్తుంది. ► ఆకులో ఉండే పత్ర హరితాన్ని హరిస్తుంది. ► ఆకుల నుంచి రసాన్ని పీల్చి వేసి మైనం లాంటి తెల్లటి పదార్థాన్ని విసర్జిస్తుంది. దానిపై ’కాప్నోడియం’ అనే బూజు పెరిగి.. ఆకుపై నల్లటి పొర ఏర్పడుతుంది. దీని వల్ల సూర్యరశ్మి అందక కిరణజన్య సంయోగ ► క్రియ స్తంభించి చెట్టు పూర్తిగా నీరసించిపోతుంది. ► కొబ్బరిలో 40 శాతం, ఆయిల్ పామ్‌లో 35 శాతం దిగుబడి తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ► తెల్లదోమను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, నివారణే మార్గమంటున్నారు. ఎక్కడెక్కడ ఉందంటే..? ► తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొబ్బరి తోటల్ని, ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లోని వేలాది ఎకరాల ఆయిల్ పామ్ తోటల్ని ఇది ఆశించింది. ► తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంతంలో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్ని కూడా తెల్లదోమ ఆశించింది. ► కడియం నర్సరీలలో కొబ్బరి, ఆయిల్ పామ్, జామ, అలంకరణ మొక్కలను సైతం తెల్లదోమ కమ్మేసింది. ► 1.60 లక్షల ఎకరాల కొబ్బరిని, అదే స్థాయిలో ఆయిల్ పామ్ తోటల్ని ఇది ఆశించినట్టు అనధికారిక అంచనా. సమగ్ర యాజమాన్యంతోనే తెల్లదోమకు చెక్ ► సర్పలాకార తెల్లదోమ సోకితే రసాయనిక పురుగుమందులు చల్లటం తగదు. వీటిని చల్లితే మిత్రపురుగులు నశించి తెల్లదోమ రెండు–మూడు రెట్లు విజృంభిస్తుంది. అందువలన అవాంఛిత పురుగుమందుల వాడకం నివారించి మిత్రపురుగులను పెంచుకోవాలి. ► జీవ నియంత్రణతో తెల్లదోమను అదుపు చేయొచ్చు. ► కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో పసుపు రంగు టార్పలిన్ అట్టలను ఎకరానికి 10 నుంచి 15 చొప్పున (1 మీ.“ 1 మీ. విస్తీర్ణం) అతికించి, వాటికి ఆముదం పూసి, తెల్లదోమ తల్లి పురుగులను ఆకర్షించి, చంపాలి. ► వీటి ద్వారా దోమను పూర్తిగా అదుపు చేయకున్నా.. ఒక తల్లి దోమను చంపడం ద్వారా 100 పిల్ల దోమలను నిరోధించవచ్చు. ► తెల్లదోమ సోకిన మొక్కలను ఒక చోట నుంచి మరొక చోటకు తరలించకూడదు. ► డైకోక్రైసా ఆస్టర్ పురుగు తెల్లదోమ గుడ్లను తినేస్తుంది. డైకోక్రైసా ఆస్టర్ సంతతి వృద్ధికి దాని గుడ్లను తెల్లదోమ ఆశించిన తొలి దశలోనే చెట్ల ఆకులకు పిన్ చేసుకోవాలి. వీటిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా స్థానంలోనే దేశంలోకెల్లా మొట్టమొదటి సారిగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఏడాది 15 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసి రైతులకు అందించారు. దేశవ్యాప్తంగా రోజుకు 3–4 లక్షల గుడ్లకు డిమాండ్ ఉంది. వచ్చే ఏడాది నుంచి రోజుకు లక్ష గుడ్ల ఉత్పత్తికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► మిత్రపురుగైన ఎన్‌కర్సియా గ్వడెలోపే అనే బదనికలు ఈ తెల్లదోమలను అదుపులో ఉంచుతాయి. ఈ పురుగును ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే అవకాశం లేదు. సహజ సిద్ధంగా కొబ్బరి తోటల్లో ఈ మిత్ర పురుగులు అభివృద్ధి చెందుతుంటాయి. అక్కడి నుంచి సేకరించి తెల్లదోమ ఆశించిన ప్రాంతాల్లో విడుదల చేయాలి. ► రిజర్వాయర్ మొక్కలు / బ్యాంకర్ మొక్కలను పెంచడం వలన ఎన్కార్సియా గ్వడెలోపే సంతతి పెరుగుతుంది. ► పురుగు స్థాయి ఎక్కువగా ఉండి మిత్రపురుగులు లేకపోతే, 1 శాతం వేపనూనెకు 10 గ్రా. డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకు అడుగు భాగాలు పూర్తిగా తడిచేలా 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ► ఐసోరియ ఫ్యూమోసోరోసే అనే రకం కీటకాలను అరికట్టే శిలీంధ్రాన్ని లీటరు నీటికి 5 గ్రాముల స్పోర్స్ సాంద్రత 1“108గా ఉండాలి చొప్పున కలిపి తయారు చేసుకున్న శిలీంద్ర ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా తెల్లదోమను అదుపులోకి తేవచ్చు. శిలీంద్రం సాంద్రత తగినంత లేకపోతే ఫలితాలు పాక్షికంగానే వస్తాయి. ఒక ప్రాంతంలో రైతులందరూ కలిసికట్టుగా చేయాల్సి ఉంటుంది. శిలీంద్ర ద్రావణాన్ని తయారు చేసుకునే పద్ధతిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు మదర్ కల్చర్‌ను కూడా పంపిణీ చేస్తున్నారు. ► నీటికి కొరత లేకపోతే.. నీటిలో డిటర్జెంట్ పౌడర్ కలిపి తెల్లదోమ ఆశించిన మొక్కలపై 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ► పగటి ఉష్ణోగ్రత పెరగేకొద్దీ తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. 40 డిగ్రీల సెల్షియస్‌కు పెరిగేటప్పటికి తగ్గుతుంది. ► రైతులు సామూహికంగా నివారణ చర్యలు చేపడితే సర్పలాకార తెల్లదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. – డా. ఎన్‌బీవీ చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధన స్థానం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, అంబాజీపేట, తూ.గో. జిల్లా – ఎ. అమరయ్య, సాక్షి బ్యూరో, అమరావతి -
తాటి నీరా తరుణమిదే!
తాటి చెట్ల నుంచి నీరాను సేకరించడం డిసెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుంది. తాటి నీరా అత్యంత ఆరోగ్యదాయకమైన ప్రకృతిసిద్ధమైన పానీయం. తాటిచెట్టు గెలల నుంచి స్రవించే పోషక ద్రవాన్ని పులియకుండా సేకరిస్తే నీరా, పులియబెట్టి సేకరిస్తే కల్లు అవుతాయి. తాజా నీరా చక్కటి రుచితో అంతకుమించిన పోషకాలతో కూడి ఉంటుంది. దీన్ని హెల్త్ డ్రింక్‌గా తాగవచ్చు. తాటినీరాతో బెల్లం, పాకం(సిరప్), పంచదార, పటిక బెల్లం తయారు చేయవచ్చు. ఇళ్లలో, బేకరీల్లో చక్కెరకు బదులుగా వీటిని వాడుకోవచ్చు. తాటి ఉత్పత్తుల గ్లైసెమిక్ ఇండెక్స్(జి.ఐ.) తక్కువ కాబట్టి సాధారణ వ్యక్తులతోపాటు షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడుకోవచ్చని తూ.గో. జిల్లా పందిరిమామిడిలోని ఉద్యాన పరిశోధనా కేంద్రానికి చెందిన ఫుడ్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య చెబుతున్నారు. ఈ పరిశోధనా కేంద్రంలో తాటి నీరాతో వివిధ ఉత్పత్తుల తయారీ కోసం అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పారు. గీత కార్మికులు, రైతులు, గ్రామీణులకు శిక్షణ ఇస్తున్నారు. తాటి నీరా ప్రకృతి సిద్ధంగా తాటి చెట్టు నుంచి లభించే పానీయాన్ని పులియకుండా సేకరిస్తే.. దాన్ని నీరా అంటారు. ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. నీరా తియ్యగా ఉండటమే కాకుండా సుక్రోజు వంటి పిండి పదార్థాలు ఎక్కువగా కలిగి ఉంటుంది. నీరాలో ఇంకా అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. నీరా చక్కెర శాతం ఎక్కువగా కలిగిన పానీయం. దీనిలో చక్కెరతోపాటు ఐరన్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్, ఆస్కార్బిక్ ఆమ్లాలు వంటి విటమిన్లు ఉన్నాయి. నీరా జీర్ణశక్తిని పెంచుతుంది. కామెర్లు వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉన్న నీరాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడవచ్చు. దీనిలో మినరల్స్, అవశ్యకమైన అమైనో ఆమ్లాలు, బి–కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. గర్భవతులకు, బలహీనంగా ఉన్న పిల్లల ఆరోగ్య రక్షణకు ఉపయోగించే ఆయుర్వే ఔషధాల్లో నీరాను వాడుతున్నారు. గర్భవతులు నీరాను వారానికి మూడు లేదా నాలుగు రోజులు తీసుకోవడం వల్ల పుట్టబోయే శిశువు మంచి రంగులో, ఆరోగ్యంగా జన్మిస్తుంది. బలహీనంగా ఉన్న పిల్లలకు రోజూ తక్కువ మోతాదులో ఇస్తే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు. మధుమేహం, ఊబకాయం, దంత క్షయం ఉన్న వారికి నీరా ఉపయోగపడుతుంది. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన కేలరీలు తక్కువగా ఉండే పదార్థాలు ఇష్టపడేవారు నీరాతో తయారు చేసిన పదార్థాలను వాడవచ్చు. తాటి నీరా సిరప్ (పాకం), బెల్లం, పంచదారను ఇళ్లలో, బేకరీలో వివిధ రకాల పదార్థాల తయారీలో చక్కెరకు బదులుగా వాడవచ్చు. నీరాను పాకం, బెల్లం, పంచదార వంటి పదార్థాలుగా మార్చడం వలన వీటిని సాంప్రదాయ వంటలు, ఇతర పదార్థాల తయారీలో చెరకు నుంచి తయారు చేసిన బెల్లం, పంచదారకు బదులుగా వాడవచ్చు. తాటి పటిక బెల్లం తాజాగా సేకరించిన నీరా (తాజా నీరా ఉదజని సూచిక 7–8 ఉంటుంది)ను 103–105 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద బాగా మరిగించాలి. నీరా బాగా మరిగి దాదాపు మూడో వంతు వరకు ఇగిరిన తర్వాత మంటను ఆర్పివేసి.. సన్నని దారాలు లేదా తీగలతో తయారు చేసిన క్రిష్టలైజర్లో పోయాలి. దీన్ని కదలకుండా, గాలి తగలకుండా ఉన్న చోటనే 35–40 రోజుల పాటు ఉంచాలి. తరువాత దారాలు లేదా తీగలకు అంటుకొని ఏర్పడిన స్ఫటికాల(అదే పటిక బెల్లం)ను బయటకు తీసి కడిగి, ఆరబెట్టి నిల్వచేసుకోవచ్చు. తాటి బెల్లం తాటి నీరాతో బాండీలో పోసి మరిగించి సులభంగానే బెల్లం తయారు చేసుకోవచ్చు. తొలుత 103–105 డిగ్రీల ఉష్ణోగ్రతతో బాగా మరగబెట్టి, తరువాత తక్కువ మంట మీద కలుపుతూ ఉండాలి. చిక్కబడిన తర్వాత అచ్చులలో పోస్తే బెల్లం తయారవుతుంది. ఎటువంటి ఎంజైములు, రసాయనాలు కలపనవసరం లేదు. తాటి పంచదార తాటి చెట్ల పెంపకంలో రసాయనాలు వాడే అవసరం లేదు. కాబట్టి తాటి నీరాతో తయారు చేసే పంచదారను కూడా ప్రకృతి సిద్ధంగా, ఏ విధమైన రసాయనాలు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. రసాయనాలు వాడకుండానే తాటి పంచదారను తయారు చేసుకోవచ్చు. ఇంతులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. నీరా పంచదారను వాడటం వలన బరువు తగ్గడం, మధుమేహం అదుపులో ఉండటంతోపాటు సీరమ్ కొలస్ట్రాల్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కూడా నీరా పంచదార ఉపయోగపడుతుంది. తాజా నీరా(ఉదజని సూచిక 7–8)ను 103–105 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగించి, బాగా చిక్కబడిన తరువాత క్రిస్టలైజర్, సెంట్రిఫ్యూజులను ఉపయోగించి పంచదారను తయారు చేస్తారు. తాటి సిరప్ (పాకం) తాజా నీరాను బాణలిలో పోసి 103–105 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బాగా మరిగించాలి. నీరా బాగా మరిగి దాదాపు సగం పరిమాణానికి తగ్గినప్పుడు మంటను ఆర్పివేసి, చల్లబర్చి గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. దీన్ని చక్కెరకు బుదులుగా వాడుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. టీ, కాఫీలలోను, కషాయాల లోను, బేకరీ ఉత్పత్తులలోను, ఐస్‌క్రీమ్‌ల తయారీలోను నీరా సిరప్‌ను ఎక్కువగా వాడతారు. 4 కోట్ల తాటి చెట్లున్నా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 4 కోట్ల తాటిచెట్లు ఉన్నాయి. ముదురు చెట్ల నుంచి డిసెంబర్ నుంచి 4 నెలల పాటు నీరాను సేకరించవచ్చు. చెరకు రసంతో తయారు చేసే పంచదార, బెల్లం కన్నా తాటి బెల్లం, తాటి పంచదార ఎంతో మేలైనవి. ఈ సహజ తీపి ఉత్పత్తులను గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహ రోగులు కూడా తినొచ్చు. ఇంత ప్రయోజనకరమైన తాటి చెట్లలో 1 శాతాన్ని కూడా మనం ఉపయోగించుకోకపోవడం దురదృష్టకరం. ప్రతి తాటి చెట్టు నుంచి ఏటా గరిష్టంగా రూ. 10 వేల ఆదాయం పొందవచ్చు. గ్రామీణులకు ఉపాధి అవకాశాలను ఇవ్వగల శక్తి తాటి, ఈత చెట్లకు ఉందని ప్రభుత్వాలు, గీత కార్మికులు, రైతులు గుర్తించాలి. – పి. సి. వెంగయ్య (94931 28932), సీనియర్ శాస్త్రవేత్త (ఫుడ్‌సైన్స్, టెక్నాలజీ), అఖిల భారత తాటిపరిశోధనా పథకం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పందిరి మామిడి, తూ. గో. జిల్లా తాటి నీరాతో తయారవుతున్న తాటి బెల్లం, తాజా తాటి నీరా -
చింతలు తీర్చే ఎర్రచింత!
తీవ్ర కరువు, గాలివానలు వంటి తీవ్రమైన ప్రకృతి వైవపరీత్యాలను సైతం తట్టుకోవడంతోపాటు రైతుకు స్థిరంగా ఏటేటా మంచి ఆదాయాన్నివ్వగలిగిన మంచి తోట పంట ‘ఎర్ర చింత’. దీని అసలు పేరు ‘అనంత రుధిర’. ఇది సహజ రకమే. అనంతపురం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల కృషి ఫలితంగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అధికారికంగా విడుదలైంది. ఈ చింతపండు ఎరుపు రంగులో ఉండటం, సాధారణ చింతలో కన్నా పోషక విలువలు అధికంగా కలిగి ఉండడంతో ఇతర ఉత్పత్తుల్లో కలపడానికి.. అంటే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఇది బాగా అనుకూలమైనది. బత్తాయి తదితర పండ్ల తోటలు ఎండిపోతున్న తీవ్ర కరువు పరిస్థితుల్లోను, గాలివానలకు తట్టుకొని దిగుబడిని ఇవ్వగలగడం దీని ప్రత్యేకత.. చింతపండుతో దక్షిణాదిప్రజలకు, రైతులకు విడదీయరాని అనుబంధం ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చింత సాగు జరుగుతోంది. ఇంట్లో రోజువారీ వంటల్లో వాడుకోవడానికి, నిల్వపచ్చడి పెట్టుకోవడానికి మాత్రమే చింతపండును ప్రస్తుతం మనం వాడుతున్నాం. చింతపండు అంటే నల్లగానే ఉంటుంది కదా అనుకోవద్దు. ఎందుకంటే ఇటీవలే ఎర్రని చింత రకం ఒకటి వెలుగులోకి వచ్చింది. పొలుసు ఒలిచిన తర్వాత చింతపండు మామూలు చింత రకాలకు భిన్నంగా ఎర్ర చింత రకాన్ని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఐదేళ్లపాటు కొనసాగిన పరిశోధనల ఫలితంగా ఎరుపు రంగులో ఉండే చింత రకం రైతులకు అందుబాటులోకి వచ్చింది. ‘అనంత రుధిర’ అనే పేరుతో ఈ కొత్త రకాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి దేశవ్యాప్తంగా విడుదల చేసింది. గింజలు తీసిన ఎర్రచింతపండు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఉద్యాన శాస్త్రవేత్తలు విడుదల చేసిన చింత రకాలు రెండే రెండు. ఉత్తరప్రదేశ్‌లో యోగేశ్వర్ అనే రకం(దీని వివరాలు పెద్దగా అందుబాటులో లేవు) మొదటిది కాగా, మన అనంతపురం శాస్త్రవేత్తలు గుర్తించి, అభివృద్ధి చేసి వెలుగులోకి తెచ్చిన ‘ఎర్ర చింత’(అనంత రుధిర) రెండోది కావడం విశేషం. రేకులకుంటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానంలో 40కి పైగా రకాల చింతచెట్లను సాగు చేస్తూ పరిశోధనలు సాగిస్తున్నారు. వీటిలో 30 ఏళ్ల వయసున్న ఒక చెట్టు కాయల్లో గుజ్జు ఎర్రగా ఉన్నట్లు, ఈ చెట్టు ప్రతి ఏటా కాయలు కాస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎర్ర చింతపండుతో తయారైన వివిధ ఉత్పత్తులు దీనికి ‘ఛాంపియన్ ట్రీ’ అని పేరు పెట్టి ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. ఈ చెట్టు కొమ్మల ద్వారా అంట్లను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందిస్తున్నారు. ఈ ఏడాది కనీసం 20 వేల అంట్లు ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఈ రకం మొక్కలు కొన్నిటిని ఈ పరిశోధనా స్థానంలో నాటారు. అవి పూతకు వచ్చిన తర్వాత ఆ చెట్లకు కూడా అంట్లు కట్టడం ప్రారంభిస్తామని డా. శ్రీనివాసులు తెలిపారు. ‘అనంత రుధిర’ రకంతోపాటు సాధారణరకాలైన తెట్టు అమాలిక, ధార్వాడ్ సెలక్షన్–1, ధార్వాడ్ సెలక్షన్–2 చింత రకాల అంటు మొక్కలు కూడా రేకులకుంటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి. పంపిణీకి సిద్ధంగా ఉన్న ఎర్రచింత అంటుమొక్కలు ఎర్ర చింతకు గుత్తులుగా కాయలు ఉద్యాన క్షేత్రంలో ఉన్న అనంత రుధిర రకం ప్రతి ఏటా కాపు కాస్తున్నది. కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. పిందెను విరిచి చూస్తే రక్తం మాదిరిగా ఎర్రగా కండ కనిపిస్తుంది. కాయ ముదిరిన తర్వాత రోజ్ రెడ్‌లోకి మారుతుంది. యాంటోసైనిన్స్ అనే పిగ్మెంట్ కారణంగా ఎరుపు రంగు సహజసిద్ధంగానే వస్తున్నదని డా. శ్రీనివాసులు తెలిపారు. ఆరోగ్యదాయకం మామూలు చింత రకాల నుంచి వచ్చే చింతకాయల ద్వారా చింతతొక్కు, చింతపండుగానే ఎక్కువగా ఆహారంలో ఉపయోగిస్తారు. అయితే, ఎర్రచింతతో అనేక ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ రకం చింతపండు, ఇతర ఉత్పత్తులు ఆరోగ్యపరంగా మనిషి ఎంతగానో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మానవ శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ (చెడు కలిగించే పదార్థాల)ను ఇవి నిర్వీర్యం చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఇందులో టార్టారిక్ యాసిడ్, భాస్వరం, పొటాషియం, నియాసిన్, రెబోఫ్లేవీన్, బీటా కెరోటిన్ లాంటి విటమిన్లు, మినరల్స్(ఖనిజాలు) ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా టార్టారిక్ యాసిడ్ 16 శాతం ఉంటుంది. దీన్ని చింత తొక్కుగా, చింతపండుగా వంటకాల్లో వాడితే మంచి రుచిని ఇస్తుందన్నారు. ఆకర్షణీయంగా ఆహారోత్పత్తులు ఎరుపు రంగు ఆక్షణీయంగా ఉంటుంది కాబట్టి ఎర్ర చింతపండుతో పులిహోర, సాంబారును మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. ఎర్ర చింతపండును వినియోగించి జామ్, జెల్లీ, సాస్, చిక్కటిగుజ్జు, పొడి, టోఫీస్(చాక్లెట్లు), బేకరీ పదార్ధాల తయారీలో వాడుకుండే ఆయా ఉత్పత్తులు సహజమైన ఎర్ర రంగుతో అదనపు పోషక విలువలతో కూడి మరింత ఆకర్షణీయంగా మారుతాయని డా. శ్రీనివాసులు అంటున్నారు. ఎగుమతుల పెరుగుదలకు కూడా అవకాశం ఉంటుంది. ఐదో ఏడాది నుంచి దిగుబడి ‘అనంత రుధిర’ రకం సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమైనవే అయినప్పటికీ, ఎర్రగరప నేలలు, తేలికపాటి నల్ల రేగళ్లలో మంచి దిగుబడులు వస్తాయని డా.శ్రీనివాసులు తెలిపారు. సాధారణంగా చింత మొక్కలను చౌడు నేలల్లోనో, వ్యవసాయానికి పనికిరాని భూముల్లోనో నాటుతూ ఉంటారని.. అయితే సాగు యోగ్యమైన భూముల్లో ఇతర తోట పంటల మాదిరిగానే చింత అంట్లను నాటుకొని, డ్రిప్ ద్వారా నీటిని, ఎరువులను అందిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఆయన అంటున్నారు. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 8 మీటర్ల ఎడంలో ఎకరాకు 62 మొక్కలు నాటుకోవచ్చు. చెట్లు, కొమ్మలు గుబురుగా, దట్టంగా పెరుగుతాయి, కొన్ని దశాబ్దాల పాటు పెద్ద చెట్లుగా ఎదుగుతాయి కాబట్టి ఎటు చూసినా 8 మీటర్ల దూరంలో చింత మొక్కలు నాటుకోవాలన్నారు. మొక్కలు నాటిన తర్వాత ఐదో ఏడాది కాపునకు వస్తాయి. పూత వచ్చిన 7–8 నెలలకు పండ్లు తయారవుతాయి. తొలి ఏడాది చెట్టుకు 15–20 కిలోల చింతపండ్ల దిగుబడి వస్తుంది. 10–12 సంవత్సరాల చెట్టు ఏటా 40–50 కిలోల దిగుబడినిస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఒక్కో చెట్టుకు ఏటా 70–80 కిలోల చొప్పున చింత పండ్ల దిగుబడి వస్తుంది. చింత పండ్లను సేకరించి పైన పొలు, ఈనెలు, గింజలు తీసేస్తే.. 40–45 శాతం మేరకు నికరంగా చింతపండు చేతికి వస్తుందని డా. శ్రీనివాసులు తెలిపారు. ఏటా కాపు కాయడం ఈ రకం విశిష్టత కావడంతో రైతుకు లాభదాయకంగా ఉంటుంది. అంటు మొక్కలు నాటుకుంటే 70–80 ఏళ్ల వరకు దిగుబడినిస్తాయి. చింత గింజలు నాటితే చెట్లు 10–12 ఏళ్లకు గానీ కాపునకు రావు. కానీ, వందేళ్ల వరకు దిగుబడినిస్తాయి. అయితే, గింజ నాటినప్పటికన్నా అంటు నాటుకున్నప్పుడు జన్యుపరంగా ఖచ్చితమైన నాణ్యమైన చెట్లు రావడానికి అవకాశం ఉందన్నారు. అంతర పంటలుగా పప్పు ధాన్యాలు చింత మొక్కల మధ్య ఎటుచూసినా 8 మీటర్ల దూరం ఉంటుంది కాబట్టి.. మామిడి, చీనీ తోటల్లో మాదిరిగానే.. చింత తోటలు నాటిన కొన్ని ఏళ్ల పాటు రైతులు నిశ్చింతగా అంతర పంటలు వేసుకోవచ్చని డా. శ్రీనివాసులు తెలిపారు. అన్ని రకాల కూరగాయ పంటలు, వేరుశనగ, అలసంద, పెసర, మినుము, బీన్స్ వంటి పప్పుజాతి పంటలను అంతరపంటలుగా సాగు చేసుకోవచ్చన్నారు. చింత చెట్లకు కాయతొలిచే పురుగు ఒక్కటే సమస్యగా గుర్తించారు. మూడు నాలుగు నెలల పాటు ఉండే పిందె దశలో 1 మి.లీ క్లోరిఫైరిపాస్ లేదా 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1 మి.లీ డైక్లోరోవాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కాయతొలిచే పురుగును నివారించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. డ్రిప్ ద్వారా నీటిని తగుమాత్రంగా అందించాలి. సేంద్రియ ఎరువులు, వేప చెక్కతో పాటు తగిన మోతాదులో రసాయన ఎరువులు వేసుకోవాలని డా. శ్రీనివాసులు సిఫారసు చేస్తున్నారు. అయితే, ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించే రైతులు తమ పద్ధతుల ప్రకారం ఎరువులను, కషాయాలను వాడుకుంటూ చింత తోటలు సాగు చేసుకోవచ్చు. – గంగుల రామలింగారెడ్డి, సాక్షి, అంతపురం అగ్రికల్చర్ ఎర్ర గరప, రేగడి నేలలు అనుకూలం ఎర్ర చింత చెట్ల సాగుకు ఎర్ర గరప నేలలతోపాటు తేలికపాటి నల్లరేగడి నేలలు అనుకూలం. కోస్తా ప్రాంతాల్లో సారవంతమైన భూముల్లో అయితే మెట్ట ప్రాంతాల్లో కన్నా అధిక దిగుబడి కూడా రావచ్చు. గాలి వానలకు దీని కాయలు పండిన దశలో కూడా రాలిపోవు. తక్కువ వర్షపాతం ఉండే రాయలసీమ వంటి ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులను సైతం తట్టుకొని బతుకుతుంది. అందువల్లనే బత్తాయి, దానిమ్మ, నిమ్మ తోటలు ఎండిపోతున్న ప్రాంతాల్లో రైతులు ఇటీవల కాలంలో చింత మొక్కలు నాటుకుంటున్నారు. ఇతర తోటల్లో మాదిరిగా డ్రిప్ పెట్టుకొని, ఎరువులు వేసుకొని కొంచెం శ్రద్ధ చూపితే ఎటువంటి భూముల్లోనైనా చక్కగా పెరిగి దశాబ్దాలపాటు లాభదాయకమైన దిగుబడినిస్తుంది. ఎర్ర చింత అంటు మొక్కలకు రైతుల నుంచి ఇప్పటికే గిరాకీ బాగా వచ్చింది. తెలంగాణ ఉద్యాన శాఖ వారు కూడా 3 వేల మొక్కలకు ఆర్డర్ ఇచ్చారు. వచ్చే నెలలో వారికి సరఫరా చేస్తున్నాం. టిష్యూకల్చర్ పద్ధతి విజయవంతం కాకపోవడంతో అంటు మొక్కలనే రైతులకు అందిస్తున్నాం. ఎర్రచింతపండును వంటకాల్లో చింతపండుగా కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో వాడటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎగుమతి అవకాశాలు కూడా ఎక్కువే. – డా. బి. శ్రీనివాసులు (73826 33667), అధిపతి, డా. వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, రేకులకుంట, అనంతపురం జిల్లా -
పాలీహౌస్ ఉత్పత్తులకు మార్కెటింగ్
తాడేపల్లిగూడెం రూరల్ : పాలీ హౌస్‌ల్లో పండించే ఉత్పత్తులకు సబ్సిడీతో పాటు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని ఏపీ హార్టీకల్చర్ గుంటూరు కమిషనరేట్ అధికారి శరవణ న్ అన్నారు. మంగళవారం మండలంలోని వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలో పాలీహౌస్, షెడ్ నెట్‌ల్లో సాగు చేసే క్యాప్సికమ్, టమోట, జర్బెరా, కార్మెషన్, గులాబీ, పూలు, కూరగాయల సాగు విధానంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాలీహౌస్, షెడ్ నిర్మాణం కోసం సంబంధిత ఉద్యాన అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. క్యాప్సికంకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ప్రకాశం జిల్లాకు చెందిన రైతు దండా వీరాంజనేయులు కోరారు. కోపర్ట్ బయోలాజికల్ ల్యాబ్ (బెంగళూరు) ప్రతినిధి కె.మహేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రకృతి యాజమాన్య పద్ధతుల ద్వారా సులభంగా చీడపీడలను నివారించవచ్చని చెప్పారు. రాజ్వా న్ హైబ్రీడ్ సీడ్స్ ప్రతినిధి ఎల్వీ ప్రసాద్, నెటాఫిమ్ డ్రిప్ కంపెనీ ప్రతినిధి ఏఎస్ సుబ్బారావు మాట్లాడారు. ఉద్యాన వర్సిటీ పరిశోధన సంచాలకుడు దిలీప్‌బాబు, విస్తరణ సంచాలకులు ఆర్వీఎస్కే రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ రామ్మోహ న్‌రావు, ఉద్యాన ఏడీ జి.విజయలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారులు, ఎంపీఈవోలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. -
రైతులకు మార్గదర్శకులు కండి
తాడేపల్లిగూడెం : రైతులకు మార్గదర్శకులుగా ఉద్యాన విద్య పూర్తిచేసిన విద్యార్థులు మారాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్రో పిలుపునిచ్చారు. మండలంలోని వెంకట్రామన్నగూడెంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాపాత్రో హాజరై మాట్లాడారు. ఉష్ణోగ్రతలో ఒక సెల్సియస్ తేడా వస్తే ఉద్యాన పంటల దిగుబడులు గణనీయంగా పడిపోతాయి. ఇలాంటి అనేక అంశాలపై నిత్యం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగని శాస్త్రవేత్తలు పరిశోధనలకే పరిమితం కాకూడదన్నారు. పరిశోధన ఫలితాలను రైతులకు చేరువ చేయాలని సూచించారు. మెట్ట ప్రాంత ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రానికి అవసరమైన అఖిల భారత సమన్వయ పరిశోధన ప«థకాలు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. పరిశోధనలు చేస్తున్నాం : వీసీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉద్యాన యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ బీఎంసీ రెడ్డి మాట్లాడుతూ 17 పరిశోధన కేంద్రాల ద్వారా అధిక దిగుబడులు సాధించే ఉద్యాన ఉత్పత్తులను అభివద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి. నాబార్డ్, ఆర్‌కేవై పథకాల ద్వారా విశ్వవిద్యాలయానికి గ్రాంట్లు అందుతున్నాయన్నారు. ఉద్యాన వర్సిటీ ప్రగతిని వివరించారు. 516 మందికి పట్టాలు ప్రదానం రెండో స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని 516 మందికి పట్టాల ప్రదానం చేశారు. బీఎస్సీ పూర్తిచేసిన 410 మంది, ఎంఎస్సీ పూర్తిచేసిన 90 మంది, పీహెచ్డీ పూర్తిచేసిన 16 మందికి పట్టాలను మహాపాత్ర చేతుల మీదుగా అందజేశారు. బంగారు పతకాలు డిగ్రీస్థాయిలో హార్టికల్చర్ హానర్సులో అత్యుత్తమ గ్రేడ్ మార్కులు సంపాదించిన టి.సమత, ఎస్.లోకేశ్వరిలకు అన్నే శిఖామణి మెమోరియల్ గోల్డ్‌మెడల్, ఎంఎస్సీలో అత్యుత్తమ మార్కులు సంపాదించిన షేక్ సమీన బేగం, జి.కోటేశ్వరరావులకు దాశరథి మెమోరియల్ గోల్డ్‌మెడల్, అధ్యాపకుల కేటగిరీలో ఎంటమాలజీ శాస్త్రవేత్త డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, శాస్త్రవేత్తల కే టగిరీలలో ఉత్తమ పరిశోధనకు గాను డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావులు బంగారు పతకాలను అందుకున్నారు. రాష్ట్ర ఉద్యాన కమిషనర్ చిరంజీవి చౌదరి. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వ విద్యాలయ ఉప కులపతి డాక్టర్ మన్మోహన్సింగ్, పాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. -
పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ సమావేశం రసాభాస!
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సమావేశం రసాభాసైంది. తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం పేరుని మార్చాలని టీడీపీ సభ్యులు తీర్మానించారు. డీసీసీబి చైర్మన్ వెంకటరత్నం దానిని వ్యతిరేకించారు. టీడీపి ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కె.ఎస్.జవహర్ అతనిని అడ్డుకున్నారు. మెజార్టీ సభ్యులు తమవైపు ఉన్నారని, యూనివర్సిటీ పేరు మారుస్తామని వారు అన్నారు. ఈ విశ్వవిద్యాలయం ఇక్కడకు రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని, ఆయన హయాంలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, జిల్లాలో ఎంతోమంది విద్యార్థులు చదువుకున్నారని వెంకటరత్నం వివరించారు. అటువంటి వ్యక్తి పేరుని తొలగించాలని నిర్ణయించడం తగదని ఆయన వాదించారు. ** -
ఉద్యోగాలు
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్‌లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సైంటిఫిక్ ఆఫీసర్: 1 అర్హతలు: 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ లేదా 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్‌లో పీజీ ఉండాలి. ఒకటి నుంచి రెండేళ్ల అనుభవం అవసరం. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ (బి): 1 అర్హతలు: పదోతరగతితో పాటు ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్/ కంప్యూటర్ సైన్స్‌లో 60 శాతం మార్కులతో డిప్లొమా ఉండాలి. రెండేళ్ల అనుభవంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 22 వెబ్సైట్: www.tifrh.res.in వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్: 1 అర్హతలు: అగ్రికల్చర్/ హార్టికల్చర్/ యానిమల్ సెన్సైస్/ ఫిషరీస్‌లో డాక్టోరల్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు. సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్: 12 విభాగాలు: అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, ఎంటమాలజీ, ఫిషరీస్ సైన్స్, హార్టికల్చర్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ, వెటర్నరీ సైన్స్. అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఏఎస్ఆర్బీ/ యూజీసీ నెట్లో అర్హత సాధించాలి. వయసు: 21 - 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 24 వెబ్సైట్: www.drysrhu.edu.in -
ఉద్యానంలో ఉజ్వల భవిత!
వ్యవసాయం.. మానవ నవ జీవనానికి ఆరోప్రాణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చుక్కాని! లక్షలు ఆర్జించే కొలువులను కాదని కొందరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పొలం బాట పడుతుంటే, మరికొందరు ఉన్నతోద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. వ్యవసాయం అంటేనే ఒకప్పుడు నిర్లక్ష్యపు చూపు చూసిన యువత నేడు ‘పంటల’ కోర్సులపై మక్కువ పెంచుకుంటోంది.. ఈ నేపథ్యంలో వ్యవసాయ అనుబంధరంగమైన ఉద్యానశాఖలో ఉద్యోగావకాశాలు, కోర్సులు, భవిష్యత్ అవకాశాలు తదితర అంశాలపై డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బి.ఎం.సి.రెడ్డితో ‘భవిత’ ఇంటర్వ్యూ.. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు లక్ష్యాలేమిటి? వాటి సాధనలో ఎంతవరకు విజయవంతమయ్యారు? ప్రస్తుతం వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. వర్షాభావ పరిిస్థితులు, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల, సహజవనరుల (నీరు) తగ్గుదల, భూసార నిస్సారం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఉద్యాన పంటలపై చేపట్టాల్సిన పరిశోధనలు, ఉద్యాన పంటల ప్రాముఖ్యత ,అభివృద్ధి అవకాశాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం 2007, జూన్ 26న ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. ఇలాంటి విశ్వవిద్యాలయం భారత దేశంలో రెండోది కావడం విశేషం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యాన అనుబంధ కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు 2008, ఏప్రిల్ 1 నుంచి ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చాయి. అదే ఏడాది మే 10 నుంచి వర్సిటీ స్వయంప్రతిపత్తి హోదాతో పనిచేస్తోంది. ఉద్యాన విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంగా 2011, ఆగస్టు 1న మార్చారు. విద్య, పరిశోధన, విస్తరణ ముఖ్య ఉద్దేశాలుగా విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. ఇప్పుడదే లక్ష్య సాధన దిశగా అడుగులు ముందుకేస్తున్నాం. ప్రస్తుతం విశ్వవిద్యాయలం అందిస్తున్న కోర్సులేవి? ప్రస్తుతం హార్టికల్చరల్ పాలిటెక్నిక్, బీఎస్సీ హార్టికల్చర్, ఎంఎస్సీ హార్టికల్చర్, పీహెచ్డీ కోర్సులను అందిస్తున్నాం. హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి అర్హతలేంటి? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుకు అర్హులు. ఇంటర్మీడియెట్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అనర్హులు. విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండాలి. ఏడేళ్ల విద్యా కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల (నాన్ మునిసిపల్ పరిధి) పాఠశాలలో చదివుండాలి. అలాంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి కంపార్ట్మెంటల్లో ఉత్తీర్ణులైన వారు కూడా కోర్సులో ప్రవేశాలకు అర్హులే. ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో సాధించిన గ్రేడ్‌ను బట్టి కోర్సుకు ఎంపిక చేస్తారు. పాలిటెక్నిక్ కోర్సుల వ్యవధి ఎంత? దీని స్వరూపం ఎలా ఉంటుంది? కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం 23 సబ్జెక్ట్‌లను రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిలో మొదటి ఏడాది 12, రెండో ఏట11 చొప్పున పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది. వీటితో పాటు ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్లూ ఉన్నాయి, వీటిలో ఉద్యాన పంటల సాగు, చీడపీడల నివారణ, నీటి పరివాహక ప్రాంత యాజమాన్యం, సాగుకు అనుకూలమైన నేలల గురించి పాఠ్యాంశాలుంటాయి. పాలిటెక్నిక్ హార్టికల్చర్ కోర్సులు పూర్తి చేసినవారికి ఎలాంటి అవకాశాలున్నాయి? ప్రభుత్వ ఉద్యానశాఖలో విస్తరణ అధికారి (హెచ్ఈఓ) ఉద్యోగానికి డిప్లొమా చేసినవారే అర్హులు. అలాగే ప్రైవే టు సంస్థల్లోనూ, నర్సరీలలోనూ అవకాశాలుంటాయి. ప్రాంగణ నియామకాలు కూడా నిర్వహిస్తున్నారు. బీఎస్సీ హార్టికల్చర్ కోర్సును అందించే కళాశాలలు, సీట్ల సంఖ్య, ఎంపిక విధానం ఎలా ఉంటుంది? అనంతరాజుపేట (కడప), మోజర్ల (మహబూబ్‌నగర్), రాజేంద్రనగర్ (రంగారెడ్డి), వెంకటరామన్నగూడెం (పశ్చిమ గోదావరి)లలో కళాశాలలు ఉన్నాయి. సీట్ల సంఖ్య 230. ఇంటర్మీడియెట్ బైపీసీ చదివి, ఎంసెట్‌లో సాధించిన ర్యాంకు ప్రాతిపదికన బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు ఉంటాయి. బీఎస్సీ హార్టికల్చర్ పూర్తిచేసిన వారికి ఎలాంటి అవకాశాలున్నాయి? బీఎస్సీ హార్టికల్చర్ కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ ఉద్యానశాఖ అధికారిగా స్థిరపడొచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలో టెక్నికల్ ఆఫీసర్స్, కన్సల్టెంట్లు, నర్సరీ, విత్తనశుద్ధి కర్మాగారాలలో అధికారులుగా ఉద్యోగావకాశాలుంటాయి. తితిదే పరిధిలో ఉద్యాన రూపకల్పన (గార్డెనింగ్ డిజైనింగ్), టూరిజం పరిశ్రమలో గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ ఉద్యోగాలకూ వీరు అర్హులే. ప్లాంట్ డాక్టర్స్‌గా, రైతులకు సలహాదారులుగా అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. సొంతంగా నర్సరీలు స్థాపించి స్వయం ఉపాధి బాటలో సాగవచ్చు. అంతేకాదు ఇతర డిగ్రీ విద్యార్థుల తరహాలో సివిల్ సర్వీసెస్, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయొచ్చు. విశ్వవిద్యాలయం పరిధిలో ఎమ్మెస్సీ, పీహెచ్డీలలో ఏయే స్పెషలైజేషన్లు ఉన్నాయి? వీటిలో ప్రవేశానికి అర్హతలేమిటి? ఎమ్మెస్సీ హార్టికల్చర్ కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. ఫ్రూట్ సైన్స్, కూరగాయల శాస్త్రం, పూలమొక్కల పెంపకం, ల్యాండ్ స్కేపింగ్, సుగంధ ద్రవ్య, ఔషధ మొక్కల పెంపకం వంటి వాటిని స్పెషలైజేషన్లుగా ఎంపిక చేసుకోవచ్చు. రాజేంద్రనగర్, వెంకటరామన్నగూడెం, అనంతరాజుపేట, మోజర్ల కళాశాలల్లో ఎమ్మెస్సీ సీట్లున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా ఎమ్మెస్సీ హార్టికల్చర్ కోర్సులో ప్రవేశించొచ్చు. అకడమిక్ మెరిట్‌కు 50 శాతం, ప్రవేశ పరీక్షకు 50 శాతం ప్రాధాన్యమిచ్చి సీట్లను కేటాయిస్తారు. హార్టికల్చర్ పీహెచ్డీ కోర్సులు వెంకటరామన్నగూడెం, రాజేంద్రనగర్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో సరిపడినన్ని కళాశాలలున్నాయని భావిస్తున్నారా? ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా కళాశాలలు లేవని చెప్పొచ్చు. వీటి సంఖ్య పెంచడానికి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. యూనివర్శిటీ పరిధిలో మొత్తం ఎన్ని పరిశోధనా కేంద్రాలున్నాయి. వీటి స్థాపన వెనుక ప్రధాన ఉద్దేశమేంటి? మొత్తం 27 పరిశోధనా కేంద్రాలున్నాయి. జాతీయ స్థాయి సంస్థలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్), రాష్ట్ర ఉద్యాన మిషన్ ప్రాజెక్టులను పరిశోధనాంశాలుగా తీసుకుంటారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచడం, పోషక విలువల అభివృద్ధి, ఆహారభద్రత, అనుకూల వాతావరణం కల్పించడం, ఆహార పదార్థాల నిల్వ సామర్థ్యం పెంచి రైతులు మెరుగైన ఆదాయం ఆర్జించేలా చూడటం, ఎగుమతులు, ప్రాసెసింగ్ పద్ధతులను ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యాలుగా పరిశోధన కేంద్రాలు ఆవిర్భవించాయి. రాష్ట్రంలో కృషి విజ్ఞాన కేంద్రాల వివరాలు, వాటి ఏర్పాటు లక్ష్యం ఏమిటి? విశ్వవిద్యాలయం పరిధిలో మూడు కృషి విజ్ఞాన కేంద్రా లు ఉన్నాయి. ఇవి పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకటరామన్నగూడెం, తూర్పుగోదావరి జిల్లాలోని పందిరిమామిడి, కరీంనగర్ జిల్లాలోని రాంగిరిఖిల్లాలలో ఉన్నాయి. ఇవి ఉద్యాన విస్తరణ కార్యక్రమాలు చేపట్టడం, సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ మోతాదులో ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం, ఆయా పంటకాలాల్లో ఎదురయ్యే సమస్యలపై అన్నదాతలకు అవగాహన కల్పించడం వంటివి చేస్తున్నాయి. ఆదర్శ రైతులకు శిక్షణ, కిసాన్ మేళాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, ప్రసార మాధ్యమాల ద్వారా రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపడం వంటి సేవలనూ కూడా అందిస్తున్నాయి. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం పరిధిలో పరిశోధనల ఫలితంగా కనిపెట్టిన కొత్త రకం వంగడాలు ఏవైనా ఉన్నాయా? విశ్వవిద్యాలయం పరిధిలో ఆవిష్కరించిన కొత్త రకం వంగడాలు చాలా ఉన్నాయి. మామిడిలో మంజీర, కేఎంహెచ్-1, నీలేషాన్, నీలుద్దీన్, నీల్ గోవా, స్వర్ణ వంటివి ఉన్నాయి. నిమ్మ: బాలాజీ. అరటి: కొవ్వూరు బొంత. జామ: సఫేద్ జామ్, కోహిర్ సఫేదా. కంద: గజేంద్ర. చిలగడదుంప: సామ్రాట్, కిరణ్, ఆర్‌ఎన్‌ఎస్‌పీ-1. కొబ్బరి: గోదావరి గంగ, డబుల్ సెంచరీ, గౌతమి గంగ, కేరా బస్తర్, కల్ప ప్రతిభ. వంగ: భాగ్యమతి, గులాబి, శ్యామల. పొట్లకాయ, చిక్కుడు, గుమ్మడికాయ, మిరప వంటి పంటలకు సంబంధించి కూడా కొత్త వంగడాల ఆవిష్కరణ జరిగింది. పరిశోధన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలలో నిర్వహించే పరిశోధనల్లో విద్యార్థులకు భాగస్వామ్యం కల్పిస్తున్నారా? విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనల్లో భాగస్వాములను చేస్తుంటాం. అలాగే విద్యార్థులకు పరిశోధనలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. యూనివర్సిటీ పరిధిలో రైతులను ఏ విధంగా చైతన్యపరుస్తున్నారు? కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకే) ద్వారా రైతులకు పంటసాగు, ఉత్పత్తి పెంచడంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక రైతు శిక్షణ కేంద్రం వెంకటరామన్న గూడెం కేవీకేకు అనుబంధంగా ఉంది. ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తున్నారా? వీటిద్వారా ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి? విశ్వవిద్యాలయంలో ఆంధ్రాబ్యాంకు, ఇండియన్ బ్యాంకు, రుచి సోయా ఇండస్ట్రీస్, విభా సీడ్స్, క్యాడ్బరి ఇండియా సంస్థలు ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాయి. ఆకర్షణీయమైన వేతనాలతో విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయి. వై.మురళీకృష్ణ - న్యూస్‌లైన్, తాడేపల్లిగూడెం. బీఎస్సీ హార్టికల్చర్ కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ ఉద్యానశాఖ అధికారిగా స్థిరపడొచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలో టెక్నికల్ ఆఫీసర్స్, కన్సల్టెంట్లు, నర్సరీ, విత్తనశుద్ధి కర్మాగారాలలో అధికారులుగా ఉద్యోగావకాశాలుంటాయి. ఎమ్మెస్సీ హార్టికల్చర్ కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. ఫ్రూట్ సైన్స్, కూరగాయల శాస్త్రం, పూలమొక్కల పెంపకం, ల్యాండ్ స్కేపింగ్, సుగంధ ద్రవ్య, ఔషధ మొక్కల పెంపకం వంటి వాటిని స్పెషలైజేషన్లుగా ఎంపిక చేసుకోవచ్చు.