తాడేపల్లిగూడెం: లిసియాంతస్.. ముళ్లులేని గులాబీ పువ్వు. నీలం.. ఆకుపచ్చ.. పసుపు.. గులాబీ.. తెలుపు.. నీలం.. పికోటీ.. చాంపేన్. ఎన్నెన్నో రంగుల్లో ఉండే ఈ లిసియాంతస్ పువ్వుల్ని చూస్తే కళ్లు ఆనందంతో విప్పారతాయి. చూపు తిప్పనివ్వని సౌందర్యం వాటి సొంతం. ఏక రేకలైనా.. బహురేకలైనా.. ఆ పుష్పాల అందాలు మనసుల్ని దూదిపింజలా మార్చేస్తాయి. స్వప్నలోకంలో విహరింపజేస్తాయి.
లిసియాంతస్ పువ్వులు గులాబీ పూలను పోలి ఉంటాయి కానీ.. వీటికి ముళ్లు మాత్రం ఉండవు. రెండు నుంచి మూడు వారాలకు పైగా వాడిపోవు. వీటి సాగు ప్రయోగం మన రాష్ట్రంలో ఫలిస్తే.. కృషీవలులకు లాభాల గుబాళింపేనంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన వర్సిటీ ఉప కులపతి డాక్టర్ తోలేటి జానకిరామ్. ఈ పూల విశేషాలేమిటో.. సాగు ప్రయోగం ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దామా.
సమ శీతోష్ణ వాతావరణంలోనూ..
లిసియాంతస్ సాగుకు శీతల వాతావరణం అవసరం. సమశీతోష్ణ వాతావరణంలోనూ లిసియాంతస్ పెరుగుతుందని రుజువు కావడంతో రావడంతో రక్షిత సాగు పద్ధతిలో హైటెక్ పాలీహౌస్, ఫ్యాన్, పాడ్ పాలీహౌస్, కూలింగ్, మిస్ట్ చాంబర్లలో వీటిని పెంచుతున్నారు. తమిళనాడులోని ఊటీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోనూ ఇప్పటికే వీటిని సాగు చేస్తున్నారు. పాలీ హౌస్‌లలో సాగు చేసే ఈ పుష్పాలకు వాణిజ్య విలువలు అధికం. ఎగుమతికి అనుకూలమైనవి. అందుకే.. ఇది మంచి లాభదాయకమైన ఉద్యాన పంట.
మన దగ్గరా కొన్ని ప్రాంతాలు అనుకూలమే!
గులాబీ మాదిరిగా అంటు పద్ధతిలో కాకుండా విత్తనాలు చల్లి సాగు చేసుకోవచ్చు. వీటి సాగుకు మన రాష్ట్రంలోనూ కొన్ని ప్రాంతాల వాతావరణం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక విత్తన కంపెనీ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఉద్యాన పరిశోధన స్థానం ద్వారా ప్రయోగాత్మకంగా సాగు చేయించేందుకు వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సమాయత్తమవుతోంది. గతంలో చింతపల్లి కేంద్రంలో సిమ్లా యాపిల్‌ను ప్రయోగాత్మకంగా పండించారు.
లిసియాంతస్ సాగుకు ఈ పరిశోధన స్థానం బాగుంటుందని సకాటా సీడ్స్ సంస్థ ప్రతినిధులు గుర్తించారు. అరుదైన ఆర్కిడ్స్ పూల సాగు కోసం ఈ కేంద్రంలో విశిష్ట రక్షిత సాగు కేంద్రం ఉంది. ఇక్కడే లిసియాంతస్ పువ్వుల సాగుకు త్వరలో శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గత నెలలో ఉద్యాన వర్సిటీలో ఉప కులపతి డాక్టర్ జానకిరామ్ పర్యవేక్షణలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ మెన్ అసోసియేషన్, పాలీహౌస్ ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ పూల సాగుపై ఔత్సాహిక రైతులకు రైతులకు అవగాహన కల్పించారు.
ప్రేమకు ప్రతీకగా..
ప్రపంచంలోనే అందమైన పువ్వులుగా పేరున్న లిసియాంతస్ పుష్పాలను ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. జెంటియన్ కుటుంబానికి చెందిన ఈ పువ్వును టెక్సాస్ బ్లూబెల్‌గా కూడా పిలుస్తారు. ఇకో, డబులిని, రోసిత, ఎక్స్‌కలిబర్, మరయాకి, రోసిత రోసన్నో, వోయేజ్, అబూ రోసిత పేర్లతోనూ లిసియాంతస్‌ను పిలుస్తున్నారు. బొకేలు, పూల అలంకరణకు అనుకూలమైన ఈ పుష్పాలు పువ్వులు ఏక, బహుళ రేకలతో గులాబీ, కామేలియా ఆకారంలో వైవిధ్యంగా ఉంటాయి.
ఆసియా ఖండంలో 50 ఏళ్ల క్రితమే ప్రాచుర్యం పొందిన ఈ పువ్వులు మృదువైన రేకలతో అలరిస్తాయి. ఒకటి లేదా రెండు మూడు జతల నారు మొక్కలను కలిపి నాటుకోవచ్చు. నేల శుద్ధీకరణ, ఆవిరి శుద్ధీకరణ, హాట్ వాటర్ స్టెరిలైజేషన్ పద్ధతిలో నారు తయారీకి సమాయత్తం కావచ్చు. వీటికి ఎక్కువ ఎరువులు అవసరం లేదు. కాల్షియం నైట్రేట్ ఆధారిత ఎరువులు స్వల్పంగా వాడితే చాలు.
త్వరలోనే ప్రయోగాలు
అపురూపమైన లిసియాంతస్ పువ్వులను వాడుకలోకి తెచ్చే క్రమంలో వీటి సాగుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఇందుకు సంబంధించి సకాటా సీడ్స్ సంస్థతో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టాం. వీటి సాగుకు చింతపల్లి పరిశోధన స్థానం అనుకూలమని సీడ్స్ సంస్థ ప్రతినిధులు పరిశీలనకు వెళ్లి వచ్చిన తర్వాత చెప్పారు. పుష్పాల సైకిల్‌ను పరిశీలించడానికి ప్రయోగం చేయనున్నాం. ఈ ప్రయత్నం విజయవంతమైతే రైతులకు లాభాల పంట అందుబాటులోకి వస్తుంది.
–డాక్టర్ తోలేటి జానకిరామ్, వైస్ చాన్సలర్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment