
ఈ సీజన్‌లో రకరకాల పువ్వులు మనకు కనువిందు చేస్తుంటాయి. అవి మన చర్మానికి, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. కొన్నింటి సువాసనల వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంటుంది. మరికొన్ని పువ్వులు బ్యూటీ ట్రీట్‌మెంట్లలో చేరి, తమ గొప్పతనాన్ని చాటుతుంటాయి.
బంతిపువ్వులు క్రిమినాశకంగా పనిచేస్తాయి. చర్మంపై దద్దుర్లు, చికాకులకు, మొటిమల సమస్యలు ఉన్నవారికి ఔషధంలా పనిచేస్తుంది. బంతి పువ్వు రేకలను కొద్దిగా నూరి, మొటిమలపై రుద్ది, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మొటిమల సమస్య దూరం అవుతుంది.
లావెండర్ మనసుకు శాంతిని కలిగించడంలోనూ, చర్మానికి యాంటీ బాక్టీరియల్‌గానూ ఉపయోగపడుతుంది. మసాజ్‌ల కోసం లావెండర్ నూనెలు, చర్మం డీ హైడ్రేట్ కాకుండా లావెండర్ వాటర్ స్ప్రే చేస్తే తిరిగి కళగా మారుతుంది.
మల్లెలతో చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. పొడి చర్మం గలవారు జాస్మిన్ ఆయిల్, జాస్మిన్ ఫేస్ ప్యాక్‌లు వాడితే మృదువుగా మారుతుంది. ఒత్తిడి ఉపశమనానికి జాస్మిన్ సువాసనలు ఎంతో మేలు చేస్తాయి.
గులాబీ – లావెండర్ ఫ్లవర్ ప్యాక్ కప్పు రోజ్ వాటర్, టీస్పూన్ ఎండిన లావెండర్ పువ్వులు, 5–6 చుక్కల లావెండర్ నూనె తీసుకోవాలి. రోజ్ వాటర్‌ను మరిగించి, ఎండిన లావెండర్ పువ్వులను అందులో వేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి, మిశ్రమాన్ని చల్లబరచాలి. తర్వాత వడకట్టి, ఏదైనా నూనె కలిపి రాసుకోవచ్చు.
మందార పువ్వులు నిస్తేజంగా ఉన్న శిరోజాలకు కండిషనర్‌గా ఉపయోగపడి మెరుపును తీసుకువస్తాయి. మాడుపై ఉండే చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. గుప్పెడు మందార పువ్వులను తీసుకొని, వాటిని మెత్తని పేస్ట్‌లా తయారు చేసి,అందులో కొద్దిగా పెరుగు కలిపి తలకు ప్యాక్ వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారి ఉన్న శిరోజాలు మృదువుగా అవుతాయి.
‘గులాబీపువ్వులలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకే కాదు ఔషధంగా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. టోనర్‌గా రోజ్‌వాటర్, ఫేస్ మాస్క్‌లు, చర్మ సంరక్షణలో రోజ్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు.
(చదవండి: అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్‌ఏ టెస్ట్‌లో..!)