శాస్త్రవేత్తలకు సూచనలిస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ టి.జానకీరాం
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ద్వారా రెండు కొత్త నిమ్మ రకాలను విడుదల చేయనున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ టి.జానకీరాం తెలిపారు. తిరుపతిలోని చీనీ, నిమ్మ పరిశోధన స్థానాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఇక్కడ అభివృద్ధి చేస్తున్న చీనీ, నిమ్మ మొక్కల నర్సరీని పరిశీలించారు. రైతులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఏఎల్–94–14, టీఏఎల్–94–13 అనే రెండు కొత్త నిమ్మ రకాలను రూపొందించామన్నారు. త్వరలోనే వీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఇందులో టీఏఎల్–94–14 రకం ఊరగాయ తయారీకి ఉపయోగకరమన్నారు. సీఎస్‌ఐఆర్ సంస్థ నుంచి పరిశోధన ప్రాజెక్ట్ లభించిందని, తిరుపతి పరిశోధన స్థానంలో ఈ ప్రాజెక్ట్ చేపడతామని చెప్పారు.
వర్సిటీ ఈ ఏడాదిని చీనీ, నిమ్మ సంవత్సరంగా గుర్తించి ఈ పంటల సాగు విస్తీర్ణం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాది కాలంలో 1.5 లక్షల చీనీ, నిమ్మ మొక్కలను రైతులకు అందించినట్టు చెప్పారు. గుంటూరు లాం ఫామ్‌లో మిరప, అనంతరాజు పేట పరిశోధన స్థానంలో కనకాంబరం పూలపై పరిశోధనల కోసం రెండు సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ పరిశోధన సంచాలకులు ఆర్వీఎస్‌కే రెడ్డి, విస్తరణ సంచాలకులు బి.శ్రీనివాసులు, తిరుపతి చీనీ, నిమ్మ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఆర్.నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment