మిరప, మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపులో రెండోస్థానం
రాష్ట్రంలో ఉద్యానసాగు 45.58 లక్షల ఎకరాలు..
ఉత్పత్తి 366.53 లక్షల టన్నులు వెల్లడించిన 2023–24 సామాజిక ఆర్థికసర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్ర వృద్ధిలో ఉద్యానపంటలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఏపీ ఉద్యానపంటల హబ్‌గా మారుతోంది. బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, ఆయిల్‌పాం ఉత్పాదకతలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, మిరప, మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపు ఉత్పాదకతలో రెండోస్థానంలో ఉందని 2023–24 సామాజిక ఆర్థికసర్వే వెల్లడించింది. 2023–24లో కొత్తగా 1,43,329 ఎకరాల్లో ఉద్యానపంటల సాగు చేపట్టినట్లు తెలిపింది.
ఉద్యానపంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, ప్రధానంగా రాయలసీమ ప్రాంతం ఉద్యాన హబ్‌గా తయారవుతోందని పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 45.58 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగవుతుండగా.. అందులో 43 శాతం (19.50 లక్షల ఎకరాల్లో) రాయలసీమలోనే సాగవుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉద్యానపంటల ఉత్పత్తి 366.53 లక్షల మెట్రిక్ టన్నులుండగా.. అందులో 52 శాతం (189.69 లక్షల మెట్రిక్ టన్నులు) రాయలసీమలోనే ఉత్పత్తి అవుతున్నట్లు వివరించింది. మెట్ట ప్రాంతాల్లో తక్కువ ఆదాయం వచ్చే పంటలకు బదులు ఎక్కువ లాభదాయకమైన ఉద్యానపంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపింది.
ఉద్యానపంటల ఉత్పాదకత, నాణ్యత పెంపుదల కోసం ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా తోటబడి పేరుతో సలహాలు, సూచనలు ఇస్తోందని, అలాగే విపత్తుల్లో దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుందని తెలిపింది. 2023–24లో ఉద్యానపంటలు దెబ్బతిన్న 1.31 లక్షల మంది రైతులకు రూ.139.31 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించినట్లు వెల్లడించింది. ఏపీ ఉద్యానపంటల అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించిందని సర్వే తెలిపింది. ఇప్పటివరకు 1,62,071 మెట్రిక్ టన్నులను వివిధ దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపింది. రాయలసీమలో సేకరణ కేంద్రాలను, ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment