Papaya
-
బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, ఆయిల్‌పాం.. ఉత్పాదకతలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వృద్ధిలో ఉద్యానపంటలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఏపీ ఉద్యానపంటల హబ్‌గా మారుతోంది. బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, ఆయిల్‌పాం ఉత్పాదకతలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, మిరప, మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపు ఉత్పాదకతలో రెండోస్థానంలో ఉందని 2023–24 సామాజిక ఆర్థికసర్వే వెల్లడించింది. 2023–24లో కొత్తగా 1,43,329 ఎకరాల్లో ఉద్యానపంటల సాగు చేపట్టినట్లు తెలిపింది.ఉద్యానపంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, ప్రధానంగా రాయలసీమ ప్రాంతం ఉద్యాన హబ్‌గా తయారవుతోందని పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 45.58 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగవుతుండగా.. అందులో 43 శాతం (19.50 లక్షల ఎకరాల్లో) రాయలసీమలోనే సాగవుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉద్యానపంటల ఉత్పత్తి 366.53 లక్షల మెట్రిక్ టన్నులుండగా.. అందులో 52 శాతం (189.69 లక్షల మెట్రిక్ టన్నులు) రాయలసీమలోనే ఉత్పత్తి అవుతున్నట్లు వివరించింది. మెట్ట ప్రాంతాల్లో తక్కువ ఆదాయం వచ్చే పంటలకు బదులు ఎక్కువ లాభదాయకమైన ఉద్యానపంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపింది. ఉద్యానపంటల ఉత్పాదకత, నాణ్యత పెంపుదల కోసం ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా తోటబడి పేరుతో సలహాలు, సూచనలు ఇస్తోందని, అలాగే విపత్తుల్లో దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుందని తెలిపింది. 2023–24లో ఉద్యానపంటలు దెబ్బతిన్న 1.31 లక్షల మంది రైతులకు రూ.139.31 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లించినట్లు వెల్లడించింది. ఏపీ ఉద్యానపంటల అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించిందని సర్వే తెలిపింది. ఇప్పటివరకు 1,62,071 మెట్రిక్ టన్నులను వివిధ దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపింది. రాయలసీమలో సేకరణ కేంద్రాలను, ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించింది. -
Diwali 2024 ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా, టేస్ట్ అదిరిపోవాలంతే!
దీపావళి వెలుగు దివ్వెలు, మతాబులు, చిచ్చబుడ్ల వెలుగులు మాత్రమే కాదు స్వీట్ల పండుగ కూడా. అయితే ఎప్పడూ చేసుకునే తరహాలో కాకుండా, ఆయిల్ లేకుండా ఆరోగ్య కరంగా చేసుకునే స్వీట్ల గురించి తెలుసుకుందాం. ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం పట్టదు కూడా. ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా ఎలా చేయాలో చూద్దాం రండి!బొప్పాయిహల్వాకావల్సిన పదార్ధాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుబొప్పాయి పండు – ఒకటి (తొక్క తీసి తురుముకోవాలి)పంచదార – పావు కప్పుబాదం పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లుయాలకుల పొడి – టీ స్పూనుకోవా తురుము – మూడు టేబుల్ స్పూన్లుబాదం పలుకులు, ఎండు ద్రాక్షలు – రెండు టీస్పూన్లు.తయారీ విధానంముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి.నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ. సహజతీపితో ఉండే ఈ హల్వాలోని పోషకాలు బొప్పాయిలో విటమిన్ సి ,బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్, డైటరీ ఫైబర్‌లో కూడా ఎక్కువే. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.జీర్ణక్రియకు ,గట్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇందులోని బెల్లం ఇనుము , మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు సహజమైన తీపిని అందిస్తుంది.బాదం, ఎండుద్రాక్షలతో రుచిని పెంచడమే కాకుండా ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ E, మెగ్నీషియం లభిస్తాయి. -
బొప్పాయి తొక్కలతో అందం, ఆనందం
ఆరోగ్యం కోసం అనేక రకాల పండ్లను తినడం మనకు అలవాటు. పండ్లతోనే పండ్ల తొక్కలతో కూడా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి బొప్పాయి తొక్కలు. రుచికి, మంచిపోషకాలకు పెట్టింది పేరు బొప్పాయి. కానీ ఆ పండ్ల తొక్కల్లో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. సౌందర్య పోషణలో బాగా ఉపయోగపడతాయి.బొప్పాయి పండు లోనే కాదు బొప్పాయి తొక్కలోనూ ఎన్నో పోషకాలు లభిస్తాయి. బొప్పాయి పీల్స్‌లో క్రూడ్ ప్రొటీన్, క్రూడ్ ఫైబర్, క్రూడ్ ఫ్యాట్, యాష్ కంటెంట్, తేమ, కార్బోహైడ్రేట్, ఫ్యాటీ యాసిడ్, ఎనర్జీ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బీ1, విటమిన్ బీ2, విటమిన్ బీ3, విటమిన్ బీ6, విటమిన్ బీ12 ,విటమిన్ సీ వంటి విటమిన్లు , ఖనిజాలను కూడా ఉంటాయి. పండిన బొప్పాయి తొక్కలు కాల్షియం, పొటాషియం, ఐరన్ కూడా లభిస్తాయి. అందుకే సౌందర్య పోషణ ఉత్పత్తులో దీన్ని విరివిగా వాడతారు. అలాగే ఇంట్లో సహజంగా ఫేస్‌ప్యాక్‌లా కూడా వాడుకోవచ్చు. ఇవి చర్మ ఆరోగ్యానికి ,చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సాయపడతాయి.పండిన బొప్పాయి తొక్కల్ని శుభ్రంగా కాడిగి, మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి రోజ్‌వాటర్ పెరుగు బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి , మెడకుప్యాక్లా వేసుకుని, ఆరిన తరువాత కడిగేసుకోవాలి. కనీసం పండిన బొప్పాయి ముక్కల్ని ముఖంపై సున్నితంగా రుద్దు కొని, ఆరిన తరువాత చల్లని నీళ్లతో కడుక్కున్నా ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. టాన్ పోతుంది. ప్రెష్‌గా, ప్రకాశవంతంగా మారుతుంది. బొప్పాయి తొక్కలతో అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లోఒకటి దాని ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణం అలాగే ఇందులోని పపైన్ మృత చర్మ కణాలను తొలగిస్తుంది. బొప్పాయిలో లైకోపీన్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచి, తొందరగా వృద్ధాప్య చాయలు రాకుండా కాపాడతాయి. -
చర్మంపై మృత కణాలు పోవాలంటే.. ఇలా చేయండి!
టొమాటో రసం పావు కప్పు తీసుకుని అందులో దూది ముంచి ముఖానికి అద్దాలి. ఆరిన తర్వాత వలయాకారంగా మర్దన చేస్తూ చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా కాంతివంతంగా మారుతుంది. వార్ధక్య లక్షణాలుగా కనిపించే ముడతలు కూడా తొలగిపోతాయి.మృత కణాలు పోవాలంటే...బొప్పాయి గుజ్జు పావు కప్పు తీసుకుని అందులో టీ స్పూన్ పన్నీరు (రోజ్‌వాటర్) కలిపి ముఖానికి రాయాలి. పది లేదా పదిహేను నిమిషాలకు తేమను చర్మం పీల్చుకుంటుంది. అప్పుడు వేళ్లతో వలయాకారంగా ముఖమంతా మర్దన చేసి చన్నీటితో శుభ్రం చేయాలి. బొప్పాయిలోని ఎంజైమ్‌లు చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.ఇవి చదవండి: హెల్త్ ఫ్యాక్ట్: నాన్‌వెజ్ తిన్నాక బాదం తినండి... ఎందుకంటే..? -
బొప్పాయి ఆకులతో గుండె,కాలేయం,కిడ్నీలు పదిలం! అదెలాగంటే..
బొప్పాయి పండు అంటే చాలా మందికి ఇష్టం.బొప్పాయి పండు జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.బొప్పాయి పండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వలన అది మలబద్దకం సమస్యను నివారిస్తుంది. కేవలం బొప్పాయి పండు మాత్రమే కాకుండా బొప్పాయి ఆకులతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు చెప్తున్నారుప్రస్తుతం మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి కొంగొత్త అనారోగ్య సమస్యలను ఎదురుకోవలసి వస్తుంది. కొన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స కూడా ఉండటం లేదు. ఈ క్రమం లోనే చాలా మంది జనాలు ఆయుర్వేదం,పురాతన వైద్యం చిట్కాలను ఆశ్రయిస్తున్నారు. మనిషి శరీరంలో ప్రధానమైన అవయవాలలో గుండె,కాలేయం,కిడ్నీ ఉన్నాయి. ఒక మొక్క ఈ మూడు అవయవాలను 70 ఏళ్ళ పాటు ఆరోగ్యంగా ఫిట్ గా ఉంచుతుంది అని చాలా మందికి తెలియదు. ఈ అవయవాలకు ఆ మొక్క సంజీవినిలాగ పని చేస్తుంది. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం..బొప్పాయి ఆకులో యాంటీ ట్యూమర్ గుణాలు ఉన్నాయి.అవి కాన్సర్ ను నివారించటం లో చాలా సహాయపడతాయి.బొప్పాయిలో ఉండే ఈ యాంటీ ట్యూమర్ గుణాలు కణితులను నివారించి కాన్సర్ బారిన పడకుండా చేస్తాయి. బొప్పాయి ఆకుల రసంలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.బొప్పాయి ఆకుల రసం వివిధ వ్యాధులను నివారించటం లో సహాయం చేస్తుంది కాబట్టి ఈ రసాన్ని సర్వ రోగ నివారిణి అంటారు.బొప్పాయి ఆకులతో చేసిన రసం గుండె,కాలేయం,కిడ్నీ వంటి అవయవాలకు చాలా మేలు చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. బొప్పాయి ఆకులతో చేసిన రసం మలేరియా,డెంగ్యూ వంటి వ్యాధుల చికిత్స లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది.బొప్పాయి ఆకులతో చేసిన రసాన్ని తాగితే ప్లేట్ లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది.అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఈ రసం రక్త ప్రసరణను వేగంగా మెరుగుపరుస్తుంది. గర్భాశయ, ప్రోస్టేట్,రొమ్ము, ఊపిరితిత్తుల కాన్సర్ నివారణలో బొప్పాయి ఆకుల రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.మలబద్దకం సమస్య ఉన్న వారికి ఈ రసం ఔషధంలా పని చేస్తుంది.ఈ రసాన్ని బేది మందు అని కూడా అంటారు. బొప్పాయి ఆకులతో చేసిన రసం శరీరం లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన అవి ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయ పడతాయి. గుండె,కాలేయం,కిడ్నీ లను మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఈ బొప్పాయి ఆకుల రసం చాలా సహాయపడుతుంది. అందుకే బొప్పాయి ఆకుల రసం గుండె,కాలేయం,కిడ్నీఅవయవాలకు సంజీవనిలాగ పని చేస్తుంది అని నిపుణులు నమ్మకంగా చెబుతున్నారు. (చదవండి: నేహా ధూపియా వెయిట్ లాస్ జర్నీ!..ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గే స్ట్రాటజీ ఇదే..!) -
మీరెప్పుడైనా బొప్పాయి బన్స్ ట్రై చేసారా..!
కావలసినవి: బొప్పాయి గుజ్జు, బాదం పౌడర్ – 1 కప్పు చొప్పున పీనట్ బటర్, అవిసెగింజల పొడి – అర కప్పు చొప్పున, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – అర టీ స్పూ¯Œ , బాదం – జీడిపప్పు ముక్కలు, మినీ చాక్లెట్ చిప్స్ – 2 టేబుల్ స్పూన్ల చొప్పున కొబ్బరి తురుము – కొద్దిగా (గార్నిష్‌కి) తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో బొప్పాయి గుజ్జు, అవిసెగింజల పొడి, బాదం పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వెనీలా ఎక్స్ట్రాక్ట్, పీనట్స్ బటర్, బాదం – జీడిపప్పు ముక్కలు వేసుకుని.. మరోసారి బాగా కలుపుకోవాలి. అనంతరం చాక్లెట్ చిప్స్ వేసుకుని ఒకసారి కలుపుకుని.. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని.. ఆ మొత్తం మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని కొబ్బరి కోరులో వేసి, దొర్లించి.. సర్వ్ చేసుకోవాలి. ఇవి చదవండి: స్వీట్ పొటాటో బన్స్.. క్షణాలలో ఇలా రెడీ చెయొచ్చు! -
ఇందిరా గాంధీ బ్రేక్ ఫాస్ట్ కోసం ఓ చెఫ్ పడ్డ పాట్లు!
ఇందిరా గాంధీకి సంబంధించిన ఓ ఆసక్తికర కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజ్ గోవాలోని చెఫ్ సతీష్ అరోరా తన పుస్తకంలో పేర్కొన్న ఘటన ఇది. తాను ఇందిరా గాంధీకి బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయి పండ్లు ఇచ్చేందుకు ఎంతలా కష్టపడాడో గుర్తు చేసుకున్నారు. ఓ యుద్ధమే చేసినట్టు తాను రాసిన స్వీట్స్ అండ్ బిట్టర్స్: టేల్స్ ఫ్రమ్ ఏ చెఫ్స్ లైఫ్ అనే పుస్తకంలో వివరించారు. ఇంతకీ ఆ చెఫ్ గెలచాడా? లేదా? అసలేం జరిగిందంటే..అది 1983లో ఇందిరాగాంధీ చోగం (CHOGM) సమావేశం సందర్భంగా జరిగిన ఘట్టం. చెఫ్ అరోరా ఆ పుస్తకంలో.. 1983 నవంబర్‌లో దివగంత మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో గోవాలో దాదాపు 40కి పైగా కామెన్వెల్త్ దేశాల నాయకులతో 48 గంటల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ సదస్సు వరల్డ్ టూరిజం మ్యాప్‌లో గోవాను ఉంచాలనే లక్ష్యంతో జరుగుతోంది. వారికి గోవా తాజా హోటల్లో ఆతిధ్యం ఏర్పాటు చేశారు. నాయకులకు అందించే వంటకాల మెనుతో సహా ఇందిరాగాంధీ భోజన మెనూ కూడా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చింది. ఇందిరాగాంధీ బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయిలు తీసుకుంటారని ఆ మెనూలో ఉంది. గోవాలో అది కూడా నవంబర్ మాసం కావడంతో బోపాయిలు ఎక్కడ అందుబాటులో లేవు. అదీగాక ఈ కామెన్వెల్త్ నాయకుల సదస్సు కోసం గోవా అంతటా టైట్ సెక్యూరిటీతో పోలీసులు బందోబస్తుతో హాడావిడిగా ఉంది. ఎక్కడిక్కడ మరమత్తులు చేసి వీధి దీపాలు వెలిగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బయటకు వెళ్లి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే పోలీస్ చెకింగ్ దాటుకుని బయటకు వెళ్లి తిరిగి రావడం మాటలు కాదు. దీంతో చెఫ్‌ల బృందం బొప్పాయిలను ముంబై తాజ్ నుంచి తెప్పించే ఏర్పాట్లు చేసిందని అక్కడే ఐదేళ్లుగా సేవలందించిన చెఫ్ సతీష్ అరోరా వెల్లడించారు. "వచ్చిన పచ్చి బొప్పాయిలు తొందరగా పక్వానికి వచ్చేలా కాగితం చుట్టి ఉంచాను. అవి పక్వానికి మెల్లగా వస్తున్నాయి. ఇంకో పక్క ఇందిరా గాందీ, ఆమె సిబ్బంది బ్రేక్ ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పడంతో ఎలా అందించాలో తెలియక కలవరపడుతున్నాం. ఎందుకంటే సరిగా పక్వానికి రానీ పండ్లను వారికి ఎలాఅందించాలో తెలియక ఒకటే ఆందోళన. ఇక లాభం లేదనుకుని ఆమెకు బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయిలు అందించేందుకు పోలీస్ జీపులో ఓ యుద్ధ వీరుడి మాదిరి గోవా మార్కెట్లన్నీ గాలించానని" తెలిపారు అరోరా. "చివరికి ఓ మార్కెట్లో పండిన బొప్పాయిలు కనిపించాయి. ఓ డజను బొప్పాయిలను తీసుకుని అదే జీపులో వస్తూ.. ఏదో సాధించిన వీరుడిలా ఆనందంగా వచ్చా". కానీ చివరికి ఆ హోటల్ ప్రవేశించేందుకు హోటల్ సెక్యూరిటీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యులు అరోరాను అడ్డుకున్నారు. వాస్తవాన్ని వివరించి ఎంతగా బతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ పండ్లలో పేలుడు పదార్థాలు ఉన్నాయోమో! అని ప్రతి దానికి రంధ్రాలు పెట్టి చెక్‌చేశారు. ఓ రెండు చెక్‌లు చేసి వదిలిపెట్టక మొత్తం అన్నింటికి రంధ్రాలు చేశారు సెక్యూరి సిబ్బంది. ఏదో రకంగా ప్రదాని ఇందిరా గాంధీకి బ్రేక్‌ఫాస్ట్‌గా బోప్పాయిల అందిచేందుకు చేసిన యుద్ధం విజయవంతం కాకపోగా తమకు అత్యంత నిరాశనే మిగిల్చిందంటారు అరోరా. పైగా జీవితంలో మర్చిపోలేనంత టెన్షన్‌కి గురిచేసిన రసవత్తరం ఘట్టం అని తన పుస్తకం స్వీట్స్ అండ్ బిట్టర్స్లో చెప్పుకొచ్చారు చెఫ్ అరోరా. నాయకులకు సంబంధించని కొన్ని ఆసక్తకర విషయాలు వాళ్లు మన ముందు సజీవంగా లేకపోయినా వాళ్ల నిర్ణయాలు, జీవితశైలికి అద్దం పట్టేలా కనిపిస్తాయి కదూ!. (చదవండి: సీతమ్మ శాపాన్ని ఉపసంహరించుకుందేమో! అందుకే ఇవాళ అయోధ్య..!) -
Papaya Farming: బొప్పాయి.. ఇలా పండిస్తే లక్షల్లో లాభాలు, ఫుల్ డిమాండ్
సంప్రదాయ పంటలతో విసిగిన రైతన్న ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో గిరాకీ ఉన్న బొప్పాయి పంటను సాగు చేసేందుకు బాపట్ల జిల్లాలో రైతులు మొగ్గుచూపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతికూల పరిస్థితులను అధిగమించి బొప్పాయి పంటను జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తూ లాభాల బాటలో నడుస్తున్నారు బొప్పాయి రైతులు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి బొప్పాయిని సాగు చేసుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చని తద్వారా రైతులకు లాభాలు వస్తాయని ఉద్యానశాఖ అధికారిణి దీప్తి పేర్కొన్నారు. 324 ఎకరాల్లో బొప్పాయి సాగు జిల్లాలోని కొల్లూరు మండలంలో 9.02, భట్టిప్రోలులో 18.23, సంతమాగులూరులో 155.74, బల్లికురవ 45.54, మార్టూరు 12.85, యద్దనపూడి 11.79, జే.పంగులూరు 21.93, అద్దంకి 32.18, కొ రిశపాడు 16.74 ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు. రెండు సంవత్సరాల పంటకాలంలో ఎకరాకు 90 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఖర్చుపోను నికరంగా రూ.2లక్షల వరకు ఆదాయం రావడంతో జిల్లా రైతులు బొప్పాయి సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో నామమాత్రంగా సాగు చేపట్టిన బొప్పాయి ఈ ఏడాది అత్యధికంగా 324 ఎకరాలకు పైగా సాగు చేపట్టారు. బొప్పాయి సాగులో రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం వలన పండిన పంట ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కాయలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని రైతులు చెప్తున్నారు. అనుకూలమైన రకాలతో మంచి దిగుబడి జిల్లాలో సాగు చేపట్టాలనుకునే రైతులు రెడ్ లేడీ, వాషింగ్టన్, కో 1,2,3 రకాలు అనువైనవి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేసుకోవాలి. మొక్కలు నాటే సమయంలో గుంతల్లో ప్రతి గుంతకూ 20 కిలోల పశువుల ఎరువు, 20 గ్రాముల అజోప్పైరిల్లమ్, 20 గ్రాముల ఫాస్ఫోబాక్టీరియా, 40 గ్రా ముల మైకోరైజాను బాగా కలుపుకొని వేసుకోవాలి. నాటే సమయం జూన్, జులై, అక్టోబర్, నవంబర్ మాసాల్లో నాటుకోవచ్చు. 40 నుంచి 60 రోజుల వయస్సున్న 15 సెంటీమీటర్ల పొడవు గల మొక్కలను సాయంత్రం సమయంలో నాటుకోవాలి. ఎరువుల యాజమాన్యం ప్రతి మొక్కకూ రెండు కిలోల నాడెప్ కంపోస్టు, ఒక కిలో వేపపిండి, అర కిలో ఘనజీవామృతం వేసుకొని మొక్కలను నాటుకోవాలి. తరువాత ప్రతి 20 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతాన్ని పారించుకోవాలి. మొక్కలపై ప్రతి 15 రోజుల కొకసారి పంచగవ్యను పిచికారీ చేసుకోవాలి. ప్రతి 25 రోజులకు ఒకసారి శొంఠి పాల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. బొప్పాయిలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చు. ప్రకృతి సాగు చేయడం వలన కాయలు బరువుగా నాణ్యత కలిగి ఉంటాయి. వేసవిలో కూడా బెట్టకు రాకుండా అధిక దిగుబడులు వస్తాయి. అలాగే పండుగ సమయాల్లో టన్ను రూ.22 వేల వరకు పలుకుతుంది. మార్కెట్లో కిలో బొప్పాయి రూ.90 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ లేని సమయంలో కూడా టన్ను రూ.10 నుంచి 15 వేలు ధర పలుకుతుంది. – దీప్తి, ఉద్యానశాఖ అధికారిణి -
బొప్పాయిలో వైరస్ తెగుళ్లు.. నివారణ లేకపోతే నష్టమే
బొప్పాయి పంటను వైరస్ తెగుళ్లు ఆశించి రైతులు నష్టపోతున్నారు. ఆ తెగుళ్ల బారినపడి పంట దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్త శ్రీకృష్ణ రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. వెర్రి తెగుళ్లు మొజాయిక్, రింగ్‌స్పాట్(ఉంగరాల) తెగులు, ఆకుముడత(క్రింకిల్) అనే మూడు రకాల వెర్రి తెగుళ్లు బొప్పాయి పంటను నాశనం చేసి దిగుబడులను గణనీయంగా తగ్గించడమే కాక పండు నాణ్యతను బాగా దెబ్బతీసి విపరీత నష్టాన్ని కలిగించడంతో పాటు కొన్ని సందర్భాల్లో చెట్లు కాపునకు రాకుండా గొడ్డు చెట్టుగా మారడం జరుగుతుంది. ఈ మహమ్మారి వెర్రి తెగుళ్లను తొలి దశ నుంచే యాజమాన్య పద్ధతులతో అరికట్టాలి. వెర్రి తెగులు తాలుకు వైరస్ కణాలు ఒకమారు మొక్కలో ప్రవేశిస్తే మొక్క క్షీణించే వరకు దాని జీవకణాలలోనే ఉండి రకరకాలుగా లక్షణాలు కలిగించి అనర్ధాలకు దారితీస్తుంది. మొజాయిక్ తెగులు మొజాయిక్ తెగులు ఆశిస్తే ఆకు సైజు తగ్గుతుంది. ఆకులపై అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు ఈనెలు లేకుండా ఏర్పడతాయి. దూరం నుంచి ఆకులు పసుపు రంగుకు మారినట్లు కన్పిస్తాయి. అందుకే దీనిని పల్లాకు తెగులని కూడా అంటారు. తెగులు సోకిన ఆకులు పెళుసుగా మారతాయి. చెట్ల పెరుగుదల తగ్గి ఎదుగుదల ఉండదు. పంట దిగుబడి నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. కాయలు గిడసబారి నాసిగా ఉంటాయి. విత్తనం మరియు పేనుబంక ద్వారా తెగులు వ్యాపిస్తుంది. ఉంగరాల(రింగ్‌స్పాట్) తెగులు ఈ తెగులు లక్షణాలు ఆకులు, కాడ, కాండం, పూత, పిందె, కాయ, పండ్లపై ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. లేత ఆకులు పచ్చదనం కోల్పోయి పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. దీంతో ఆకుల పరిమాణం తగ్గి సరైన మోతాదులో ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కాండం పైభాగాన ఆకు తొడిమలపై ముదురాకు పచ్చని మచ్చలు, చారలు నూనె రాసినట్లు కన్పిస్తాయి. తెగులు తీవ్ర దశలో ఒక దానితో ఒకటి కలిసి మొక్క ఎదుగుదల తగ్గుతుంది. పూత, పిందె, కాయ, పండుపై గోధుమ రంగుతో ఉంగరాల్లాంటి రింగులు ఏర్పడతాయి. వీటి మధ్యభాగం ఆకుపచ్చగా ఉంటుంది. ఒక్కో పండుపై వీటి సంఖ్య వందల్లో ఉంటాయి. తెగులు సోకిన చెట్టు పూలు అంతగా పిందె కట్టవు. పిందెలు ఎదగవు. రింగులున్న కాయలు తొందరగా పండి మెత్తబడి నీరుకారుతాయి. నాణ్యత లోపిస్తుంది. దూరప్రాంతాల రవాణాకు పనికిరావు. విత్తనం మరియు పేనుబంక ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకుముడత(లీఫ్ క్రింకిల్ లేదా కర్ల్) తెగులు ఈ తెగులు సోకిన చెట్లలో ఎదుగుదల తగ్గుతుంది. ముడతలు పడి ఆకులు ముడుచుకుని బంతిలా మారతాయి. ఆకు తొడిమ వంకర టింకరగా తిరుగుతుంది. వికృతాకారంగా ఉంటుంది. చెట్టు తల ఆకారం మారుతుంది. పూత రాక గొడ్డు చెట్టుగా మారవచ్చు. తెల్లదోమ ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది. తెగుళ్ల నివారణకు.. ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలు వాడాలి. విత్తన శుద్ధి తప్పనిసరి. నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటేటప్పు డు వెర్రి తెగుళ్ల లక్షణాలుంటే తీసేయాలి. అంతర పంటగా మిరప, టమాటా, దోస పుచ్చ, గుమ్మడి లాంటివి సాగుచేయొద్దు. తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే తీసి నాశనం చేయాలి. సమతుల సమగ్రమైన ఎరువులను సకాలంలో అందించాలి. సూక్షధాతు మిశ్రమాన్ని 3, 4 నెలల వయస్సులో ఒకమారు చెట్లపై పిచికారి చేయాలి. కలుపు మొక్కలు పొలంలోను, పొలం గట్లపైన లేకుండా పరిశుభ్రతను పాటించాలి. తోటలో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి. అంతర సేద్యం చేసేటప్పుడు చెట్ల వేర్లకు గాయాలు తగలకుండా చూడాలి. రసం పీల్చే పురుగులతోనే వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి. పేనుబంక, తెల్లదోమ పురుగులను సకాలంలో నివారించాలి. వాటి ఉధృతిని నివారించాలంటే థైయోమిథాక్సిన్ 0.3 గ్రా, లేదా డైఫెన్త్యూరియాన్ 1 గ్రా, లేదా స్పినోస్యాడ్ 0.3 మి.లీ లేదా ఎసిఫెట్ 1.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాటితో పాటు 5 మి.లీ వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 15 రోజుల వ్యవధిలో పై మందులను మార్చుతూ రెండు, మూడు సార్లు పిచికారి చేసుకుంటే పురుగు వృద్ధి తగ్గుతుంది. బొప్పాయిలో వైరస్ తెగుళ్ల లక్షణాలు కన్పించిన మొక్కలను మొదట్లోనే పీకేయాలి. సరైన నీరు, పోషకాల యాజమాన్యం ద్వారా వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు. నీటి పోషకాల యాజమాన్యం సక్రమంగా లేకపోవడంతోనే తెగుళ్లు అధికంగా వస్తాయి. -
ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా...
పిల్లలు కొన్నిసార్లు ఎంత రుచిగా చేసి పెట్టినా సరే, ఆకలి కావడం లేదంటారు. తరచూ విరేచనాలు చేసుకుంటారు. బరువు తగ్గిపోయి బలహీనంగా కనిపిస్తుంటారు. ఎందుకు ఇలా అవుతోందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. నిజానికి ఇవి ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలేమీ కాదు. కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం... తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి రోగాల బారిన పడుతారు. ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాల మీదికి కూడా వస్తుంది. కడుపులో నులి పురుగులు పోవడానికి... ►వేప నూనె పది చుక్కలు చక్కెరలోవేసి లోపలకు తీసుకుంటే క్రిములు నశిస్తాయి. ►గుప్పెడు లేత వేప చిగురు, అర చెంచా ఉప్పు, అర చెంచా పసుపు కలిపి మాత్రల్లా చేసుకొని రాత్రి నిద్రించే ముందు ఒక మాత్ర వేసుకుంటే నులిపురుగులు నశిస్తాయి. ►పచ్చి బొప్పాయి కాయకు గాట్లు పెట్టగా వచ్చిన పాలు చెంచా, ఆముదం చెంచా కలిపి తాగితే.. పురుగులు పడి పోతాయి. ►ఎండించిన వేప పువ్వు 50 గ్రాములు. మిరియాల పొడి చెంచా, ఉప్పు చెంచా కలిపి ప్రతిరోజు భోజనంలో మొదటి ముద్దగా కలుపుకుని తినాలి, లేదా గ్లాసు నీటిలో ఒక చెంచా వేసి సగం అయ్యే వరకు మరిగించి కషాయం లాగా తాగినా కూడా నులిపురుగులు నశిస్తాయి. ►వీటన్నింటినీ చేయడం కష్టం అనుకుంటే ఆల్బెండిజాల్ ట్యాబ్లెట్‌ను పదిహేను రోజులకొకసారి చొప్పున నెలరోజులు వాడాలి. ఒక నెల గ్యాప్ ఇచ్చి అదే రిపీట్ చేయాలి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: మేడం.. నాకు 25 ఏళ్లు... మూడుసార్లు డాక్టర్ దగ్గరకు వెళ్లాను... పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి? -
బొప్పాయి గింజలు పొడి చేసుకుని తిన్నారంటే! ఇందులోని కార్పైన్, పాలీఫెనాల్స్ వల్ల
Health Tips In Telugu- Papaya Seeds: బొప్పాయి పండు తరగగానే ముందు అందులో ఉండే గింజలు తీసి అవతల పారేస్తాం. బొప్పాయి గింజలపై జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఇవి కొద్దిగా కారంగా, చేదుగా ఉంటాయి. వీటిని ఎండబెట్టి.. మిక్సీలో పొడిలా చేసి తినవచ్చు. బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ ఉంటాయి. ఇంకా జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇంకా ఈ గింజల్లో ఒలీక్ యాసిడ్, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని పెంచుతాయి. కార్పైన్ వల్ల బొప్పాయి గింజలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ సాధారణ స్థాయికి తగ్గుతుంది. వీటిలో ఉండే కార్పైన్ అనే పదార్థం పేగులలోని పురుగులు, బ్యాక్టీరియాను చంపుతుంది. ఈ విత్తనాలలోని అధిక ఫైబర్.. పేగులు బాగా కదిలేలా చేస్తుంది. బరువు తగ్గుతారు ఫలితంగా జీర్ణక్రియ బాగా జరుగుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి.. శరీర వ్యర్థాలను తొలగిస్తుంది. శరీరంలో అనవసర కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది. ఫలితంగా త్వరగా బరువు తగ్గిపోతారు. పీరియడ్స్ నొప్పిని తగ్గించి బొప్పాయిలో ఉండే కెరోటిన్.... ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. బొప్పాయి గింజలు ఋతుక్రమం సరైన క్రమంలో ఉండేలా చేస్తాయి. పీరియడ్స్ నొప్పిని కొంతవరకూ తగ్గిస్తాయి. బొప్పాయి గింజల్లో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మంట, నొప్పిని తగ్గిస్తాయి. ఇందులోని పాలీఫెనాల్స్ కారణంగా బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్... అనేక రకాల క్యాన్సర్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. రోజూ 5 నుంచి 6 బొప్పాయి గింజలను తీసుకుని.. వాటిని చూర్ణంలా చేసి తినండి. లేదా పొడిలా చేసి నీటిలో కలిపి తాగేయండి. బొప్పాయి గింజల సారాన్ని తాగడం వల్ల... కడుపులో ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాలు చనిపోతాయి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశ ఉంటుంది. చదవండి: బీరకాయ కూర తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల -
బొప్పాయి, దానిమ్మ.. రోజూ తింటే కలిగే లాభాలు! ముఖంపై ముడతలు.. ఇంకా
వయసు పెరిగే కొద్ది రకరకాల మార్పులు రావడం సహజం. ముఖ్యంగా ముఖంపై ముడతలు, ముఖం మెరుపు కోల్పోయి కళావిహీనం కావటం, కళ్లకింద ఉబ్బెత్తుగా ఉండటం, మంగు మచ్చలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వీటినుంచి ఉపశమనానికి చాలా మంది మార్కెట్లో లభించే అనేకమైన కాస్మెటిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే వీటి వినియోగం వల్ల పరిష్కారం లభించకపోగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులుగా కొన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటూ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌లను వాడటం వల్ల శరీరం యవ్వనంగా తయారవుతుంది. అంతేకాకుండా చాలా రకాల చర్మసమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాం... బొప్పాయి దీనిలో చర్మానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి బొప్పాయి పండ్లను ప్రతి రోజూ తినడం మంచిది. బొప్పాయిలో యాంటీ ఏజింగ్ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి కాబట్టి దీనిని తినడం వల్ల శరీరానికి అధిక పరిమాణం లో యాంటీ ఆక్సిడెంట్లు లభించి చర్మం ఆరోగ్యంగా మిలమిలలాడుతుంది. అంతేకాదు, అనేకరకాల చర్మ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బొప్పాయి గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా వాడటం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆకు కూరలు ఆకు కూరల్లో క్లోరోఫిల్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం ఆరోగ్యంగా, కళ్లు మెరుపులీనుతూ ఉండాలంటే ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఆకుకూరల వాడకం వల్ల ఏ లోపం లేకుండా శరీరానికి సమృద్ధిగా విటమిన్లు అందుతాయి. అంతేగాక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. పాలు, బాదం పాలలో ఉండే పోషకాల గురించి చిన్నప్పటినుంచి వింటున్నదే కాబటిట ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇక బాదం పప్పును ఏ విధంగా తీసుకున్నా అందులో చర్మాన్ని యవ్వనంగా ఉంచే లక్షణాలున్నాయి కాబట్టి రోజూ గుప్పెడు బాదం పప్పు తీసుకోవడం చాలా మంచిది. దానిమ్మ దానిమ్మను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని ఆపడానికి సహాయపడుతుంది. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే రోజూ ఆహారంలో దానిమ్మను వినియోగించాలి. దానిమ్మ రసాన్ని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. షుగర్ ఉన్న వారు కూడా దానిమ్మను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పెరుగు శరీరానికి కావాల్సిన ప్రోబయోటిక్స్ అధిక పరిమాణంలో లభించాలంటే ఆహారంలో పెరుగు తప్పనిసరిగా ఉండాల్సిందే. పెరుగును ఫేస్ ప్యాక్‌గా కూడా వాడచ్చు. ప్రతి రోజూ పెరుగును ఆహారంలో తీసుకుంటే ముడతలు తొలగిపోవడంతోపాటు చర్మంపై రంధ్రాలు, మచ్చలు లేకుండా ముఖచర్మం మృదువుగా తయారవుతుంది. పిల్లలకు చిన్నప్పటినుంచి పెరుగు తినే అలవాటు చేయడం మంచిది. పైన చెప్పుకున్న వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మందులు, సౌందర్య సాధనాలతో పనిలేకుండా యవ్వనంగా ఉండచ్చని నిపుణుల మాట. చదవండి: Carrot Juice: క్యారట్ జ్యూస్ తాగే అలవాటుందా?... ఈ విషయాలు తెలిస్తే.. -
Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా!
మొక్కజొన్న పిండి, మైదాపిండితో బొప్పాయి హల్వా ఇలా తయారు చేసుకోండి. కావలసినవి: ►బొప్పాయి – 1(ఒక కేజీ) ►మొక్కజొన్న పిండి, మైదాపిండి – పావు కప్పు చొప్పున ►పంచదార – ముప్పావు కప్పు, చిక్కటి పాలు – 2 కప్పులు ►నెయ్యి – 6 టేబుల్ స్పూన్ల పైనే ►కొబ్బరి తురుము – గార్నిష్ కోసం తయారీ విధానం: ►ముందుగా బొప్పాయి తొక్క, లోపల గింజలు తీసి.. మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ►దానిలో మొక్కజొన్న పిండి, మైదాపిండి, పంచదార, చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపాలి. ►పంచదార కరిగేంత వరకూ కలిపి.. కళాయిలో పోసుకుని.. చిన్న మంట మీద.. ఆ మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ ఉండాలి దగ్గరపడేంత వరకూ. ►మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేస్తూ ఉండాలి. ►దగ్గర పడిన తర్వాత మిగిలిన నెయ్యి మొత్తం వేసుకుని, బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►ఒక బౌల్‌కి నెయ్యి రాసి.. అందులో ఈ మిశ్రమాన్ని వేసుకుని.. చల్లారనివ్వాలి. ►ఆపై నచ్చిన షేప్‌లో ముక్కలు కట్ చేసుకుని కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Makka Sattu Muddalu: మక్క సత్తు ముద్దలు తిన్నారా? ఇలా తయారు చేసుకోండి! ఆరోగ్య ప్రయోజనాలివే! Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?! -
Recipe: ముల్లంగి తురుము, రాగి పిండి, గోధుమ పిండితో ముల్లంగి నాచిన్ రోటీ!
నోటికి రుచిగా ఉండే ఆహారం కాకుండా పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం శరీరానికి చాలా అవసరం. క్యాలరీలు కూడా అవసరమే. అయితే అవసరమైన దానికన్నా ఎక్కువైతే బరువు పెరుగుతారు. అందువల్ల క్యాల్షియం సమృద్ధిగా, క్యాలరీలు తక్కువగా ఉండే వంటకాలు ఎలా వండుకోవచ్చో చూద్దాం... ముల్లంగి నాచిన్ రోటీ కావలసినవి: ►ముల్లంగి తురుము – అరకప్పు ►ముల్లంగి ఆకుల తురుము – అరకప్పు ►రాగి పిండి – అరకప్పు ►గోధుమ పిండి – అరకప్పు ►నువ్వులు – రెండు టీస్పూన్లు ►వేయించిన జీలకర్ర – అరటీస్పూను ►పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను ఉప్పు – రుచికి తగినంత ►నూనె – రోటీ వేయించడానికి సరిపడా. తయారీ: ►నూనె తప్పించి మిగతా వాటన్నింటిని ఒక గిన్నెలో వేసి చపాతీ పిండిలా కలిపేసి పదినిమిషాలపాటు నానబెట్టుకోవాలి ►నానిన పిండిని ఉండలు చేసుకుని రోటీల్లా వత్తుకోవాలి ►బాగా వేడెక్కిన పెనం మీద పావు టీస్పూను నూనె వేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ►లైట్ బ్రౌన్ కలర్లోకి కాలిన తరువాత వెంటనే సర్వ్ చేసుకోవాలి. ►ఇవి వేడిమీదే బావుంటాయి. చల్లారితే గట్టిబడతాయి. బొప్పాయి యాపిల్ స్మూతీ కావలసినవి: ►బొప్పాయి ముక్కలు – రెండు కప్పులు ►గ్రీన్ యాపిల్ ముక్కలు – ఒకటిన్నర కప్పులు ►గింజలు తీసిన ఆరెంజ్ తొనలు – పావు కప్పు ►పెరుగు – కప్పు ►ఐస్ క్యూబ్స్ – ఒకటిన్నర కప్పులు ►వెనీలా ఎసెన్స్ – అరటీస్పూను. తయారీ: ►పదార్థాలన్నింటిని మిక్సీజార్‌లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ►మిశ్రమాన్ని వెంటనే సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ►లేదంటే రిఫ్రిజిరేటర్లో పెట్టి చల్లగా ఉన్నప్పుడు సర్వ్‌చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Sesame Crusted Chicken: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్ చికెన్! Beetroot Rice Balls Recipe: బీట్రూట్ రైస్ బాల్స్ ఇలా తయారు చేసుకోండి! -
Health Tips: డెంగీ జ్వరాన్ని ఎలా గుర్తించాలి? నివారణకు చర్యలేంటి?
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జ్వరం. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. ఈ బాధితుల్లో కొందరికి డెంగీ వల్ల జ్వరం వస్తోంది. అసలు వచ్చింది మామూలు జ్వరమా? లేక డెంగీ జ్వరమా తెలుసుకోవడం ఎలా అన్నది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. డెంగీ లక్షణాలు ►జ్వరం విపరీతంగా ఉంటుంది. దాదాపు 104 డిగ్రీలు ►తీవ్రమైన తలనొప్పి, చలి, ఒళ్లునొప్పులు ►కళ్లలో విపరీతమైన నొప్పి ►శరీరంపై దద్దర్లు ►వాంతులు కావడం, కడుపునొప్పి ►నోరు ఆరిపోవడం, విపరీతమైన దాహం ►కొన్ని సందర్భాల్లో జ్వరం తీవ్రతను బట్టి రక్తస్రావం డెంగీ లక్షణాలుంటే ఏంచేయాలి? ►పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ద్రవాలను ఇవ్వాలి ►జ్వరం వచ్చిన వెంటనే చల్ల నీళ్లతో శరీరం అంతా బాగా తుడవాలి ►దోమలు నివారించడానికి ఇంట్లో కాయిల్స్, లిక్విడ్, దోమ తెరలు వాడాలి డెంగీని నివారించడానికి అనుసరించాల్సిన ఆయుర్వేదంలో ఉన్న జాగ్రత్తలు 1. నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి అందులోని ఒక్కో భాగంలో 1015 లవంగాలను అందులో గుచ్చాలి. దీంతో డెంగీ దోమలు ఆ ప్రాంతంలోకి రావు. 2. బొప్పాయి ఆకును తుంచి బాగా కడిగి వాటిని కలకండతో కలిపి కొన్ని నీళ్లు పోసి, మిక్సీ పట్టాలని. వచ్చిన ఆ మిశ్రమాన్ని వడగట్టి గంటకో గ్లాసు చొప్పున డెంగీ బాధితుడికి తాగిస్తే డెంగీ లక్షణాలు పూర్తిగా మాయం అవుతాయి. 3. క్యారెట్ జ్యూస్, చీనీ రసం, కొబ్బరి బోండం నీళ్లు బాగా తాగిస్తే తొందరగా కోలుకునే అవకాశం ఉంది. 4. కొబ్బరి నూనెను పాదాల నుంచి మోకాళ్ల దాకా బాగా పూయాలి. ఇది యాంటి బయోటిక్‌గా పనిచేస్తుంది. డెంగీ దోమను దగ్గరికి రాకుండా కాపాడుతుంది. 5. డెంగ్యూ జ్వరం కారణంగా తల నెప్పి, వాంతులు, ముక్కు, నోటి చిగుర్ల నుండి రక్తం రావడం, పొత్తి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలకు డెంగ్యూ జ్వరం వస్తే ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ►డెంగీ వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి. జ్వరం తగ్గాక కూడా పూర్తిగా కొలుకోవడానికి ఒక నెల వరకు కూడా సమయం పట్టవచ్చు. ►డెంగీ జ్వరం రోగనిరోధక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి చూపిస్తుంది. ►జ్వరం తగ్గాక పోషకాలతో కూడిన, శుభ్రమైన పరిసరాల్లో తీసిన చెరకు రసం, కొబ్బరినీళ్లు, తాజా పళ్ళ రసం లాంటివి ఇవ్వాలి. ►పాలు, పెరుగు, చేపలు, గ్రుడ్లు, కోడి మాంసం లాంటి పౌష్టికాహారం రోజువారీ ఆహారంలో చేర్చాలి. ►పళ్లలో దానిమ్మపాళ్లు, కూరగాయలతో బీట్ రూట్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. ►మసాలా కూరలు, నూనె పదార్థాలు, బయటి వంటకాలు వీలైనంత వరకు తగ్గించాలి. ►కొన్ని సందర్భాల్లో వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉన్నా శరీర తత్వాన్ని బట్టి శరీరంలోని కొన్ని వ్యవస్థలు సులభంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. జ్వరం వచ్చినపుడు ప్లేట్ లెట్స్ తగ్గి తీవ్రమైన ముప్పుకు దారి తీస్తుంది. ఏ వైరస్ శరీరంలో ఏ భాగాన్ని దెబ్బ తీస్తుంది అనే అవగాహన కలిగిన డాక్టర్‌ను సంప్రదించాలి. అలాంటప్పుడు ప్లేట్ లెట్స్ తగ్గుదలను నిరోధించడానికి కావలసిన మందులు వాడడంతో పాటు ఇతరుల నుంచి సేకరించిన ప్లేట్లెట్లను శరీరంలోనికి ఎక్కిస్తారు. ►బొప్పాయి ఆకుల రసం ఈ ప్లేట్లెట్స్ పెరగడానికి దోహదం చేస్తుంది. ►డెంగ్యూ జ్వరం వచ్చిన తరువాత చర్య తీసుకొవడం కంటే ముందు అది రాకుండా నిరోధించడం మంచిది. ►డెంగ్యూ జ్వరం రాకుండా అడ్డుకొనే టీకా ప్రయోగ దశలో ఉన్నది కొన్ని నెలలలో అందుబాటులోకి రానుంది. అంత వరకు డెంగ్యూ సీజన్ లో శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులను ధరించడం మంచిది. కూలర్లలో , పూలకుండీలలో, పాత టైర్లలో... ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి లేకుంటే డెంగ్యూ దోమలు వీటిలో అభివృద్ధి చెందుతాయి. కిటీకీలకు తెరలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దోమలను ఇంట్లోకి రాకుండా చూడవచ్చు. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Pigmentation: బంగాళా దుంప, నిమ్మ రసం, తేనె.. పిగ్మెంటేషన్‌కు ఇలా చెక్! Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. -
Health Tips: ఈ పండ్ల గింజల్లో ‘సైనైడ్’.. పొరపాటున కూడా తినకండి! ఒకవేళ..
Are These Seeds Poisonous: కొన్ని రకాల పండ్ల గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలను తింటే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అయితే కొన్ని పండ్ల విత్తనాలను పొరపాటునో లేదంటే కావాలనో తరచూ తింటే.. అవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆపిల్ రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. ఆపిల్ మంచిదే అయినా.. ఆపిల్ గింజలు మాత్రం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఎందుంటే వీటిలో ఉండే అమిగ్డాలన్.. సైనైడ్‌ను విడుదల చేస్తుంది. ఇది కడుపులోకి వెళ్లి విరేచనాలు, వికారం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. నిజానికి సైనైడ్ మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆపిల్ గింజల్లో ఇది తక్కువ స్థాయిలోనే ఉంటుంది. చెర్రీ మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి చెర్రీ పండ్లు. కానీ చెర్రీ గింజల్లో హానికరమైన సైనైడ్ సమ్మేళనం ఉంటుంది. వీటిని ఎక్కువ మొత్తంలో తినడం వల్ల ఆపిల్ తినడం వల్ల కలిగే నష్టాలే కలుగుతాయి. ఆప్రికాట్ ఆప్రికాట్ విత్తనాలలో విషపదార్థాలైన అమిగ్డాలన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్లు ఉంటాయి. ఆప్రికాట్ విత్తనాలను తినడం వల్ల శరీరం బలహీనపడటమే కాదు.. ప్రాణాల మీదికి వస్తుంది. ఈ విత్తనాలు ఒక వ్యక్తిని కోమాలోకి తీసుకెళతాయి. పీచ్ పీచ్ విత్తనాల్లో అమిగ్డాలిన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆప్రికాట్ విత్తనాల మాదిరిగానే లక్షణాలు కనిపిస్తాయి. దీనిని తినడం వల్ల పొత్తికడుపు నొప్పి, నెర్వస్ నెస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. పియర్ విత్తనాల్లో ప్రాణాంతకమైన సైనైడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వికారం, విరేచనాలు, పొత్తికడుపు నొప్పిని కలిగిస్తుంది. అలాగే చెమట, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇది కోమాకు కూడా దారితీస్తుంది. ఇంకా బొప్పాయి గింజలు కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముందు చెప్పినట్లుగా ఒకటీ రెండు సార్లు పొరపాటున అదీ ఒకటో రెండో గింజలు తింటే పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ.. తరచూ తింటే మాత్రం ప్రమాదం బారిన పడినట్లే పరిశోధకులు అంటున్నారు. చదవండి: Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. Mental Health: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? ఆ మూడింటిపై నియంత్రణ లేకపోతే! అంతే ఇక.. -
Health: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో ఒక్కటే కాదు గుమ్మడి, గోధుమ గడ్డి..
Super Foods To Increase Platelet Count: ప్రస్తుత కాలంలో డెంగ్యూ జ్వరాలు, వైరల్ ఫీవర్ల మూలాన ప్లేట్లెట్ల కౌంట్ విపరీతంగా పడిపోతూ రోగులను, వారి సంబంధీకులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, ప్లేట్లెట్ల కౌంట్ పడిపోయిన తర్వాత చేయగలిగిందేమీ లేదు, దాతలనుంచి సేకరించిన ప్లేట్లెట్లను రోగులకు ఎక్కించడం మినహా. అలా కాకుండా, మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధకతను పెంచే ఆహారం ఏమిటో తెలుసుకుందాం. రక్తాన్ని పెంచే క్యారట్.. ప్లేట్లెట్ కౌంట్‌ని కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందారని సర్వేలో తేలింది. క్యారెట్‌ని నేరుగానైనా, సలాడ్ రూపంలోనైనా ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది. గుమ్మడికాయ.. ఎక్కువగా వంటల్లో ఉపయోగించే గుమ్మడిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అంతేనా.. ఇందులో ప్లేట్లెట్లని పెంచడమే కాదు, వాటి సంఖ్యను అదుపులో ఉంచే లక్షణాలు కూడా ఉన్నాయి. దీన్ని క్రమబద్ధంగా తీసుకోవడం వల్ల కణాల్లో ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ప్రోటీన్ ఉత్పత్తి అవడమంటే ప్లేట్లెట్స్కౌంట్ పెరిగినట్లే. బొప్పాయి బొప్పాయి పండు ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చాలా మంచిదని తెలుసు. అయితే, కేవలం పండులో మాత్రమే కాదు.. ఈ ఆకుల్లోనూ బోలెడు ఆరోగ్యానికి సంబంధించిన గుణాలున్నాయి. ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్స్, అల్కాలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల 24 గంటల్లోనే ప్లేట్లెట్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ ఆకు రుచి మాత్రం కాస్త చేదుగానే ఉంటుంది. కానీ, ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోకతప్పదు. గోధుమగడ్డి.. ఈ మధ్యకాలంలో చాలామందికి ఆరోగ్యంపై పెరిగిన అవగాహన కారణంగా.. గోధుమగడ్డి గురించి అందరూ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇందులోని ఎన్నో ప్రత్యేక గుణాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి.. ఈ గడ్డిని రసంగా చేసుకుని వడపోసి అందులో కాస్త నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ సులభంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బీ 12 ఫుడ్.. ►పాలు, గుడ్లు, చీజ్‌లో బీ 12 ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పెరుగుతుందని తేలింది. ►బీట్ రూట్.. ఎరుపు రంగులో ఉండే బీట్రూట్.. శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది. దీనిని ఎలా తీసుకున్నా మంచిదే. దీని వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. ►క్యారట్, బీట్రూట్ని కలిపి జ్యూస్ చేసుకుని తాగినా మంచి ఫలితమే ఉంటుంది. విటమిన్ కె ఫుడ్.. విటమిన్ కె ఉన్న ఫుడ్ కూడా ప్లేట్లెట్స్ సంఖ్యని పెంచుతుందని తేలింది. కేల్, గుడ్లు, ఆకుకూరలు, లివర్, మాంసం, క్యాబేజీ తినడం వల్ల కూడా ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. విటమిన్ సి ఫుడ్.. ►ఆరోగ్యానికి విటమిన్ సి చాలా అవసరం. ►విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీ, టమాట, అడవి ఉసిరి, కాలీఫ్లవర్ తినడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని తేలింది. ►ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి కౌంట్‌ని పెంచడంలో ఈ ఆహారపదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ►ప్లేట్లెట్స్ పడిపోయిన వారు సమస్యని పరిష్కరించుకునేందుకు వీటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ►ఒకవేళ తినడం కష్టం అనుకుంటే వీటితో సలాడ్ చేసి భోజనానికి ముందుగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక కమలాఫలాల్ని జ్యూస్‌లా చేసుకోని ►తాగేయొచ్చు. ►ముఖ్య విషయం ఏమిటంటే.. పైన చెప్పిన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం ప్లేట్లెట్స్ సంఖ్య ఒక్కటే పెరగదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిలో వ్యాధి నిరోధకత ఒకటి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. -
Papaya Fruits Packing: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!
గుర్రంకొండ: అన్నయమ్య జిల్లాలో పడమటి ప్రాంతాలైన పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సాగు చేసిన బొప్పాయిని ప్రత్యేక పద్ధతుల ద్వారా దేశరాజధాని ఢిల్లీకి ఎగుమతి చేస్తున్నారు. బొప్పాయి లోడింగ్ అన్నిటికంటే భిన్నంగా ఆసక్తికరంగానూ ఉంటుంది. ఇందుకోసం కాకినాడ, ఒంగోలు ప్రాంతాల నుంచి సిద్ధహస్తులైన కూలీలను వ్యాపారులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముందుగా ఎండుగడ్డితో లారీని లోపలివైపు ప్యాకింగ్ చేయడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.18 వరకు పలుకుతోంది. దీంతో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌కు చెందిన బొప్పాయి వ్యాపారులు ఇక్కడే మకాం వేసి బొప్పాయి కాయలను వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఇక్కడే మకాం సాధారణంగా పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు జులై నెలలో ఇక్కడికి చేరుకొంటారు. ముఖ్యంగా మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మకాం వేస్తుంటారు. అప్పటి నుంచి డిసెంబర్ నెల వరకు ఇక్కడే ఉండి బొప్పాయి కొనుగోలు చేసి ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏజెంట్లను నియమించుకొని బొప్పాయి సాగు చేసిన రైతుల వివరాలు సేకరించి తోటలవద్దకు వెళ్లి వారే నేరుగా రైతుల వద్ద నుంచి కాయల్ని కొనుగోలు చేస్తారు. లోడింగ్ కూలీల ప్రత్యేకత కాకినాడ, ఒంగోలు లాంటి ప్రాంతాలకు చెందిన కూలీలు ఈ తరహా కటింగ్, లోడింగ్ కోసం వస్తుంటారు. బొప్పాయి తోటల్లో వెళ్లే కూలీలు ఎగుమతికి పనికొచ్చే కాయలను చెట్టునుంచి కింద పడకుండా కిందికి దించుతారు. ఆ తరువాత ప్రతి కాయను పేపర్‌తో చుడతారు. లారీలోకి బొప్పాయి కాయల్ని లోడ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తారు. లారీ లోపల, కింద భాగంలో నాలుగువైపులా ఎండుగడ్డిని ఏర్పాటు చేస్తారు. పేపర్ చుట్టిన కాయల్ని లారీల్లో లోడ్ చేసి మళ్లీపైన కూడా ఎండుగడ్డిని ఎక్కువగా వేసి లోడ్ చేయడం వీరి ప్రత్యేకత. వందలాది మంది కూలీలు బయట జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతుండడం గమనార్హం. ఢిల్లీ కటింగ్‌కు ప్రత్యేకం సాధారణంగా మన ప్రాంతంలో బొప్పాయి సగం రంగు వచ్చే వరకు కోత కోయరు. ఢిల్లీ కటింగ్‌కు మాత్రం ఎంతో తేడా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న బొప్పాయి సన్నని సూది లావు అంత లేత పసుపు రంగు వర్ణం రాగానే వాటితో పాటు వాటిపైనున్న రెండు కాయల్ని కోత కోస్తారు. ఇందుకోసం అనుభవం కలిగిన కోత కూలీలను ఏర్పాటు చేసుకొంటారు. లోడింగ్ చేసేందుకు అనుభవం ఉన్న బయట ప్రాంతాల హమాలీలను తీసుకొస్తుంటారు. ఢిల్లీ కంటింగ్ కాయలు పచ్చిగా ఉండాలి, వారం రోజుల తరువాత వర్ణం వచ్చే కాయలనే తోటల్లో ఏరి మరీ కోస్తుంటారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి లోడ్ లారీ చేరుకోవాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు కాయలు చెడిపోకుండా బందోబస్తు చేయడం కూలీల ప్రత్యేకత. బొప్పాయికి భలే డిమాండ్ బయట రాష్ట్రాలతో పాటు, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో గతంలో కురిసిన వర్షాలకు బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో కిలో రూ.18 వరకు ధర పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ మార్కెట్లలో కిలో రూ.50 నుంచి రూ. 60 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం. (క్లిక్: మదనపల్లెకు కొత్త మాస్టర్ ప్లాన్) తోటల వద్దనే కొనుగోలు చేస్తున్నారు బొప్పాయి తోటల వద్దకే వ్యాపారులు వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ముందుగా తమను సంప్రదించి ధర నిర్ణయిస్తారు. ఢిల్లీకి తరలించే బొప్పాయిని జాగ్రత్తగా నైపుణ్యం కలిగిన కూలీల చేత కోయిస్తారు. వాటిని భద్రంగా ప్యాకింగ్ చేసి వాహనాల్లో లోడ్ చేసి తీసుకెళుతుంటారు. – సుధాకర్‌రెడ్డి, బొప్పాయి రైతు, చెరవుమొరవపల్లె మూడు ఎకరాల్లొ సాగు చేశా ఈసీజన్లో మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ప్రస్తుతం తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కిలో రూ. 18 చొప్పున ధర ఇస్తున్నారు. కూలీఖర్చు, మార్కెట్‌కు తరలించడం వంటి అన్ని ఖర్చులు వ్యాపారులే భరిస్తారు. ప్రస్తుతానికి మంచి గిట్టుబాటు ధరలే ఉన్నాయి. – రామయ్య, బొప్పాయి రైతు, కొత్తపల్లె -
Beauty Tips: చింతాకు, బొప్పాయి గుజ్జు.. మచ్చలు, ముడతలు మాయం!
Tamarind Leaf And Papaya Pack : కప్పు చింత ఆకుల్లో పావు కప్పు బొప్పాయి పండు గుజ్జు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ పుల్లటి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి మాయిశ్చర్ అందుతుంది. ఇందులోని యాంటీసెఫ్టిక్ గుణాలు చర్మాన్ని సూక్ష్మజీవుల నుంచి కాపాడతాయి. క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ను వేసుకుంటే ముఖం మీద మచ్చలు, ముడతలు, చర్మసంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ►ఇక బియ్యప్పిండి, బొప్పాయి గుజ్జుని మఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి. ►అదే విధంగా బొప్పాయిగుజ్జులో పసుపు, పచ్చిపాలు, తేనె, తులసి ఆకుల పొడి కలిపిముఖానికి పట్టిస్తే, మొటిమలు, తెల్లమచ్చలు మాయమవతాయి. ►బొప్పాయి పండు గుజ్జు, అర స్పూన్ అలోవెరా జ్యూస్, కొంచెం తేనె కలిపి రాసుకుంటే చర్మానికి కావలసిన తేమ, పోషక పదార్థాలు అందుతాయి. మీరు యవ్వనంగా కనిపిస్తారు. ►నిమ్మరసం, కొద్దిగా పెసరపిండి కలిపి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలిపి రాసుకొంటే తెల్లని ఛాయ వస్తుంది. ►బొప్పాయి పండుకి ముఖం మీద ముడతలు పోగొట్టే అద్భుత గుణం కూడా ఉంది. చదవండి: టీనేజ్‌లో కాకుండా... యుక్తవయసు దాటాకా మొటిమలు వస్తున్నాయా? అయితే -
పోషకాల పపాయ.. సింపుల్‌గా లస్సీ చేసుకుని తాగితే..!
కావలసినవి: తొక్క తీసిన బొప్పాయిపండు ముక్కలు – కప్పు, తేనె – టేబుల్ స్పూను, మజ్జిగ – కప్పు, యాలకులపొడి – చిటికెడు, పుదీనా తరుగు – టీస్పూను, ఐస్‌క్యూబ్స్ – పావుకప్పు, నిమ్మరసం – టీస్పూను. తయారీ విధానం.. ►బొప్పాయి ముక్కలను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ►తరువాత తేనె, పుదీనా తరుగు, యాలకుల పొడి వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక ఐస్‌క్యూబ్స్ మజ్జిగ, నిమ్మరసం వేసి గ్రైండ్ చేసి, సర్వ్ చేసుకోవాలి. ►బొప్పాయిలోని పాపిన్ అనే ఎంజైమ్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. ►దీనిలో విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్, పీచుపదార్థం, ప్రోటిన్, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి1, బి 3, బి 5, ఇ, ఐరన్ లు, కెరోటినాయిడ్స్ శరీరానికి అంది జీవక్రియలు క్రమబద్ధీకరిస్తాయి. ►బొప్పాయి, తేనెను కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ►ఈ లస్సీని రోజుకొక గ్లాసు చొప్పున క్రమం తప్పకుండా తాగితే బరువు నియంత్రణలో ఉంటుంది. -
Hair Care: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల
Hair Care Tips In Telugu: జుట్టు పొడవుగా... ఒత్తుగా పెరగడంలో క్షారం ఉన్న ఆహార పదార్థాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆల్కలైన్ లేదా క్షారం శరీర పీహెచ్ స్థాయులను సమతులంగా ఉంచి జీర్ణక్రియ సవ్యంగా జరిగేలా చేసి, శరీరానికి పోషకాలను అందిస్తుంది. ఫలితంగా కురులకు పోషకాలు అంది ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ ఆహార పదార్థాలు తింటే మేలు ►తెల్లగా ఉన్న బ్రెడ్ కంటే బ్రౌన్బ్రెడ్ను తినాలి. ►తెల్లగా ఉండే పిండి కాకుండా రాగి, జొన్న, సజ్జ, బార్లీ పిండిలను కలిపి రొట్టె చేసుకుని తినాలి. ►దోసకాయ, పాలకూర, బ్రకోలి, కాకరకాయ, బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ కే, ఫోలేట్లు పుష్కలంగా ఉంటాయి. ►తులసి ఆకులు, బెల్లంతో చేసిన టీ, తులసి, పుదీనా, సొరకాయలను కలిపి చేసిన జ్యూస్ కూడా జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. ►వాల్‌నట్స్‌లోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ చక్కగా జరిగి జుట్టు పెరుగుదలకు దోహద పడుతుంది. ►వాల్నట్స్ తినలేనివారు కనీసం వాల్నట్స్ ఆయిల్‌ను జుట్టుకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. ►బొప్పాయి హెయిర్ మాస్క్ కూడా కేశాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. చదవండి👉🏾Mango Health Benefits: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇందులోని క్వార్సెటిన్ వల్ల.. -
Summer: పోషకాల స్మూతీ.. క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది! ఇంకా
Summer Drinks- Boppayi Banana Smoothie: బొప్పాయి బనానా స్మూతీలో యాంటీ ఆక్సిడెంట్స్, కెరాటిన్స్, విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో ఫోలేట్, పాంథోనిక్ యాసిడ్, ఖనిజ పోషకాలు పొటాషియం, కాపర్, మెగ్నీషియంలతోపాటు పీచుపదార్థం కూడా ఉంటుంది. ఈ స్మూతి తాగడం వల్ల ఈ పోషకాలన్నీ శరీరానికి అందడంతోపాటు, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కోలన్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. వేసవిలో తాగే స్మూతీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి బనానా స్మూతీ తయారీకి కావలసిన పదార్థాలు: పాలు – రెండు కప్పులు, తొక్కతీసిన బొప్పాయి పండు ముక్కలు – అరకప్పు, బాగా పండిన అరటి పండు – ఒకటి (ముక్కలు తరగాలి), కర్జూరపండ్లు – ఆరు, ఐస్ ముక్కలు – ఆరు, చాక్లెట్ తరుగు – గార్నిష్‌కు సరిపడా. తయారీ: ►బొప్పాయి, అరటి పండు ముక్కలను, కప్పు పాలు, ఐస్‌ముక్కలను బ్లెండర్లో వేసి స్మూత్‌గా వచ్చేంత వరకు గ్రైండ్ చేయాలి. ►ముక్కలన్నీ మెదిగాక, కర్జూరం పండ్లలో గింజలు తీసేసి వేయాలి. ►మిగిలిన కప్పు పాలను పోసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని గ్లాస్లో పోసి చాక్లెట్ తరుగుతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన బొప్పాయి బనానా స్మూతీ రెడీ. చదవండి👉🏾 Poha Banana Shake: ఫైబర్, ఐరన్ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తాగితే! -
Beauty Tips: బొప్పాయి గుజ్జు, గంధం పొడి.. ముఖంపై జిడ్డు మాయం
క్రమంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతల నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే.. రోజుకి కనీసం మూడు లీటర్ల మంచినీటితోపాటు కొబ్బరి నీళ్లను తాగాలి. వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవడంతోపాటు సులభంగా ఇంట్లో తయారు చేసిన ప్యాక్‌లు వేసుకోవడం ద్వారా వేసవిలో కూడా ముఖవర్ఛస్సుని కాపాడుకోవచ్చు. కప్పు పెరుగులో టేబుల్ స్పూను తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖానికి సహజ సిద్ధమైన మాయిశ్చర్‌ను అందించి కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. బాగా పండిన అరకప్పు బొప్పాయి గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల గంధం పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ వేసుకోడం వల్ల ముఖంపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్మూధూళి వదిలి, చర్మం కాంతివంతంగా కనిపించడమే కాదు, మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. చదవండి: Ragi Java Health Benefits: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే -
Breast Milk: తల్లిపాలు పెరగాలంటే.. బొప్పాయి కూర, ఆవుపాలు, కర్బూజ, జీలకర్ర ఇంకా
Best Foods Increase Breast Milk Production: పిల్లలకు తల్లిపాలు ఎంతో ఆరోగ్యకరం. పాలిచ్చే తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుందని పెద్దలు, పరిశోధకులు ఎప్పటినుంచో చెబుతున్న విషయమే. అయితే కొందరు తల్లులకు పాలు పడవు. అలాంటివారు కొన్ని సూచనలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. గర్భిణులకు బొప్పాయి ఇవ్వకూడదని అందరికీ తెలుసు. అదే బొప్పాయి బాలింతలకు కల్పతరువులా పనిచేస్తుంది. దోరగా ఉన్న బొప్పాయికాయను కొబ్బరి కోరులా చేసి కూర వండుకుని తింటే స్తన్యవృద్ధి కలుగుతుంది. పాల ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని మార్గాలున్నాయి! ►ఆవుపాలు, కర్బూజాపండు, పాలకూర, జీలకర్ర, బార్లీజావ, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, మునగాకు కూరలు చాలా మేలు చేస్తాయి. ►పట్టణ ప్రాంతాలలోని వారికి పిల్లిపెసర దొరకపోవచ్చు. కాని దాని వేళ్ళను దంచిన రసం తీయాలి. దీనిని ఎండించి దంచిన చూర్ణం రోజూ తేనెలో తీసుకుంటే పాలు పెరుగుతాయి. ఆయుర్వేద దుకాణాల్లో శతావరి పేరిట చూర్ణం దొరుకుతుంది. ఇది కూడా బాగానే పని చేస్తుంది. ►రెండు గ్లాసుల నీళ్ళలో రెండు టీస్పూన్ల పత్తిగింజల పొడి పోసి నీళ్ళు అరగ్లాసు అయ్యేంతవరకు మరిగించాలి. చల్లారిన తర్వాత దీనిని వడగట్టి తేనె కలుపుకుని తాగితే పాలవెల్లువ కల్గుతుంది. ►తామర కాడను ఎండించిన చెంచాడు చూర్ణాన్ని తేనెతో కలిపి రోజుకు మూడుసార్లు తింటే పాలు పెరుగుతాయి. ►ఆముదం ఆకులపైన ఆముదాన్ని రాసి వెచ్చ చేసి రొమ్ములకు కడితే పాలచేపు వస్తుంది. ►బాలింతలకు వాము కషాయం రోజూ తేనెతో తీసుకుంటే చక్కని పాలు పడతాయి. ►శనగలను మొలకలొచ్చేదాకా నాన బెట్టాలి. ఎండించి, పొట్టు తీసి, దోరగా వేయించి, కట్టులా కాచుకుని తాగితే బలాన్నిచ్చి మంచి ఔషధంగా పనిచేస్తాయి. మంచి రక్తాన్ని పుట్టిస్తాయి. పాలిచ్చే తల్లులకు ఇస్తే పాలు పెరుగుతాయి. ►బాలింతలకు జలుబు చేస్తుందని మంచినీళ్లు ఎక్కువ తాగనివ్వరు పెద్దలు. అలా కాకుండా తగినన్ని మంచి నీళ్లు తాగుతుండాలి. కాకపోతే చల్లటి నీళ్లు కాకుండా గోరు వెచ్చటి నీళ్లు తాగడం మంచిది. ►మజ్జిగ, పెరుగు, పాలు పుష్కలంగా తీసుకోవాలి. ►ఇవన్నీ అంతో ఇంతో పాలు పడే తల్లులకు పని చేస్తాయి. అయితే కొందరు తల్లులకు కొన్ని కారణాల వల్ల పాలు అసలు పడవు. అటువంటప్పుడు ప్రయోజనం ఏముందని పిల్లలను రొమ్ముకు దూరం పెడతారు తల్లులు. అలా చేయకూడదు. పిల్లలు రొమ్మును చప్పరించడం వల్ల తల్లిలో మాతృత్వ భావన ఉప్పొంగి హార్మోన్ల ప్రేరణతో పాలు స్రవించేందుకు అవకాశం ఉంటుందని పెద్దలతోబాటు వైద్యులు కూడా చెబుతున్నారు. చదవండి: Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల... -
Diwali Special Sweets: మలై లడ్డు, మిల్క్ బర్ఫీ, బొప్పాయి హల్వా తయారీ ఇలా..
వెలుగునిచ్చే దీపాలు, మిరుమిట్లుగొలిపే క్రాకర్స్, నోటిని తీపిచేసే∙స్వీట్లలోనే దీపావళి సందడంతా కనిపిస్తుంది. ఏటా చేçసుకునే మిఠాయిలు కాకుండా, ఆయిల్ వాడకుండా పాలతో ఆరోగ్యకరమైన స్వీట్లను సులభంగా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... బొప్పాయిహల్వా కావల్సిన పదార్ధాలు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు – ఒకటి (తొక్కసి తురుముకోవాలి) పంచదార – పావు కప్పు బాదం పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి – టీ స్పూను కోవా తురుము – మూడు టేబుల్ స్పూన్లు బాదం పలుకులు – రెండు టీస్పూన్లు. తయారీ విధానం ►ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ►నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. ►ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ. మిల్క్ బర్ఫీ కావల్సిన పదార్ధాలు పాలపొడి – రెండున్నర కప్పులు పంచదార – ముప్పావు కప్పు పాలు – కప్పు నెయ్యి – పావు కప్పు పిస్తా పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►గిన్నెలో పాలపొడి, పంచదార, పాలు పోసి కలుపుకోవాలి. ►స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పాలపొడి మిశ్రమం, నెయ్యివేసి సన్నని మంటమీద వేయించాలి. ►10 నిమిషాల తరువాత మిశ్రమం పాన్ కు అతుక్కోకుండా ఉండకట్టినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి బేకింగ్ పేపర్ పరిచిన ట్రేలో వేయాలి. ►ట్రే మొత్తం సమానంగా పరుచుకునేలా మిశ్రమాన్ని వత్తుకోవాలి. పిస్తాపలుకులు వేసి మరోసారి వత్తుకోని,ట్రేను గంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ►రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ. మలై లడ్డు కావల్సిన పదార్ధాలు క్రీమ్ మిల్క్ – రెండు లీటర్లు నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు కండెన్సెడ్ మిల్క్ – ముప్పావు కప్పు యాలకుల పొడి – పావు టీస్పూను. కోవా నెయ్యి – అరటీస్పూను పాలు – పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ – పావు కప్పు పాల పొడి – ముప్పావు కప్పు తయారీ విధానం ►ముందుగా పాలను కాచి, నిమ్మరసం వేసి పన్నీర్‌లా చేసుకోవాలి. ►బాణలి వేడెక్కిన తరువాత అరటీస్పూను నెయ్యి, పావు కప్పు పాలు పోసి వేయించాలి. ఇవన్నీ బాగా కలిసిన తరువాత ముప్పావు కప్పు పాలపొడి వేసి తిప్పుతూ ఉడికించాలి. ►బాణలి నుంచి ఈ పాలమిశ్రమం గట్టిపడి ఉండలా చుట్టుకునేటప్పుడు దించేస్తే పాలకోవ రెడీ. ►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని..ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్, కోవా వేసి సన్నని మంట మీద తిప్పుతూ వేయించాలి. ►మిశ్రమం మృదువుగా మారాక ముప్పావు కప్పు కండెన్స్డ్ పాలు పోసి కలపాలి. కండెన్స్డ్ పాలు తియ్యగా ఉంటాయి కాబట్టి పంచదార వేయకూడదు. ►మిశ్రమం దగ్గరపడ్డాకా.. యాలకులపొడి వేసి మరో ఐదునిమిషాలు వేయించి దించేయాలి. ►గోరువెచ్చగా ఉన్నప్పుడే గుండ్రంగా చుట్టుకుంటే మలై లడ్డు రెడీ. చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
నిన్న అదృశ్యం.. నేడు బొప్పాయి తోటలో శవమై తేలిన బాలుడు
సాక్షి, చిత్తూరు: దసరా వేడుకలతో ఆనందంగా గడవాల్సిన ఆ ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది. పండక్కి అమ్మమ్మ ఇంటికొచ్చిన మనవడు అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటన కె.వి పల్లి మండలంలో బుధవారం వెలుగు చూసింది. ఎనిమిదేళ్ల బాలుడిని దుండగులు కిరాతకంగా హతమార్చారు. మంగళవారం అదృశ్యమైన బాలుడు తేజస్ రెడ్డి (8) బొప్పాయి తోటలో శవమై కనిపించాడు. బాలుడు పీలేరు కు చెందిన నాగిరెడ్డి కుమారుడిగా తెలిసింది. దసరా సెలవులు కావడంతో ఇటీవల అమ్మమ్మ ఊరైన కె.వి పల్లి మండలం ఎగువ మేకల వారి పల్లికి తమ కుమారుడు వచ్చినట్టుగా అతని తల్లిదండ్రులు చెప్తున్నారు. (చదవండి: ‘దిశ వన్ స్టాప్’.. మహిళలపై వేధింపులకు ఫుల్స్టాప్) తమ బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో నిన్న కె.వి పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అంతలోనే నేడు శవమై కనిపించాడని కన్నీరుమున్నీరవుతున్నారు. తేజస్ రెడ్డిని బంధువులే చంపారని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ ఘాతుకానికి కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ఫోన్ కొట్టు.. అవినీతి ఆటకట్టు) -
లాక్డౌన్లో బరువు పెరిగారా? ఇలా చేయండి
లాక్డౌన్ కారణంగా దాదాపు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో యూట్యూబ్‌లో కుకింగ్ వీడియోలను చూసి ప్రొఫెషనల్ షెఫ్ అవతారమెత్తారు. వంటలన్నీ ప్రయోగాలు చేస్తూ హల్చల్ చేశారు. దీంతో ఇప్పటివరకు ఫిట్నెస్ ప్రీక్‌గా ఉన్నవారు సైతం బరువు పెరిగారు. దీంతో సహజంగానే కాస్త ఒత్తిడి పెరుగుతుంది. అయితే దీని గురించి ఏమాత్రం ఆందోళన చెందవద్దు. కేవలం కొన్ని జాగ్రత్తలు, నియమాలతో మళ్లీ ఫిట్‌గా ఉండొచ్చు. పెరిగిన బరువును తగ్గించుకోవచ్చు. దీనికి బొప్పాయి పండే పరిష్కారమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన దినచర్యలో అల్పాహారం తీసుకోవడం అతి ముఖ్యమైనది. అయితే కొందరు సమయం లేదనో, ఒకేసారి మధ్యాహ్నం తినొచ్చనో ఏవేవో కారణాలు చెప్పి బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేస్తుంటారు. ఇలా తరుచూ అల్పాహారం తీసుకోకపోవడం వల్ల తొందరగా బరువు పెరుగుతారు. కాబట్టి ఫిట్‌గా ఉండాలనుకునేవారు మొదట క్రమం తప్పకుండా అల్పాహారం చేయాలి. దీని వల్ల రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటుందట. (అదృష్టం అంటే నీదిరా బాబు!) ఇక బరువు తగ్గాలనుకునేవారికి ఉత్తమమైన అల్పాహారం బొప్పాయి పండు.దీనిలోని ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు లాంటి ముఖ్యమైన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరానికి ఎంతో శక్తినిచ్చే బొప్పాయిని తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా చేస్తుందట. ఆఫీసుకు లేట్ అవుతుందని బ్రేక్‌ఫాస్ట్‌ని మానేసేవాళ్లకి ఇదో చక్కని పరిష్కారం. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే బొప్పాయితో మంచి బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయవచ్చు. ఇందులోని ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా మధ్యాహ్న సమయం వరకు మీ ఆకలిని అరికట్టేందుకు బెస్ట్ ఛాయిస్ అంటున్నారు నిపుణులు. బొప్పాయి గుజ్జు, కప్పు పెరుగు, పావుకప్పు పాలు కలిపి మిక్సీ పట్టాలి. తర్వాత దీనికి రెండు టేబుల్ స్పూన్ల తేనెను కలిపి ప్రతీరోజూ ఉదయం అల్పాహారంలా తీసుకోవాలి. దీని వల్ల ఆరోగ్యంతో పాటు అందమూ మెరుగుపడుతుంది. సో లాక్డౌన్లో కారణంగా బరువు పెరిగిన వారికి ఇదో చక్కటి పరిష్కారమంటున్నారు వైద్య నిపుణులు. ఈ లిస్ట్‌లో మీరూ ఉంటే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ట్రై చేసేయండి. (నానమ్మ పిజ్జా సూపర్‌హిట్) -
మేక, బొప్పాయి పండుకు కరోనా పాజిటివ్!
దొడోమ: కరోనా వైరస్ ఇప్పటివరకు మనుషులకు, పులులు, పిల్లులు వంటి కొన్ని జంతువులకూ వచ్చింది. అయితే విచిత్రంగా ఓ మేకకు, మరీ విచిత్రంగా ఓ బొప్పాయి పండుకు కరోనా సోకింది. ఈ వింత సంఘటన టాంజానియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే టాంజానియా దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ చేసే పరీక్షా కిట్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. దీన్ని మనుషులతోపాటు బొప్పాయి, మేక, గొర్రెల పైనా పరీక్షించింది. ఈ క్రమంలో గొర్రె మినహా మిగతా రెండింటికి వైరస్ సోకినట్లు తప్పుడు ఫలితాలివ్వడంతో కిట్లలో డొల్లతనం బయటపడింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు జాన్ మగుఫులి దిగుమతి చేసుకున్న టెస్టు కిట్లలో సాంకేతిక లోపాలున్నాయని వెల్లడించారు. వీటి వాడకాన్ని నిలిపివేస్తూ దర్యాప్తుకు ఆదేశించారు. (ఇళ్ల ముందు కరెన్సీ నోట్ల కలకలం) కాగా ఇప్పటికే వైరస్ వ్యాప్తి విషయాన్ని దాస్తోందని ప్రభుత్వంపై విమర్శలు వచ్చినవేళ నాసిరకం కిట్లతో ప్రజల ఆరోగ్యంపై చెలగాటమాడుతున్నారని విపక్షాలు మరోసారి భగ్గుమంటున్నాయి. మరోవైపు అధ్యక్షుడు జాన్ మగుఫులి మాత్రం ఈ కిట్ల ద్వారా.. కొంతమంది కరోనా బాధితులకు వైరస్ సోకలేదన్న విషయం నిరూపితమవుతోందన్నారు. ఆదివారం నాటికి టాంజానియాలో 480 కరోనా కేసులు నమోదవగా 17 మంది మరణించారు. అక్కడ పది లక్షల మందికి గానూ కేవలం 500 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. (ఈ ఏడాది చివరికల్లా టీకా!) -
ఇవి తినండి సరి అవుతుంది
ఆధునిక జీవన శైలిలో దేహ కదలికలు తగ్గిపోయాయి. దాంతో జీవక్రియల వ్యవస్థ గాడి తప్పడమూ ఎక్కువైంది. దానికి తోడు చలికాలంలో దేహక్రియల్లో ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి. వీటన్నింటి కారణంగా ప్రతి పదిమందిలో ఏడుగురు మహిళలు పీరియడ్స్ క్రమం తప్పడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనిని నివారించడానికి మందుల మీద ఆధారపడాల్సిన పని లేదు. ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. ►చలికాలంలో రోజూ కొద్దిగా బెల్లం తింటూ ఉంటే రుతుక్రమం సక్రమంగా ఉంటుంది. రుతుస్రావ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా బెల్లం అరికడుతుంది. ►ముప్పై రోజులు దాటినా కూడా పీరియడ్స్ రాకుండా ఉన్నప్పుడు విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు, కూరలను తీసుకోవాలి. బొప్పాయిలోని ఆస్కార్బిక్ యాసిడ్ ఈస్ట్రోజెన్ హార్మోన్ల మీద ప్రభావం చూపించి సమస్యను సరిదిద్దుతుంది. ఈ సమస్యను పరిష్కరించే మరికొన్ని పండ్లు పైనాపిల్, మామిడి, కమలాలు, నిమ్మ, కివి. ►పచ్చి అల్లం తరుగులో స్వచ్ఛమైన తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి. ఇవి హార్మోన్లలో అసమతుల్యతను క్రమబద్ధీకరిస్తాయి. ►స్వచ్ఛమైన పసుపును రోజూ ఆహారంలో తీసుకోవాలి. పీరియడ్స్ ఆలస్యమైతే గ్లాజు వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగుతుంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ సమస్య తలెత్తదు. పసుపును తేనెతో కలిపి చప్పరించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ►పీరియడ్స్ సక్రమంగా రావడం, కండరాల నొప్పిని తగ్గించడంలో కాఫీ కూడా మంచి మందే. కాఫీలో ఉండే కెఫీన్ ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను ప్రభావితం చేస్తుంది. ►బీట్రూట్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి దేహక్రియలను సక్రమంగా ఉంచుతాయి. ►ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ వాము లేదా వాము పొడి వేసి మరిగించి తాగాలి. రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ టీ (కాన్కాక్షన్) తాగితే పీరియడ్ సక్రమం కావడంతోపాటు మెన్స్ట్రువల్ పెయిన్ కూడా ఉండదు. -
క్యారెట్ కాంతి
►ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ చొప్పన ఉల్లి, క్యారెట్ రసం, గుడ్డు సొన, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని యాక్నె, మొటిమలు ఉన్న చోట రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. యాక్నె, మొటిమలు తగ్గి ముఖం కాంతివంతం అవుతుంది. ►చెరుకు రసం, క్యారెట్ రసం, పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల పొడిబారిన చర్మం మృదువుగా అవుతుంది. ►బొప్పాయి గుజ్జు టేబుల్ స్పూన్, క్యారెట్ రసం టీ స్పూన్, తేనె టీ స్పూన్.. ఈ మూడింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చర్మం కాంతిమంతం అవుతుంది. -
బొప్పాయి ప్యాక్
రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని పెంపొందించే బొప్పాయి మేని నిగారింపులోనూ మెరుగైన ఫలితాలను అందిస్తుంది. ►బొప్పాయి గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే మలినాలు తొలగిపోతాయి. చేతులు, పాదాలపై ఉన్న ట్యాన్ వదిలిపోతుంది. ►అరకప్పు బొప్పాయి గుజ్జులో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలు, చేతులు, ముఖానికి రాసి మసాజ్ చేయాలి. పదినిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదుత్వం పెరుగుతుంది. పొడిబారిన చర్మానికి ఇది మేలైన ప్యాక్. ►టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో మూడుసార్లయినా ఇలా చేయడం వల్ల చర్మం జిడ్డు తగ్గి, నిగారింపు పెరుగుతుంది. -
రుచికి గొప్పాయి
బొప్పాయి న్యూస్‌లో ఉంది. డెంగీ జ్వరానికి దాని ఆకుల రసం విరుగుడనే ప్రచారం ఉంది. కాని వైద్యుల సలహా లేకుండా అలాంటి చిట్కాలు పాటించకూడదనే హెచ్చరిక కూడా ఉంది. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు. అయితే కూరకు కూడా అది చాలా గొప్పాయిదని తెలుసుకోవాలి. పనీర్, పెరుగుపచ్చడి, మసాలా కూర.. ఇవన్నీ రొటీన్‌గా ఉండే మీ మెనూను మార్చేస్తాయి. కొత్తగా ఉందని అనిపిస్తాయి. గొప్పగా చెప్పండి.. ఇవాళ మీ ఇంట బొప్పాయి అని. బొప్పాయి హల్వా కావలసినవి: దోరగా పండిన బొప్పాయి తురుము – 4 కప్పులు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బాదం పొడి లేదా పాల పొడి లేదా కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►బొప్పాయి పండును శుభ్రంగా కడిగి ముక్కలు చేసి గింజలు వేరు చేసి, తురమాలి ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక బొప్పాయి తురుము వేసి సన్నని మంట మీద సుమారు పావుగంట సేపు దోరగా వేయించాలి ►బాగా ఉడికిన తరవాత పంచదార వేసి బాగా కలిపి సుమారు పావు గంట సేపు ఉడికించాలి ►బాదం పప్పుల పొడి జత చే సి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి ►జీడి పప్పు పలుకులు జత చేసి రెండు నిమిషాల పాటు కలిపి దింపేయాలి ►కొద్దిగా వేడిగా లేదా చల్లగా తింటే రుచిగా ఉంటుంది. బొప్పాయి మసాలా కూర కావలసినవి: బొప్పాయి ముక్కలు – 2 కప్పులు; పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 4; జీలకర్ర – ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టేబుల్ స్పూను; ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఆవాలు – ఒక టీ స్పూను. తయారీ: ►ఒక గిన్నెలో బొప్పాయి ముక్కలు, పచ్చి బఠాణీ, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించి దింపేయాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక పల్లీలు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ►జీలకర్ర జత చేసి మరోమారు వేయించాలి ►నువ్వులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►ఎండు కొబ్బరి పొడి జత చేసి మరోమారు వేయించాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ►పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, పసుపు, కరివేపాకు, పచ్చి మిర్చి, ఉల్లి తరుగు వేసి వేయించాలి ►ఉప్పు జత చేసి బాగా కలిపి, బొప్పాయి ముక్కలు జత చేయాలి ►మెత్తగా పొడి చేసిన మసాలా పొడి వేసి మరోమారు కలపాలి ►కొద్దిసేపు కలిపిన తరవాత దింపేయాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. బొప్పాయి పెరుగు పచ్చడి కావలసినవి: పచ్చి బొప్పాయి తురుము – ఒక కప్పు; పెరుగు – 3 కప్పులు; తరిగిన పచ్చి మిర్చి – 4; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; పసుపు – కొద్దిగా; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►ఒక గిన్నెలో బొప్పాయి తురుము, తగినన్ని నీళ్లు, ఉప్పు జత వేసి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి ►ఒక పెద్ద పాత్రలో పెరుగు, పసుపు వేసి గిలకొట్టాలి ►ఉడికించిన బొప్పాయి తురుము జత చేసి బాగా కలియబెట్టాలి ►వేయించి ఉంచుకున్న పోపు వేసి కలిపి, కొత్తిమీరతో అలంకరించాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. బొప్పాయి పనీర్ కూర కావలసినవి: సన్నగా తరిగిన పచ్చి బొప్పాయి ముక్కలు – 2 కప్పులు; ఉడికించిన బంగాళ దుంప – 1; సన్నగా తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; పనీర్ తురుము – ఒక టేబుల్ స్పూను; మెంతులు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. పేస్ట్ కోసం: ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రేకలు – 10; అల్లం – చిన్న ముక్క; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాలు – అర టీ స్పూను; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 1. తయారీ: ►ఒక పాత్రలో ఉప్పు వేసి, తరిగిన బొప్పాయి ముక్కలు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి, నీరు ఒంపేయాలి ►ఉడికించిన బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలు చేయాలి ►చిన్న గిన్నెలో మెంతులు, కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాక, నీళ్లు ఒంపేసి మెంతులను బొప్పాయి ముక్కలకు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►పేస్ట్ కోసం తీసుకున్న పదార్థాలను మెత్తగా ముద్దలా చేసి, జీలకర్ర వేగిన తరవాత జత చేయాలి ►ఉప్పు, అర కప్పు నీళ్లు జత చేసి కొద్దిసేపు ఉడికించాలి ►బొప్పాయి ముక్కలు, బంగాళ దుంప ముక్కలు జత చేసి బాగా కలిపి, మూత ఉంచి, మంట బాగా తగ్గించి సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి ►బొప్పాయి ముక్కలు బాగా మెత్తపడి, గ్రేవీ చిక్కగా అవ్వగానే దింపేసి, కొత్తిమీరతో అలంకరించాలి ►చపాతీ, పరాఠా, అన్నంలోకి రుచిగా ఉంటుంది. పచ్చి బొప్పాయి కర్రీ (నార్త్ ఇండియన్ స్టయిల్) కావలసినవి: పచ్చి బొప్పాయి – అర కేజీ; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రేకలు – 4; సోంపు – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►కుకర్‌లో నూనె వేసి వేడి చేయాలి ∙సోంపు వేసి చిటపటలాడించాలి ►అల్లం వెల్లుల్లి తురుము వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి ►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు జత చేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి ►మిగిలిన మసాలా వస్తువులన్నీ వేసి వేయించాలి ►చివరగా బొప్పాయి ముక్కలు వేసి బాగా కలిపి, ఒక కప్పు నీళ్లు జత చేసి మూత పెట్టాలి ►మూడు విజిల్స్ వచ్చాక దింపేసి, కొత్తిమీర తరుగుతో అలంకరించి వడ్డించాలి ►పుల్కా, రోటీ, అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. బొప్పాయి కొన్ని సంవత్సరాల క్రితం వరకు బొప్పాయి పండు దొడ్లో చెట్టుకి కాస్తే ఎవరికివారు తినడమో, ఇరుగుపొరుగు పంచిపెడితేనో మాత్రమే దొరికేది. కానీ, ఈ పండులోని పోషక విలువలు, ఆరోగ్య రక్షక గుణాలు ప్రాచుర్యం పొందాక, ఇది కూడా బజార్లో కొనుక్కోవలసిన పండు అయిపోయింది. ఇప్పటికీ మిగిలిన పళ్లతో పోల్చితే ఇది చవకగానే దొరుకుతోంది. కాని ప్రజలలో ఒక నిజం కాని నమ్మకం ఉంది. ఎక్కువ ఖరీదు పెట్టి కొంటే అందులో ఎక్కువ బలం ఉంటుందనీ, చవకగా దొరికే పళ్లల్లో పోషక విలువలు తక్కువనీ. ఇది కేవలం పరిజ్ఞాన లోపం వల్ల ప్రబలిన నమ్మకం. చవకగా దొరికే బొప్పాయి పండులో ఉన్నన్ని పోషక విలువలు, ఖరీదైన ఆపిల్‌లో లేవు. అందుకని పండు విలువని ఖరీదుతో వెలకట్టకూడదు. ఏ భాగాలు... పచ్చికాయని కూరగాను, పండుని ఆహారంగాను వాడతాం. గింజలలో కూడా వైద్యగుణాలు ఉన్నాయి. పండు – ప్రయోజనాలు ►పచ్చికాయలోను, పండులోను కూడా జీర్ణశక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. ఎంతటి అరగని పదార్థాన్నయినా, బొప్పాయితో కలిపి తింటే తేలికగా జీర్ణం అయిపోతుంది. మాంసాహారంతో బొప్పాయి కలిపి వండితే త్వరగా, తేలికగా జీర్ణం అవుతుంది. ►మలబద్దకం, పైల్స్ వ్యాధి ఉన్నవారికి మలబద్దకం పోగొట్టి, పైల్స్ వ్యాధి తగ్గేందుకు సహాయపడుతుంది. ►క్రమంగా తింటూంటే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ శరీరంలో పేరుకోకుండా, బయటికి పంపేసి శరీరాన్ని రక్షిస్తుంది. ►ఇందులోని విటమిన్ సి కారణంగా, నెలరోజులు నిత్యం తింటూంటే పురుషులలోని వీర్యకణాలు అన్నిరకాలుగా వృద్ధి చెందుతాయి. ►గర్భిణీలకు నిషేధం. పచ్చికాయ – గింజలు ►సిరోసిస్ ఆఫ్ లివర్ వ్యాధిగ్రస్తులు... బొప్పాయి గింజలను నూరి రసం తీసి, కొద్దిగా నిమ్మరసం కలిపి (1 చెంచా రసం + 10 చుక్కల నిమ్మ రసం) రోజూ రెండు పూటలా కొంతకాలం తీసుకుంటూంటే ఆరోగ్యం మెరుగవుతుంది. ►చర్మవ్యాధులలో... గడ్డలు, మొటిమలు, పాదాలలో వచ్చే కార్న్స్ వంటి సమస్యలలో పచ్చికాయ నుండి రసం తీసి, పైపూతగా వాడితే తగ్గుతాయి. ►నెలసరి క్రమంగా కానివారు పచ్చికాయ తింటూంటే స్రావం సక్రమంగా అవుతుంది. ►పచ్చి బొప్పాయి కాయ నుంచి కారే పాలు 1 చెంచాడు + 1 చెంచా తేనె కలిపి సేవిస్తూంటే కడుపులో పురుగులు పోతాయి. ఈ మిశ్రమం సేవించిన 1 – 2 గంటల తరవాత ఆముదం తీసుకోవాలి. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
బొప్పాయి కోసం గొడవ.. పండ్ల మార్కెట్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : డెంగ్యూ ఫీవర్ విజృంభిస్తుండటంతో దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఇక డెంగీ అటాక్‌తో తలెత్తే ప్లేట్లెట్ల సమస్యను సమర్థంగా ఎదుర్కొంటే ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి, దానిమ్మ పండ్లను ఆహారంగా తీసుకుంటే ప్లేట్లెట్ల వృద్ధికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బొప్పాయికి భారీ గిరాకీ ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.100 పైగా పలుకుతోంది. మరో వైపు బొప్పాయి పంట తగినంత అందుబాటులో లేకపోవడంతో పండ్ల వ్యాపారులు దాని కోసం పోటీపడుతున్నారు. ఈ క్రమంలో కొత్తపేట పండ్ల మార్కెట్లో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. చెమటోడ్చి పండించిన పంటకు దళారులు తక్కువ మొత్తంలో చెల్లించి.. బయట భారీ మొత్తానికి అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపించారు. దళారుల రేట్లు నచ్చక నేరుగా విక్రయాలు జరిపారు. దీంతో బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని రైతులపై దళారులు దాడి చేశారు. పరస్పరం దాడులతో పండ్ల మార్కెట్ దద్దరిల్లింది. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. -
బొప్పాయి..బాదుడేనోయి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగీ, మలేరియా, డయేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ఔషధగుణాలున్న బొప్పాయి పండ్లకు ఎన్నడూ లేనంత గిరాకీ పెరిగింది. మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్లు బొప్పాయి సరఫరా లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగాయి. అన్ని జిల్లా, మండల ప్రధాన ఆస్పత్రులన్నీ డెంగీ, ఇతర విష జ్వరాల బాధితులతో నిండిపోతున్నాయి. దీనికితోడు వర్షాల సీజన్ కావడంతో కలుషిత నీటితోనూ ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగులు బొప్పాయి పండ్లను ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంకా పలు రకాల మేలు కలుగుతుందని చెబుతున్నారు. ఎక్కడ నుంచి సరఫరా... రాష్ట్రంలో పెద్ద సైజు బొప్పాయి పండ్లు అధికంగా ఖమ్మం, జహీరాబాద్, కల్వకుర్తి, అచ్చంపేట, ఒంగోలు నుంచి, చిన్నసైజు బొప్పాయిలు నల్లగొండ, వరంగల్, కర్ణాటకలోని గుల్బర్గా, ఏపీలోని నూజివీడుల నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. ధర.. దడదడ గత ఏడాది ఇదే సమయానికి గడ్డిఅన్నారం మార్కెట్లో హోల్‌సేల్ వ్యాపారులు పెద్దరకం బొప్పాయి కిలో రూ.8 నుంచి రూ.10కి విక్రయించారు. అది కాస్త ప్రస్తుతం రూ.30 నుంచి రూ.40కి పెరిగింది. దీన్ని రిటైల్ వ్యాపారులు కిలో రూ.80కి అమ్ముతున్నారు. సూపర్ మార్కెట్లలో కిలో రూ.100కి అమ్ముతున్నారు. ఇక జిల్లాల్లో పెద్దరకం బొప్పాయిలు అందుబాటులో లేవు. చిన్నసైజు బొప్పాయి ధర సైతం జిల్లాలో కిలో రూ.80కి తక్కువగా లేదు. అయితే, గడ్డిఅన్నారం మార్కెట్‌కు శుక్రవారం 80 టన్నుల మేర బొప్పాయి పండ్లు వచ్చినట్లు మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నారు. ఇదే రీతిన మార్కెట్లో బొప్పాయి వస్తేనే ధరలు దిగొచ్చే అవకాశం ఉంది. మేలు ఇలా.. శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేసేందుకు, శరీరంలోని కొవ్వును తగ్గించడానికి దోహదపడుతుంది. గుండెపోటు నివారణకు, జలుబు, జ్వరంతో బాధపడేవారికి మంచి ఔషధం.. బొప్పాయి ఆకుల జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. ∙లివర్ సిరోసిస్ వంటి కాలేయ సంబంధ వ్యాధులు రాకుండా నివారిస్తుంది. -
ఎండ నుంచి మేనికి రక్షణ
ఎండ వేడిమి దాడి చేస్తోంది. దీనికి విరుగుడుగా ఈ కాలం మేని సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ►ఎండ నుంచి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జు చర్మానికంతా పట్టించి, మూడు నిమిషాలుంచి కడిగేయాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ఎండవేడిమికి కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. ►చర్మం తాజాగా ఉండాలంటే ఎండలో బయటికి వెళ్లి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని, 5 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ►చలికాలానికి మాయిశ్చరైజర్లు మాదిరి ఈ కాలం సన్‌ప్రొటెక్షన్ లోషన్లు వాడుతుంటారు. అయితే, వీటిని బయటకు వెళ్లడానికి 10 నిమిషాల ముందు రాసుకుంటే చాలు ఎండబారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. ►ఎండవేడికి చర్మం కమిలి, మంట పుడుతుంటే ఉపశమనానికి అలొవెరా జెల్ రాసి, పది నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ►ఈ కాలం శిరోజాలు పొడిబారడం సమస్య ఎక్కువ. అందుకని వారానికి ఒకసారి అరటిపండు గుజ్జును తలకు అంతా పట్టించి, పది నిమిషాలు ఉంచి, కడిగేయాలి. దీనివల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతినదు. ►చర్మం నిస్తేజంగా మారకుండా రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. -
హెల్దీ ట్రీట్
ఫ్రూట్ అండ్ లెట్యూస్ సలాడ్ కావలసినవి: లెట్యూస్ ఆకులు (దీనికి బదులుగా తరిగిన క్యాబేజీ ఆకులను వాడుకోవచ్చు) – 1 కప్పు బొప్పాయి ముక్కలు – అర కప్పు ద్రాక్ష – అర కప్పు ఆరెంజ్ తొనలు – అర కప్పు జామపండు ముక్కలు – అర కప్పు స్ట్రాబెర్రీలు – అర కప్పు పుచ్చకాయ ముక్కలు – అర కప్పు బాదం పప్పు పలుకులు – టేబుల్‌స్పూన్ డ్రెస్సింగ్కోసం... నిమ్మరసం – టేబుల్ స్పూన్ తేనె – 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి – 2 ఉప్పు – తగినంత తయారి: 1. డ్రెస్సింగ్ కోసం చెప్పిన పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి కలపాలి. 2. పండ్ల ముక్కలన్నీ ఒక పాత్రలో తీసుకుని, డ్రెస్సింగ్ మిశ్రమం వేసి కలపాలి. 3. సలాడ్ కప్పులో లెట్యూస్ ఆకులు వేసి, పైన డ్రెస్సింగ్ చేసిన పండ్లముక్కలను వేసి సర్వ్ చేయాలి. కప్పు సలాడ్‌లో పోషకాలు: క్యాలరీలు : 103కి.క్యా కొవ్వు : 2.5 గ్రా. పిండిపదార్థాలు : 18.7 గ్రా. విటమిన్ : 30.7 గ్రా. -
మేనికి బొప్పాయి
ఎండ వేడిమి దాడి చేస్తోంది. దీనికి విరుగుడుగా ఈ కాలం మేని సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ►ఎండవేడికి చర్మం కమిలి, మంట పుడుతుంటే ఉపశమనానికి అలొవెరా జెల్ రాసి, పది నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ►ఇక ఈ కాలం సన్‌ప్రొటెక్షన్ లోషన్లు, మాయిశ్చరైజర్‌ని ఎంపిక చేసుకొని వాడాలి. వీటిని బయటకు వెళ్లడానికి ముందు 10 నిమిషాల ముందు రాసుకుంటే ఎండబారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. ►ఎండ నుంచి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జు చర్మానికంతా పట్టించి, మూడు నిమిషాలుంచి కడిగేయాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ఎండవేడిమికి కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. ►శిరోజాలకు వారానికి ఒకసారి కండిషనర్ను తప్పక ఉపయోగించాలి. అరటిపండు గుజ్జును తలకు పట్టించి, పది నిమిషాలు ఉంచి, కడిగేయాలి. దీనివల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతినదు. ►చర్మం నిస్తేజంగా మారకుండా రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. -
చలి కొరుకుతున్నప్పుడు ఏం తినాలి
చలికాలంలో ఏదో ఒకటి వేడిగా తినాలన్న యావ ఉంటుంది. పెనం మీద నుండి తీసి తింటే కడుపులో వెచ్చగా ఉండదు. నాలిక దాటాక చలి కొరుకుతూనే ఉంటుంది. మరి ఆవురావురని ఆవ తింటే... కాలిన కడుపుకి వెచ్చని కాపు కాస్తుంది. అందుకే ఆవురావురుమంటూ ఈ ఆవ పెట్టిన కూరలను వండండి... వేడివేడిగా తినండి... బొప్పాయి ఆవ పెట్టిన కూర కావలసినవి: బొప్పాయి తురుము – రెండు కప్పులు (బొప్పాయి కాయలను శుభ్రంగా కడిగి, సన్నగా తురుముకోవాలి); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; ఆవాలు – 2 టీ స్పూన్లు (తగినన్ని నీళ్లల్లో నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి); జీలకర్ర – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 4; అల్లం తురుము – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – ఒక టేబుల్ స్పూను; చిక్కటి చింతపండు పులుసు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఒక దాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ∙తరిగిన పచ్చి మిర్చి, అల్లం తురుము, కరివేపాకు వేసి మరోమారు బాగా కలపాలి ∙బొప్పాయి తురుము, ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ∙బొప్పాయి తురుము మెత్తపడేవరకు ఉడికించాలి ∙చింతపండు రసం, ఆవ ముద్ద వేసి కలియబెట్టి, చింతపండు రసం పచ్చి వాసనపోయే వరకు ఉడికించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి ∙అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. అరటి దూట ఆవపెట్టిన కూర కావలసినవి: అరటి దూట – పెద్ద ముక్క; పల్చటి మజ్జిగ – రెండు గ్లాసులు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను ; తరిగిన పచ్చిమిర్చి – 5; అల్లం తురుము – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఆవ ముద్ద – ఒక టీ స్పూను; చిక్కటి చింతపండు రసం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ∙ముందుగా అరటిదూటను శుభ్రం చేసి, సన్నగా ముక్కలుగా తరగాలి ∙ఈ ముక్కలను మజ్జిగలో వేయాలి, లేదంటే న ల్లబడిపోతాయి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చి మిర్చి, అల్లం తురుము వేసి దోరగా వేయించాలి ∙కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి. తరిగిన అరటిదూటను మజ్జిగలో నుంచి గట్టిగా పిండి తీసి, వేగుతున్న పోపులో వేయాలి ∙పసుపు, ఉప్పు జత చేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙అరటి దూట బాగా ఉడికిన తరవాత ఆవ ముద్ద, చింతపండు రసం వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి ∙ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది. పనస పొట్టు ఆవపెట్టిన కూర కావలసినవి: పనస పొట్టు – ఒక కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను (ఆవ పెట్టడం కోసం); చిక్కటి చింతపండు పులుసు – రెండు టీ స్పూన్లు పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – నాలుగు (ముక్కలు చేయాలి); తరిగిన పచ్చి మిర్చి – నాలుగు; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – తగినన్ని; నూనె – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ∙పనస పొట్టును నీళ్లలో శుభ్రంగా కడిగి నీరంతా పిండేసి తీసేయాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙ఆవాలకు నాలుగు స్పూన్ల నీళ్లు జత చేసి, పావు గంట తరవాత మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ ఉడికించిన పనస పొట్టును కుకర్ నుంచి బయటకు తీయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి, నూనె వేసి కాగాక, పోపు దినుసులు వేసి వేయించాలి ∙కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి ∙ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙పనస పొట్టును గట్టిగా పిండి పోపులో వేసి బాగా కలపాలి ∙చింతపండు రసం, ఉప్పు, పసుపు, ముందుగా నూరి పెట్టుకున్న ఆవ పొడి వేసి బాగా కలిపి, దింపేయాలి ∙వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. కొత్తిమీరతో అలంకరించాలి. క్యాబేజీ ఆవపెట్టిన కూర కావలసినవి: తరిగిన క్యాబేజీ – 2 కప్పులు; పోపు దినుసులు – ఒక టేబుల్ స్పూను; ఆవ పొడి – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 2; తరిగిన పచ్చి మిర్చి – 2; పసుపు – చిటికెడు; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, ఎండు మిర్చి, పోపు దినుసులు వేసి చిటపటలాడే వరకు వేయించాలి ∙పచ్చి మిర్చి జత చేసి వేయించాలి ∙పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి ∙క్యాబేజీ తరుగు వేసి బాగా కలపాలి ∙బాగా ఉడికిన తరవాత, ఆవ పొడి వేసి కలపాలి ∙చివరగా నిమ్మ రసం జత చేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి. కంద–బచ్చలి ఆవపెట్టిన కూర కావలసినవి: కంద – పావు కేజీ; బచ్చలి కూర – 150 గ్రా.; ఉప్పు – రుచికి తగినంత; చిక్కటి చింతపండు రసం – ఒక టీ స్పూను. ఆవాల ముద్ద కోసం: ఆవాలు – 2 టీ స్పూన్లు; బియ్యం – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2; నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙చిన్న పాత్రలో ఆవాలు, బియ్యం, ఎండుమిర్చి, తగినన్ని నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి ∙మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేసి పక్కన ఉంచాలి ∙కందను శుభ్రం చేసి, తొక్క వేరు చేసి, కందను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి ∙బచ్చలికూరను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙ఒక పాత్రలో కంద ముక్కలు, తరిగిన బచ్చలి ఆకు వేసి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్లోఉంచి మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙చల్లారాక, ఎక్కువగా ఉన్న నీళ్లను వేరు చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, పసుపు, ఎండు మిర్చి వేసి చిటపటలాడేవరకు వేయించాలి ∙ఉడికించిన కంద, బచ్చలి మిశ్రమం వేసి బాగా కలపాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలిపి చివరగా ఆవ ముద్ద, చింతపండు రసం వేసి కలిపి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. అరటికాయ ఆవపెట్టిన కూర కావలసినవి: అరటి కాయలు – 4; తరిగిన పచ్చి మిర్చి – 5; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను (తగినన్ని నీళ్లలో అరగంట సేపు నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); చిక్కటి చింతపండు రసం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙అరటికాయలను శుభ్రంగా కడిగి, పైన తొక్కను తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడించాలి ∙పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ∙కరివేపాకు, పచ్చి మిర్చి, అల్లం ముద్ద వేసి మరోమారు బాగా వేయించాలి ∙ఉడికించి ఉంచుకున్న అరటి కాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా మెదపాలి ∙ఆవ ముద్ద, చింతపండు రసం వేసి బాగా కలిపి, ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి. -
బ్యూటిప్స్
♦ ఒక్కొక్కసారి స్నానం చేసినా, ఏ సబ్బుతో ముఖం కడిగినా తాజాగా ఉన్నట్లనిపించదు. కాలుష్యం చర్మరంధ్రాల్లో పట్టేసినప్పుడు, జిడ్డు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఈ సమస్య పోయి ముఖం తాజాగా, శుభ్రంగా ఉండాలంటే బొప్పాయి గుజ్జు చక్కని మందు. మామూలుగా ప్యాక్‌కు వాడేకంటే ఎక్కువ మోతాదు గుజ్జు అవసరమవుతుంది. ముందుగా సగం గుజ్జును ముఖానికి, మెడకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత తుడిచేసి ముఖానికి ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టిన తరువాత మిగిలిన గుజ్జుతో ప్యాక్ వేయాలి. ప్యాక్ ఆరిన తరువాత చన్నీటితో కడగాలి. ♦ స్వచ్ఛమైన బాదం నూనె చర్మానికి చక్కని టానిక్‌లా పని చేస్తుంది. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్‌లు, లోషన్లకు బదులుగా ఆల్మండ్ ఆయిల్ వాడకం మంచి ఫలితాలనిస్తుంది. చలికాలంలో అన్ని రకాల చర్మతత్త్వాల వాళ్లూ దీనిని వాడవచ్చు. ముఖంతోపాటుగా చేతులు, కాళ్లకు కూడా (చలికి ఎక్స్పోజ్ అయ్యేంత వరకు) రాస్తుంటే మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, చర్మం మీదున్న మచ్చలు, గీతల వంటివి తొలగిపోతాయి. -
గుడ్ ఫుడ్
♦ బొప్పాయి నుంచి వచ్చే పాలలో నెయ్యిని కలిపి కొద్దిగా తీసుకుంటే... అజీర్తి వల్ల కలిగిన కడుపునొప్పి తగ్గుతుంది. అలాగే బొప్పాయి గింజలను ఎండబెట్టి పొడి చేసి, నేతితో కలిపి రోజూ కాస్త తీసుకుంటే... కడుపులో ఉన్న పురుగులు నశిస్తాయి. ♦ పొడిచర్మం త్వరగా ముడతలు పడుతుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి ఆముదం కాని, కొబ్బరి నూనె కాని రాసి ఉదయం వరకు అలాగే ఉంచాలి. కొబ్బరి నూనె అయితే ముఖమంతా రాయవచ్చు. ఆముదం అయితే కళ్ల చుట్టూ ప్రదేశాన్ని మినహాయించాలి. కొంతమందికి కళ్ల దగ్గర ఆముదం రాస్తే ఇరిటేషన్‌తో చర్మం ఎర్రబడుతుంది. ♦ ఒక కప్పు ముల్తానీ మట్టిని తీసుకుని... అందులో ఒక గుడ్డు తెల్లసొన, రెండు చెంచాల బియ్యపు పిండి, కాసిన్ని నీళ్లు కలిపి పేస్టులాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుత్తుకు, మాడుకు బాగా పట్టించి... ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో తలంటు కోవాలి. కొన్నాళ్లపాటు వారానికోసారి ఇలా చేస్తే జుత్తు బలపడుతుంది. సిల్కీగా తయారవుతుంది. -
జీర్ణశక్తిని పెంచే బొప్పాయి!
బొప్పాయి పండుతో ఆరోగ్యానికి సమకూరే ప్రయోజనాల జాబితాకు అంతు లేదు. జీర్ణక్రియకు తోడ్పడటం మొదలుకొని... అది జరిగే సమయంలోనే అందులోని హానికరమైన క్రిములను తుదముట్టించడం వరకు అనేక మేళ్లు చేస్తుంది బొప్పాయి. అందులో కొన్ని... ►బొప్పాయి కంటికి మేలు చేస్తుంది. కంటికి వచ్చే మాక్యులార్ డీజనరేషన్ అనేæ కంటి జబ్బును నివారిస్తుంది. ∙ఎముకలు బలహీనంగా మారే ఆస్టియోఆర్థరైటిస్ను బొప్పాయి అరికడుతుంది.∙బొప్పాయి తినేవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ ∙అనేక రకాల క్యాన్సర్లతో బొప్పాయి పోరాడుతుంది ∙మహిళల్లో రుతుక్రమాన్ని చక్కబరుస్తుంది. గర్భవతుల విషయంలో ఒక జాగ్రత్త : పండిన బొప్పాయి గర్భవతులకు మేలే అయినప్పటికీ వారికి బొప్పాయి పెట్టే విషయంలో ఒకింత జాగ్రత్త అవసరం. పూర్తిగా పండనిదీ, లేదా బాగా పచ్చిగా ఉన్న బొప్పాయిలో ‘పపాయిన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేసి కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీసేలా చేయవచ్చు. అందుకే పచ్చిది, పాక్షికంగా పండినవాటిని మాత్రం వారు తినకూడదు. -
బొప్పాయితో గర్భస్రావం అవుతుందా?
అపోహ: బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుంది. వాస్తవం: ఇది చాలామందిలో ఉన్న అపోహ. బాగా పక్వానికి వచ్చిన బొప్పాయి పండును తినడం గర్భవతులకు మేలు చేస్తుంది. ఎందుకంటే... ఇందులో విటమిన్–ఏ, విటమిన్–సిలతో పాటూ అనేక రకాల పోషకాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలి. పూర్తిగా పండని లేదా బాగా పచ్చిగా ఉన్నవాటిని తినకూడదు. పచ్చిబొప్పాయిలో ‘పపాయిన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ గర్భసంచిని ముడుచుకుపోయేలా (యుటెరైన్ కంట్రాక్షన్స్ను) ప్రేరేపించి కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీసేలా చేయవచ్చు. అందుకే పచ్చిది, పాక్షికంగా పండినవాటిని మాత్రం గర్భవతులు తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే ఆ పండ్లముక్కలను తేనెతోనూ, పాలతోనూ కలిపి తింటే అందులోని పపాయిన్ ఎంజైమ్ ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. -
‘రింగ్‌స్పాట్’తో బొప్పాయికి నష్టం
వైరస్ రాకుండానే ముందస్తు చర్యలు తీసుకోవాలి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సుబ్రమణ్యం అనంతపురం అగ్రికల్చర్: రింగ్‌స్పాట్ వైరస్ నివారణకు సరైన మందులు లేనందున వైరస్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నపుడే బొప్పాయి పంట లాభదాయకమని కర్నూలు జిల్లా మహానంది ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖరగుప్తా ఆధ్వర్యంలో బొప్పాయి, జామ తోటల సాగుపై రైతులకు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ దీప్తితో కలిసి కర్నూలు శాస్త్రవేత్త సుబ్రమణ్యం రైతులకు అవగాహన కల్పించారు. రింగ్‌స్పాట్ వైరస్ ప్రమాదకరం బొప్పాయికి ఆశించే రింగ్‌స్పాట్ వైరస్ చాలా ప్రమాదకరం. అందువల్ల వైరస్ సోకకుండా మొక్కల ఎంపికలోనే జాగ్రత్త తీసుకోవాలి. జిల్లాకు అనువైన ‘రెడ్‌లేడీ’ రకం బొప్పాయి ఎకరాకు 20 గ్రాములు విత్తనం అవసరమవుతుంది. పాలిథీన్ కవర్లలో దోమతెరలు కట్టి నారు పెంచి 45 నుంచి 60 రోజుల వయస్సు కలిగిన మొక్కలు నాటుకోవాలి. ఒకటిన్నర అడుగు గుంతలు తవ్వి 5 కిలోల పశువుల ఎరువు, అర కిలో వర్మీకంపోస్టు, ఒక కిలో వేపపిండి, 20 గ్రాములు సింగిల్ సూపర్‌పాస్ఫేట్ వేసి గుంత నింపి ఆ తర్వాత నాటుకోవాలి. రెండు నెలల తర్వాత ఒక్కో చెట్టుకు 100 గ్రాములు యూరియా, 140 గ్రాములు పొటాష్ ఎరువులు వేయాలి. అలా రెండు నెలలకోసారి ఎరువులు వేయాలి. ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు ఫర్టిగేషన్ పద్ధతిలో అయితే తొలిదశలో రోజు మార్చి రోజు ఒక కిలో 12–61–0, కాయలు ఏర్పడిన తర్వాత ఒక కిలో 19–19–19, అలాగే చివర్లో ఒక కిలో 0–0–50 ఎరువులు డ్రిప్ ద్వారా పంపాలి. చిన్నమొక్కల సమయంలో రోజుకు ఒక మొక్కకు నాలుగు లీటర్లు, పెద్ద చెట్లకు రోజుకు 8 లీటర్లు ఇవ్వాలి. అలాగే రింగ్ స్పాట్ వైరస్ నివారణకు తోట చుట్టూ నాలుగైదు సాళ్లు మొక్కజొన్న, అలాగే కంచె చుట్టూ రెండు వరుసలు అవిశే నాటుకుంటే వైరస్ వ్యాప్తి ఉండదు. సూక్ష్మపోషకాల (మైక్రోన్యూట్రియంట్స్) లోపం నివారణకు జింక్, బోరాన్, ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రాములు చొప్పున, 100 గ్రాములు యూరియా, కొద్దిగా నిమ్మరసంతో తయారు చేసిన సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి. తెగుళ్ల నివారణ బొప్పాయికి ఎక్కువగా బుడమకుళ్లు తెగులు సోకి కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. నివారణకు 2 గ్రాములు రిడోమిల్ ఎంజెడ్ లేదా 3 గ్రాములు బ్లైటాక్స్ లీటర్ నీటికి కలిపి కాండం తడిచేలా పాదుల దగ్గర పోయాలి. ఆకులపై బూడిద తెగులు నివారణకు 1 గ్రాము బైలెటన్ లేదా 1 మి.లీ కారథేన్ లేదా 1 గ్రాము ఇండెక్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయలపై వచ్చే మచ్చతెగులు నివారణకు 1 గ్రాము రిడోమిల్ ఎంజెడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. -
బ్యూటిప్స్
ఎండకు కమిలిన చర్మానికి బొప్పాయి రసం రాస్తే తక్షణం సాంత్వన కలుగుతుంది. ఫ్రూట్ ఫేషియల్కు బాగా పండిన బొప్పాయి పండు గుజ్జును అన్ని రకాల చర్మాల వాళ్లూ వాడవచ్చు. ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జులో టీ స్పూన్ శనగపిండి, టీ స్పూన్ పెరుగు కలిపి ప్యాక్ వేయాలి. ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. మెడ, మోచేతులు, పాదాల నలుపు వదలాలంటే బొప్పాయి ముక్కతో ఐదు నిమిషాల సేపు రుద్దాలి. ఇలా రెండువారాలు చేస్తే నలుపుపోతుంది. బొప్పాయిలో సహజసిద్ధంగా మైల్డ్ బ్లీచ్తోపాటు మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. కాబట్టి కృత్రిమ మైన బ్లీచ్, ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే కలిగే ఫలితాన్ని బొప్పాయి ప్యాక్‌తో సాధించవచ్చు. -
సుడిగాలులకు చెక్
- పండ్ల తోటలను కాపాడుకోవచ్చు – ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు అనంతపురం అగ్రికల్చర్ : ఈదురు, పెనుగాలులు, సుడిగాలుల నుంచి పండ్లతోటలను కాపాడుకునేందుకు రైతులు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) బీఎస్ సుబ్బరాయుడు తెలిపారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా ఈదురుగాలుల బీభత్సం, పిడుగులతో కూడిన అకాల వర్షాలు పడుతుంటాయని చెప్పారు. విపరీతమైన గాలుల వల్ల కోతలు, కాపుకు వచ్చిన అరటి, బొప్పాయి పంటలు దెబ్బతింటుండగా మామిడి, చీనీ లాంటి తోటల్లో కాయలు రాలుతున్నాయన్నారు. అలాగే లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్న షేడ్నెట్లు, గ్రీన్హౌస్, పాలీహౌస్‌లు, నర్సరీలు లాంటివి కూడా దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నష్ట నివారణకు రైతులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంత వరకు సమస్య నుంచి గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. రక్షణ చర్యలు ఉద్యాన తోటల చుట్టూ గాలినిరోధక చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అరటి, బొప్పాయి తోటలు సాగు చేసే సమయంలో తోట చుట్టూ కనీసం రెండు మూడు వరుసలు ఏపుగా పెరిగే అవిశె లేదా సరుగుడు లాంటి చెట్లు నాటుకుంటే కొంత వరకు గాలితీవ్రతను నివారించవచ్చు. అలాగే నీలగిరి, మలబార్ వేప, చెట్టు ఆముదం, చెట్టు తంగేడు లాంటివి వేసుకున్నా మేలు. అరటి రైతులు ప్రతి ఎకరాకు రెండు వరసులు అవిశే నాటుకోవడం వల్ల నష్టాన్ని పూర్తీగా తగ్గించవచ్చు. అలా చేయకపోతే పెరిగిన చెట్లు, గెల వేసిన చెట్లు, కాయలు కాసిన చెట్లు గాలివేగానికి నేలవాలే పరిస్థితి ఉంటుంది. కనీసం పంగలు కలిగిన కట్టెలతో అరటి చెట్లకు పోట్లు పెట్టుకుంటే కొంత వరకు నష్టాన్ని తగ్గించవచ్చు. కంపకంచె, ముళ్లకంచె వేసుకున్నా నష్టాన్ని తగ్గించుకోవచ్చు. తోటచుట్టూ కలబంద వేసినా, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అలాగే కందికట్టెను తడికెలు మాదిరిగా అల్లుకుని తోట చుట్టూ పెట్టుకున్నా ఫలితం ఉంటుంది. పాలీహౌస్, గ్రీన్‌హౌస్‌ల చుట్టూ కూడా అవిశే, సరుగుడు, నీలగిరి, మలబార్ వేప లాంటివి వేసుకోవడంతో పాటు చుట్టూ నీటితడులు ఇస్తే సుడిగాలిని నియంత్రించవచ్చు. విండ్స్ప్రింట్ అనే దోమతెరను గ్రీన్హౌస్ చుట్టూ వేసుకుని గాలి వెళ్లడానికి అవకాశం కల్పిస్తే ఈదురుగాలుల నుంచి కాపాడుకోవచ్చు. -
బ్యూటిప్స్
టేబుల్ స్పూన్ పచ్చి పాలలో కొన్ని చుక్కల రోజ్ వాటర్, తేనె, కొద్దిగా శనగపిండి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిస్తే ముఖం నిగారిస్తుంది.టీ స్పూన్ శనగపిండిలో మూడు చుక్కల నిమ్మరసం, కొద్దిగా బొప్పాయి రసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి. అర టేబుల్ స్పూన్ మెంతులను పొడి చేయాలి. దీంట్లో పెరుగు, మూడుచుక్కల రోజ్‌వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. వారంలో ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది. -
బొప్పాయితో బోలెడంత సౌందర్యం
బొప్పాయి పండు ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఎంతో ముఖ్యమైనది. ఈ బొప్పాయి ప్యాక్‌తో ఇంట్లోనే ‘ఫేషియల్ గ్లో’ సొంతం చేసుకోవచ్చు. అందులోని విటమిన్-ఎ, విటమిన్-సి, మెగ్నీషియం, పొటాషియం మీ ముఖారబిందాన్ని రెట్టింపు చేస్తాయి. డ్రై స్కిన్ ఒక గిన్నెలో రెండు బొప్పాయి పండు ముక్కల్ని చిదిమి గుజ్జులా చేసుకోవాలి. అందులో ఒక చెంచా తేనె, మూడు చెంచాల పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమంతో ముఖం, మెడపై ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ప్యాక్ వేసుకున్న చోట్లను శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ డ్రై స్కిన్ (పొడి చర్మం) వారికి మంచి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. మొటిమలు, జిడ్డు చర్మం రెండు చెంచాల బొప్పాయి గుజ్జులో ఒక చెంచా ముల్తానీ మట్టిని కలపాలి. ఆ మిశ్రమంతో రోజు విడిచి రోజు ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలా చేస్తే జిడ్డుతనం పోయి చర్మం నిగారిస్తుంది. పిగ్మెంటేషన్ ముఖంపై నల్ల మచ్చలతో బాధపడే వారికి బొప్పాయి పండు మంచి ఉపశమనం. రెండు చెంచాల బొప్పాయి పండు గుజ్జులో ఒక చెంచా నిమ్మరసం కలిపి రోజూ స్నానం చేసే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. -
బొప్పాయి.. సేంద్రియ సిపాయి!
- సేంద్రియ, ప్రకృతి సేద్య పద్ధతుల మేళవింపు - పకడ్బందీగా సేంద్రియ బొప్పాయి, మునగ సేద్యం.. - తొలి ఏడాదీ దిగుబడి తగ్గని వైనం.. - ఎకరానికి ఏటా రూ. లక్ష నికరాదాయమే లక్ష్యంగా సేంద్రియ సేద్యం ఉద్యాన పంటల్లో సేంద్రియ సేద్యం ప్రారంభించిన తొలి ఏడాదిలోనే రసాయనిక వ్యవసాయానికి దీటుగా దిగుబడి పొందడం సాధ్యమేనా? ఇటు పోషకాల లోపం రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ.. అటు చీడపీడలను, వైరస్ తెగుళ్లను ద్రావణాలు, కషాయాలతో సమర్థవంతంగా ఎదుర్కొని మంచి దిగుబడులతో అధికాదాయం పొందడం సాధ్యమేనా?? ఈ ప్రశ్నలకు ముమ్మాటికీ సాధ్యమేనని ఏకలవ్య ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ స్వానుభవంతో చెబుతోంది. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఈ ఫౌండేషన్ బొప్పాయి, మునగ సేంద్రియ తోటలు పెంచుతూ.. తొలి ఏడాదే ఆశ్చర్యకర ఫలితాలను నమోదు చేస్తోంది. రైతులు సేంద్రియ సేద్యం గుట్టుమట్లు తెలుసుకొని గనక పంటల సాగు చేపడితే.. నిశ్చింతగా రసాయనిక వ్యవసాయంతో దీటుగా దిగుబడి తీయడం, ఎకరంలో ఏడాదికి రూ. లక్ష నికరాదాయం పొందడం సుసాధ్యమేనని చాటుతున్న ‘ఏకలవ్య’ అనుభవాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. రైతుకు, పంట భూములకు, ప్రజారోగ్యానికి, ప్రకృతి వనరులకు విచ్చలవిడి రసాయనిక వ్యవసాయం నష్టదాయకంగా పరిణమించింది. దీనికి ప్రత్యామ్నాయంగా అనేక రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ముందుకొస్తున్నాయి. సేంద్రియ, ప్రకృతి సేద్యంపై ఒక్కొక్కరు ఒక్కో విషయం చెప్తుండడం వల్ల రైతుల్లో కొంత గందరగోళం నెలకొంటున్నది. ఈ నేపథ్యంలో.. సమగ్రమైన సేంద్రియ సేద్య పద్ధతులను స్థిరీకరించి, పంటల వారీగా సాగు పద్ధతులను నమోదు చేయడం ద్వారా సేంద్రియ సేద్యం వైపు ఆకర్షితులయ్యే రైతులకు మార్గదర్శంగా ఉండేందుకు ఏకలవ్య ఫౌండేషన్ కృషి చేస్తోంది. సులువుగా అనుసరణీయమైన, ఖర్చు తక్కువతో కూడిన సాగు మెలకువలను మేళవించి.. కచ్చితమైన ఫలితాలనిచ్చే సమగ్ర సేంద్రియ వ్యవసాయ పద్ధతిని కళ్లకు కట్టి చూపితే అన్నదాతలకు మేలు కలుగుతుందన్నది తమ అభిమతమని సేంద్రియ సేద్య విభాగం సారధి బూర్ల రమాకాంత్ ‘సాక్షి’తో చెప్పారు. ఇదే ఆలోచనతో మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి సమీపంలో వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశామన్నారు. మిడ్జిల్ మండలం ఉరుకొండపేటలో ఐదెకరాల్లో బొప్పాయి తోటను, కల్వకుర్తి మండలం కుర్మిద్ద గ్రామంలో ఏడెకరాల్లో మునగ తోటను సాగు చేస్తున్నామన్నారు. మునగ (ఎకరానికి 900 మొక్కలు.. 6ఁ8) పూత దశలో ఉంది. జీవామృతం వడకట్టుకోవడానికి ఈ తోటలో అనుసరిస్తున్న మూడు జల్లెళ్ల పద్ధతి బాగుంది. సేంద్రియ బొప్పాయి సాగు పద్ధతులు, పోషకాల యాజమాన్యం, చీడపీడల నియంత్రణ తదితర అంశాలపై రమాకాంత్ అందించిన సమాచారం ఇలా ఉంది. ఘనజీవామృతం, వేపపిండి మిశ్రమం.. ఉరుకొండపేటలో వెంకట రమణ గోశాల పక్కన గల ఐదెకరాల ఎర్ర చల్కా పొలంలో.. సరిగ్గా 8 నెలల క్రితం బొప్పాయి 4,150 మొక్కలు నాటారు. మొక్కల మధ్య 6 అడుగులు, సాళ్ల మధ్య 8 అడుగుల దూరం పెట్టారు. దుక్కి చేసిన పొలంలో.. 2 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పున గుంతలు తవ్వారు. వేపపిండి, ఘనజీవామృతం సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని (ఎకరానికి 2 క్వింటాళ్లు) గుంతల్లో వేసి.. నెల రోజుల హైబ్రిడ్ బొప్పాయి మొక్కలు నాటారు. డ్రిప్ వేసి, మల్చింగ్ షీట్‌ను అమర్చారు. కల్వకుర్తి ప్రాంతంలో సాధారణ వార్షిక వర్షపాతం 550 ఎం.ఎం. కాగా, ఈ ఏడాది 400 ఎం.ఎం.కు పైగా నమోదైంది. 300 అడుగుల్లోతు నుంచి బోర్ల ద్వారా తోడిన నీటితో పంటలు సాగవుతున్నాయి. సేంద్రియ సాగు కావడం వల్ల, మల్చింగ్ వల్ల సాగు నీటిని పొదుపుగా వాడగలుగుతున్నారు. ‘సేంద్రియ ఎన్.పి.కె.’ ద్రవరూప ఎరువులు! నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను సేంద్రియ పద్ధతుల్లో ప్రత్యేక ద్రావణాల ద్వారా బొప్పాయి, మునగ పంటలకు నేలకు ఇవ్వడంతోపాటు పిచికారీ చేస్తుండడం విశేషం. వీటిని డ్రిప్ ద్వారా అయితే.. ఎకరం/200 లీటర్ల నీటికి 2 లీటర్ల చొప్పున, పిచికారీకి అయితే ఎకరం / 200 లీటర్ల నీటికి అర లీటరు నుంచి లీటరు వరకు కలుపుతున్నారు. నత్రజని కోసం: చేప + బెల్లం సమాన పాళ్లలో కలిపిన ద్రావణాన్ని 10 రోజులు మురగబెట్టి వారానికోసారి వాడుతున్నారు. భాస్వరం కోసం: 10 లీటర్ల నీటికి పశువుల ఎముకల బూడిద కిలో చొప్పున కలిపి 10 రోజులు మురగబెట్టిన తర్వాత వాడుతున్నారు. మొక్కలు నాటిన రెండు నెలల వరకు వారానికోసారి, ప్రస్తుతం నెలకోసారి వాడుతున్నారు. పొటాష్ కోసం: కిలో నాటు పొగాకు (తంబాకు) చూర, కాడలు, కాయలు + 25 లీటర్ల నీరు లేదా ఆవు మూత్రం లేదా నీరు - ఆవు మూత్రం చెరి సగం కలిపి వాడుతున్నారు. గోమూత్రంతో పిండినల్లి పరారీ: బొప్పాయి కాండంపై ఎప్పుడైనా పిండినల్లి కనిపిస్తే.. 10% గోమూత్రం (100 లీటర్ల నీటికి 10 లీటర్ల గోమూత్రం+ 150 గ్రా. సబ్బుపొడి కలిపి) పిచికారీ చేసి సమర్థవంతంగా అరికడుతున్నారు. వైరస్ వ్యాధుల నివారణకు: 200 లీ. నీటికి 20 గ్రాముల పీజీపీఆర్ బ్యాక్టీరియాను కలిపి నెలకోసారి పిచికారీ చేస్తున్నారు. వైరస్ సోకితే 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. ద్రావణాలు, కషాయాల పిచికారీకి షెడ్యూల్ తయారు చేసుకొని ప్రతి పిచికారీకి కనీసం వారం వ్యవధి ఉండేలా చూసుకుంటున్నామన్నారు. వీటి వల్ల మిత్రపురుగులకు ఎటువంటి నష్టమూ ఉండదన్నారు. కాండం కుళ్లు తెగులు నివారణ: పేడ పేస్ట్ బాగా పనిచేస్తున్నది. 5 కిలోల ఆవుపేడ + 5 లీటర్ల ఆవు మూత్రం + 250 గ్రా. సున్నం కలిపి పేస్ట్ తయారు చేసి.. బొప్పాయి చెట్టు కాండానికి రెండు నెలలకోసారి పూస్తున్నారు. వేరుకుళ్లు నివారణకు: 200 లీటర్ల జీవామృతంలో 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి బ్యాక్టీరియాను కలిపి.. 3 రోజులు మురగబెట్టి డ్రిప్ ద్వారా రెండు దఫాలు ఇస్తే అద్భుత ఫలితం వచ్చింది. ఇంకా బొప్పాయి తోటలో ఫంగస్ నివారణకు, కాయ నాణ్యత పెంపుదలకు పుల్ల మజ్జిగ పిచికారీ చేస్తున్నారు. వైరస్ తెగుళ్ల నివారణకు ఆవు పాలు బాగా పనిచేస్తున్నాయంటున్నారు. చిన్న, పెద్ద పురుగులకు చేప కునపజలాన్ని సైతం పిచికారీ చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. మరో ఏడాదికల్లా బొప్పాయి తోటలో ఆద్యంతం ఎదురయ్యే సమస్యలు, చీడపీడలు - సేంద్రియ పద్ధతుల్లో నివారణోపాయాలను రైతులకు పూర్తిస్థాయిలో అందించగలమని రమాకాంత్ ధీమాగా తెలిపారు. సేంద్రియ సేద్యంలో వైరస్ బెడద తక్కువ! తమ సేంద్రియ బొప్పాయి తోట ఆరున్నర నెలలకే కోతకొచ్చిందని, మొదటి నెలలోనే ఎకరానికి 4 టన్నుల దిగుబడి వచ్చిందని రమాకాంత్ (83747 21751) తెలిపారు. రానున్న 16 నెలల్లో ఎకరానికి 400 టన్నుల దిగుబడి సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. రసాయనిక వ్యవసాయంలో సాధారణంగా 7-8 నెలల బొప్పాయి తోటలో ఎల్లో మొజాయిక్ వైరస్ బారిన పడిన చెట్లు 60-80 శాతం వరకు కనిపిస్తుంటాయని, దిగుబడి తగ్గిపోవడానికి ఇదే ముఖ్య కారణమని ఆయన తెలిపారు. మొక్కలు నాటిన 8-9 నెలల తర్వాత వైరస్ పూర్తిగా కమ్మేయడం వల్ల పిందెలు ఏర్పడడం కష్టంగా మారి, ఏడాదిన్నరకే పంట ముగిసిపోతుంటుందన్నారు. అయితే, తమ తోటలో వైరస్‌ను 2 నెలల్లోనే నియంత్రించగలిగామని, వైరస్ సోకిన చెట్లు 20%కి మించి లేవన్నారు. వైరస్‌ను కంట్రోల్ చేయడం వల్ల పంట కాలం 6-7 నెలల పాటు పెరుగుతుందని, తద్వారా దిగుబడి అదనంగా వస్తుందన్నారు. సేంద్రియ సేద్యంలో వైరస్ కంట్రోల్ అవుతుంది కాబట్టి దిగుబడి బాగుంటుందని, రైతుకు మంచి ఆదాయం వస్తుందన్నారు. డ్రిప్ ద్వారా నీరు, పోషకాల సరఫరా తోట అంతటా ఒకేలా జరగాలంటే వాటర్ డిశ్చార్జి ఒకేలా ఉండాలన్నారు. డ్రిప్ ఉన్నా.. నెలకోసారి సాళ్ల మధ్యలో నీటి తడి ఇచ్చి, జీవామృతం వడకట్టాక మిగిలే మడ్డిని వేస్తున్నందున పంట ఏపుగా పెరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ‘ఏకలవ్య’ సేంద్రియ క్షేత్రంలో తొలి ఏడాదే అధిక దిగుబడి సాధిస్తుండడం అభినందనీయం. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు : పీ ఏ నాగరాజు ‘జీవామృత పంచగవ్య’తో సత్ఫలితాలు బొప్పాయి, మునగ తోటల్లో పోషకాల యాజమాన్యంలో జీవామృతంతో పంచగవ్య కలిపి (‘జీవామృత పంచగవ్య’) వాడటం వల్ల చక్కని ఫలితాలొస్తున్నాయని రమాకాంత్ తెలిపారు. గ్రాము జీవామృతంలో 6 కోట్ల సూక్ష్మజీవులుండగా, ఇందులో 2,70,000 కోట్లున్నాయి. 200 లీటర్ల జీవామృతంలో 2 లీటర్ల పంచగవ్యను కలిపి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. జీవామృతం తయారీ కోసం 10 కిలోల పేడ, 10 లీటర్ల మూత్రం, కిలో బెల్లం, కిలో పప్పుల పొడి, 180 లీటర్ల నీటిని కలిపి.. 24 గంటల తర్వాత.. 2 లీటర్ల పంచగవ్యను కూడా పోసి కలపాలి. అలా ఆరు రోజులు మురగబెడితే ‘జీవామృత పండగవ్య’ వాడకానికి సిద్ధమవుతుంది. దీన్ని పూత దశ (మూడున్నర నెలల) వరకు 15 రోజులకోసారి డ్రిప్ ద్వారా ఇచ్చారు. ఆ తర్వాత 10 రోజులకోసారి, కాపు దశ నుంచి వారానికోసారి ఇస్తున్నారు. డ్రిప్ ద్వారా నేలకు ఇవ్వడంతోపాటు పిచికారీ కూడా చేస్తున్నారు. నూనె పిచికారీతో ‘వైట్ పీచ్ స్కేల్’కు చెక్! బొప్పాయి తోటలో ‘వైట్ పీచ్ స్కేల్’ (కాయపై తెల్లని బూజు) సమస్య నివారణకు అనేక ప్రయోగాలు చేశామని చెబుతూ.. పత్తి గింజల నూనెను పిచికారీ చేసి సత్ఫలితాలు సాధించారు. లీటరు పత్తి గింజల నూనెలో 100 ఎం.ఎల్. ఎమల్సిఫైర్ వేసి.. వంద లీటర్ల నీటిలో కలిపి.. అవసరమైనప్పుడు పిచికారీ చేస్తున్నారు. హై కంప్రెసర్ స్ప్రేయర్‌తో పిచికారీ చేసి బూజును చెదరగొడుతున్నారు. 15 లీటర్ల నీటికి 100 ఎం.ఎల్. కిరోసిన్ కలిపి లేదా 15 లీటర్ల నీటికి 6-7 ఎం.ఎల్. షాంపూ సాచెట్‌ను కలిపి పిచికారీ చేసినా మంచి ఫలితం వచ్చింది. అన్ని రకాల రసం పీల్చే పురుగులు, కొరికి తినే పురుగుల నుంచి పంటను కాపాడుకోవడానికి 5% పదాకుల (దశపత్ర) కషాయం (100 లీటర్ల నీటికి 5 లీటర్ల కషాయం)ను ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. మొక్కలు నాటిన 3 నెలల తర్వాత నుంచి.. ఒక వారం పదాకుల కషాయం (5%), మరో వారం వేప నూనె (10,000 పీపీఎం)ను వంద లీటర్ల నీటికి 250 ఎం.ఎల్. చొప్పున కలిపి పిచికారీ చేస్తున్నారు. -
ఆహారంపై 10 అపోహలు... వాస్తవాలు
మనం రోజూ తినే ఆహారం గురించి మనకు తెలిసిన విషయాలు తక్కువ. పైగా అందులోనే బోలెడన్ని అపోహలూ, తప్పుడు అభిప్రాయాలు. మనం రోజూ తినే ఆహారంపై ఉన్న అపోహలు తొలగించుకొని, వాస్తవాలు తెలుసుకుందాం. అపోహ: బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుంది. వాస్తవం: బాగా పక్వానికి వచ్చిన బొప్పాయి పండును తినడం గర్భవతులకు మేలు చేస్తుంది. కానీ పూర్తిగా పండని, లేదా బాగా పచ్చిగా ఉన్న బొప్పాయిలో ‘పపాయిన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ గర్భసంచిని ముడుచుకుపోయేలా ప్రేరేపించి కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీసేలా చేయవచ్చు. అందుకే గర్భవతులు పచ్చికాయ తినకూడదు. అపోహ: గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ తప్పదా? వాస్తవం: పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉండే మాట వాస్తవమే. ఒక గుడ్డులో 211 మి.గ్రా. ఉంటుంది. కొలెస్ట్రాల్ మోతాదులు ఎంతగానో మించితేనే అప్పుడవి రక్తప్రవాహానికి అడ్డుపడతాయి. అంతేగానీ ఒక గుడ్డులో ఉన్న పచ్చసొనకు రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పరిచేంత కొవ్వు ఉండదంటున్నారు పెన్స్ స్టేట్ యూనివర్సిటీ నిపుణులు. అపోహ: నిమ్మజాతి పండ్లు అయిన నిమ్మ, నారింజ, బత్తాయితో పాటు జామ పండు తింటే జలుబు చేస్తుంది. వాస్తవం: నిమ్మజాతి పండ్లలో విటమిన్-సి పాళ్లు ఎక్కువ. జలుబు చేయడం అన్నది వైరస్ వల్ల జరిగే పరిణామం. దీన్ని మన వ్యాధి నిరోధకశక్తి ఎదుర్కొని అదుపు చేస్తుంది. అలా ‘విటమిన్-సి’ని సమకూర్చి ఇమ్యూనిటీ పెంచే గుణం నిమ్మజాతిపండ్లతో పాటు జామకూ ఉంది. అపోహ: గర్భవతులు పాలు తాగడం వల్ల బిడ్డ తెల్లగా పుడతాడు. కాఫీ లేదా టీ తాగితే బిడ్డ మేనిచాయ ఒకింత తగ్గవచ్చు. వాస్తవం: ఇది పూర్తిగా తప్పు. బిడ్డ రంగును కేవలం జన్యు వులు నిర్ణయిస్తాయి. గర్భవతులు పాలు తాగడం వారి ఆరోగ్యానికి మేలు చేసే విషయం కాబట్టి పాలు తాగడం మంచిదే. కాఫీ, టీ తీసుకున్నా బిడ్డ రంగు మారడు. అపోహ: కాకరకాయ తింటే డయాబెటిస్ తగ్గుతుంది. వాస్తవం: కాకరలోని పోషకాలైన కరాటిన్, మమోర్డిసిన్ అనే పదార్థాలకు రక్తంలోని చక్కెరపాళ్లను తగ్గించే సామర్థ్యం ఉంది. వాటి గింజలలో పాలీపెప్టైడ్-పీ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్థం ఉంటుంది. అయితే కేవలం కాకర తినడం వల్ల చక్కెర అదుపులో ఉండదు. డయాబెటిస్ రోగులు చక్కెరను నియంత్రించే మందులు వాడాల్సిందే. అపోహ: పాలకూర, టమాట కలిపి తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. వాస్తవం: కిడ్నీల్లో ఏర్పడే రాళ్లలో అనేక రకాలు ఉంటాయి. వాళ్లు చాక్లెట్లు వంటివీ తినకూడదు. జన్యుకారణాల వల్ల ఇలా కొన్ని పదార్థాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నవారు మినహా, మిగతా వాళ్లంతా మంచి ఆరోగ్యం కోసం పాలకూర, టమాట నిర్భయంగా, నిశ్చింతగా తినవచ్చు. అపోహ: బ్రేక్‌ఫాస్ట్‌గా టిఫిన్ కంటే పండ్లు తినడమే మేలు. వాస్తవం: రాత్రి భోజనం పూర్తయ్యాక సుదీర్ఘమైన వ్యవధి తర్వాత మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తింటాం. ఇంత వ్యవధి తర్వాత తినే ఆహారం కేవలం పండ్లూ, ఫలాలకు బదులుగా బలవర్థకమైన ఆహారం అయితే మంచిది. పైగా ఉదయం తినే ఆహారం కొంత ఘనంగా ఉండటం వల్ల రోజంతా చేసే పనులకు తగిన శక్తి వస్తుంది. అపోహ: రాత్రివేళ పెరుగు తినడం వల్ల ఉదయం విరేచనం సుఖంగా జరగదు. వాస్తవం: నిజానికి పెరుగు అనేది కడుపులోకి వెళ్లకముందునుంచే జీర్ణమవుతుండే ఆహారం. ఈ కారణం వల్ల పెరుగు ప్రీ-డెజెస్టైడ్ ఆహారం కాబట్టి రాత్రి తిన్నతర్వాత మరింత తేలిగ్గా జీర్ణమవుతూ ఉంటుంది. కాబట్టి పెరుగు తినడం వల్ల ఉదయం మలబద్దకం రాదు. అపోహ: గర్భవతులు ఎక్కువగా ద్రాక్ష తినడం మంచిది. వాస్తవం: గర్భవతులు ద్రాక్షపండ్లను తినడం అంత మంచిది కాదు. ద్రాక్ష కాస్త ఆమ్లగుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ‘హార్ట్ బర్న్’ ఎక్కువగా కనిపిస్తుంది. ద్రాక్షలో రెస్వెరట్రాల్ అనే పోషకాలు గర్భవతుల్లో హార్మోన్ల అసమతౌల్యతకు దారితీసి వారికి హాని చేయవచ్చు. అందుకే ద్రాక్ష తక్కువగా తినడం మేలు. అపోహ: ఏదైనా శస్త్రచికిత్స తర్వాత శనగపప్పు తింటే చీము పడుతుంది. వాస్తవం: శనగపప్పుకూ, చీము పట్టడానికీ ఎలాంటి సం బంధం లేదు. చీము పట్టడం గాయాలను మాన్పేందుకు తెల్లరక్తకణాలు, హానికారక బ్యాక్టీరియాతో పోరాడటం వల్ల జరిగేదే తప్ప... శనగపప్పు వల్ల కాదు. పప్పులు తినడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. -
రసం పీల్చే పురుగులతో అప్రమత్తంగా ఉండండి
పెనుమూరు: బొప్పాయి, బెండ, టమాట పంట లకు రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నాయని, వీటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిరుపతి రాష్ట్రీయ కృషి విజ్ఞాన కేంద్రం పట్టు పరిశ్రమ శాఖ శాస్త్రవేత్త పద్మజ తెలిపారు. బుధవారం పెనుమూరు మండలంలోని సోమనందాపురం, కావూరివారిపల్లె తదితర గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. పద్మజ మాట్లాడుతూ రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోపిడ్ 0.5 మిల్లీలు లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలని చెప్పారు. బొప్పాయి తోటల్లో పిండినల్లి ఆశిస్తోంద ని, రోగార్ 2 మిల్లీలు ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పంట సాగుకు ముందే విత్తనశుద్ధి చేపడితే తెగుళ్ల ఉద్ధృతిని అరికట్టవచ్చని వివరించా రు. రాష్ట్రీయ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త సుధాకర్ మాట్లాడుతూ మండలంలో సాగవుతున్న మల్బరీ తోట ల ద్వారా పట్టు పురుగుల పెంపకంతో రైతులు మంచి లాభాలు పొందుతున్నారని, ఎకరా పొలంలో మల్బరీ తోట సాగుకు సుమారు రూ.15 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రభుత్వం పట్టు పరిశ్రమ శాఖ ద్వారా మల్బరీ సాగు చేసిన రైతులను ప్రోత్సహించడానికి ఎకరాకు రూ.6,700 నగదు సబ్సిడీని చెక్కు రూపంలో అందిస్తోందని తెలిపా రు. తోట సాగుకు వేపపిండిని 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తోం దన్నారు. ఎకరా పొలంలో మల్బరీ తోట సాగు చేస్తే సుమారు 250 పట్టు గుడ్లును పెంచుకోవచ్చని చెప్పారు. రెండు నెలలకు ఓసారి 150 నుంచి 180 కిలోల పట్టు గూళ్లు ఉత్పత్తి చేయవచ్చని వెల్లడించారు. పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన షెడ్డు నిర్మాణానికి పట్టు పరిశ్ర మ శాఖ రూ.లక్ష నగదు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. స్టాండ్లను రూ.16,500 సబ్సిడీపై ఇస్తున్నట్లు వెల్లడించా రు. పట్టు పురుగులు గూళ్లు కట్టే 250 నేత్రికలు రైతులకు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. కిలో పట్టుగూళ్లు ఉ త్పత్తిచేస్తే రూ.50 సబ్సిడీ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ శాఖ సాంకేతిక అధికారి వసంతరాయులు, మండల వ్యవసాయాధికారి సుమతి, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు జయంతి, నీలిమ పాల్గొన్నారు. -
ఖర్చు తక్కువ రాబడి ఎక్కువ
డ్రిప్ పద్ధతిలో బొప్పాయి సాగు ఎకరాకు రూ.లక్ష ఖర్చుతో రూ.2 లక్షల ఆదాయం పూతలపట్టు: డ్రిప్ పద్ధతిలో బొప్పాయి సాగుచేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని నిరూపిస్తున్నాడు పూతలపట్టు మండలం నొచ్చుపల్లె గ్రామానికి చెందిన రవి. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సాగు మంచి ఫలితాలు ఇస్తుండడంతో పలువురు రైతులు ఆ మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. సాగు విధా నం, దిగుబడి గురించి రవి(9492548265) మాటల్లోనే చూద్దాం.. నాకున్న ఎకరా పొలంలో చాలా ఏళ్లుగా చెరుకు సాగు చేసేవాడిని. మొదట్లో దిగుబడి బాగా వచ్చినా రానురాను తగ్గిపోయింది. పైగా నీటి ఖర్చు కూడా ఎక్కువ. వ్యవసాయాధికారులను సంప్రదిస్తే పంట మార్పిడి చేయమన్నారు. పైగా డ్రిప్‌తో సాగు చేస్తే మంచి ఫలి తాలు ఉంటాయని చెప్పారు. వారి సూచన మేరకు తైవాన్ రెడ్ లేడి 786 రకం బొప్పాయి సాగుకు ఉపక్రమించాను. చెరుకు సాగుచేస్తే సంవత్సరానికి ఫలితం వచ్చేది. అదే బొప్పా యిలో ఆరు నెలల నుంచే దిగుబడి వస్తోంది. పైగా అంతకంతకు ఆదాయం ఉండడంతో ఆర్థికంగా కొంతమేరకు ఉపశమనం లభించింది. సాగు విధానం.. బొప్పాయి పంట సాగుకు మిట్టనేలలు మంచిది. ఎన్నుకున్న పొలాన్ని బాగా దున్నుకోవాలి. డ్రిప్ పైపులను అమర్చుకోవాలి. దీనికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ప్రతి ఆరు అడుగులకూ ఓ అడుగు లోతు గుంత తవ్వాలి. ఇందులో ముందుగా ఆవుల ఎరువును వేసి వారం, పది రోజులు మగ్గనివ్వాలి. తర్వాత అందులో మొక్కలు నాటాలి. నాటిన మూడు రోజులకు నీరు అందించాలి. తర్వాత నాలుగు రోజులకోసారి తడి ఇస్తే సరిపోతుంది. పూత, పిందె దశలో రోజు మార్చి రోజు నీరు అందిస్తే ఆరు నెలలకు దిగుబడి ప్రారంభవుతుంది. 25 రోజులకోసారి ఏడాది మొత్తం కాయలు కోతకు వస్తాయి. మొదటి నాలుగైదు కోతలకు కాయలు పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి మంచి ధర పలుకు తాయి. పోనుపోను కాయ సైజు తగ్గుతుంది కాబట్టి ధర కూడా అలాగే ఉంటుంది. సస్యరక్షణ.. బొప్పాయిలో ప్రతి 15 రోజులకోసారి మందు లు పిచికారి చేయాలి. చెట్లు పూతకు వచ్చే వరకు క్రిమికీటకాలు బారి నుంచి కాపాడుకునేందుకు ఫాంటాక్, టాటామిడా, ఎఫ్-4, బోరాన్ మందులు పిచికారి చేయాలి. కాపునకు వచ్చిన తర్వాత పిండినల్లి రాకుండా మందులు పిచికారీ చేసుకోవాలి. ఖర్చులు.. ఆదాయం ఎకరా నేల దున్నకాలకు రూ.2 వేలు ఖర్చవుతుంది. పేడ ఎరువు 10 లోడ్లకు రూ.20 వేలు అవుతుంది. ఎకరాకు 1,300 మొక్కలు అవసరమవుతాయి. రూ.10 చొప్పున రూ.13 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. గుంతలు తవ్వడానికి, మొక్కలు నాటడానికి రూ.13 వేలు, రెండు నెలలకొకసారి ఎరువులకు రూ.20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కలుపుతీతకు రూ.10 వేలు, మందులకు రూ.15 వేలు ఖర్చు అవుతుంది. డ్రిప్‌తో కలిపి మొత్తంగా దాదాపుగా రూ.లక్ష వరకు ఖర్చు వస్తుంది. ఆరు నెలల నుంచి దిగుబడి ప్రారంభవుతుంది. ప్రతి 25 రోజులకొకసారి కోత ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏడాదికి 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో వాటి ధర కేజీ రూ.10 నుంచి 17 వరకు ఉంటుంది. ధర కేజీ రూ.10 అనుకున్నా రూ.3 లక్షలు వస్తుంది. ఖర్చులు లక్ష పోను దాదాపు రూ.2 లక్షలు మిగులుతుంది. -
మామిడి మధురం.. చేదు నిజం..!
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : మామిడి, అరటి, బొప్పాయి, సపోట, ద్రాక్ష, దానిమ్మ ఇలా అనేక రకాల పండ్లు కాలాలకు అనుగుణంగా ఆరగిస్తే ఆరోగ్యానికి మంచిది. శరీర ఎదుగుదలకు, పరిపుష్టికి దోహదపడుతాయి. అన్ని కాలాలలో దొరికేది అరటి. వేసవి కాలంలో దొరికేది మాత్రం మామిడి. అయితే పండ్ల వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి చెట్టుమీద కాయలు పండకుండానే కోసి మాగపెడుతున్నారు. తొందరగా పండటం కోసం కాల్షియం కార్భైట్, పొగబెట్టి మాగబెట్టడం వంటి చర్యలతో కాయలను పండ్లుగా మారుస్తున్నారు. అనంతరం బహిరంగ మర్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా పండిన పండ్లలో ప్రక్టోజ్, గ్లూకోజ్, కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయి. శరీరం నీరసించిపోయినప్పుడు ఇవి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మలబద్ధకం, ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతాయి. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లలో ఇవి ఉండవు. కాగా, ఆరోగ్యానికి హానికరం. జిల్లాలో ప్రధానంగా మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, చెన్నూర్, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో మామిడి వ్యాపారం జరుగుతాయి. ఏటా రూ.11 కోట్ల మామడి పండ్ల వ్యాపారం జరుగుతుంది. మామిడిని ఎలా మాగ పెడతారంటే.. మామిడి పండ్లను కొనుగోలు చేయడం వ్యాపారులకు ఆర్థికంగా పెట్టుబడి ఎక్కువ కావడంతో కాయలను ఎంచుకుంటున్నారు. మామిడి తోటల్లో కాయలు, గాలి దుమారంకు కింద పడిన కాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తారు. గ్యాస్ వెల్డింగ్‌కు వినియోగించే కాల్షియం కార్బైట్‌ను కొనుగోలు చేస్తారు. ఈ రసాయనాన్ని పొట్లాలుగా మారుస్తారు. 20 కిలోల మామిడి కాయల బాక్స్‌లలో, నేలపై రాశులుగా వేసిన కాయల మధ్య ఐదు నుంచి 50 వరకు కార్బైట్ పొట్లాలను మధ్య మధ్యన పెడతారు. ఆ కార్బైట్ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తుంది. ఆ రసాయనాల ప్రతిచర్యతో ఉష్ణోగ్రత పెరిగి కాయలు పండ్లుగా మారుతాయి. నాలుగు రోజులపాటు బాక్స్‌లలో, నేల మీద రాశులుగా ఉన్న మామిడికాయలు పండ్లుగా మారతాయి. పూర్తి పచ్చదనంలోకి వచ్చి మామిడి ప్రియుల నోర్లు ఊరించేలాగా మారుతాయి. అలా తయారైన మామిడి పండ్లను మార్కెట్లోకి రిటైల్ అమ్మకం దారులకు విక్రయిస్తారు. అలా చేతులు మారిన మామిడి పండ్లు మామిడి ప్రియుల చేతికి చేరి కడుపులోకి వెళ్లి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. గ్యాస్ ద్వారా పండ్లుగా మార్చడం మరో పద్ధతి గ్యాస్ ద్వారా కూడా మామిడి కాయలను పండ్లుగా మార్చడం కొత్త పద్ధతి. గతేడాది మంచిర్యాలలో ప్రారంభమైంది. కాల్షియం కార్బైట్ తక్కువ ఖర్చుతో పండ్లుగా మార్చే వీలున్నప్పటికి పెద్ద మొత్తంలో పండ్లుగా మారడం సాధ్యం కాదు. దాంతో కూలింగ్ స్టోర్ విధానం ద్వారా కాయలను పండ్లుగా మారుస్తున్నారు. ఒకేసారి 8 వేల కిలోల వరకు కాయలను పండ్లుగా మార్చే సౌలభ్యం కూలింగ్ స్టోర్‌లో ఉంటుంది. ఇథిలేన్ అనే గ్యాస్‌ని కూలింగ్ స్టోరేజ్‌లోకి పంపుతారు. పగలంతా కూలింగ్, రాత్రి వేళ మాత్రమే గ్యాస్‌ను స్టోర్‌లోకి విడుదల చేస్తారు. అలా రసాయనాల ప్రభావంతో నాలుగు రోజుల్లోనే కాయలు పండ్లుగా మారతాయి. ఒక మామిడిపండే కాకుండా అరటికాయలను కూడా పండ్లుగా మారుస్తున్నారు. పండ్లను మాగ పెట్టడానికి కూలింగ్ స్టోరేజ్‌లు పెట్టడానికి రూ.25 లక్షల నుంచి రూ.30 వరకు వ్యయం చేస్తున్నారంటే లాభాలు ఎలా ఉన్నాయో తేట తెల్లం అవుతుంది. అమలు కాని నిషేధం బహిరంగ మార్కెట్లో కార్బైట్ విచ్చలవిడిగా దొరుకుతోంది. కిలో విలువ రూ.80 ఉంటుంది. దీనిని స్టీలు రంగు మార్చేందుకు, వెల్డింగ్ కోసం ఉపయోగిస్తారు. పండ్లపై వీటి వాడకాన్ని నిషేధించిన అమలుకావడం లేదు. వ్యాపారులు గోదాముల్లో కార్బైన్‌ను వినియోగించి మాగబెడుతున్నా పట్టించుకోవడం లేదు. వీటి వాడకాన్ని తగ్గిస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వారు అవుతారు. అధికారుల నిర్లిప్తతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఏటా రూ.కోట్ల వ్యాపారం చేస్తున్నారు.