‘రింగ్‌స్పాట్‌’తో బొప్పాయికి నష్టం | agriculture story | Sakshi
Sakshi News home page

‘రింగ్‌స్పాట్‌’తో బొప్పాయికి నష్టం

Published Tue, Sep 12 2017 11:13 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

‘రింగ్‌స్పాట్‌’తో బొప్పాయికి నష్టం - Sakshi

‘రింగ్‌స్పాట్‌’తో బొప్పాయికి నష్టం

వైరస్‌ రాకుండానే ముందస్తు చర్యలు తీసుకోవాలి
ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్‌ సుబ్రమణ్యం


అనంతపురం అగ్రికల్చర్‌: రింగ్‌స్పాట్‌ వైరస్‌ నివారణకు సరైన మందులు లేనందున వైరస్‌ రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నపుడే బొప్పాయి పంట లాభదాయకమని కర్నూలు జిల్లా మహానంది ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ కె.సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపల్‌ ఎస్‌.చంద్రశేఖరగుప్తా ఆధ్వర్యంలో బొప్పాయి, జామ తోటల సాగుపై రైతులకు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ దీప్తితో కలిసి కర్నూలు శాస్త్రవేత్త సుబ్రమణ్యం రైతులకు అవగాహన కల్పించారు.

రింగ్‌స్పాట్‌ వైరస్‌ ప్రమాదకరం
బొప్పాయికి ఆశించే రింగ్‌స్పాట్‌ వైరస్‌ చాలా ప్రమాదకరం. అందువల్ల వైరస్‌ సోకకుండా మొక్కల ఎంపికలోనే జాగ్రత్త తీసుకోవాలి. జిల్లాకు అనువైన ‘రెడ్‌లేడీ’ రకం బొప్పాయి ఎకరాకు 20 గ్రాములు విత్తనం అవసరమవుతుంది. పాలిథీన్‌ కవర్లలో దోమతెరలు కట్టి నారు పెంచి 45 నుంచి 60 రోజుల వయస్సు కలిగిన మొక్కలు నాటుకోవాలి. ఒకటిన్నర అడుగు గుంతలు తవ్వి 5 కిలోల పశువుల ఎరువు, అర కిలో వర్మీకంపోస్టు, ఒక కిలో వేపపిండి, 20 గ్రాములు సింగిల్‌ సూపర్‌పాస్ఫేట్‌ వేసి గుంత నింపి ఆ తర్వాత నాటుకోవాలి. రెండు నెలల తర్వాత ఒక్కో చెట్టుకు 100 గ్రాములు యూరియా, 140 గ్రాములు పొటాష్‌ ఎరువులు వేయాలి. అలా రెండు నెలలకోసారి ఎరువులు వేయాలి.

ఫర్టిగేషన్‌ ద్వారా ఎరువులు
ఫర్టిగేషన్‌ పద్ధతిలో అయితే తొలిదశలో రోజు మార్చి రోజు ఒక కిలో 12–61–0, కాయలు ఏర్పడిన తర్వాత ఒక కిలో 19–19–19, అలాగే చివర్లో ఒక కిలో 0–0–50 ఎరువులు డ్రిప్‌ ద్వారా పంపాలి. చిన్నమొక్కల సమయంలో రోజుకు ఒక మొక్కకు నాలుగు లీటర్లు, పెద్ద చెట్లకు రోజుకు 8 లీటర్లు ఇవ్వాలి. అలాగే రింగ్‌ స్పాట్‌ వైరస్‌ నివారణకు తోట చుట్టూ నాలుగైదు సాళ్లు మొక్కజొన్న, అలాగే కంచె చుట్టూ రెండు వరుసలు అవిశే నాటుకుంటే వైరస్‌ వ్యాప్తి ఉండదు. సూక్ష్మపోషకాల (మైక్రోన్యూట్రియంట్స్‌) లోపం నివారణకు జింక్, బోరాన్, ఫెర్రస్‌ సల్ఫేట్‌ 2 గ్రాములు చొప్పున, 100 గ్రాములు యూరియా, కొద్దిగా నిమ్మరసంతో తయారు చేసిన సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి.

తెగుళ్ల నివారణ
బొప్పాయికి ఎక్కువగా బుడమకుళ్లు తెగులు సోకి కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. నివారణకు 2 గ్రాములు రిడోమిల్‌ ఎంజెడ్‌ లేదా 3 గ్రాములు బ్లైటాక్స్‌ లీటర్‌ నీటికి కలిపి కాండం తడిచేలా పాదుల దగ్గర పోయాలి. ఆకులపై బూడిద తెగులు నివారణకు 1 గ్రాము బైలెటన్‌ లేదా 1 మి.లీ కారథేన్‌ లేదా 1 గ్రాము ఇండెక్స్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయలపై వచ్చే మచ్చతెగులు నివారణకు 1 గ్రాము రిడోమిల్‌ ఎంజెడ్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement