పీవీ శ్రీరామమూర్తి , బి.చంద్రానాయక్ , ఎస్.శ్రీనివాసరావు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఇదో చిత్రమైన రాజకీయం. ఒక జేడీఏను కాదని డీడీని జేడీ కుర్చీలో ఇన్‌చార్జ్‌గా నియమించడం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. తన సన్నిహితుడికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు ఓ వర్గం అధికారులతో కలిసి జేడీఏ నడిపిన విజయవంతమైన రాయ‘బేరం’. మంత్రి పరిటాల సునీత సిఫార్సు, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదేశాలతో ఇష్టం లేకపోయినా తాను జారీ చేసిన జీఓ స్థానంలో 10 గంటల్లోనే మరో జీఓ జారీ చేసిన వ్యవసాయ శాఖలోని కీలక అధికారి వ్యథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లా అవసరాలు, ఉద్యోగస్థాయి.. పారదర్శకత అన్నీ ‘రాజకీయం’ ముందు తేలిపోయాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బదిలీలు, నియామకాలు ఎలా సాగుతున్నాయో మరోసారి సుస్పష్టమైంది.
అనంతపురం జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద జిల్లా. వ్యవసాయంలో దేశంలోనే అత్యంత వెనుకడిన జిల్లాలలో ఒకటి. ఇలాంటి జిల్లాలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భాలు చాలా ఉంటాయి. వెరసి నిత్యం కరువుతో, రైతుల ఆత్మహత్యలు, రైతులు, రైతు కూలీల వలసలతో కొట్టుమిట్టాడుతున్న జిల్లాలో వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఎక్కువగా ఉంటుంది. కానీ ‘అనంత’ ప్రజాప్రతినిధులు మాత్రం రాజకీయాలకే పెద్దపీట వేశారు. జిల్లా అవసరాలను కాలరాశారు. ఐదేళ్ల కిందటి వరకూ వ్యవసాయశాఖ ఇన్‌చార్జ్ జేడీఏ శ్రీరామమూర్తి కొనసాగారు. అప్పట్లో జేడీఏను కాకుండా ఇన్‌చార్జిని నియమించడమేంటని విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాత శ్రీరామమూర్తి జేడీఏగా పదోన్నతి పొందారు. ఈ నెల 11న జేడీఏ శ్రీరామమూర్తిని ప్రకాశం జిల్లాకు బదిలీ చేస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జేడీఏగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జేడీఏ చంద్రానాయక్‌ను నియమిస్తూ జీఓలో పేర్కొన్నారు.
గంటల వ్యవధిలో నిర్ణయం మార్పు
శ్రీరామమూర్తిది గుంటూరు జిల్లా. అగ్రానమీ డీడీ శ్రీనివాసమూర్తి, శ్రీరామమూర్తికి సన్నిహితుడు. అనంతపురం జిల్లాకు శ్రీరామమూర్తి చొరవతోనే శ్రీనివాసమూర్తి వచ్చారనేది వ్యవసాయశాఖవర్గాల అభిప్రాయం. ఈ క్రమంలో జేడీఏ బదిలీ నేపథ్యంలో శ్రీనివాసమూర్తి, శ్రీరామమూర్తి ఇద్దరూ ‘అనంత’ జేడీ పోస్టుపై రాజకీయం నడిపినట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీరిద్దరితో పాటు వీరి కిందిస్థాయి ఉద్యోగులు కొందరు కలిసి మంత్రి పరిటాల సునీత వద్దకు 12వ తేది రాత్రి వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రనాయక్ ముక్కుసూటి మనిషి అని, అతను ఇక్కడి అధికారపార్టీ నేతల సిఫార్సులు పట్టించుకోరని తెలిపినట్లు తెలుస్తోంది. శ్రీనివాసమూర్తి అయితే చెప్పినట్లు వింటారని కూడా విన్నవించినట్లు సమాచారం.
ఈ క్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఫోన్ చేసి జేడీఏగా చంద్రనాయక్ వద్దని, అతని స్థానంలో ఇన్‌చార్జ్ జేడీఏగా శ్రీనివాసమూర్తిని నియమించాలని ఆమె సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. సునీత సిఫార్సు మేరకు సోమిరెడ్డి వెంటనే వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌కు ఫోన్ చేసి ఉత్తర్వులు మార్చి పంపాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్‌కు మంచి అధికారిగా పేరుంది. ఒకసారి జారీచేసిన ఉత్తర్వులను తిరిగి మార్చి పంపేందుకు ఆయన కూడా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. విధిలేని పరిస్థితుల్లో మంత్రి ఆదేశాల మేరకు 12తేదీ మధ్యాహ్నం 12.30గంటలకే చంద్రనాయక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు రావడంతో వ్యవసాయశాఖలోని ఓ వర్గం సంతోషంతో సంబరాలు చేసుకుంటే, జరిగిన పరిణామాలపై మరో వర్గం తీవ్ర ఆవేదనతో ఉంది.
జేడీఏపై ఎరువుల కుంభకోణం ఆరోపణలు
2016 జూలైలో ఎరువుల రేక్ నుంచి 2,400 టన్నుల యూరియా వచ్చింది. ఇందులో 50శాతం నిల్వలు మంత్రి కాలవ శ్రీనివాసులు అస్మదీయులకు చెందిన భాస్కర్ ఫర్టిలైజర్స్‌కుకు పంపారు. అప్పట్లో ఈ వ్యవహారంలో జేడీఏ పేరు కూడా వినిపించింది. 2016 విత్తన పంపిణీలోనూ వ్యవసాయశాఖ ఘోరంగా విఫలమైంది. విత్తనాలకు బదులు డబ్బులు ఇస్తామని అప్పటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటనలు ఇచ్చే పరిస్థితి తలెత్తిందంటే విత్తన సేకరణలో వైఫల్యం ఏంటో ఇట్టే తెలుస్తోంది. అలాగే రెయిన్‌గన్‌ల ద్వారా పంటలను కాపాడామని ఇచ్చిన నివేదికలు కూడా తప్పులతడకగా ఉండి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా చేశాయి.
రేయిన్‌గన్ పరికరాల రికవరీలో కూడా అధికారులు విఫలమయ్యారు. వెరసి జేడీఏ బదిలీ నేపథ్యంలో సమర్థ అధికారిని ప్రజాప్రతినిధులు కాంక్షించాలి. చంద్రనాయక్ జేడీఏ.. శ్రీనివాసమూర్తి డీడీఏ.. జేడీఏను కాదని, తమ అవసరాల కోసం డీడీఏను నియమించేలా సిఫార్సు చేశారంటే జిల్లా ప్రయోజనాలపై మంత్రులకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో ఇట్టే తెలుస్తోంది. పైగా ఉద్యోగం కోసం రాజకీయాలు చేసిన అధికారులు పారదర్శకతను పక్కనపెట్టి అధికారపార్టీ నేతలకు ‘జీ.. హుజూర్’ అనక తప్పదు. ఇలాంటి నిర్ణయాలతో రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లడంతో పాటు జిల్లా ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment