
సుడిగాలులకు చెక్
- పండ్ల తోటలను కాపాడుకోవచ్చు
– ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు
అనంతపురం అగ్రికల్చర్ : ఈదురు, పెనుగాలులు, సుడిగాలుల నుంచి పండ్లతోటలను కాపాడుకునేందుకు రైతులు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) బీఎస్ సుబ్బరాయుడు తెలిపారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా ఈదురుగాలుల బీభత్సం, పిడుగులతో కూడిన అకాల వర్షాలు పడుతుంటాయని చెప్పారు. విపరీతమైన గాలుల వల్ల కోతలు, కాపుకు వచ్చిన అరటి, బొప్పాయి పంటలు దెబ్బతింటుండగా మామిడి, చీనీ లాంటి తోటల్లో కాయలు రాలుతున్నాయన్నారు. అలాగే లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్న షేడ్‌నెట్లు, గ్రీన్‌హౌస్, పాలీహౌస్‌లు, నర్సరీలు లాంటివి కూడా దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నష్ట నివారణకు రైతులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంత వరకు సమస్య నుంచి గట్టెక్కవచ్చని పేర్కొన్నారు.
రక్షణ చర్యలు
ఉద్యాన తోటల చుట్టూ గాలినిరోధక చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అరటి, బొప్పాయి తోటలు సాగు చేసే సమయంలో తోట చుట్టూ కనీసం రెండు మూడు వరుసలు ఏపుగా పెరిగే అవిశె లేదా సరుగుడు లాంటి చెట్లు నాటుకుంటే కొంత వరకు గాలితీవ్రతను నివారించవచ్చు. అలాగే నీలగిరి, మలబార్ వేప, చెట్టు ఆముదం, చెట్టు తంగేడు లాంటివి వేసుకున్నా మేలు. అరటి రైతులు ప్రతి ఎకరాకు రెండు వరసులు అవిశే నాటుకోవడం వల్ల నష్టాన్ని పూర్తీగా తగ్గించవచ్చు. అలా చేయకపోతే పెరిగిన చెట్లు, గెల వేసిన చెట్లు, కాయలు కాసిన చెట్లు గాలివేగానికి నేలవాలే పరిస్థితి ఉంటుంది. కనీసం పంగలు కలిగిన కట్టెలతో అరటి చెట్లకు పోట్లు పెట్టుకుంటే కొంత వరకు నష్టాన్ని తగ్గించవచ్చు.
కంపకంచె, ముళ్లకంచె వేసుకున్నా నష్టాన్ని తగ్గించుకోవచ్చు. తోటచుట్టూ కలబంద వేసినా, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అలాగే కందికట్టెను తడికెలు మాదిరిగా అల్లుకుని తోట చుట్టూ పెట్టుకున్నా ఫలితం ఉంటుంది. పాలీహౌస్, గ్రీన్‌హౌస్‌ల చుట్టూ కూడా అవిశే, సరుగుడు, నీలగిరి, మలబార్ వేప లాంటివి వేసుకోవడంతో పాటు చుట్టూ నీటితడులు ఇస్తే సుడిగాలిని నియంత్రించవచ్చు. విండ్‌స్ప్రింట్ అనే దోమతెరను గ్రీన్‌హౌస్ చుట్టూ వేసుకుని గాలి వెళ్లడానికి అవకాశం కల్పిస్తే ఈదురుగాలుల నుంచి కాపాడుకోవచ్చు.