బెల్లాలపల్లిలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న కేంద్ర బృందం సభ్యులు
అనంతపురం అగ్రికల్చర్ : రబీలో నెలకొన్న కరువు పరిస్థితుల అంచనా వేయడానికి మంగళవారం ముఖేష్‌కుమార్ నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం(కేంద్ర బృందం) జిల్లా పర్యటన కంటితుడుపుగా సాగింది. జిల్లాకు తక్షణ సాయంగా రూ.699.45 కోట్లు అవసరమని కలెక్టర్ జి.వీరపాండియన్ కేంద్ర బృందానికి కరువు నివేదిక అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు జాబితాలో మొదట 15, తర్వాత 8 మొత్తం 23 మండలాలు ఉన్నాయి. అవన్నీ కూడా తీవ్ర కరువు కాకుండా సాధారణ కరువు (మాడరేట్) జాబితా కింద ప్రకటించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎఫ్‌సీడీ ఫైనాన్స్ డైరెక్టర్ ముఖేష్‌కుమార్, నీతి అయోగ్, అగ్రికల్చర్ ఇన్‌పుట్స్ రీసెర్చ్ ఆఫీసర్ అనురాధాబటనా, ఎఫ్‌సీఐకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డీజీఎం (లీగల్) జీవీ విజయకుమార్, హైదరాబాద్‌కు చెందిన డీఓడీ డైరెక్టర్ శ్రీవాస్తవల బృందం జిల్లాకు వచ్చింది.
ఊరూరా కరువు కథలే...
జాయింట్ కలెక్టర్–2 సుబ్బరాజు ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ, ఆర్‌డబ్ల్యూఎస్, డ్వామా, డీఆర్‌డీఏ అధికారులతో కలిసి 11.30 గంటలకు గోరంట్లకు వెళ్లారు. అక్కడ తాగునీటి కష్టాలు తెలుసుకుని ఎండిపోయిన బోరుబావిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప, జెడ్పీ చైర్మన్ పూలనాగరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ కేంద్ర బృందాన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర బృందం ఏటా వచ్చివెళుతున్నా...కరువుకు శాశ్వత పరిష్కారం చూపించడంలో ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా శంకరనారాయణ విమర్శించారు. వస్తున్న అరకొర నిధులు కూడా టీడీపీ కార్యకర్తలకే సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు.
అక్కడి నుంచి అదే మండలం బెల్లాలపల్లికి చేరుకున్న కేంద్రం బృందం.. అక్కడ నిర్మిస్తున్న ఫారంపాండ్ చూసి ఉపాధి కూలీలతో మాట్లాడారు. తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు పెనుకొండ మండలం అడదాకులపల్లి గ్రామానికి చేరుకుని పంట పొలాలు పరిశీలించారు. పప్పుశగన రైతులు కొండారెడ్డి, జగన్నాథరెడ్డితో మాట్లాడారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి పంట ముగిసేదాకా వర్షంజాడ లేకపోవడంతో వేసిన పప్పుశనగ దారుణంగా దెబ్బతినడంతో నష్టాలపాలైనట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ 20 నిమిషాలు గడిపిన కేంద్రబృందం సభ్యులు ఆ తర్వాత 2.15 గంటలకు చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఎండిపోయిన 4 ఎకరాల చీనీతోటను చూసి బాధిత రైతు లక్ష్మమ్మతో మాట్లాడారు. గ్రామ శివార్లలో ఉపాధికూలీలతో సమావేశమై కష్టనష్టాలు తెలుసుకున్నారు.
ఆ తర్వాత మామిళ్లపల్లి, కనగానపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు కంబదూరు మండలం తిప్పేపల్లి గ్రామంలో ఎండిపోయిన తాగునీటి బోరుబావిని పరిశీలించి సర్పంచ్ నరసింహులుతో మాట్లాడారు. 500 అడుగులకు పైగా బోర్లు వేస్తున్నా చుక్క నీరు పడటం గగనంగా మారిందని ఈ సందర్భంగా పలువురు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ సరిగ్గా 15 నిమిషాలు గడిపారు. పక్కనే ఎండిపోయిన టమాట, కర్భూజా పంటలను పరిశీలించాలని కోరినా సమయం లేదని.. కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ భోజనం చేసి రాత్రి 7 గంటలకు అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి చేరకున్నారు.
రూ.699.45 కోట్లతో నివేదిక
జిల్లాకు తక్షణ సాయంగా రూ.699.45 కోట్లు అవసరమని కలెక్టర్ ఆధ్వర్యంలో కేంద్ర బృందానికి కరువు నివేదిక అందజేశారు. అందులో ఇప్పటికే రూ.53.94 కోట్లు ఖర్చు చేశామని, మిగతా రూ.645.51 కోట్లు జూన్‌లోపు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందులో వ్యవసాయశాఖ పరిధిలో రూ.42.40 కోట్లు, ఉద్యానశాఖ పరిధిలో రూ.13.20 కోట్లు, పశుసంవర్ధఖశాఖకు రూ.49.65 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.10.57 కోట్లు, డ్వామాకు రూ.274.71 కోట్లు, మైనర్ ఇరిగేషన్‌శాఖకు రూ.274.71 కోట్లు అవసరమని నివేదించారు.
11 గంటలకు ప్రారంభం, 6 గంటలకు ముగింపు
క్షేత్రస్థాయి పర్యటన ఉదయం 11 గంటలకు చిలమత్తూరు మండలం రక్షా ఆకాడమీ నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో అధికారులతో సమీక్ష 9.30 గంటల వరకు నిర్వహించారు. ఇందులో కరువు పరిశీలన కన్నా ప్రయాణం, అధికారులతో సమీక్షకే ఎక్కువ సమయం తీసుకోవడం విశేషం. పంట పొలాలు, ఎండిన బోరుబావులు, పండ్లతోటల పరిశీలించడం.. రైతుల కష్టాలు వినేందుకు కనీసం మూడు గంటలు కూడా కేటాయించలేదు.
అధికారులపై అసంతృప్తి
వ్యవసాయ, అనుబంధశాఖలు, డ్వామా, డీఆర్‌డీఏ తదితర శాఖల పరిధిలో నెలకొన్న కరువు పరిస్థితులకు సంబంధించి సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించారు. అనంతరం జిల్లా కరువు పరిస్థితుల గురించి కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో పవర్‌పాయింట్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. జిల్లా స్థాయి అధికారులతో కేంద్ర బృందం సభ్యులు సమీక్షించారు. పర్యటన సమయంలో కరువు పరిస్థితులు చూసిన కేంద్ర బృందం సభ్యులు కరువు నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరువు తీవ్రంగా ఉన్నా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు గానీ, కరువు నివారణ ప్రతిపాదనలు కాని పంపకపోవడంతో వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ, ఉద్యానశాఖ అధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment