Farm Sector
-
పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ కార్యకలాపాలు పుంజుకోవడంతో మార్చిలో భారత్‌లో ఇంధన డిమాండ్ పెరిగింది. నెల మొదటి అర్ధభాగంలో కనిపించిన మందగమనాన్ని అధిగమిస్తూ, నెల మొత్తంగా ఇంధన డిమాండ్ పెరిగినట్లు పరిశ్రమల ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. వ్యవసాయ రంగం నుండి బలమైన డిమాండ్, చలికాలం తర్వాత రవాణా పుంజుకోవడం వంటి కారణాలతో ఫిబ్రవరిలో ఇంధన అమ్మకాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. కానీ మార్చి మొదటి అర్ధభాగంలో కాలానుగుణంగా మందగమనం మొదలైంది. అయితే నెల రెండవ సగ భాగంలో తిరిగి ఎకానమీ కార్యకలాపాలు పుంజుకున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ వ్యవసాయ రంగ క్రియాశీలత మెరుగుపడ్డం మెరుగైన ఫలితానికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► గత ఏడాది మార్చితో పోలిస్తే 2023 మార్చిలో పెట్రోలు విక్రయాలు 5.1 శాతం పెరిగి 2.65 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. అమ్మకాలు నెలవారీగా 3.4 శాతం పెరిగాయి. ► డీజిల్ విషయంలో మార్చిలో వార్షిక డిమాండ్ 2.1 శాతం పెరిగి 6.81 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. 2022 మార్చిలో ఈ పరిమాణం 6.67 మిలియన్ టన్నులు. నెలవారీగా చూస్తే, డిమాండ్ 4.5 శాతం పెరిగింది. ► ఒక్క జెట్ ఫ్యూయెల్ డిమాండ్ పరిశీలిస్తే, డిమాండ్ 25.7 శాతం పెరిగి 614000 టన్నులుగా నమోదయ్యింది. ► కాగా, కుకింగ్ గ్యాస్ ఎల్పీజీ అమ్మకాలు మార్చిలో వార్షికంగా 3 శాతం పడిపోయి 2.37 మిలియన్ టన్నులకు చేరాయి. నెలవారీగా చూస్తే, డిమాండ్ 6.54 శాతం పడిపోయింది. ఫిబ్రవరి డిమాండ్ 2.54 మిలియన్ టన్నులు. -
ఒంటరిగా వెళ్తున్న యువతిపై లైంగిక దాడికి యత్నించిన బాలుడు.. ప్రతిఘటించడంతో..
కొచ్చి: ఒంటరిగా నడిచివెళుతున్న యువతిని బలవంతంగా పొలంలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు ఓ బాలుడు. తీరా ఆమె ప్రతిఘటించడంతో రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన కేరళలోని కొండొట్టి ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సోమవారం అర్థరాత్రి ఓ యువతి తన ఇంటి నుంచి కొట్టుక్కర జంక్షన్ వైపు కొండొట్టిలోని కంప్యూటర్ సెంటర్‌కు వెళ్తోంది. అంతలో ఓ బాలుడు ఆమెను వెంబడించి వెనుక నుంచి పట్టుకుని సమీప పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తనపై రాళ్లతో దాడి చేశాడు. అయితే నిందితుడి వద్ద నుంచి అతి కష్టం మీద తప్పించుకున్న యువతి అక్కడికి సమీపంలోని తన ఇంటికి వెళ్లి జరిగినదంతా కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తెలిపిన ఆధారాలు మేరకు పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు 10వ తరగతి విద్యార్థి, రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్‌గా పోలీసుల విచారణలో తేలింది. మొదట్లో నిందితుడు తానీ నేరం చేయలేదని విచారణలో తెలిపాడు. అయితే పోలీసులు కాస్త గట్టిగా అడగడంతో నిజాన్ని అంగీకరించాడు. దీంతో ఆ బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరచనున్నారు. చదవండి: Online Dating: మొదట డేటింగ్..ఆపై ఇంటికి రప్పించుకుని నీళ్లలో మత్తుమందు కలిపి.. -
మీరు చేయకపోతే.. మేమే స్టే విధిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రైతు ప్రతినిధులతో కేంద్రం జరుపుతున్న చర్చల ప్రక్రియ అత్యంత నిరుత్సాహపూరితంగా సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తామని స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కోసం మరింత సమయం కావాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తేల్చిచెప్పింది. సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభించే వరకు ఆ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, ఆ చట్టాల అమలుపై అంత పట్టుదల ఎందుకని కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించింది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆ చట్టాల అమలును నిలిపేయండి. లేదంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫారసుల మేరకు మేమే స్టే విధించాల్సి వస్తుంది’అని హెచ్చరించింది. చట్టాలపై స్టే విధించాలనుకోవడం లేదని, వాటి అమలును మాత్రమే తాత్కాలికంగా నిలిపేసి, సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నది తమ ఉద్దేశమని పేర్కొంది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తే.. కోర్టు ఏర్పాటు చేయనున్న కమిటీకి పరిష్కారం కనుగొనడం సులభమవుతుందని వివరించింది. కొత్త వ్యవసాయ చట్టాలు, రైతు ఆందోళనలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నేడు(మంగళవారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వనుంది. సమస్య పరిష్కారం కోసం సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. అమలుపై స్టే ఇవ్వలేరు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ప్రాథమికహక్కులకు భంగం కలిగిస్తోందనో, లేక రాజ్యాంగ పరిధిలో లేదనో కోర్టు భావిస్తేనే.. చట్టాల అమలుపై స్టే విధించడం సాధ్యమవుతుందని ఆయన వాదించారు. పిటిషనర్లు తమ వాదనల్లో ఈ అంశాలను లేవనెత్తలేదని గుర్తు చేశారు. దానికి స్పందించిన ధర్మాసనం.. ‘మీరు పరిష్కారం కనుగొనడంలో విఫలమైనందువల్లనే మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మీరు చేసిన చట్టాలు రైతుల ఆందోళనలకు కారణమయ్యాయి. ఆ సమస్యను మీరే పరిష్కరించాలి’అని వ్యాఖ్యానించింది. అసాధారణ పరిస్థితుల్లో తప్పిస్తే.. చట్టాలపై స్టే విధించడానికి తాము వ్యతిరేకమేనని పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయాన్ని జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం గుర్తు చేసింది. చట్టాల అమలుపై స్టే విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుల జాబితాను తమకు అందించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను కోరింది. వ్యవసా య చట్టాలను పలు రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ చట్టాలు ప్రయోజనకరమని పేర్కొనే ఒక్క పిటిషన్ కూడా తమ ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది. ఆందోళనలు కొనసాగించవచ్చు ‘చట్టాల అమలును నిలిపివేసిన తరువాత కూడా ఆందోళనలను కొనసాగించుకోవచ్చు. ఆందోళనల గొంతు నులిమేశామన్న విమర్శలను మేం కోరుకోవడం లేదు’అని రైతు సంఘాల తరఫున హాజరైన న్యాయవాదులతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే కమిటీకి నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎం లోధా సహా రెండు, మూడు పేర్లను సూచించాలని ఇరువర్గాలను ధర్మాసనం కోరింది. సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందులో ప్రభుత్వ, రైతు సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రభుత్వం, రైతు ప్రతినిధుల మధ్య జనవరి 15న మరో విడత చర్చలు జరగనున్నాయని, ఆ లోపు ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టును కోరారు. దీనిపై స్పందిస్తూ.. చర్చల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా ఉందని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది. చట్టాల అమలుపై స్టే విధిస్తే.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగే అవకాశముందని పేర్కొంది. ‘స్టే’తో లాభం లేదు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును కేంద్రం కానీ, సుప్రీంకోర్టు కానీ తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.. ఆ చట్టాల రద్దు కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేతలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని, అయితే, చట్టాల అమలుపై స్టే విధించడం పరిష్కారం కాబోదన్నది తమ అభిప్రాయమని భారతీయ కిసాన్ యూనియన్ హరియాణా శాఖ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చాదునీ పేర్కొన్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమొక్కటే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. రాజ్యాంగవిరుద్ధమైన ఆ చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయాలని ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ అధ్యక్షుడు భోగ్ సింగ్ మాన్సా కోరారు. కొనసాగితే హింసాత్మకం.. రైతుల ఆందోళన ఎక్కువకాలం కొనసాగితే అది హింసాత్మకంగా మారే ప్రమాదముందని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. ‘మనందరిపై బాధ్యత ఉంది. ఏ చిన్న సంఘటన అయినా హింసకు దారి తీయవచ్చు. అలాంటిది ఏదైనా జరిగితే మనమంతా బాధ్యులమవుతాం. ఎవరి మరణానికి కూడా మనం బాధ్యులం కాకూడదు’ అని వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించేవారిని తాము కాపాడబోమని పేర్కొంది. పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరపకుండానే ప్రభుత్వం ఈ చట్టాలను రూపొందించిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టమైతేనే.. సాగు చట్టాలు అన్యాయమైనవని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయని, రాజ్యాంగ విరుద్ధమైనవని నిర్ధారణ అయితే చట్టాలపై కోర్టు స్టే విధించగలుగుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమని గట్టి ఆధారాలుంటే తప్ప పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడం సాధ్యం కాదని న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేదీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వాదన వినకుండానే ఒక నిర్ధారణకు వచ్చారు. పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడానికి పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేయడం ప్రాతిపదిక కాకూడదు. ఎంపీల విజ్ఞతకు సంబంధించిన విషయమిది. కోర్టు పరిధిలో లేని అంశమిది’ అని ద్వివేదీ పేర్కొన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారు కాబట్టి చట్టాలను నిలిపేయాలనడం సరికాదన్నారు. -
కిసాన్ మహా ‘పంచాయితీ’
చండీగఢ్/కర్నాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన హరియాణాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కొత్త సాగు చట్టాల ప్రయోజనాలను వివరించి, రైతన్నలను శాంతింపజేసేందుకు ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. ముఖ్యమంత్రి నిర్వహించతలపెట్టిన ‘కిసాన్ మహాపంచాయత్’ను నిరసనకారులు భగ్నం చేశారు. ఇందుకోసం వారు పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా కదం తొక్కారు. జల ఫిరంగులకు, బాష్ప వాయువుగోళాలకు ఎదురొడ్డి మరీ అనుకున్నది చేసి చూపించారు. హెలిప్యాడ్‌పై బైఠాయింపు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ఒనగూరే లాభాలను రైతులకు స్వయంగా తెలియజేయడానికి కర్నాల్ జిల్లాలోని కైమ్లా గ్రామంలో మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదివారం కిసాన్ మహాపంచాయత్ నిర్వహిస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని, కచ్చితంగా అడ్డుకొని తీరుతామని రైతులు ప్రతిజ్ఞ చేశారు. ముందు నిర్ణయించినట్లుగానే ఆదివారం కైమ్లాలో కిసాన్ మహాపంచాయత్ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారతీయ కిసాన్ యూనియన్(చారుణి) ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రైతులు కైమ్లాకు బయలుదేరారు. గ్రామ శివారులో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, వారిని ముందుకు సాగకుండా ఆంక్షలు విధించారు. కోపోద్రిక్తులైన నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ రైతులు వినిపించుకోలేదు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కేనన్లు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. అయినప్పటికీ రైతులు లెక్కచేయలేదు. బారికేడ్లను ఛేదించుకొని కిసాన్ మహాపంచాయత్ వేదిక వద్దకు పరుగులు తీశారు. అప్పటికే అక్కడికి కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. రైతులు అక్కడున్న కుర్చీలు, పూల కుండీలు, మైకులను విరగ్గొట్టారు. వేదికను పూర్తిగా ధ్వంసం చేశారు. బీజేపీ హోర్డింగ్‌లు, బ్యానర్లను చించేశారు. నల్ల జెండాలు పట్టుకుని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలిప్యాడ్‌పై రైతులు బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చేసేది లేక కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. మహా పంచాయత్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం తమ గాయాలపై కారం చల్లేందుకు ప్రయత్నిస్తోందని రైతులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతాం.. హరియాణాలో రైతులపై వాటర్ కేనన్లు, బాష్ప వాయువు ప్రయోగించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం భూపీందర్‌సింగ్ హుడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తేల్చిచెప్పారు. రైతులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. హరియాణా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. శాసనసభను వెంటనే సమావేశపర్చాలని, ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. సీఎం ఖట్టర్ తలపెట్టిన మహా పంచాయత్‌కు ప్రజల మద్దతు లేదని హరియాణా పీసీసీ అధ్యక్షురాలు కుమారి సెల్జా చెప్పారు. మహా పంచాయత్ అసలు రంగును రైతులు బయటపెట్టారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలే బాధ్యులు: ఖట్టర్ కైమ్లా గ్రామంలో ఉద్రిక్తతకు కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులే బాధ్యత వహించాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అనుచిత ప్రవర్తనను సహించబోమని చెప్పారు. కిసాన్ మహా పంచాయత్‌కు అడ్డంకులు సృష్టించబోమని హామీ ఇచ్చిన కొందరు రైతు సంఘాల నేతలు మాట తప్పారని విమర్శించారు. దేశంలో బలమైన ప్రజాస్వామ్యం ఉందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. నిజానికి రైతులు అనుచితంగా వ్యవహరించరని చెప్పారు. కొందరు వ్యక్తులు రైతులను అప్రతిష్టపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మహా పంచాయత్‌లో తాను చెప్పాలనుకున్న విషయాలను తమ పార్టీ నాయకులు ప్రజలకు తెలిపారన్నారు. తాజా ఘటనలో నిఘా వర్గాల వైఫల్యం ఏమీ లేదన్నారు. కైమ్లాలో ఉద్రిక్తతల పరిస్థితుల దృష్ట్యా హెలికాప్టర్‌ను కర్నాల్‌లో దింపాలని తానే సూచించానన్నారు. -
దిగుబడి పెరిగినా తగ్గిన ఆదాయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు రంగాలు కునారిల్లిపోయి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయ రంగం నిలదొక్కుకోవడమే కాకుండా వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరగడం విశేషం. ఈ ఏడాది జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయం 3.4 శాతం అభివద్ధి చెందింది. వ్యవసాయ రంగంపై కరోనా ప్రభావం ప్రత్యక్షంగా లేకపోవడం, ఈ ఏడాది వర్షాలు సమద్ధిగా కురవడం, రబీ, ఖరీఫ్ పంటలకు రిజర్వాయర్లలో నీళ్లు పుష్కలంగా ఉండడం పంటల దిగుబడికి ఎంతో కలసి వచ్చింది. కరోనా కాటుకు వలస కార్మికులు ఇళ్లకు తిరగి రావడం, జీవనోపాధికోసం వారు కూడా వ్యవసాయ కూలీలుగా మారిపోవడం కూడా రైతులకు కలసి వచ్చిందని జాతీయ వ్యవసాయ ఆర్థిక వేత్త, ఇందిరాగాంధీ అభివద్ధి, పరిశోధన సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న సుధా నారాయణన్ తెలిపారు. కరోనా కారణంగా వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరగడం, పంట దిగుబడులకు ఆశించిన ధరలు లభించ లేదని ఆమె చెప్పారు. ఈసారి కూడా చాలా చోట్ల గిట్టుబాటు ధరలు లేక టన్నుల కొద్ది టమోటా రోడ్ల పాలయింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు వారాల క్రితం రోడ్డెక్కిన రైతులు ఇంకా రోడ్లపైనే ఉన్నారు. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, ఇప్పుడేమో కొత్త చట్టాలతో చిన్న కారు, సన్నకారు రైతుల నోటి కాడ కూడును కొట్టేస్తుందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. రెండు హెక్టార్లకంటే తక్కువ భూమి కలిగిన చిన్నకారు రైతులే ప్రతి పది మందిలో ఎనమిది మంది ఉన్నారు. దేశం మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 44.2 శాతం మంది ఒక్క వ్యవసాయ రంగంలోనే పని చేస్తున్నారు. ఈ ఏడాది దేశంలో 88 శాతం మంది రైతులు తమ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్మలేక పోయారు. 37 శాతం రైతులు అసలు పంటలే వేయలేకపోయారు. 15 శాతం మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డులకు కూడా తరలించలేక వదిలేశారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రధాని మోదీ ‘పీఎం–కిసాన్ స్కీమ్‌ను తీసుకొచ్చారు. దేశంలో 14 కోట్ల మంది రైతులుండగా కేవలం ఆ స్కీమ్ 8 కోట్లకు మాత్రమే పరిమితమవుతోందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వ్యవసాయ చట్టాల గురించి లోతుగా అధ్యయనం చేసే స్థితిలో కూడా రైతులు లేరు -
దేశంలో ప్రజాస్వామ్యం లేదు
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ గురువారం దేశ రాజధానిలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రియాంకా గాంధీ వాద్రా సహా సీనియర్ నేతలు, కార్యకర్తలు అక్బర్ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని మొదట భావించారు. అయితే, ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ కార్యాలయం ముందే బైఠాయించి ధర్నా నిర్వహించారు. దాంతో, నిషేధాజ్ఞలను ఉల్లంఘించారన్న కారణంతో ప్రియాంకా గాంధీని, పలువురు ఎంపీలు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆధిర్ రంజన్‌చౌధురి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అనంతరం, రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ దేశంలో వాస్తవానికి ప్రజాస్వామ్యం లేదని, ఊహల్లోనే అది ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజస్వామ్యం ఉందన్న ్రభ్రమల్లో బతుకుతున్నామన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో దేశం ప్రమాదకర మార్గంలో వెళ్తోందని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిపై అయినా ఉగ్రవాది అని ముద్ర వేస్తారని ఆరోపించారు. ‘అది రైతులైనా, కూలీలైనా, చివరకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అయినా సరే.. మోదీని వ్యతిరేకిస్తే ఉగ్రవాది అని ముద్ర వేస్తారు’ అని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోనట్లయితే.. వ్యవసాయ రంగం, తద్వారా దేశం చాలా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘సన్నిహితులైన ముగ్గురు, నలుగురు కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడం ఒక్కటే ప్రధాని మోదీ లక్ష్యం. పేదల డబ్బుతో ఆ కార్పొరేట్ల జేబులు నింపాలన్నది ప్రధాని తాపత్రయం. అందుకు అడ్డుపడే ఎవరినైనా సరే.. ఉగ్రవాదులు, దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు, నేరస్తులు అని ముద్ర వేస్తారు. అందుకు రైతులు, కూలీలు, చివరకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అయినా సరే మినహాయింపు కాదు’ అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్.. చర్చకు రా! రైతుల సంక్షేమం కోసం అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఏం చేసింది? ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందనే విషయంలో బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీకి బీజేపీ సవాలు చేసింది. కేంద్రంపై రాహుల్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారాలని తోసిపుచ్చింది. అధికారంలో ఉండగా రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర ఇవ్వలేదని, మోదీ సర్కారు వచ్చిన తరువాతనే స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేశామని, కనీస మద్దతు ధరలను భారీగా పెంచామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి శుక్రవారం ప్రధాని మోదీ రూ. 18 వేల కోట్లను జమ చేయనున్నారన్నారు. ఇప్పటివరకు రూ. 1.20 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మొత్తంగా పదేళ్లలో రూ. 7 లక్షల కోట్లు రైతులకు అందుతాయని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం చేసింది కేవలం రూ. 53 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే. అదికూడా రైతులకు ఇవ్వలేదు. బ్యాంకులకు ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ‘బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీకి సవాలు చేస్తున్నా. రైతుల సాధికారతకు మోదీ ఎంత కృషి చేస్తున్నారో, రైతులను కాంగ్రెస్ ఎలా నిర్లక్ష్యం చేసిందో నిరూపిస్తా’ అన్నారు. ప్రభుత్వానివి అబద్ధాలు రైతులకు అవాస్తవాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై విపక్ష పార్టీలు స్పందించాయి. ప్రధాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఒక ప్రకటన విడుదల చేశాయి. ఆందోళన మార్గం పట్టిన రైతులకు తమ సంఘీభావం కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ‘రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలను మేం పార్లమంట్లోనూ వ్యతిరేకించాం. ఓటింగ్ జరగాలని డిమాండ్ చేసిన ఎంపీలను సస్పెండ్ చేశారు’ అని కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, పీఏజీడీ, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), ఆరెస్పీ, ఏఐఎఫ్బీ ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. వ్యవసాయ చట్టాలపై సుప్రీంకు.. సాగు చట్టాలను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్(లోక్‌శక్తి) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే విచారణలో ఉన్న కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని కోరింది. అసెంబ్లీ సెషన్ పెట్టండి నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించి, వాటిని రద్దు చేయాలని తీర్మానం చేసేందుకు వీలుగా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు మరోసారి సిఫారసు చేయాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో సిఫారసు చేసినట్లుగా ప్రత్యేక సమావేశాలని కాకుండా, రైతుల అంశంపై చర్చ జరిపేందుకు అసెంబ్లీ 21వ సమావేశాలను డిసెంబర్ 31న ఏర్పాటు చేయాల్సిందిగా సిఫారసు చేయనున్నారు. డిసెంబర్ 23న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని గతంలో కేబినెట్ చేసిన సిఫారసును గవర్నర్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రైతులకు మళ్లీ ఆహ్వానం చర్చలకు రావాలని ఆహ్వానిస్తూ రైతు సంఘం నేతలకు ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. అయితే, కనీస మద్దతు ధర అంశానికి సంబంధించిన కొత్త డిమాండ్లేవీ చర్చల ఎజెండాలో ఉండకూడదని షరతు విధించింది. కొత్త సాగు చట్టాల పరిధిలో లేని కనీస మద్దతు ధర అంశాన్ని చర్చల్లో భాగం చేయడం అర్థం లేని పని అని వ్యాఖ్యానించింది. 40 రైతు సంఘాల నేతలను ఉద్దేశించి వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ ఈ లేఖ రాశారు. ‘రైతుల నిరసనలు ముగియాలన్న ఉద్దేశంతో వారి అన్ని అభ్యంతరాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది’ అని తెలిపారు. అరెస్ట్ సందర్భంగా మందిర్‌మార్గ్ పోలీస్‌స్టేషన్ వద్ద ప్రియాంక, రైతులు. రాష్ట్రపతికి రాహుల్ వినతిపత్రం -
అర్థంపర్థం లేని సవరణలు అక్కర్లేదు
న్యూఢిల్లీ/కోల్‌కతా: కొత్త వ్యవసాయ చట్టాల్లో అర్థంపర్థం లేని సవరణల అంశాన్ని ప్రస్తావించడం, తమకు ప్రేమ లేఖలు రాయడం మానుకోవాలని రైతులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలను తాము ఎప్పుడో తిరస్కరించామని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం లిఖితపూర్వకమైన ఒక సరైన ప్రతిపాదనతో చర్చలకు ముందుకు రావాలని కోరారు. సవరణలను రైతులు వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని రైతు సంఘం నేత శివకుమార్ కక్కా బుధవారం చెప్పారు. మరిన్ని సంస్కరణలు తథ్యం వ్యవసాయ రంగంలో సంస్కరణలను ప్రభుత్వం కొనసాగిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ బుధవారం చెప్పారు. ఈ రంగంలో చాలా అంశాల్లో ఇంకా సంస్కరణలు చేపట్టాల్సి ఉందన్నారు. మూడు కొత్త సాగు చట్టాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ చట్టాలపై రైతులు తదుపరి చర్చల కోసం ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని గుర్తుచేశారు. తదుపరి చర్చల కోసం తేదీ, సమయాన్ని ఖరారు చేయాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. నూతన సాగు చట్టాలపై ప్రభుత్వం– రైతు సంఘాల మధ్య ఇప్పటిదాకా ఐదుసార్లు చర్చలు జరగ్గా, అవన్నీ విఫలమయ్యాయి. మరోవైపు కొన్ని రైతు సంఘాలు కొత్త చట్టాల విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్ ఆఫ్ రూరల్ ఇండియా సదస్సులో తోమర్ పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతూ ఇప్పటిదాకా 3,13,363 మంది రైతుల సంతకాలతో తనకు లేఖలు వచ్చాయని తెలిపారు. వీరిలో పంజాబ్, హరియాణా రైతులు సైతం ఉన్నారని చెప్పారు. రైతన్నలకు అండగా ఉంటాం: మమతా బెనర్జీ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఫోన్ ద్వారా మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఐదుగురు టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓ బ్రెయిన్, శతాబ్ది రాయ్, ప్రసూన్ బెనర్జీ, ప్రతిమా మండల్, నదీమ్ ఉల్ హక్ ఢిల్లీలో రైతులను స్వయంగా కలిశారు. వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. నేడు రాష్ట్రపతితో కాంగ్రెస్ ఎంపీల భేటీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో నేడు భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు, నేతలు గురువారం విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం రామ్నా«థ్ కోవింద్‌తో సమావేశమై, కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన 2 కోట్ల సంతకాలతో పాటు మెమోరాండం సమర్పించనున్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ సంతకాలను సేకరించింది. 25న రైతులతో మోదీ సమావేశం ప్రధాని మోదీ డిసెంబర్ 25న దేశంలోని 9 కోట్ల మంది రైతులను ఉద్దేశించి ఉపన్యసించనున్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మరోమారు వెల్లడించనున్నారు. ఆన్లైన్లో జరిగే ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు పాల్గొంటారు. వారి ప్రయోజనం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
నాకు పేరొస్తుందనే.. మోదీ ధ్వజం
భోపాల్: వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానం కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం దేశంలో సాగు సంస్కరణల అవసరం ఎంతో ఉందన్నారు. కొత్త సాగు చట్టాలు ఎన్నాళ్లుగానో రాజకీయ పార్టీలు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు కోరుతున్నవేనని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఈ సంస్కరణలు తీసుకువచ్చిన పేరు మోదీకి దక్కుతుందనే బాధతోనే విపక్ష పార్టీలు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణలకు గతంలో ఆయా పార్టీలు మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రైతులను ఉద్దేశించి శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు గత 23 రోజులుగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన తెలుపుతున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ‘ఈ చట్టాలపై ఎవరికైనా, ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నా.. తలవంచి, చేతులెత్తి దండం పెడ్తూ చర్చలు జరిపేందుకు, వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ చట్టాలు రాత్రికి రాత్రి రూపొందించినవి కావు. ఎప్పటినుంచో రైతులు, నిపుణులు, రాజకీయ పార్టీలు కోరుతున్నవే ఈ సంస్కరణలు’ అని పేర్కొన్నారు. ‘సాగు రంగం, రైతులు ఇంకా వెనకే ఉండిపోవడానికి వీల్లేదు. వారు అన్ని సదుపాయాలతో ఆధునికతను సంతరించుకోవాలి. ఈ విషయంలో ఇంకా ఆలస్యం కూడదు. సమయం ఎవరికోసం ఆగదు’ అని ప్రధాని ఉద్ఘాటించారు. గతంలో సాగు సంస్కరణలు తీసుకువస్తామని మేనిఫెస్టోల్లో పెట్టి, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని మర్చిపోయిన వారిని రైతులు ప్రశ్నించాలన్నారు. నాడు అధికారంలో ఉన్నవారికి అది ప్రధాన విషయం కాదని విమర్శించారు. ‘ఇది మోదీ ఎలా చేయగలిగారు? ఈ మంచిపేరంతా మోదీకే వస్తే ఎలా? అనేదే వారి ప్రధాన సమస్య. ఈ విషయంలో మంచిపేరు నాకు అక్కర్లేదు. ఆ క్రెడిట్ మీ మేనిఫెస్టోలకే ఇవ్వండి. ఈ సంస్కరణలు మీ మేనిఫెస్టోల్లోనే ఉన్నాయి. నాకు కావల్సింది రైతుల అభివృద్ధి మాత్రమే. ఇకనైనా రైతులను తప్పుదోవ పట్టించడం ఆపేయండి’ అని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ‘కొత్త చట్టాలపై మీ అభ్యంతరాలేమిటో చెప్పమని పదేపదే అడుగుతున్నాం. వారి వద్ద సమాధానం లేదు. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతున్న వారే.. ఇప్పుడు కొత్త చట్టాలతో భూమిని కోల్పోతారని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘వ్యవసాయ సంస్కరణలకు సంబంధించి స్వామినాథన్ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏళ్లకేళ్లు అధికారంలో గడిపారు’ అని విపక్ష కాంగ్రెస్‌పై మండిపడ్డారు. 25, 30 ఏళ్ల క్రితమే తీసుకురావాల్సిన సంస్కరణలను తాము ఇప్పుడు తీసుకువచ్చామన్నారు. రైతన్నలను తాము అన్నదాతలుగా భావిస్తామని, ఇప్పటికే ఎమ్మెస్పీ ద్వారా దిగుబడి వ్యయం కన్నా ఒకటిన్నర రెట్లు ఆదాయం రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చి ఆరు నెలలు గడచిపోయాయి. కోవిడ్–19 సమయంలోనూ వ్యవసాయ ఉత్పత్తులను, గతంలో వారు తమ ఉత్పత్తులను అమ్ముకునే మండీల్లోనే, కనీస మద్దతు ధరకే కొనుగోలు చేశాం’ అని గుర్తు చేశారు. ‘ఎమ్మెస్పీ విధానాన్ని రద్దు చేస్తారంటే తెలివైన వ్యక్తి ఎవరూ నమ్మరు. ఇంతకంటే పెద్ద కుట్ర, అబద్ధం ఉండదు’ అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ మార్కెట్ల విషయంలోనూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. ‘కొత్త చట్టం ప్రకారం, వ్యవసాయ మార్కెట్ సహా ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే రైతు అక్కడ తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు’ అని వివరించారు. గత ఆరు నెలల్లో ఒక్క మండీ కూడా మూతపడలేదని, మండీల ఆధునీకరణకు రూ. 500 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. సాగు చట్టాలపై 25న రైతులతో మళ్లీ మాట్లాడుతానన్నారు. -
చట్టాలకు బ్రేకులేయండి
న్యూఢిల్లీ/చండీగఢ్ : అహింసాయుతంగా నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీంకోర్టు గురువారం ఉద్ఘాటించింది. రైతు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో ‘నిష్పాక్షిక, స్వతంత్ర’ కమిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. రైతుల నిరసన తెలిపే హక్కును హరించకూడదని సూచించింది. అయితే, నిరసన ప్రదర్శన అనేది ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదని, ఎవరికీ ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగరాదని పేర్కొంది. పౌరులు స్వేచ్ఛగా తిరుగాడే, ఇతర సదుపాయాలు పొందే హక్కులకు అడ్డంకి కాకూడదని న్యాయస్థానం అభిప్రాయపడింది. నిరసన తెలిపే హక్కు అంటే అర్థం నగరంలోని రోడ్లన్నీ మూసివేయడం కాదని తేల్చిచెప్పింది. ఇప్పటికిప్పుడు వ్యవసాయ చట్టాల ప్రామాణికత ప్రధానం కాదని స్పష్టం చేసింది. రైతులు చర్చలకు ముందుకు రాకుండా ఆందోళన కొనసాగిస్తున్నంత మాత్రాన ఫలితం ఉండదని, రైతాంగం డిమాండ్లు నెరవేరాలంటే చర్చలు తప్పనిసరి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే పేర్కొన్నారు. ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా నిరసనలను నిరోధించే హక్కు పోలీసులకు, అధికారులకు ఉందని గుర్తు చేశారు. జరుగుతున్న పరిణామాలు బాధాకరం రైతు ఆందోళనలకు సంబంధించిన అన్ని వాదనలు, రైతు సంఘాల అభిప్రాయాలను విన్న తరువాత, అలాగే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేసిన తరువాత మాత్రమే రైతు సమస్య పరిష్కారానికి కమిటీ నియమిస్తామని జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మేము కూడా భారతీయులమే. రైతుల దయనీయ స్థితి గురించి ఆందోళన చెందుతున్నాం. జరుగుతున్న పరిణామాల పట్ల కలవర పడుతున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తే రైతులు చర్చలకు ముందుకు రారని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలను నిలిపివేయాలని తాము కోరడం లేదని, రైతులు చర్చలకు ముందుకు వచ్చేందుకు వీలుగా తాత్కాలికంగా వాటి అమలును వాయిదా వేయాలని కోరుతున్నట్టు ధర్మాసనం తెలిపింది. రైతు సంఘాలు, నిపుణులతో కమిటీ భారీ సంఖ్యలో రైతులను నగరంలోకి అనుమతిస్తే వారు హింసకు పాల్పడరని ఎవరు హామీ ఇవ్వగలరు? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ హింస జరిగితే కోర్టు అడ్డుకోలేదని, అది కోర్టు పనికాదని గుర్తుచేసింది. పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, ఇతర అధికారులపై ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వంతో చర్చలు జరపకపోతే నిరసన ఉద్దేశం నెరవేరదని భారతీయ కిసాన్ యూనియన్(భాను)ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ప్రతినిధులు, రైతు సంఘాలతో పాటు పాలగుమ్మి సాయినాథ్ లాంటి నిపుణులను కమిటీలో నియమించనున్నట్లు వెల్లడించింది. ఆగిన మరో అన్నదాత గుండె సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న మరో రైతు గుండె ఆగిపోయింది. టిక్రీ బోర్డర్లో పంజాబ్‌కు చెందిన 38ఏళ్ల రైతు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. మరణించిన రైతును భటిండా జిల్లాకు చెంది న జై సింగ్‌గా గుర్తించారు. జై సింగ్ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉ ద్యోగం ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. నరేంద్రసింగ్ తోమర్ బహిరంగ లేఖ రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని కేం ద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. ఆయన తాజాగా రైతులకు బహిరంగ లేఖ రాశారు. చిన్న, సన్నకారు రైతాంగం ప్రయోజనాల కోసమే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు పునరుద్ఘాటించారు. అభ్యంతరాలుంటే చర్చలకు ముందుకు రావాలని కోరారు. తోమర్ లేఖను అందరూ చదవాలని ప్రధాని మోదీ కోరారు. చట్టాల ప్రతులు చింపిన కేజ్రీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. తాను రైతాంగానికి ద్రోహం చేయలేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కొత్త చట్టాల ప్రతులను అసెంబ్లీలో చించివేశారు. ఈ చట్టాలు బీజేపీ ఎన్నికల నిధుల కోసమే తప్ప రైతుల ప్రయోజనం కోసం కాదని ఆరోపించారు. ‘‘గడ్డకట్టే చలిలో, కేవలం రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య రోడ్లపైనే నా దేశ రైతాంగం నిద్రిస్తుంటే, వారికి నేను ద్రోహం చేయలేను. తొలుత నేను ఈ దేశ పౌరుడిని, ఆ తరువాతే ముఖ్యమంత్రిని’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరసన ఉద్యమంలో ఇప్పటికే 20 మంది రైతులు మరణించారని, ఇంకెప్పుడు మేల్కొంటారని కేంద్రాన్ని ప్రశ్నించారు. మంత్రులతో అమిత్ భేటీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం పలువురు సహచర మంత్రులతో భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్లతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. రైతుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహనా కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.బీజేపీ శ్రేణులు ఎంతవరకు రైతాంగాన్ని చేరగలిగారనే అంశంపై సమీక్షించినట్టు తెలుస్తోంది. -
మేమే కమిటీ వేస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: గత 20 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తోన్న రైతాంగం సమస్యల పరిష్కారానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేంగా గడ్డకట్టే చలినిసైతం లెక్కచేయకుండా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తోన్న రైతాంగం సమస్య పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కోర్టు ఎత్తిచూపింది. రైతుల సమస్య పరిష్కారం కాకపోతే ఇది జాతీయ సమస్యగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఇదే నేపథ్యంలో యావత్ దేశంలోని రైతు సంఘాలతో కలిపి తామే ఒక కమిటీని నియమించనున్నట్టు తేల్చి చెప్పింది. సమస్య పరిష్కారం విషయంలో ఇరు పక్షాలకు చిత్తశుద్ధి అవసరమని చెప్పకనే చెప్పింది. చర్చలు ఫలవంతం కావాలన్న అభిలాశ ఇరుపక్షాలకూ ఉండాలని, అప్పుడే చర్చలు ఫలవంతం అవుతాయని కోర్టు అభిప్రాయపడింది. అటువంటి సంస్థల పేర్లను తెలియజేయాల్సిందిగా కోర్టు, ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్‌ని కోరింది. రేపటిలోగా చెప్పండి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తోన్న రైతాంగాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం రైతుల సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఇది ఇలాగే కొనసాగితే ఇది జాతీయ సమస్యగా మారే ప్రమాదం ఉన్నదని అభిప్రాయపడింది. సంబంధిత రైతాంగం వాదనలను వినేందుకు సైతం కోర్టు సమ్మతిని తెలియజేసింది. అలాగే ప్రజాప్రయోజన వ్యాజ్యంపై రేపటిలోగా సమాధానమివ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ చర్యలు చేపట్టలేదని సొలిసిటర్ జనరల్ విచారణ సందర్భంగా కోర్టుకి వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందిగా రైతులకు సూచించాలని ఆయన కోర్టుని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జరిపిన చర్చలు సత్ఫలితాలనివ్వలేదని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించారు. -
నిరసన గళం వారిదే
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ వారి గళం దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. కేంద్రం బుజ్జగించినా వినడం లేదు, కరుకు లాఠీ దెబ్బలకి వెరవడం లేదు. 20 రోజులు దాటిపోయింది. ఢిల్లీ వీధుల్లో నిరసనలు హోరెత్తిపోతున్నాయి. ఈ రైతు పోరాటంలో పంజాబ్ రైతులే ఎందుకు ముందున్నారు? వారే ఎందుకు ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు ? హరిత విప్లవం వెల్లువెత్తిన రాష్ట్రం అది. దేశంలో ఆర్థిక సరళీకరణలు ప్రారంభమవడానికి ముందే అర్బన్ ఇండియా పురోగతికి బీజాలు వేసిన రాష్ట్రం అది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు అత్యధికంగా పెట్టే రాష్ట్రంలోనూ పంజాబే ముందుంటుంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో దేశం మొత్తమ్మీద ఎక్కువగా లబ్ధి పొందేది పంజాబ్ రైతులే. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) దేశం మొత్తమ్మీద పండే పంటలో 10శాతాన్ని కొంటే పంజాబ్‌లో పండే పంటలో 90% శాతాన్ని కొనుగోలు చేస్తుంది. కొత్త సాగు చట్టాలు ఒకే దేశం ఒకే మార్కెట్ వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో రాష్ట్రాలు ఎలాంటి సెస్‌లు, పన్నులు విధించడానికి వీల్లేదు. దీంతో మండీ వ్యవస్థ నీరు కారిపోయి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కే ఎసరొస్తుందన్న ఆందోళనలు రైతుల్లో ఉన్నాయి. దేశంలోని వ్యవసాయ ఉత్పాదకతలో 70శాతం పంజాబ్, ఏపీ, కర్ణాటక, యూపీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హరియాణా, మహారాష్ట్రల నుంచి వస్తోంది. ఆ 8 రాష్ట్రాల్లో సాగు భూమి, వ్యవసాయ ఉత్పత్తుల వాటా, వ్యవసాయ రంగంలో పెట్టే పెట్టుబడులు, చేసే ఆదా, ఎరువుల వినియోగం వంటి గణాంకాలన్నీ పంజాబ్ రైతులు ఈ పోరాటాన్ని ఎందుకంత ఉధృతంగా చేస్తున్నారో తేటతెల్లం చేస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న రైతు నిరసనల్లో మహిళలు అంతగా కనిపించడం లేదు. దీనికి కారణం పంజాబ్‌లో భూమిపై హక్కులు కలిగిన మహిళల సంఖ్య చాలా తక్కువ. దేశంలోని మహిళల్లో సగటున 12.9% మంది మాత్రమే భూమిపై యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారు. ఈ అంశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కాస్త మెరుగ్గా ఉన్నాయనే చెప్పాలి. దక్షిణాదిన 15.4% మంది మహిళలకి భూమిపై హక్కులు ఉంటే, ఉత్తరాదిన 9.8 శాతంగా ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం వంటివి సాధించాలంటే మహిళలకు భద్రమైన జీవితం, భూమిపై హక్కులు ఉండాలి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం వ్యవసాయ కూలీల్లో 32% ఉన్న మహిళలు ఉత్పత్తి విషయానికొచ్చేసరికి 55–66శాతం వాటా ఇస్తున్నారు. -
రైతన్న నిరశన విజయవంతం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం రైతులు చేపట్టిన ఒక రోజు నిరశన దీక్ష విజయవంతమైంది. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద 32 రైతు సంఘాల నాయకులు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లోనూ నిరశన దీక్షలు జరిగాయని రైతు నేతలు తెలిపారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గత 18 రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. గత 18 రోజుల్లో ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలో పాల్గొంటున్న 20 కి పైగా నిరసనకారులు మరణించారు. వారికి నివాళిగా సోమవారం ఉదయం రైతు నేతలు, నిరసనకారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా రైతు నిరశన దీక్షలో పాల్గొన్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి ఆప్ కార్యాలయంలో ఆయన నిరాహార దీక్ష చేశారు. కొత్త సాగు చట్టాలు కొందరు కార్పొరేట్లకే ప్రయోజనకరమని, వాటి వల్ల ద్రవ్యోల్బణం భారీగా పెరిగే ప్రమాదముందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆ చట్టాలు రైతులకు, సామాన్యులకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో రైతులు జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలిపారని రైతు నేతలు తెలిపారు. ‘ఇది కేవలం పంజాబ్ రైతుల నిరసన కాదు. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల నిరసన ప్రదర్శన అన్న సందేశాన్ని ఇవ్వాలనుకున్నాం’ అని సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘం నేత శివ కుమార్ కక్కా పేర్కొన్నారు. నిరశన దీక్ష ముగిసిన తరువాత కూడా సింఘు సహా నిరసన కేంద్రాల్లో నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన కొనసాగాయి. ‘అన్నదాత ఇప్పుడు ఆకలితో నిరసనలో పాల్గొంటున్నాడన్న సందేశం దేశ ప్రజలకు ఇవ్వడానికే ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టాం’ అని మరో రైతు సంఘం నేత హరిందర్ సింగ్ లోఖావాల్ తెలిపారు. మహిళలతో పాటు, మరింత మంది రైతులు నిరసనల్లో పాల్గొనేందుకు ఢిల్లీ సరిహద్దులకు రానున్నారని, వారి వసతి కోసం ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. మరోవైపు, వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌పై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించామని సోమవారం ‘ఫిక్కీ’ సదస్సులో వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగం తల్లిలాంటిదని వ్యాఖ్యానించారు. చర్చలు కొనసాగించేందుకు, మరో విడత చర్చల తేదీని నిర్ణయించేందుకు రైతు నేతలను సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. కచ్చితంగా మళ్లీ చర్చలు ప్రారంభమవుతాయన్నారు. చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులు అంశాలవారీగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. అంతకుముందు, తోమర్ హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం, సాగు చట్టాలకు మద్దతిస్తున్న ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేసీసీ) ప్రతినిధులను కలుసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి పనిపై వచ్చి.. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమంపై వస్తున్న నకిలీ వార్తలను అడ్డుకోవడానికి వీలుగా ట్విట్టర్ ఖాతా పని చేస్తోంది. ‘ట్రాక్టర్2ట్విట్టర్’ అనే పేరుతో ఉన్న ఈ అకౌంట్‌ను ఆస్ట్రేలియాలో పని చేసే ఓ ఐటీ నిపుణుడు క్రియేట్ చేసి రైతులకు మద్దతుగా పోస్టులు చేస్తున్నాడు. పంజాబ్‌లోని లూధియానాకు చెందిన భావ్‌జిత్ సింగ్ ఆస్ట్రేలియాలో ఐటీ నిపుణుడిగా పని చేస్తున్నారు. గత అక్టోబర్‌లో వ్యక్తిగత పనిపై ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమించడం ప్రారంభమైంది. అయితే ఆ ఉద్యమంపై నకిలీ వార్తలు పుట్టుకొస్తుండటంతో వాటిని తిప్పి కొట్టాలని భావ్‌జిత్ నిర్ణయించుకున్నారు. అనంతరం ట్రాక్టర్2ట్విట్టర్ అకౌంట్‌ను ప్రారంభించారు. నవంబర్ 28న ప్రారంభించిన ఈ ట్విట్టర్ ఖాతాకు ప్రస్తుతం 10 వేల మందికి పైగా ఫాలోవర్లతో పాటు, 2.5 మిలియన్ల ఇంప్రెషన్లు దక్కాయని ఆయన వెల్లడించారు. హిందీ, ఇంగ్లీషు, పంజాబీ భాషల్లో ఫొటోలు, వీడియోలు, న్యూస్ పోస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ఘాజీపూర్ బోర్డర్లో రైతుతో నిరాహార దీక్ష విరమింపజేస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికీయత్ -
ఇక మహా పోరాటమే
న్యూఢిల్లీ/చండీగఢ్/మథుర: తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గబోమని రైతు సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే మహా పోరాటం తప్పదని తేల్చిచెప్పారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 14న సింఘు బోర్డర్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్ వద్ద రైతు సంఘం నాయకుడు, సంయుక్త కిసాన్ ఆందోళన్ ప్రతినిధి కన్వల్‌ప్రీత్ సింగ్ పన్నూ మీడియా సమావేశంలో మాట్లాడారు. వేలాది మంది రైతులు ట్రాక్టర్లపై ఆదివారం రాజస్తాన్‌లోని షాజహాన్‌పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారని చెప్పారు. వారు ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారిని దిగ్బంధిస్తారని అన్నారు. ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. తమ తల్లులు, సోదరీమణులు, బిడ్డలు సైతం త్వరలో ఈ పోరాటంలో భాగస్వాములవుతారని తెలిపారు. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి రైతులు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వారు గమ్య స్థానానికి చేరుకుంటారని అన్నారు. చట్టాల రద్దుపై చర్చించిన తర్వాతే ఇతర అంశాలపై ప్రభుత్వంలో చర్చలు సాగిస్తామని స్పష్టం చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు. అదే రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట రైతన్నలు ధర్నాలు చేస్తారని వెల్లడించారు. రైతు సంఘాల మధ్య చిచ్చుపెట్టి, ఉద్యమాన్ని బలహీనపర్చాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, సర్కారు ఎత్తులు సాగవని కన్వల్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ నగరంతోపాటు సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాల్లో శనివారం భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. రద్దు చేస్తే ఉద్యమిస్తాం కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు వీధుల్లోకి వస్తున్నారు. మరోవైపు ఈ చట్టాలను సమర్థించే వారు కూడా తమ వాదనకు పదును పెడుతున్నారు. హరియాణాకు చెందిన 29 మంది రైతులు శనివారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిశారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని, వీటిని రద్దు చేస్తే సహించబోమని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు. టోల్‌ప్లాజాల ముట్టడి తమ పోరాటంలో భాగంగా హరియాణా రైతులు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రంలోని టోల్ ప్లాజాలను ముట్టడించారు. వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయకుండా అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో: రైతుల పోరాటానికి మద్దతుగా బీకేయూ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ వే పై ఉన్న మాంత్ టోల్‌ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. కొంత సేపు టోల్ రుసుములు వసూలు చేయనివ్వలేదు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. టోల్ రుసుములు వసూలు చేయొద్దంటూ డిమాండ్ చేశారు. ఘాజీపూర్ వద్ద పోలీసులు బ్లాక్ చేసిన రోడ్డుపై నిద్రిస్తున్న రైతు -
రైతుల ఆదాయం పెంచడానికే
న్యూఢిల్లీ: దేశంలో రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి నూతన వ్యవసాయ చట్టాలకు రూపకల్పన చేశామని తెలిపారు. అడ్డంకులను తొలగించడంతోపాటు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను పెంచడానికి సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆ దిశగానే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చామని పేర్కొన్నారు. తన విధానాలు, చర్యల ద్వారా అన్నదాతల ప్రయోజనాలను కాపాడడానికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ శనివారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) 93వ వార్షిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కొత్త సాగు చట్టాలపై రైతుల భయాందోళనలను దూరం చేసే ప్రయత్నం చేశారు. రైతాంగం సందేహాలను నివృత్తి చేస్తూ ఆయన ఇంకా ఏమన్నారంటే.. రైతులకు డిజిటల్ వేదికలు వ్యవసాయ రంగంలో మరిన్ని పెట్టుబడులు రావడానికి, రైతులకు లబ్ధి చేకూరడానికి సంస్కరణలు దోహదపడతాయి. అన్నదాతలను సంపన్నులను చేయడమే ప్రభుత్వ సంస్కరణల ప్రధాన లక్ష్యం. ఈ చట్టాలతో రైతులకు ఎన్నో లాభాలు ఉంటాయి. వారు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి లేదా కొనుగోలు చేయడానికి నిర్దేశిత మార్కెట్లలోనే కాకుండా వెలుపల కూడా అదనపు వెసులుబాటు లభిస్తుంది. రైతులు ప్రస్తుతం మార్కెట్లలో లేదా దళారులకు పంటలను విక్రయించుకోవాల్సి వస్తోంది. కొత్త చట్టాలతో మార్కెట్లను ఆధునీకరిస్తారు. రైతులకు డిజిటల్ వేదికలు అందుబాటులోకి వస్తాయి. విక్రయం, కొనుగోలు మరింత సులభ తరం అవుతుంది. ఇవన్నీ రైతుల ఆదాయం పెంచడం కోసమే. ఆదాయం పెరిగితే రైతులు ధనవంతులవుతారు. తద్వారా ఇండియా ధనిక దేశంగా మారుతుంది. కొత్త మార్కెట్లు... కొత్త అవకాశాలు నూతన సంస్కరణల అమలుతో రైతాంగానికి కొత్త మార్కెట్లు, కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారు. కోల్డ్ స్టోరేజీల్లో సదుపాయాలు మెరుగవుతాయి. వీటన్నింటితో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. ఈ సంస్కరణలో చిన్న, సన్నకారు రైతులు గరిష్ట ప్రయోజనాలు పొందుతారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ రంగం వెలుగులీనుతోంది. రైతులకు మేలు చేకూర్చే చర్యలు ప్రారంభించాం. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం. ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలుపుతున్నారు. దీంతో విదేశాల నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోగలుగుతున్నాం. చెరకు పండించే రైతులకు మంచి ధర లభిస్తోంది. అడ్డుగోడలను కూల్చేస్తున్నాం... వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ వంటివి వేర్వేరుగా పని చేస్తున్నాయి. ఈ విధానం సరైంది కాదు. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానం కావాలి. వివిధ రంగాల మధ్య వారధులు ఉండాలి తప్ప అడ్డుగోడలు కాదు. ఈ అడ్డుగోడలను కూల్చడానికి కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మారుమూల పల్లెల్లోనూ ప్రజలకు బ్యాంకు ఖాతా, విశిష్ట గుర్తింపు సంఖ్య, తక్కువ ధరకే మొబైల్ డేటా అందుతున్నాయి. వీటితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వ్యవస్థ మన దేశంలో అవతరించింది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం వ్యవసాయ రంగంలో పారిశ్రామికవేత్తల పాత్ర పరిమితంగానే ఉంది. వారు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి. కోల్డ్ స్టోరేజీలు, ఎరువుల తయారీలో ప్రైవేట్ రంగం పాత్ర ఆశించిన స్థాయిలో లేదు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయి. పెట్టుబడిదారులకు గ్రామీణ ప్రాంతాలు మంచి ఎంపిక. ఇంటర్నెట్ వినియోగం నగరాల కంటే గ్రామాల్లో అధికంగా ఉంది. 98 శాతం గ్రామాలు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనతో అనుసంధానం అయ్యాయి. వారు సామాజిక, ఆర్థిక చైతన్యం కోరుకుంటున్నారు. పల్లె ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజలకు వైఫై సేవలు అందించేందుకు ఇటీవల ‘ప్రధానమంత్రి వాణి’ ప్రాజెక్టును ప్రారంభించాం. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచడానికి ఉద్దేశించిన ఈ వేదికను పారిశ్రామిక రంగం ఉపయోగించుకోవాలి. 21వ శతాబ్దపు పురోగతికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అందించే సహకారమే కీలకం. అందుకే ఆయా ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి. ఈ అవకాశం వదులుకోవద్దు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు గ్రామాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే ధ్యేయంగా ప్రభుత్వ విధానాలను రూపొందించాం. కనిష్ట స్థాయికి సర్కారు నియంత్రణలు కరోనా మహమ్మారి అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనే సంకేతాలను ఆర్థిక సూచికలు ఇస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ నియంత్రణలను కనిష్ట స్థాయికి తగ్గించి, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాం. కరోనా మహమ్మారి మొదలైన ఫిబ్రవరితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎంతో మెరుగయ్యాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించడానికి గత ఆరేళ్లుగా పలు కార్యక్రమాలు చేపట్టాం. వీటి ఫలితంగా కరోనా సమయంలోనూ రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇతర పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, తయారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాల్లో ఎన్నో కీలక మార్పులు వచ్చాయి. పన్నుల్లోనూ సంస్కరణలు తెచ్చాం. దీంతో ట్యాక్స్ టెర్రరిజం, ఇన్స్పెక్టర్రాజ్ అంతమయ్యాయి. 20–20 క్రికెట్ మ్యాచ్‌లో పరిణామాలు శరవేగంగా మారుతుండడం మన చూస్తుంటాం. అదే తరహాలో 2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. -
సుప్రీం మెట్లెక్కిన రైతులు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన మరో మలుపు తిరిగింది. ఈ చట్టాల రద్దుకు బదులుగా కొన్ని సవరణలు చేస్తా మంటూ కేంద్రం ప్రకటించడం, పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. మూడు కొత్త సాగు చట్టాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ భాను(బీకేయూబీ) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. బీకేయూబీ అధ్యక్షుడు భాను ప్రతాప్‌సింగ్ శుక్రవారం ఈ విషయం తెలిపారు. మూడు చట్టాల రాజ్యాంగబద్ధతను, చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి రవి, ఛత్తీస్‌గఢ్ కిసాన్ కాంగ్రెస్ నేత రాకేశ్ వైష్ణవ్ తదితరులు గతంలో సుప్రీంకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం అక్టోబర్ 12న కేంద్ర ప్రభుత్వానికి జవాబు చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ చట్టాల అమలుపై స్టే విధించాలని కోరుతూ భారతీయ కిసాన్ పార్టీ నవంబర్‌లో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లన్నింటిపై డిసెంబర్ చివరి వారంలో సుప్రీంకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. ఏకపక్షంగా ఆమోదించారు.. పార్లమెంట్లో పూర్తిస్థాయిలో చర్చ జరపకుండానే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లులను ఆమోదించి, సాగు చట్టాలను తీసుకొచ్చిందని భాను ప్రతాప్‌సింగ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. రైతు సంఘాల వాదనలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సర్కారు నిర్ణయం వల్ల రైతులు కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు ముమ్మాటికీ ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం, రైతు వ్యతిరేకమని తెలిపారు. తిరుచ్చి రవి దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు కూడా ఇంప్లీడ్ కావాలని భాను ప్రతాప్‌సింగ్ అభ్యర్థించారు. చర్చలకు సిద్ధం: ఏఐకేఎస్‌సీసీ రైతుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) స్పష్టం చేసింది. చర్చల నుంచి రైతు సంఘాల నేతలు అర్ధాంతరంగా వెళ్లిపోయారంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ఢిల్లీ శివారులోని సింఘు, టిక్రీ, గాజీపూర్, పల్వాల్‌లోని ధర్నా ప్రాంతాలకు దేశవ్యాప్తంగా రైతులు తరలి వస్తున్నారని తెలి పింది. డిసెంబరు 15న ముంబైలో, 16న కోల్‌కతా లో నిరసనలు నిర్వహించనున్నట్లు ఏఐకేఎస్‌సీసీ తెలిపింది. సంఘ వ్యతిరేక శక్తులతో జాగ్రత్త సాగు చట్టాలపై పోరు సాగిస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. సంఘ వ్యతిరేక, వామపక్ష, మావోయిస్టు శక్తులు చొరబడి ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రమాదముందని పేర్కొంది. వేర్వేరు ఆరోపణల కింద అరెస్టయిన హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలంటూ టిక్రి వద్ద జరుగుతున్న నిరసనల్లో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడంపై వ్యవసాయ మంత్రి తోమర్ ఈ మేరకు అప్రమత్తం చేశారు. 14న పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ నిరసనలు సాగు చట్టాల రద్దు కోసం పోరాడుతున్న రైతులకు అండగా నిలుస్తామని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించాయి. రైతులకు మద్దతుగా 14వ తేదీన పంజాబ్‌లో రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపాయి. రైతుల డిమాండ్ల విషయంలో బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. వారికి సంఘీభావంగా 14న ఉత్తర ప్రదేశ్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుతంగా బైఠాయింపులు నిర్వహిస్తామని వెల్లడించారు. 11వ రోజుకు చేరిన ఆందోళనలు కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ–నోయిడా సరిహద్దులో రైతులు సాగిస్తున్న ఆందోళన శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌ను కలిపే ఈ సరిహద్దు వద్ద రైతుల నిరసనల కారణంగా అధికారులు వాహనాల రాకపోకలను పాక్షికంగా నిలిపివేశారు. ఒకవైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. 700 జిల్లాల్లో ప్రచారం.. 100 ప్రెస్మీట్లు.. వాస్తవాల వివరణకు బీజేపీ నిర్ణయం న్యూఢిల్లీ: వ్యవసాయరంగంలో తీసుకువచ్చిన మూడు కొత్త చట్టాలతో ఒనగూరే లాభాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ చట్టాలతో రైతన్నలకు లబ్ధి కలుగుతుందే తప్ప ఎలాంటి నష్టం ఉండబోదని తెలియజేయనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనుంది. త్వరలో 100 మీడియా సమావేశాలు, 700కు పైగా జిల్లాల్లో ప్రజలతో భేటీలు, ప్రచార కార్యక్రమాలు తలపెట్టింది. ఈ ప్రచార పర్వంలో కేంద్ర మంత్రులు సైతం పాల్గొంటారని, కొత్త చట్టాల గురించి ప్రజలకు సవివరంగా తెలియజేస్తారని, సందేహాలను నివృత్తి చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళన ఉధృతం అవుతుండడం, ప్రతిపక్షాలు సైతం ఒక్కతాటిపైకి వస్తుండడంతో బీజేపీ అప్రమత్తమైంది. సాగు చట్టాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించి, వాస్తవాలను వివరించాలని నిర్ణయానికొచ్చింది. ఇప్పటికే ఈ చట్టాల ప్రయోజనాలపై ప్రధాని సహా పార్టీ నేతలు పలుమార్లు ప్రజలకు వివరణలు ఇచ్చారు. సాగు చట్టాల విషయంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. -
రైతన్నలూ.. చర్చలకు రండి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. రాతపూర్వకంగా ఇస్తామన్న హామీలను పరిశీలించాలని కోరారు. చర్చల తేదీని వారే నిర్ణయించవచ్చని అన్నారు. వ్యవసాయ చట్టాల్లోని కొన్ని నిబంధనలను సవరిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీని తిరస్కరిస్తూ రైతు సంఘాలు తదుపరి ఆందోళనకు కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తోమర్ గురువారం ఢిల్లీలో రైల్వే, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘రైతులకు అభ్యంతరాలు ఉంటే కొత్త చట్టాల్లో ఏవైనా నిబంధనలను విశాల దృక్పథంతో పరిశీలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల అనుమానాలను నివృత్తి చేస్తాం. వారి సమస్యలను పరిష్కరించడానికి రైతు సంఘాల నాయకుల సలహాల కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, కొత్త చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో వారు మళ్లీ మొదటికొస్తున్నారు’’ అని తోమర్ వ్యాఖ్యానించారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చారు. ‘‘తీవ్రమైన చలి వాతావరణంలో, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తుండడం పట్ల ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలి’’ అని తోమర్ చెప్పారు. సమస్య పరిష్కారంపై తాను అశాభావంతో ఉన్నానన్నారు. చర్చలు పురోగతిలో ఉండగానే రైతు సంఘాలు తదుపరి దశ పోరాట కార్యాచరణను ప్రకటించడం సరైంది కాదని తోమర్ ఆక్షేపించారు. కొత్త చట్టాలతో ఎంఎస్పీకి ఢోకా లేదు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) అమలు కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై రాతపూర్వక హామీ ఇస్తామని బుధవారం ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. రైతుల భయాందోళనలు తొలగించడానికి కనీసం 7 సమస్యలపై అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటికి రైతు సంఘాలు ససేమిరా అనడంతో చర్చలకు విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు తదుపరి చర్చలకు పిలుపునిచ్చారు. కొత్త చట్టాలు ఎంఎస్పీని ప్రభావితం చేయవని, పైగా రక్షణగా ఉంటుందని పీయూష్ గోయెల్ అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను ప్రైవేట్ మార్కెట్లలో విక్రయించడానికి అదనపు ఎంపికను మాత్రమే ఈ చట్టం ఇస్తుందని వివరించారు. సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేసుకోవచ్చు రైతుల అభ్యంతరాలపై ప్రభుత్వం ముసాయిదా ప్రతిపాదనను పంపుతుందని 13 యూనియన్ నాయకులతో మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో హోం మంత్రి అమిత్ షా చెప్పగా.. ఈ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. కొత్త చట్టాల తరువాత వ్యవసాయ మార్కెట్లు బలహీనపడతాయన్న రైతుల ఆందోళనకు పరిష్కారంగా.. సవరణలు చేయవచ్చని, రాష్ట్ర ప్రభుత్వాలు మండీల వెలుపల పనిచేసే వ్యాపారులను నమోదు చేయవచ్చని కేంద్రం ప్రతిపాదించిందని తాజాగా మంత్రులు గుర్తుచేశారు. రాష్ట్రాలు వాటిపై కూడా ఏపీఎంసీ మండీల తరహాలో పన్ను, సెస్ విధించవచ్చని వివరించారు. వివాదాల పరిష్కారం కోసం సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేసే హక్కు రైతులకు లభించకపోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. అందుకే సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేయడానికి వీలుగా నిబంధనల్లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు చెప్పారు. కార్పొరేట్ సంస్థలు సాగు భూములను స్వాధీనం చేసుకుంటాయన్న భయాన్ని తొలగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద సాగు భూములను అటాచ్ చేయడంపై ఇంకా స్పష్టత ఇస్తామన్నారు. ప్రస్తుత కనీస మద్దతు ధర అమలు ప్రక్రియ కొనసాగుతుందని లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమేనన్నారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. రైతుల విషయంలో ప్రస్తుత విద్యుత్ బిల్లు చెల్లింపు విధానంలో ఎటువంటి మార్పు ఉండదని మంత్రులు వెల్లడించారు. రైతుల వెనుక ఎవరున్నారో తేల్చండి ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల వెనుక ఏయే శక్తుల ఉన్నాయో నిగ్గు తేల్చాలని నరేంద్ర సింగ్ తోమర్, పీయూస్ గోయెల్ ప్రసార మాధ్యమాలను కోరారు. ‘‘మీడియా కళ్లు చురుగ్గా ఉంటాయి. మీ దర్యాప్తు నైపుణ్యాలను ఉపయోగించండి. రైతుల ఆందోళన వెనుక ఉన్న శక్తులు ఏమిటో బయటపెట్టండి. చర్చల కోసం రైతులు ముందుకు రాకుండా వెనక్కి లాగుతున్న అంశమేమిటో గుర్తించండి’’ అని పేర్కొన్నారు. కార్పొరేట్ల కోసమే.. కొత్త చట్టాలను రైతులు స్వాగతిస్తున్నారంటూ వ్యవసాయ మంత్రి తోమర్ చేసిన ప్రకటనను అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) తప్పుపట్టింది. ఈ చట్టాల విషయంలో కేంద్ర మంత్రులు తప్పుడు వాదనలు వినిపిస్తున్నారని, బహిరంగంగా అసత్యాలు వల్లెవేస్తున్నారని విమర్శించింది. బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే కొత్త చట్టాలు తెచ్చారని ఆరోపించింది. ఈ విషయాన్ని సామాన్య ప్రజలు సైతం అర్థం చేసుకుని రైతుల పోరాటానికి మద్దతు ఇస్తున్నారని గుర్తుచేసింది. 14 రోజుల్లో 15 మంది.. చండీగఢ్: సాగు చట్టాలపై ఢిల్లీలో, నగర శివార్లలో 14 రోజులుగా ఉద్యమిస్తున్న రైతుల్లో 15 మంది వేర్వేరు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను సహచర రైతులు పంజాబ్‌లోని స్వస్థలాలకు చేరుస్తున్నారు. ప్రతి రోజూ ఒక్క మృతదేహమైనా ఢిల్లీ నుంచి పంజాబ్‌కు చేరుకుంటోందని వారు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. గుండెపోటుతో 10 మంది రైతన్నలు తనువు చాలించారు. చలిని తట్టుకోలేక మరో రైతు మరణించాడు. మృతుల్లో మహిళలూ ఉన్నారు. రైలు పట్టాలపై పోరాటం! సా గుచట్టాలను తక్షణమే రద్దు చేయాలనే తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఇకపై దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమ కార్యాచరణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సింఘు వద్ద ఆందోళన కొనసాగిస్తున్న రైతులు గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దిగి రాకపోతే ఢిల్లీకి దారితీసే అన్ని ప్రధాన రహదారులను దిగ్బంధిస్తామని పేర్కొన్నారు. సర్కారు మొండి వైఖరి అవలంబిస్తే రైల్వే ట్రాక్‌లపై పోరాటం తప్పదని, ఇది పంజాబ్, హరియాణాల్లోనే కాదు, దేశమంతటా జరుగుతుందని రైతు సంఘం నాయకుడు బూటా సింగ్ స్పష్టం చేశారు. -
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారత్ బంద్ జరగనుంది. ఈ దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్ఎస్ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆయా పార్టీల కార్యకర్తలు బంద్‌లో చురుగ్గా పాలుపంచుకోనున్నారు. బంద్‌లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌ను పాటించాలని ఎవరినీ ఒత్తిడి చేయవద్దని సూచించాయి. శాంతియుతంగా నిరసన తెలపాలని, అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు, రైతులు ప్రకటించిన భారత్ బంద్‌నకు నైతిక మద్దతు తెలుపుతున్నామని పది కార్మిక సంఘాల ఐక్య కమిటీ సోమవారం ప్రకటించింది. బంద్‌కు మద్దతు తెలుపుతూనే, కార్మికులు విధుల్లో పాల్గొంటారని పేర్కొంది. డ్యూటీలో ఉండగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తారని, విధుల్లోకి వెళ్లేముందు కానీ విధులు ముగిసిన తరువాత కానీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపింది. కార్మికులు స్ట్రైక్ చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని హిందూ మజ్దూర్ సభ ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ వివరించారు. కాగా, బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు కోవిడ్–19 ముప్పు పొంచి ఉన్న కారణంగా, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని, శాంతిసామరస్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీలోని పలు సరిహద్దుల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో గత 12 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర మంత్రులు ఇప్పటివరకు ఐదు విడతలుగా జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసిన విషయం తెలిసిందే. మరో విడత చర్చలు బుధవారం జరగనున్నాయి. వేలాదిగా రైతులు నిరసన తెలుపుతున్న సింఘు సరిహద్దును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సందర్శించారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ‘తాత్కాలిక జైళ్లుగా ఢిల్లీలోని స్టేడియంలను వాడుకునేందుకు అనుమతించాలని మాపై భారీగా ఒత్తిడి వచ్చింది. మేం వారి ఒత్తిడికి తలొగ్గలేదు. అది ఉద్యమానికి సహకరించింది’ అని కేజ్రీవాల్ తెలిపారు. రైతులకు కష్టం కలగకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ‘ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక సేవకుడిలా మీ వద్దకు వచ్చాను’ అని రైతులతో పేర్కొన్నారు. ఆప్ నేతలు, కార్యకర్తలు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మద్దతివ్వండి బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్‌లో పాల్గొనేలా ఎవరినీ ఒత్తిడి చేయవద్దని తమ మద్దతుదారులను కోరాయి. శాంతియుతంగా బంద్ జరపాలని, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని భారతీయ కిసాన్ ఏక్తా సంఘటన్ అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ దాలేవాలా కోరారు. ‘మేం పిలుపునిచ్చిన బంద్ రాజకీయ పార్టీలిచ్చే బంద్ లాంటిది కాదు. ఇది ఒక సైద్ధాంతిక లక్ష్యం కోసం మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు.. నాలుగు గంటల పాటు జరిపే ప్రతీకాత్మక బంద్. ఈ నిరసనతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఆ నాలుగు గంటల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం’ అని రైతు సంఘం నేత రాకేశ్ తికాయిత్ వివరించారు. ఆ నాలుగు గంటల పాటు దుకాణాలను మూసేయాలని వ్యాపారస్తులను కోరుతున్నామన్నారు. ఆ నాలుగు గంటల పాటు టోల్ ప్లాజాలను, కీలక రహదారులను నిర్బంధిస్తామని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళన కొనసాగు తుందని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు. తాజా చట్టాలు రైతులకు లబ్ధి చేకూరుస్తాయని ఇన్నాళ్లు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి సవరణలు చేసేందుకు సిద్ధమని ఎందుకు చెప్తోందని మరో రైతు నేత దర్శన్ పాల్ ప్రశ్నించారు. బంద్‌కు మద్దతుగా మంగళవారం అన్ని రవాణా కార్యకలాపాలను నిలిపేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) ప్రకటించింది. ఏఐఎంటీసీ దేశవ్యాప్తంగా దాదాపు 95 లక్షల మంది ట్రక్కు యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో, దేశవ్యాప్తంగా నిత్యావసరాల రవాణాపై ప్రతికూల ప్రభావం పడనుంది. అతిపెద్ద రైల్వే కార్మిక విభాగాలైన ‘ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్’, ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్’ కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి. బంద్‌కు మద్దతుగా రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శనలు చేస్తారని తెలిపాయి. కాగా, తమ కార్యకలాపాలు మంగళవారం కూడా కొనసాగుతాయని వాణిజ్యవేత్తల సంఘం సీఏఐటీ, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేశాయి. బంద్‌లో నేరుగా పాల్గొనబోవటం లేదని బ్యాంక్ యూనియన్లు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. విరామ సమయాల్లో బంద్‌కు మద్దతుగా బ్యాంక్ బ్రాంచ్‌ల ముందు ప్లకార్డులను ప్రదర్శిస్తారని తెలిపింది. ప్రతిపక్షాల ద్వంద్వ నీతి రైతుల ఉద్యమానికి మద్దతివ్వడం విపక్షాల ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ విమర్శించింది. సాగు చట్టాల్లోని నిబంధనలను కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్షాలు గతంలో మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఉన్న అన్ని ఆంక్షలను తొలగిస్తామని 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్ర చేస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతూ.. ఉనికి కోసం రైతు ఉద్యమాన్ని వాడుకుంటున్నాయని, రైతుల్లోని కొన్ని వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. 16 రాష్ట్రాలపై ప్రభావం బంద్ వల్ల 16 రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని సూచించింది. బంద్‌లో పాల్గొనే వామపక్ష అనుకూల అతివాదులు సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని జోనల్ మేనేజర్లకు సూచించారు. సైకిల్‌పై 300 కి.మీ. పంజాబ్, హరియాణాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు వెళ్లి నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ఇద్దరు యువకులు సైకిల్ మీద ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించారు. జోవన్ ప్రీత్ సింగ్ (24), గురిందర్ జీత్ (26)లు పంజాబ్‌లోని బర్నాలా నుంచి రెండు రోజుల క్రితం ప్రయాణమై సోమవారానికి ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. ట్రాక్టర్లలో ప్రయాణించాలంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, అందుకే సైకిళ్లపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దారిపొడవునా అప్పటికే రైతులు ఉండటంతో తిండికేమీ లోటు లేదని, రాత్రి వేళ ట్రాక్టర్లలో పడుకున్నామని చెప్పారు. ఆ చట్టాలు మంచివే.. కొత్త సాగు చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి చెప్పారు. ఈ చట్టాలను సమర్ధిస్తున్న రైతుల బృందంతో తోమర్ సోమవారం సమావేశమయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, హరియాణాకు చెందిన రైతు కన్వల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఈ బృందం తోమర్‌ను కలిసింది. ఈ బృందంలో భారతీయ కిసాన్ యూనియన్(అత్తార్) జాతీయ అధ్యక్షుడు అత్తార్ సింగ్ సంధూ కూడా ఉన్నారు. సాగు చట్టాలను రద్దు చేయవద్దని, అవసరమైతే కొన్ని సవరణలు చేయాలని ఈ బృందం మంత్రిని కోరింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తమ ప్రభుత్వం ఎదుర్కోగలదని తోమర్ వ్యాఖ్యానించారు. రైతుల కోసం వైఫై.. ఢిల్లీ–హరియాణా సరిహద్దుల వద్ద ఉన్న రైతులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీఓ ముందుకు వచ్చింది. ఢిల్లీ సరిహద్దు వద్ద ఓ రూటర్ ఏర్పాటు చేశామని, అలాగే హరియాణా సరిహద్దు వద్ద పోర్టబుల్ డివైజ్‌ల నుంచి వైఫై సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రైతులు తమ ఇంట్లో ఉన్నవారితో మాట్లాడుకుంటారని, రైతుల పిల్లలు ఆన్లైన్ క్లాసులకు హాజరువుతారని ఎన్జీవో సభ్యులు తెలిపారు. అర్జున, పద్మ అవార్డులను వెనక్కు ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్న మాజీ క్రీడాకారులు రైతుల డిమాండ్లు ► ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. ► కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని వ్యవసాయ చట్టంలో చేర్చాలి. ► మండీల నుంచి కొనుగోళ్లను ప్రభుత్వమే చేపట్టాలి. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవసాయ కోర్టులు నెలకొల్పాలి. రైతుల అనుమానాలు ► సాగు రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ► ఒకే దేశం –ఒకే మార్కెట్ విధానంతో భవిష్యత్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. ► మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుంది. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాలను సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి రావడం. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్‌తో భూములకు రక్షణ కరువవుతుంది. ► నిత్యావసర సరుకుల సవరణ చట్టంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏమంటోంది? ► సాగు చట్టాలకు రైతు సంఘాలు కోరిన మేరకు సవరణలు చేపట్టేందుకు సిద్ధం. ► కనీస మద్దతు ధర విధానం యథా ప్రకారం కొనసాగుతుంది. దీనిపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. ► రాష్ట్రానికి చెందిన మండీలను ప్రభావితం చేయడం మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం. ► రైతులు అభ్యంతరం తెలుపుతున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ► కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాలను సూచనలు కోరుతున్నాం. పీటముడి ఎక్కడ? ► వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీసం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. -
మద్దతు ధరకు ఢోకా లేదు
సాక్షి, న్యూఢిల్లీ: మద్దతు ధర ప్రధాన అంశంగా వ్యవసాయ బిల్లుల రద్దు డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల ఆందోళనను పరిష్కరించేందుకు కేంద్రం స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైతులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జరగనున్న ఆరో విడత చర్చల్లో మరింత స్పష్టతతో రైతులకు భరోసా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రైతుల ప్రతినిధి బృందం, కేంద్ర మంత్రుల మధ్య విజ్ఞాన్ భవన్లో శనివారం జరిగిన ఐదో విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మళ్లీ డిసెంబర్ 9న సమావేశం కానుంది. 12 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)ను క్రమంగా తొలగించేందుకు ఈ చట్టాలు ఊతమిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ అంశంపై ఆందోళన అవసరం లేదని చెబుతూ వస్తోంది. ఈ చట్టాలు చేసిన అనంతరం కూడా పలు పంటలకు మద్దతు ధర ప్రకటించినట్టు వివరిస్తోంది. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా మద్దతు ధరలు పెంచుతూ, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ముందుకు వెళుతున్నామని వాదిస్తోంది. గతంలోనూ చట్టరూపం లేదు.. ‘వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్’ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా మొత్తం 22 వ్యవసాయ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరలను(ఎమ్మెస్పీ) నిర్ణయిస్తుంది. పంటలకు ఎమ్మెస్పీని సిఫారసు చేస్తున్నప్పుడు సీఏసీపీ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఉత్పత్తి వ్యయంపై ఎమ్మెస్పీ ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండాలని 2018–19 బడ్జెట్లోనే ప్రకటించామని, దీని ప్రకారమే అన్ని ఖరీఫ్, రబీ, ఇతర వాణిజ్య పంటల కనీస మద్దతు ధరలను పెంచినట్టు కేంద్రం వాదిస్తోంది. 2018–19, 2019–20 సంవత్సరాల్లో దేశపు సగటు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం మార్జిన్ తిరిగి వచ్చేలా ఈ చర్యను చేపట్టినట్టు పేర్కొంది. ఇదే సూత్రానికి అనుగుణంగా 2020–21 మార్కెటింగ్ సీజన్ కోసం అన్ని ఖరీఫ్ పంటలకు, రబీ పంటలకు మద్దతు ధర ప్రకటించామని తెలిపింది. మద్దతు ధరకు చట్టరూపం గతంలోనూ లేదని, ఇప్పుడు కూడా అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి కొనసాగింపుగా ఐదో విడత చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి స్పష్టత ఇచ్చారు. ‘ఎమ్మెస్పీ కొనసాగుతుందని మేం చెప్పాం. ఎమ్మెస్పీపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. అయితే రైతుల మనస్సులో ఏమైనా సందేహాలు ఉంటే, వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. ఏపీఎంసీ చట్టం రాష్ట్రాలకు చెందినది. రాష్ట్రానికి చెందిన మండీలను ఏ విధంగానైనా ప్రభావితం చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో ఎవరికైనా అనుమానాలు ఉంటే, వాటినీ నివృత్తి చేస్తాం. ఈ 9వ తేదీన జరగనున్న చర్చల్లో అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నాం’ అని తోమర్ తెలిపారు. రైతులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెనక్కి తగ్గని రైతు సంఘాలు.. మద్ధతు ధరపై భరోసా ఇస్తే సరిపోదని, అది చేతల్లో కూడా ఉండాలని, చట్టబద్ధత తప్పని సరిగా కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెస్పీకి చట్టరూపం అవసరం లేదని, అది కార్యనిర్వాహక నిర్ణయమని ప్రభుత్వం చెబుతుండగా.. ఉపాధి హామీ, ఆహార భద్రత వంటివి కూడా చట్టరూపం దాల్చకముందు కార్యనిర్వాహక నిర్ణయంగానే ఉండేవని రైతు సంఘాలు గుర్తుచేస్తున్నాయి. 9వ తేదీన జరిగే చర్చల్లో ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి, ఆ తదుపరి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాలు చెబుతున్నాయి. ముందు ఈ మూడు చట్టాలు రద్దు చేస్తేనే కేంద్రం చెప్పేది ఏదైనా వింటామని స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం సవరణలు తెస్తామని చెబుతున్నప్పటికీ ఈ మూడు చట్టాల మౌలిక స్వరూపం రైతులకు వ్యతిరేకంగా ఉందన్నది తమ ఆందోళన అని వివరిస్తున్నాయి. అందుకే రేపు 8వ తేదీన జరిగే భారత్ బంద్ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. -
భారత్ బంద్‌కు విపక్షాల మద్దతు
న్యూఢిల్లీ/ముంబై: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతు సంఘాలు ప్రకటించిన రేపటి ‘భారత్ బంద్’కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ దేశవ్యాప్త బంద్‌కు ఆదివారం కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆప్ పార్టీలు తమ మద్దతు తెలిపాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, 10 కార్మిక సంఘాల ఐక్య కమిటీ బంద్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సత్వరం పరిష్కారం చూపనట్లయితే.. ఈ ఉద్యమం ఢిల్లీ నుంచి దేశం నలుమూలలకు విస్తరిస్తుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిసెంబర్ 9న పవార్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి రైతు ఉద్యమ తీవ్రతను వివరించి, జోక్యం చేసుకోవాలని కోరుతారని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ వెల్లడించారు. పవార్‌తో పాటు రాష్ట్రపతిని కలిసే ప్రతినిధి బృందంలో సీతారాం ఏచూరి (సీపీఎం), డీ రాజా (సీపీఐ), టీఆర్ బాలు(డీఎంకే) ఉంటారన్నారు. రైతు ఆందోళనలపై కేంద్రం తీవ్రంగా యోచిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించే విషయం కూడా పరిగణిస్తోందని తెలిపాయి. మరోవైపు, రేపటి(డిసెంబర్ 8, మంగళవారం) బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి 250 మందికి పైగా రైతులు ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్నారని తెలిపాయి. ‘ఇది కేవలం పంజాబ్ రైతుల నిరసన కాదు. ఇది దేశవ్యాప్త నిరసన. కేంద్రం త్వరగా స్పందించనట్లయితే.. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. మేం భారత్ బంద్‌కు పిలుపునివ్వడంపై నిన్నటి(శనివారం) చర్చల సందర్భంగా మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు’ అని రైతు నేత బల్దేవ్ సింగ్ యాదవ్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. బంద్ నుంచి అంబులెన్స్‌లకు, అత్యవసర విభాగాలకు మినహాయింపు ఇచ్చామన్నారు. బంద్‌లో అంతా శాంతియుతంగా పాల్గొనాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హింసాత్మక చర్యలకు దిగవద్దని విజ్ఞప్తి చేశారు. భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. బంద్‌కు మద్దతుగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపింది. నటుడు కమల్‌హాసన్ పార్టీ ‘ఎంఎన్ఎం’ కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ..తదితర 10 కార్మిక సంఘాలు కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సహా పలు బ్యాంక్ యూనియన్లు భారత్ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఎన్ఆర్ఐ కుటుంబాల మద్దతు ఈ ఉద్యమంలో అన్ని విధాలుగా సాయం చేసేందుకు విదేశాల్లోని తమ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని కొందరు రైతులు వెల్లడించారు. దీర్ఘకాలం ఉద్యమం సాగించేందుకు వీలుగా రైతులు సిద్ధమై వచ్చిన విషయం తెలిసిందే. పళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను వారు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఢిల్లీ శివార్లకు భారీగా చేరుకున్న రైతులకు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక గురుద్వారా సభ్యులు కూడా ఇతోధిక సాయం అందిస్తున్నారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ సహా పలు యూరోప్ దేశాల్లో పంజాబ్ మూలాలున్న ప్రవాస భారతీయులున్నారు. వారు వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. విపక్ష నేతల ఉమ్మడి ప్రకటన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పీఏజీడీ చైర్మన్ ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రైతుల న్యాయబద్ధ డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని అందులో వారు కోరారు. ఈ ప్రకటనపై తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), అఖిలేశ్‌యాదవ్(ఎస్పీ), డీ రాజా(ఆర్జేడీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్) తదతరులు సంతకాలు చేశారు. లండన్‌లోని భారత దౌత్య కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ఎన్ఆర్ఐల నిరసన -
ఢిల్లీతో ఢీకి టీఆర్ఎస్ రెడీ
ఈ నెల 8న రైతులు తలపెట్టిన ‘భారత్ బంద్’కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బంద్‌కు మద్దతుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. రాజకీయంగా టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేలా బీజేపీ ఇటీవల రాష్ట్రంలో అనుసరిస్తున్న వైఖరిని తిప్పికొట్టేలా వ్యూహరచన చేయడంపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. సాక్షి, హైదరాబాద్: తాజా రాజకీయ పరిస్థితుల్లో బీజేపీపై దూకుడుగా వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయిం చింది. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం, కేంద్ర ప్రభుత్వ ఇతర ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగనుంది. భావసారూప్య పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకూ సిద్ధమవు తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తూ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని తాజా సమీకరణాలతో భిన్న వైఖరి తీసుకోనుంది. ఓ వైపు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ యంత్రాంగాన్ని క్రియాశీలం చేస్తూనే... మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. విపక్షనేతలతో టచ్‌లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని, మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటానికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తి అవసరం ఉందనే విషయాన్ని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో హైదరాబాద్‌లో భారీ సదస్సును నిర్వహిస్తామని గత నెలలో కేసీఆర్ ప్రకటించారు. రైతు సమస్యలపై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల ఫలితాన్ని చూసిన తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, అఖిలేశ్ యాదవ్, స్టాలిన్ వంటి నేతలతో కేసీఆర్ ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల సందర్భంగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా తనతో టచ్‌లో ఉన్నట్లు కేటీఆర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మరింత బలంగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తూ... రాజకీయ పార్టీలు, విమర్శల జోలికి పెద్దగా వెళ్లకపోవడం కూడా తమకు నష్టం చేసిందని టీఆర్ఎస్ భావిస్తోంది. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఇటీవలి కాలంలో విమర్శలు పెంచినా తిప్పికొట్టడంలో టీఆర్ఎస్ విఫలమైందనే భావన నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ యంత్రాంగంలో కదలిక తేవడంతో పాటు, ప్రజల్లోకి దూకుడుగా వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ వ్యూహంలో భాగంగా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, శిక్షణ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల క్షేత్రస్థాయి పర్యటనలు వీలైనన్ని ఎక్కువగా ఉండేలా చూడనుంది. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం నిరంతరం ప్రజల్లో ఉండేలా చూడాలని నిర్ణయించింది. భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రైతులు ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటాయని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని భారత్ బంద్‌ను కేసీఆర్ సమర్థించారు. రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తుచేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని, బంద్‌కు సంఘీభావం తెలిపి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. -
చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు
న్యూఢిల్లీ : ఆందోళన బాట పట్టిన రైతు సంఘాలతో కేంద్రం జరుపుతున్న చర్చలు మరోసారి ఎటూ తేలకుండానే ముగిశాయి. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దుపైనే రైతు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా పట్టుబట్టారు. అయితే, నిర్దుష్ట ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం 9వ తేదీ వరకు సమయం కోరింది. దీంతో 11 రోజులుగా దేశ రాజధాని కేంద్రంగా చేపట్టిన రైతు సంఘాల ఆందోళన మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధనకు 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రులు, 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ఐదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. దాదాపు 4 గంటలపాటు జరిగిన చర్చలకు కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాయకత్వం వహించారు. చర్చల్లో రైల్వేలు, వాణిజ్యం, ఆహారం శాఖల మంత్రి పీయూష్ గోయల్, పంజాబ్‌కు చెందిన ఎంపీ, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ పాల్గొన్నారు. గత సమావేశాల్లో చర్చల సందర్భంగా హామీ ఇచ్చిన అంశాలపై కేంద్రం తీసుకున్న చర్యలను వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ వారికి వివరించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చర్చల ప్రారంభం సందర్భంగా పంజాబీలో మంత్రి సోమ్ ప్రకాశ్ వారికి తెలిపారు. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు గట్టిగా పట్టుబడ్డారు. స్పష్టమైన హామీ లభించకుంటే బయటకు వెళ్లిపోతామంటూ తెగేసి చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందనీ, వారి సమస్యలను పరిష్కరిస్తామని దీంతో మంత్రులు వారికి సర్దిచెప్పారు. అయితే, సాగు చట్టాల రద్దు విషయం తేల్చాలంటూ రైతు ప్రతినిధులు గంటపాటు మౌనవ్రతం సాగించారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు, అంతర్గతంగా చర్చలు జరిపి నిర్దిష్ట ప్రతిపాదనలు తయారు చేసేందుకు ఈ నెల 9 వరకు సమయం కావాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరారు. దీంతో చర్చలు ఎటూ తేలకుండానే వాయిదా పడ్డాయి. ఆహారం, టీ వెంట తెచ్చుకున్న రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సింఘూ వద్ద ఆందోళన సాగిస్తున్న ప్రాంతం నుంచి చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు ఆహారం, టీ తమతోపాటు తెచ్చుకున్నారు. గురువారం కూడా రైతులు ఆహారం, టీతోపాటు మంచినీరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రైతు ప్రతినిధుల సూచనలు కోరాం: తోమర్ చర్చల అనంతరం మంత్రి తోమర్ మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాల నేతల నుంచి నిర్దిష్ట సూచనలను కోరాం. అయితే, చలి తీవ్రత దృష్ట్యా ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధులు, మహిళలు, పిల్లల్ని ఇళ్లకు పంపించాలని కోరాం’అని తెలిపారు. వివిధ పార్టీలు..సంఘాల మద్దతు 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్‌తోపాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించాయి. బంద్‌కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్దతుగా నిలిచింది. రైతులకు మద్దతుగా పంజాబ్‌కు చెందిన పలువురు మాజీ క్రీడాకారులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తమ పద్మశ్రీ, అర్జున అవార్డులను వాపసు చేసేందుకు ఢిల్లీకి బయలుదేరారు. రహదారులే గ్రామాలుగా... ఢిల్లీకి వెళ్లే కీలక రహదారులపై రైతులు నిరసలు తెలుపుతుండటంతో గడిచిన 10 రోజులుగా ఈ మార్గాల్లో ట్రాపిక్ జాంలు పెరిగిపోయాయి. దీంతో పోలీసులు కొన్ని మార్గాలను మూసివేసి, మరికొన్ని రోడ్లలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. దీర్ఘకాలం పోరుకు రైతులు సమాయత్తం అవుతుండటంతో కొన్ని రోడ్లు గ్రామాలుగా మారిపోయాయి. రైతులు రోడ్లపైనే ట్రాక్టర్లు నిలిపి, వాటిపై టెంట్లు వేసుకున్నారు. అక్కడే వంటావార్పూ చేపట్టారు. అవసరమైన సరుకులు, కాయగూరలు వంటివి అక్కడికి అందుతున్నాయి. సెల్ఫోన్లకు సోలార్ ప్యానళ్లతో చార్జింగ్ చేసుకుంటున్నారు. ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధుల కోసం కొందరు వైద్యులు వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేశారు. వృద్ధులు హుక్కా పీలుస్తూ కాలం గడుపుతున్నారు. చర్చలకు ముందు ప్రధానితో భేటీ రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలకు వెళ్లేముం దు మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌లు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రైతుల ముందుంచబోయే ప్రతిపాదనలపై వారంతా కలసి చర్చించినట్లు సమాచారం. రైతుల ఆందోళనలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చలు జరపడం ఇదే మొదటి సారి. రైతు ప్రతినిధుల మౌనవ్రతం చర్చల సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతు సంఘాల ప్రతినిధులంతా మౌనవ్రతం పాటించారు. ప్రధానమైన ఈ డిమాండ్ కేంద్రానికి సమ్మతమా కాదా స్పష్టం చేయాలని కోరుతూ ప్రతినిధులు అవును/ కాదు అని రాసి ఉన్న కాగితాలను వారు నోటికి అతికించుకున్నారని పంజాబ్ కిసాన్ యూనియన్ నేత రుల్ధు సింగ్ తెలిపారు. ప్రభుత్వం వారిని మాట్లాడించేందుకు మౌనంతోనే సమాధానం చెప్పారని మరో నేత కవితా కురుగంటి వెల్లడించారు. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. సాగు చట్టాలకు ప్రభుత్వం పలు సవరణలు చేస్తామంటూ ముందుకు వచ్చిందనీ, తాము మాత్రం పూర్తిగా రద్దు చేయాలని కోరామని బీకేయూ ఏక్తా అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ఉగ్రహన్ చెప్పారు. శనివారం సింఘూ వద్ద జరిగిన ధర్నాలో నినదిస్తున్న రైతుల పిల్లలు చర్చల విరామ సమయంలో వెంట తెచ్చుకున్న ఆహారం తింటున్న రైతు సంఘాల ప్రతినిధులు -
8న భారత్ బంద్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రైతులు తమ ఉద్యమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే డిసెంబర్ 8న భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోని మిగిలిన రహదారులను సైతం అడ్డుకునే ప్రణాళిక రూపొందించినట్లు రైతు నాయకుడు హర్విందర్ సింగ్ లఖ్వాల్ తెలిపారు. మోడీ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల దిష్టిబొమ్మలను నేడు దేశవ్యాప్తంగా దగ్ధం చేయాలని నిర్ణయించారు. గణతంత్ర దినోత్సవ కవాతులో రైతులు పాల్గొనాలని ఢిల్లీ –ఘజియాబాద్ సరిహద్దులో ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మరోవైపు భారత ప్రభుత్వ సవరణను అంగీకరించే ప్రసక్తిలేదని, సింఘు సరిహద్దులో ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిసాన్ సభ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లాహ్ తెలిపారు. రైతు ఉద్యమాన్ని పంజాబ్ ఉద్యమం అని మాత్రమే ప్రచారం చేస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. అయితే ఈ ఉద్యమం భారతదేశం అంతటా జరుగుతోందని, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించని పరిస్థితుల్లో, ఉద్యమం మరింత దూకుడుగా జరుగుతుందని మొల్లాహ్ హెచ్చరించారు. కెనడాకు వార్నింగ్ గురువారం అసంపూర్తిగా ముగిసిన చర్చలను మరోసారి కొనసాగించేందుకు రైతులు సంఘాల నాయకులు, కేంద్రం సిద్ధమయ్యారు. రైతులు చేస్తున్న నిరసనలు పది రోజులకు చేరుకున్న నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో కేంద్రంతో రైతులు మరో దఫా చర్చలు జరుపనున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర విదేశాంగ శాఖ భారత్‌లో కెనడా హైకమిషనర్ నాదిర్ పటేల్‌ను శుక్రవారం హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అనంతరం కెనడా ప్రధాని, కేబి నెట్ మంత్రులు భారత్‌లో జరుగుతున్న నిరసనలపై స్పందించడాన్ని తప్పుబడుతూ.. అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇరు దేశాల మధ్య బంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. -
‘మద్దతు’ కోసం మట్టిమనుషుల పోరాటం!!
రైతే ఒక పారిశ్రామికవేత్తగా మారేలా వ్యవసాయ రంగంలో చరిత్రాత్మక చట్టాల్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెప్పుకున్నారు. కానీ ఆ చట్టాలను రద్దు చేయాలంటూ గత పది రోజులుగా ఢిల్లీ వీధుల్లో బైఠాయించిన రైతన్నలు చరిత్ర సృష్టిస్తున్నారు. ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువగా ఉండే పంజాబ్, హరియాణా రైతులు పోరాటానికి తొలి అడుగు వేస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల రైతులు వారి అడుగులో అడుగు వేసి కదం తొక్కారు. ఈ చట్టాల అమలుతో వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ జరుగుతుందన్న ఆందోళన అన్నదాతల్ని వెంటాడుతోంది. అందుకే నిత్యావసర సరుకుల సవరణ చట్టం.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహక చట్టం... రైతుల సాధికారత, రక్షణ ధరల హామీ సేవల ఒప్పంద చట్టాలను వెనక్కి తీసుకోవాలని, మద్దతు ధరను చట్టంలో చేర్చాలని రేయింబగళ్లు నిరసన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాల లక్ష్యంలోనే తప్పులు ఉన్నాయని రైతు ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ‘ఏదైనా చట్టం లక్ష్యమే తప్పుగా ఉంటే దానిలో సవరణలు చేసినా అవి తప్పుదారి పడతాయి. దాని వల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు’’ అని 40 మంది రైతులున్న ప్రతినిధి బృందంలోని ఏకైక మహిళా కవితా కురుగంటి తెలిపారు. పీట ముడి ఎక్కడ ? సాగు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. ఎంఎస్పీపై రైతులను విపక్షాలు పక్కదారి పట్టిస్తున్నాయనీ, అందుకే రైతులు ఆందోళన తీవ్ర చేస్తున్నారన్నది కేంద్రం ఆరోపిస్తోంది. రైతుల అభ్యంతరాలు, డిమాండ్లు.. వ్యవసాయ రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఒకే దేశం ఒకే మార్కెట్ విధానం వల్ల భవిష్యత్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుందంటున్నారు. అందుకే ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. కేంద్రం ఏమంటోంది ? ► వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ససేమిరా కుదరదని తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్ట సవరణలకు అంగీకరించింది. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా బడా కంపెనీలు రైతులు భూములు తీసుకోవడానికి వీల్లేకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ► మండీల్లో ప్రైవేటు వ్యక్తులు వస్తే పోటీ ఉండి రైతులకే ప్రయోజనమని వాదిస్తున్న కేంద్రం రాష్ట్రాల పరిధిలో నడిచే మండీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒప్పుకుంది. ప్రైవేటు మార్కెట్లు, ప్రభుత్వ మార్కెట్ యార్డుల్లో పన్నులు సమానంగా వసూలు చేయడానికి అంగీకరించింది. ► ప్రైవేటు వ్యాపారులు పాన్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి బదులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ► కనీస మద్దతు ధర ఎప్పటికీ కొనసాగుతుందని, దానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని పదే పదే చెబుతూ వస్తోంది. -
పీఎఫ్ఐ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా ఆరోపణలకు సంబంధించి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు చెందిన 26 కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. దాదాపు 9 రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. పీఎఫ్ఐ చైర్మన్ ఓఎం అబ్దుల్ సలాం, కేరళ రాష్ట్ర పీఎఫ్ఐ చీఫ్ నసారుద్దీన్ ఎల్మరామ్, పీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అబ్దుల్ వాహిద్‌ల నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిపారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడులు చేశారని పీఎఫ్ఐ పేర్కొంది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముర్షీదాబాద్, లక్నో, ఔరంగాబాద్, జైపూర్, కొచ్చి, మలప్పురం తదితర నగరాలతోపాటు ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో దాడులు చేసింది. నగదు అక్రమ రవాణా కేసుకు సంబంధించి సాక్ష్యాలను సంపాదించేందుకు సోదాలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలకు ఆర్థిక సాయం అందించారన్న ఆరోపణలతో పీఎఫ్ఐ ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్, బెంగళూరులో పోలీస్ స్టేషన్లపై దాడి, హాథ్రస్ హత్యాచారం తరువాత నిధుల లావాదేవీలు.. తదితర నేరాల వెనుక పీఎఫ్ఐ హస్తం ఉందన్న ఆరోపణలపై కూడా ఈడీ విచారణ చేస్తోంది. -
పద్మవిభూషణ్ వాపస్
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై 8 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ రైతులే ప్రముఖంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రైతుల ఒత్తిడి కారణంగా శిరోమణి అకాలీదళ్ బీజేపీతో పొత్తును తెంచుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రైతులు అకాలీదళ్ వైపు ఏమాత్రం మొగ్గు చూపలేదు. కీలకమైన ఓటుబ్యాంకుగా ఉన్న రైతుల్లో విశ్వసనీయతను కాపాడేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ గురువారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతుగా పద్మవిభూషణ్ గౌరవాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ఈరాజకీయ కురు వృద్ధుడు ప్రకటించారు. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాశారు. రైతుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వానికి బలమైన సందేశం పంపేందుకే ప్రకాశ్ సింగ్ తన అవార్డును తిరిగి ఇచ్చినట్లు ఆయన కుమారుడు, అకాలీ దళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. కాగా, శిరోమణి అకాలీ దళ్ డెమొక్రటిక్ పార్టీని ఏర్పాటు చేసిన రాజ్యసభ సభ్యుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా సైతం రైతులకు మద్దతుగా 2019లో అందుకున్న పద్మ భూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ విశ్వసనీయతను కాపాడేందుకు... మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అడ్వాణీ తరువాత, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న ఏకైక నేత ప్రకాశ్ సింగ్ బాదల్. ఆయన పంజాబ్‌కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. పడిపోతున్న పార్టీ విశ్వసనీయతను నిలబెట్టడంతోపాటు, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇప్పటికీ బాదల్‌పైనే ఉంది. అందుకే 73 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన బాదల్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.