ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్
మోగా: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ మన రైతన్నల వెన్ను విరుస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయ చట్టాలను చెత్తబుట్టలో పారేస్తామని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆదివారం పంజాబ్‌లో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ తీరుపై విరుచుకుపడ్డారు. ఒకవైపు కరోనా వైరస్ పంజా విసురుతుండగా, ఇప్పుడే హడావుడిగా వ్యవసాయ చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), ఆహార ధాన్యాల సేకరణకు స్వస్తి పలకడమే వారి(కేంద్రం) లక్ష్యమని ఆరోపించారు. రైతులకు ఏమాత్రం నష్టం జరగనివ్వబోమని అన్నారు. తాము వారికి అండగా ఉంటామన్నారు. రైతులకు న్యాయం చేసే విషయంలో ఒక్క అంగుళమైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
కార్పొరేట్ల చేతుల్లో మోదీ సర్కారు కీలుబొమ్మ
ట్రాక్టర్ ర్యాలీ పంజాబ్‌లోని మోగా, లూథియానా జిల్లాల మీదుగా సాగింది. అనంతరం బద్లీకలాన్‌లో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 4 నుంచి 6వ తేదీ వరకు ట్రాక్టర్ ర్యాలీలను తలపెట్టింది. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీల చేతిలో కీలుబొమ్మ అని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆరేళ్లుగా ప్రజలను దగా చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ర్యాలీలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment