amarindar Singh Raja
-
అగ్రి చట్టాలను చెత్తబుట్టలో పారేస్తాం
మోగా: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ మన రైతన్నల వెన్ను విరుస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయ చట్టాలను చెత్తబుట్టలో పారేస్తామని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆదివారం పంజాబ్‌లో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ తీరుపై విరుచుకుపడ్డారు. ఒకవైపు కరోనా వైరస్ పంజా విసురుతుండగా, ఇప్పుడే హడావుడిగా వ్యవసాయ చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), ఆహార ధాన్యాల సేకరణకు స్వస్తి పలకడమే వారి(కేంద్రం) లక్ష్యమని ఆరోపించారు. రైతులకు ఏమాత్రం నష్టం జరగనివ్వబోమని అన్నారు. తాము వారికి అండగా ఉంటామన్నారు. రైతులకు న్యాయం చేసే విషయంలో ఒక్క అంగుళమైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కార్పొరేట్ల చేతుల్లో మోదీ సర్కారు కీలుబొమ్మ ట్రాక్టర్ ర్యాలీ పంజాబ్‌లోని మోగా, లూథియానా జిల్లాల మీదుగా సాగింది. అనంతరం బద్లీకలాన్లో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 4 నుంచి 6వ తేదీ వరకు ట్రాక్టర్ ర్యాలీలను తలపెట్టింది. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీల చేతిలో కీలుబొమ్మ అని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆరేళ్లుగా ప్రజలను దగా చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ర్యాలీలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు, రైతులు పాల్గొన్నారు. -
ఆయన చదివింది ఐఐటీలోనేనా?
చండీగఢ్: ఢిల్లీలో వాయు కాలుష్యం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పంజాబ్‌లో పంట వ్యర్థాలను దహనంచేయడం వల్లే కాలుష్యం పెరుగుతోందన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకోసం కేజ్రీవాల్ ఉపగ్రహ చిత్రాల్ని రుజువుగా చూపడం హాస్యాస్పదమని అన్నారు. అసలు కేజ్రీవాల్ ఐఐటీలోనే చదివారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థికి ఇంత కన్నా మంచి అవగాహన ఉంటుందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ కాలుష్యానికి పంజాబ్‌ను నిందించడానికి ముందు కేజ్రీవాల్ వాస్తవాలు గ్రహించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం జరగని రోజుల్లో కూడా ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ మెరుగ్గా లేద న్నారు. ఢిల్లీ–ఎన్సీఆర్ మీదుగా వీస్తున్న గాలులు వాయవ్యం నుంచి తూర్పు దిశగా మళ్లాయని, కాబట్టి పంజాబ్, హరియాణాల పంట వ్యర్థాల దహన ప్రభావం ఢిల్లీపై లేదని వాతావరణ శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. -
‘భూసేకరణ’పై కాంగ్రెస్ నిరసన
జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ సవరణబిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సోమవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వారు పార్లమెంట్‌వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కేనన్లతో చెదరగొట్టి, లాఠీచార్జి చేశారు. ఈ సంఘటనలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా బ్రార్‌తోపాటు పాటు పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, జైరాం రమేశ్, అంబికా సోని, అహ్మద్ పటేల్ తదితరులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అహ్మద్ పటేల్ ద్వారా కార్యకర్తలకు తన సందేశాన్ని పంపించారు. నేడు ప్రతిపక్షాల ర్యాలీ: భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పది పార్టీలకు చెందిన నేతలు కలిసి నేడు న్యూఢిల్లీలో ర్యాలీ నిర్వహించనున్నారు. పార్లమెంటు భవనం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లి, అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం సమర్పించనున్నారు.