‘భూసేకరణ’పై కాంగ్రెస్ నిరసన
- జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ సవరణబిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సోమవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వారు పార్లమెంట్‌వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కేనన్‌లతో చెదరగొట్టి, లాఠీచార్జి చేశారు.
ఈ సంఘటనలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా బ్రార్‌తోపాటు పాటు పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, జైరాం రమేశ్, అంబికా సోని, అహ్మద్ పటేల్ తదితరులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అహ్మద్ పటేల్ ద్వారా కార్యకర్తలకు తన సందేశాన్ని పంపించారు.
నేడు ప్రతిపక్షాల ర్యాలీ: భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పది పార్టీలకు చెందిన నేతలు కలిసి నేడు న్యూఢిల్లీలో ర్యాలీ నిర్వహించనున్నారు. పార్లమెంటు భవనం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లి, అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం సమర్పించనున్నారు.