రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
చట్టం అమలు చేయాలంటే జైల్లో పెడతారా?: భట్టి
హైదరాబాద్: భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలంటే, బాధితులను పరామర్శిస్తామంటే ప్రజా ప్రతినిధులను జైల్లో పెడతారా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి పోలీసులు ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా పోలీసులు ఇంత అరాచకంగా వ్యవహరించారా అని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ ఏమైనా నిషేధిత పార్టీయా? ప్రజాప్రతినిధులంతా నిషేధిత నాయకులా? మల్లన్నసాగర్ నిర్వాసితులను పరామర్శించడానికి వెళ్లే నాయకులను గాంధీభవన్‌కు వచ్చి పోలీసులు అరెస్టు చేశారు. ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి పోలీసులు ఎలా వస్తారు? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? చట్టాన్ని గౌరవించాలనే స్పృహ ప్రభుత్వానికుందా? పోలీసులే రాష్ట్రా న్ని ఏలుతున్నారు.. వారే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు’’ అని దుయ్యబట్టారు.
భూనిర్వాసితుల కమిటీ, అటవీ భూముల హక్కుల కమిటీలతో గాంధీభవన్‌లో గురువారం సమావేశం అవుతామన్నారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల కోసం పోరాట కార్యాచరణపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్‌ఎస్‌యూఐ తలపెట్టిన ‘చలో క్యాంపస్’ను భట్టి ఈ సందర్భంగా ప్రారంభించారు. టీఆర్‌ఎస్.. విద్యార్థులు, యువకులకు ఇచ్చిన మాట తప్పిందన్నారు.