హైదరాబాద్ చుట్టూ 10 వేల ఎకరాలు గుంజుకున్న బీఆర్‌ఎస్
భూ సేకరణ బాధితుల గురించి ఇప్పుడు మొసలికన్నీరు
అందరికీ సమానావకాశాల కోసమే సర్వే: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసిన భూములను బీఆర్‌ఎస్ పాలనలో బలవంతంగా గుంజుకొని అమ్ముకున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అలాంటి దుర్మార్గులు ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 24 లక్షల ఎకరాల భూమిని రైతులకు పంచిందని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు అందులో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రైతుల నుంచి 10 వేల ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని అమ్ముకొన్నారని ఆరోపించారు.
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి ఆయన నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అరి్పంచారు. అనంతరం గాం«దీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచి్చన భూ సేకరణ చట్టం ప్రకారమే రైతుల నుంచి అభివృద్ధికి అవసరమైన భూములు తీసుకుంటామని, బలవంతంగా తీసుకోబోమని స్పష్టంచేశారు. లగచర్లలో అధికారులపై దాడి చేయించింది బీఆర్‌ఎస్ పార్టీయేనని ఆరోపించారు. హామీలను నెరవేర్చకుండా బీజేపీ ప్రజలను మోసగించిందని విమర్శించారు. సొంత స్థలం ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబి్ధదారులకు రూ.5 లక్షలు ఇచ్చే అంశంపై సర్వే చేస్తున్నట్లు తెలిపారు.
సమానావకాశాల కోసమే సర్వే..: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నదని భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏటా రూ. 20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. దేశాన్ని విభజించి, అస్థిరపరిచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నవారు ఇందిరాగాంధీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అలాంటివారితో దేశానికి ఎప్పటికైనా ప్రమాదమేనని అన్నారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, చరణ్ యాదవ్, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరంతో ఏ ప్రయోజనం లేదు
⇒ ఆ ప్రాజెక్టు నీళ్లు లేకున్నా రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి
⇒ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గన్‌పౌడ్రీ: బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందనటం అవాస్తవమని పేర్కొన్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరుగుతుందని ఆనాడే చెప్పామని, ఇప్పుడు అదే నిజమైందని పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆయన పలువురికి ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభా అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో రూ.72 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. వ్యవసాయ రుణాల మాఫీ కింద రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని వెల్లడించారు. వ్యవసాయరంగ అభివృద్ధికి అన్నివిధాలుగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఇందిరాగాం«దీపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment