Corporate agents
-
అగ్రి చట్టాలను చెత్తబుట్టలో పారేస్తాం
మోగా: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ మన రైతన్నల వెన్ను విరుస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయ చట్టాలను చెత్తబుట్టలో పారేస్తామని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆదివారం పంజాబ్‌లో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ తీరుపై విరుచుకుపడ్డారు. ఒకవైపు కరోనా వైరస్ పంజా విసురుతుండగా, ఇప్పుడే హడావుడిగా వ్యవసాయ చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), ఆహార ధాన్యాల సేకరణకు స్వస్తి పలకడమే వారి(కేంద్రం) లక్ష్యమని ఆరోపించారు. రైతులకు ఏమాత్రం నష్టం జరగనివ్వబోమని అన్నారు. తాము వారికి అండగా ఉంటామన్నారు. రైతులకు న్యాయం చేసే విషయంలో ఒక్క అంగుళమైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కార్పొరేట్ల చేతుల్లో మోదీ సర్కారు కీలుబొమ్మ ట్రాక్టర్ ర్యాలీ పంజాబ్‌లోని మోగా, లూథియానా జిల్లాల మీదుగా సాగింది. అనంతరం బద్లీకలాన్లో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 4 నుంచి 6వ తేదీ వరకు ట్రాక్టర్ ర్యాలీలను తలపెట్టింది. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీల చేతిలో కీలుబొమ్మ అని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆరేళ్లుగా ప్రజలను దగా చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ర్యాలీలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు, రైతులు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది కొత్త కార్పొరేట్ ఏజెంట్ నిబంధనలు
సహారా లైఫ్ పటిష్టంగానే ఉంది - ఈ ఏడాది జీవిత బీమా వ్యాపారంలో వృద్ధి - ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ - హెచ్డీఎఫ్సీ లైఫ్ సీఎస్సీ సురక్షా పథకం షురూ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా రంగంలో కార్పొరేట్ ఏజెంట్ల కొత్త నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నట్లు బీమా అభివృద్ధి నియంత్రణ మండలి (ఐఆర్డీఏ) ప్రకటించింది. దీనికి సంబంధించి వచ్చే మూడు వారాల్లోగా గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. ఒక కార్పొరేట్ ఏజెంట్ గరిష్టంగా మూడు కంపెనీల పాలసీలను విక్రయించే విధంగా ఈ నిబంధనలను రూపొందించామని, దీనికి అనుగుణంగా కంపెనీలు ఏజెంట్లను మార్చుకోవడానికి తగినంత సమయం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఒక కార్పొరేట్ ఏజెంట్ ఒక కంపెనీ పాలసీ మాత్రమే విక్రయించాల్సి ఉంది. గురువారం హైదరాబాద్‌లో హెచ్డీఎఫ్సీ లైఫ్ కామన్ సర్వీస్ సెంటర్స్ ( మీ సేవా కేంద్రాలు) ద్వారా విక్రయించే పాలసీ ‘సీఎస్సీ సురక్ష’ను విజయన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జీవిత బీమా వ్యాపారంలో 15 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీమా కంపెనీలు ఐపీవోల ద్వారా నిధులు సమీకరించడానికి నిబంధనలు జారీ చేసినా ఇప్పటి వరకు ఒక కంపెనీ కూడా ఇందుకోసం దాఖలు చేసుకోలేదని చెప్పారు. సహారా లైఫ్ ఆర్థికంగా పటిష్టంగానే ఉందని, దీనిపై ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ మధ్యనే సహారా మ్యూచువల్ ఫండ్‌ను సెబీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. డిమ్యాట్ రూపంలో బీమా పాలసీలను అందించే రిపాజిటరీ సేవలకు స్పందన అంతంత మాత్రంగానే ఉందని, ఇప్పటి వరకు కేవలం 3 లక్షలు పాలసీలు మాత్రమే రిపాజిటరీ రూపంలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకాలకు మంచి స్పందన వచ్చిందని, ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా మంది ఈ పథకాల్లో సభ్యులుగా చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆంధ్ర, తెలంగాణ హెడ్ రామకృష్ణ హెగ్డే, తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.