సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ ఘాజీపూర్‌లో రైతుల నిరసన
న్యూఢిల్లీ/చండీగఢ్/మథుర: తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గబోమని రైతు సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే మహా పోరాటం తప్పదని తేల్చిచెప్పారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 14న సింఘు బోర్డర్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్ వద్ద రైతు సంఘం నాయకుడు, సంయుక్త కిసాన్ ఆందోళన్ ప్రతినిధి కన్వల్‌ప్రీత్ సింగ్ పన్నూ మీడియా సమావేశంలో మాట్లాడారు.
వేలాది మంది రైతులు ట్రాక్టర్లపై ఆదివారం రాజస్తాన్‌లోని షాజహాన్‌పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారని చెప్పారు. వారు ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారిని దిగ్బంధిస్తారని అన్నారు. ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. తమ తల్లులు, సోదరీమణులు, బిడ్డలు సైతం త్వరలో ఈ పోరాటంలో భాగస్వాములవుతారని తెలిపారు. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి రైతులు తరలి వస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వారు గమ్య స్థానానికి చేరుకుంటారని అన్నారు. చట్టాల రద్దుపై చర్చించిన తర్వాతే ఇతర అంశాలపై ప్రభుత్వంలో చర్చలు సాగిస్తామని స్పష్టం చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు. అదే రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట రైతన్నలు ధర్నాలు చేస్తారని వెల్లడించారు. రైతు సంఘాల మధ్య చిచ్చుపెట్టి, ఉద్యమాన్ని బలహీనపర్చాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, సర్కారు ఎత్తులు సాగవని కన్వల్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ నగరంతోపాటు సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాల్లో శనివారం భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
రద్దు చేస్తే ఉద్యమిస్తాం
కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు వీధుల్లోకి వస్తున్నారు. మరోవైపు ఈ చట్టాలను సమర్థించే వారు కూడా తమ వాదనకు పదును పెడుతున్నారు. హరియాణాకు చెందిన 29 మంది రైతులు శనివారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిశారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని, వీటిని రద్దు చేస్తే సహించబోమని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు.
టోల్‌ప్లాజాల ముట్టడి
తమ పోరాటంలో భాగంగా హరియాణా రైతులు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రంలోని టోల్ ప్లాజాలను ముట్టడించారు. వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయకుండా అడ్డుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో: రైతుల పోరాటానికి మద్దతుగా బీకేయూ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ వే పై ఉన్న మాంత్ టోల్‌ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. కొంత సేపు టోల్ రుసుములు వసూలు చేయనివ్వలేదు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. టోల్ రుసుములు వసూలు చేయొద్దంటూ డిమాండ్ చేశారు.
ఘాజీపూర్ వద్ద పోలీసులు బ్లాక్ చేసిన రోడ్డుపై నిద్రిస్తున్న రైతు
Comments
Please login to add a commentAdd a comment