వ్యవసాయ మోటార్ల దొంగలు అరెస్ట్
వాకాడు(గూడూరు) : మండలంలోని కొండాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో రైతులకు చెందిన వ్యవసాయ మోటార్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను బుధవారం వాకాడు పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 13 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వాకాడు సీఐ ఉప్పల సత్యనారాయణ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. కొండాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా పలువురు మెట్ట రైతులకు సంబంధించిన టెక్స్‌మో కంపెనీ వ్యవసాయ మోటార్లు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన డేగా సుబ్రమణ్యం అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓజిలి ఎస్సై విజయకుమార్, వాకాడు హెడ్‌కానిస్టేబుల్ రమణయ్య, ఏఎస్సై శ్రీనివాసులురెడ్డి, పీసీలు అనిల్, గోవర్ధన్‌లను టీంగా ఏర్పటుచేశారు.
వీరు నిందితులైన కొడవలూరు వంశీకృష్ణారెడ్డి, అతని స్నేహితుడైన అంబడి నరేష్‌లను విద్యానగర్‌లో అదుపులోకి తీసుకుని 13 మోటార్లును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పగలంతా పొలాల్లో తిరుగుతూ మోటార్లను గుర్తించి రాత్రి సమయాల్లో బాడుగ ఆటో తీసుకెళ్లి దొంగతనాలకు పాల్పడుతున్నారని సీఐ తెలిపారు. దొంగలించిన మోటార్లను విద్యాగనర్‌లోని వంశీకృష్ణారెడ్డి నివాసంలో దాచిపెట్టడం జరిగిందన్నారు. నిందితులను బుధవారం కోట కోర్టుకి హాజరుపరిచినట్లు తెలిపారు.