సీఆర్‌డీఏపై పిటిషన్ల పరంపర
- తాజాగా హైకోర్టును ఆశ్రయించిన మరికొంతమంది రైతులు
సాక్షి, హైదరాబాద్: రాజధానికి భూసమీకరణకోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రపదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తున్న రైతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 300 మంది రైతులు ఈ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేయగా, తాజాగా మరికొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర లేదని, అందువల్ల దానిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ గుంటూరు, విజయవాడలకు చెందిన కొమ్మినేని చలపతిరావుతోపాటు మరికొందరు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వానికి తమ భూములు కావాలనుకుంటే, వాటిని కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త భూసేకరణ చట్టం కింద మాత్రమే సేకరించాలని, అలా కాని పక్షంలో కృష్ణానదికి ఇరువైపులా ఉన్న గ్రామాలను భూసేకరణ నుంచి మినహాయించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు హైకోర్టును అభ్యర్థించారు. రైతులకు చట్టబద్ధ పరిహారం అందకుండా చేసేందుకే పభుత్వం భూసమీకరణను తెరపైకి తెచ్చిందని వివరించారు. తమను ఒత్తిళ్లకు గురిచేస్తోం దన్నారు.ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని పిటిషనర్లు కోరారు.