
రైతు ఆందోళనలు మరింత హింసాత్మకం
మంద్‌సౌర్ జిల్లాలో బుధవారం కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ రైతులు ఆందోళనలు చేపట్టి ఓ గోదాము, పలు దుకాణాలను తగులబెట్టారు. మౌ–నీముచ్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దేవాస్ జిల్లాలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతోపాటు నాలుగు బస్సులు, 8 ఇతర వాహనాలను తగులబెట్టారు. నీముచ్ జిల్లాలో పోలీస్ ఔట్‌పోస్ట్‌కు కూడా నిప్పు పెట్టారు. రైతులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం మంగళవారం నాడు చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వోద్యోగం ఇస్తామని ప్రకటించింది. గాయపడ్డ రైతులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామనీ, రుణ ఎగవేత దారులుగా ముద్రపడ్డ రైతులు అప్పును తీర్చుకునేందుకు పథకం తీసుకొస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కిందకు దాదాపు 6 లక్షల మంది రైతులు వస్తారనీ, వారి మొత్తం అప్పుల విలువ రూ.6 వేల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.