రైతుల పొలాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు
ఈ నెల 26న భూములు వేలం వేస్తున్నట్టు నోటీసులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు అధికారులు జబర్దస్తీకి దిగుతున్నారు. తనఖాలో ఉన్న భూములను వేలం వేస్తున్నట్టుగా రైతులకు నోటీసులు ఇవ్వడమే గాకుండా, పొ లాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకోళ్ల జబర్దస్తీతో తమ పరువు పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్‌డీసీసీబీ) అధికారులు కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు.
రైతుల భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కుదువ పెట్టిన భూములను వేలం వేయడానికి తాము అ«దీనంలోకి తీసుకున్నట్టు కొందరు రైతుల భూముల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్‌లో లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో రైతుల భూములను వేలం వేస్తున్నట్టు పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయంపై ‘సాక్షి’ప్రచురించిన కథనంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి సహకార బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరువు తీసేలా వ్యవహరించవద్దని ఆదేశించారు.
దీంతో రైతుల భూముల వేలం నిలిచిపోయింది. తాజాగా నస్రుల్లాబాద్ మండలంలో సహకార బ్యాంకు అధికారులు తిరిగి అదే పద్ధతిని మొదలుపెట్టారు. ఈనెల 26న పలువురు రైతుల భూములను వేలం వేయనున్నట్టు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల ఆవేదన..: బ్యాంకు అధికారులు తమ భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడంతో పాటు భూముల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు ఆస్తులు అమ్ముకుని అయినా కడతామని, తమ భూములు వేలం వేసి పరువు తీయద్దని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment