
భోపాల్: చనిపోయిందని భావించి అంత్యక్రియలు పూర్తి చేశాక ఓ మహిళ సజీవంగా తిరిగిరావడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. రాజస్తాన్ (Rajasthan) వాసికి తనను అమ్మేశారని, ఏడాదిన్నరపాటు అక్కడే ఉండి, చివరికి తప్పించుకుని వచ్చానని చెబుతోంది. అయితే, ఆమెను హత్య చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వ్యక్తులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. పలు ట్విస్టులున్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జల్లాలో చోటుచేసుకుంది. లలితా బాయి అనే మహిళకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అయితే, షారుఖ్ అనే వ్యక్తితో జిల్లాలోని (Mandsaur district) భాన్‌పుర పట్టణానికి వెళ్లిపోయింది. అక్కడ ఇద్దరూ రెండు రోజులున్నారు.
లలితా బాయిని తీసుకెళ్లిన షారుఖ్.. రాజస్తాన్‌కు చెందిన షారుఖ్ అనే మరో వ్యక్తికి ఆమెను రూ.5 లక్షలకు అమ్మేశాడు. షారుఖ్ వెంట రాజస్తాన్‌లోని కోటా వెళ్లిన లలితా బాయి అక్కడ దాదాపు ఏడాదిన్నరపాటు గడిపింది. చివరికి తప్పించుకుని ఇటీవల సొంతూరులోని తండ్రి రమేశ్ నానురాం దగ్గరికి చేరుకుంది. ఆమె సజీవంగా రావడంతో ఆశ్చర్యపోయిన తండ్రి వెంటనే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసులు ఆమె వద్ద ఉన్న ఆధార్ కార్డును, ఓటర్‌ఐడీని పరిశీలించి ఆమె చెప్పింది నిజమేనని తేల్చారు. కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. లలితా బాయి సజీవంగానే ఉన్నట్లు ధ్రువీకరించుకున్నారు.
అయితే, లలితా బాయి కనిపించకపోవడంతో వెదుకుతున్న కుటుంబ సభ్యులకు గ్రామ పరిసరాల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఛిద్రమైన స్థితిలో కనిపించింది. చేతిపై పచ్చబొట్టు, కాలికి ఉన్న నల్లదారం వంటి ఆధారాలను బట్టి లలితా బాయిగా భావించి, అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆమెను హత్య చేసిన ఆరోపణలపై గ్రామానికి చెందిన ఇమ్రాన్, షారుఖ్, సోను, ఎజాజ్ అనే వారిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment