జైపూర్: మధ్యప్రదేశ్‌లో రేస్‌లోలేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన బీజేపీ అధిష్టానం మరోసారి అలాంటి అనూహ్య నిర్ణయమే తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్ శర్మను రాజస్తాన్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు బీజేపీ మంగళవారం ప్రకటించింది. దీంతో ఇటీవల బీజేపీ విజయబావుటా ఎగరేసిన మూడు రాష్ట్రాలు.. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కొత్త ముఖాలే సీఎం పీఠంపై కనిపించనున్నాయి.
మంగళవారం జైపూర్‌లో 115 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై భజన్‌లాల్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ భేటీకి బీజేపీ అధిష్టానం తరఫున పార్టీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. సమావేశం తర్వాత భజనలాల్ వెంటనే రాష్ట్ర గవర్నర్ కల్‌రాజ్ మి శ్రాను కలిశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా భజన్‌లాల్‌కు గవర్నర్ ఆహ్వనం పలికారు.
పదవుల్లో కులాల సమతుల్యం పాటిస్తూ బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్‌లాల్‌ను సీఎంగా, రాచరిక వారసురాలైన మహిళా ఎమ్మెల్యే దియా కుమారిని డిప్యూటీ సీఎంగా, దళిత నేత ప్రేమ్‌చంద్ బైర్వాలను డిప్యూటీ సీఎంగా, సింధ్ వర్గానికి చెందిన వాసుదేవ్ దేవ్నానీని స్పీకర్‌గా ఎంపికచేశారు. కాంగ్రెస్ అభ్యర్థిమరణంతో వాయిదాపడిన కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో జనవరి 5న పోలింగ్ జరగనుంది
నేడు మోహన్‌కు పట్టం
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతారు.
సంస్థాగతం నుంచి సీఎం దాకా...
భజన్‌లాల్ చాలా సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో సంస్థాగత పదవుల్లోనే కొనసాగారు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. వెనువెంటనే ఆయన్ను సీఎం పదవి వరించడం విశేషం. భరత్‌పూర్ జిల్లాకు చెందిన 56 ఏళ్ల భజన్‌లాల్.. సంగనేర్ నియోజకవర్గం నుంచి 48,000కుపైగా భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. గతంలో ఈయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)తో మంచి అనుబంధం ఉంది. విద్యార్థి దశలో రాజనీతి శాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment