రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాజస్థాన్ సీఎం ఎంపిక విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి పేరును ఆదివారం ప్రకటించారు. విష్ణుదేవ్ సాయికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఇంకా సీఎం ఎవరనేది ఖరారు కాలేదు. సోమవారం మధ్యప్రదేశ్‌లో శాసనసభా పక్ష సమావేశం జరగాల్సివుంది. అయితే రాష్ట్రపతి లక్నో పర్యటన కారణంగా ఈ సమావేశం వాయిదా పడింది. ఇప్పుడు ఈ సమావేశం మంగళవారం జరగనుంది. ఇక రాజస్థాన్ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన సత్తాను చాటుతున్నారు.
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రాజే జైపూర్‌లోని తన నివాసంలో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. ఇదేవిధంగా పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజాల్, మాజీ మంత్రి రాజ్‌పాల్ సింగ్ షెకావత్, మాజీ మంత్రి దేవి సింగ్ భాటీ కూడా రాజేను కలిశారు. మరోవైపు ఎమ్మెల్యేలతో ఆదివారం జరగాల్సిన పరిశీలకుల సమావేశం కూడా వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమ, మంగళవారాల్లో లక్నోలో పర్యటనలో ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన కారణంగానే శాసనసభా పక్ష సమావేశం వాయిదా పడిందని తెలుస్తోంది.
వసుంధర రాజేను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజాల్ కూడా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అటువంటి పరిస్థితిలో అనుభవమున్న నేత మాత్రమే చక్కదిద్దగలరని.. అందుకు వసుంధర రాజే మాత్రమే సరైనవారని పేర్కొన్నారు. కాగా ఆదివారం జైపూర్ చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్ సీంఎం ఎంపికకు సంబంధించి త్వరలోనే పార్టీ హైకమాండ్, రాజస్థాన్ ఎమ్మెల్యేలు తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు.
ఇది కూడా చదవండి: 19న ‘ఇండియా’ భేటీ
Comments
Please login to add a commentAdd a comment