దేశంలో ప్రజాస్వామ్యం లేదు | Rahul Gandhi says no democracy in India | Sakshi
Sakshi News home page

దేశంలో ప్రజాస్వామ్యం లేదు

Published Fri, Dec 25 2020 4:26 AM | Last Updated on Fri, Dec 25 2020 5:08 AM

Rahul Gandhi says no democracy in India - Sakshi

రాష్ట్రపతిభవన్‌కు ర్యాలీగా వెళ్తున్న రాహుల్

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ గురువారం దేశ రాజధానిలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రియాంకా గాంధీ వాద్రా సహా సీనియర్‌ నేతలు, కార్యకర్తలు అక్బర్‌ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని మొదట భావించారు. అయితే, ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ కార్యాలయం ముందే బైఠాయించి ధర్నా నిర్వహించారు. దాంతో, నిషేధాజ్ఞలను ఉల్లంఘించారన్న కారణంతో ప్రియాంకా గాంధీని, పలువురు ఎంపీలు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ తరువాత, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్, ఆధిర్‌ రంజన్‌చౌధురి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం, రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ దేశంలో వాస్తవానికి ప్రజాస్వామ్యం లేదని, ఊహల్లోనే అది ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజస్వామ్యం ఉందన్న ్రభ్రమల్లో బతుకుతున్నామన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో దేశం ప్రమాదకర మార్గంలో వెళ్తోందని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిపై అయినా ఉగ్రవాది అని ముద్ర వేస్తారని ఆరోపించారు.

‘అది రైతులైనా, కూలీలైనా, చివరకు ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అయినా సరే.. మోదీని వ్యతిరేకిస్తే ఉగ్రవాది అని ముద్ర వేస్తారు’ అని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోనట్లయితే.. వ్యవసాయ రంగం, తద్వారా దేశం చాలా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  ‘సన్నిహితులైన ముగ్గురు, నలుగురు కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడం ఒక్కటే ప్రధాని మోదీ లక్ష్యం. పేదల డబ్బుతో ఆ కార్పొరేట్ల జేబులు నింపాలన్నది ప్రధాని తాపత్రయం. అందుకు అడ్డుపడే ఎవరినైనా సరే.. ఉగ్రవాదులు, దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు, నేరస్తులు అని ముద్ర వేస్తారు. అందుకు రైతులు, కూలీలు, చివరకు ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అయినా సరే మినహాయింపు కాదు’ అని రాహుల్‌ పేర్కొన్నారు.  

రాహుల్‌.. చర్చకు రా!
రైతుల సంక్షేమం కోసం అధికారంలో ఉండగా కాంగ్రెస్‌ ఏం చేసింది? ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందనే విషయంలో బహిరంగ చర్చకు రావాలని రాహుల్‌ గాంధీకి బీజేపీ సవాలు చేసింది. కేంద్రంపై రాహుల్‌ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారాలని తోసిపుచ్చింది. అధికారంలో ఉండగా రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్‌ పట్టించుకోలేదని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత ప్రకాశ్‌ జావడేకర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర ఇవ్వలేదని, మోదీ సర్కారు వచ్చిన తరువాతనే స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేశామని, కనీస మద్దతు ధరలను భారీగా పెంచామని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి శుక్రవారం ప్రధాని మోదీ రూ. 18 వేల కోట్లను జమ చేయనున్నారన్నారు. ఇప్పటివరకు రూ. 1.20 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మొత్తంగా పదేళ్లలో రూ. 7 లక్షల కోట్లు రైతులకు అందుతాయని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం చేసింది కేవలం రూ. 53 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే. అదికూడా రైతులకు ఇవ్వలేదు. బ్యాంకులకు ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ‘బహిరంగ చర్చకు రావాలని రాహుల్‌ గాంధీకి సవాలు చేస్తున్నా. రైతుల సాధికారతకు మోదీ ఎంత కృషి చేస్తున్నారో, రైతులను కాంగ్రెస్‌ ఎలా నిర్లక్ష్యం చేసిందో నిరూపిస్తా’ అన్నారు.  

ప్రభుత్వానివి అబద్ధాలు
రైతులకు అవాస్తవాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై విపక్ష పార్టీలు స్పందించాయి. ప్రధాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఒక ప్రకటన విడుదల చేశాయి. ఆందోళన మార్గం పట్టిన రైతులకు తమ సంఘీభావం కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ‘రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలను మేం పార్లమంట్లోనూ వ్యతిరేకించాం. ఓటింగ్‌ జరగాలని డిమాండ్‌ చేసిన ఎంపీలను సస్పెండ్‌ చేశారు’ అని కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, పీఏజీడీ, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌), ఆరెస్పీ, ఏఐఎఫ్‌బీ ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.  

వ్యవసాయ చట్టాలపై సుప్రీంకు..
సాగు చట్టాలను సవాలు చేస్తూ భారతీయ కిసాన్‌ యూనియన్‌(లోక్‌శక్తి) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  ఇప్పటికే విచారణలో ఉన్న కేసులో తమను ఇంప్లీడ్‌ చేయాలని కోరింది.

అసెంబ్లీ సెషన్‌ పెట్టండి
నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించి, వాటిని రద్దు చేయాలని తీర్మానం చేసేందుకు వీలుగా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాలని గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌కు మరోసారి సిఫారసు చేయాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో సిఫారసు చేసినట్లుగా ప్రత్యేక సమావేశాలని కాకుండా, రైతుల అంశంపై చర్చ జరిపేందుకు అసెంబ్లీ 21వ సమావేశాలను డిసెంబర్‌ 31న ఏర్పాటు చేయాల్సిందిగా సిఫారసు చేయనున్నారు. డిసెంబర్‌ 23న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని గతంలో కేబినెట్‌ చేసిన సిఫారసును గవర్నర్‌ తోసిపుచ్చిన విషయం తెలిసిందే.  

రైతులకు మళ్లీ ఆహ్వానం
చర్చలకు రావాలని ఆహ్వానిస్తూ రైతు సంఘం నేతలకు ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. అయితే, కనీస మద్దతు ధర అంశానికి సంబంధించిన కొత్త డిమాండ్లేవీ చర్చల ఎజెండాలో ఉండకూడదని షరతు విధించింది. కొత్త సాగు చట్టాల పరిధిలో లేని కనీస మద్దతు ధర అంశాన్ని చర్చల్లో భాగం చేయడం అర్థం లేని పని అని వ్యాఖ్యానించింది.  40 రైతు సంఘాల నేతలను ఉద్దేశించి వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ ఈ లేఖ రాశారు. ‘రైతుల నిరసనలు ముగియాలన్న ఉద్దేశంతో వారి అన్ని అభ్యంతరాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది’ అని తెలిపారు.


అరెస్ట్‌ సందర్భంగా మందిర్‌మార్గ్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ప్రియాంక, రైతులు. రాష్ట్రపతికి రాహుల్‌ వినతిపత్రం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement